ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం
మార్చి 20, 2020 నుంచి ఇంతవరకూ ముఖ్యమంత్రులతో ఐదుసార్లు సమావేశం నిర్వహించిన ప్రధాని
గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ 19 విస్తరణ లేకుండా చూడడంపై ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించాలి : ప‌్రధాని శ్రీ నరేంద్ర మోదీ
కోవిడ్ సంక్షోభానంతర అవకాశాలను ఉపయోగించుకోవడానికి కృషి చేద్దాం : ప‌్రధాని
నూతన ప్రపంచ వాస్తవికతకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలి: ప‌్రధాని
Posted On:
11 MAY 2020 10:22PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారిని అంతం చేయడానికి జరుగుతున్న పోరాటంలో భాగంగా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికిగాను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారతదేశంలో కరోనా మహమ్మారి విస్తరణకు సంబంధించిన భౌగోళిక ప్రాంతాల గురించి అందరికీ సరైన అవగాహన కలిగిందని అన్నారు. తీవ్ర ప్రభావిత ప్రాంతాల గురించి కూడా అందరికీ తెలిసిందని అన్నారు. గత కొన్ని వారాలుగా మహమ్మారి నిరోధానికి చేపడుతున్న చర్యలపై జిల్లా స్థాయి వరకూ అధికారులకు అవగాహన కలిగిందని ప్రధాని అన్నారు.
కోవిడ్ -19పై కలిగిన ఈ అవగాహన ఆధారంగా ముందు ముందు ప్రత్యేక దృష్టితో పోరాటం చేద్దామని ప్రధాని పిలుపునిచ్చారు.
కరోనా వైరస్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో మనం మరింత వ్యూహాత్మకంగా పని చేయాలి. ప్రస్తుతం మన ముందు రెండంచెల సవాల్ వుంది. మొదటిది ఈ వ్యాధి విస్తరణ రేటును అరికట్టాలి. రెండోది అన్ని మార్గదర్శకాలను ప్రజలు అనుసరించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రెండు లక్ష్యాలపైన దృష్టి పెట్టి మనం పని చేయాలని ప్రధాని కోరారు.
గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ -19 విస్తరణ జరగకుండా దానిపైన ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించాలని ప్రధాని స్పష్టం చేశారు.
ఇక ఆర్ఢిక వ్యవస్థను గాడిలో పెట్టడానికిగాను ముఖ్యమంత్రులు ఇచ్చిన సలహాలను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామని ప్రధాని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రులు కోవిడ్ -19పై పోరాటంలో భాగంగా ప్రధాని అందిస్తున్న నాయకత్వం ప్రశంసనీయంగా వుందని అన్నారు. దేశంలో వైద్య ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం వుందని ముఖ్యమంత్రులు ప్రధానికి వివరించారు. వలస కార్మికులు, కూలీలు తమ తమ ప్రాంతాలకు చేరుకున్నారు కాబట్టి వారి విషయంలో భౌతిక దూర మార్గదర్శకాలను అమలు చేయాలని, మాస్కులను ఉపయోగించేలా చూడాల్సి వుందని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వుందని అన్నారు.
విదేశాల్లో చిక్కుకుపోయి ఈ మధ్యనే తమ తమ ప్రాంతాలకు చేరుకుంటున్న భారతీయులను తప్పనిసరిగా క్వారంటైన్ చేయాలని ముఖ్యమంత్రులు సూచించారు. దేశంలోని చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కేంద్రం సాయం చేయాలని, రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాలని, వ్యవసాయ ఉత్పత్తులకు తగిన మార్కెట్ కల్పించాలని అన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కోవిడ్ -19కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రులు ప్రశంసనీయమైన పాత్ర నిర్వహిస్తున్నారని, క్షేత్రస్థాయిలో వున్న అనుభవంతో వారు విలువైన సలహాలు ఇస్తున్నారని ప్రధాని అన్నారు.
కోవిడ్ -19 కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మార్పులు వచ్చాయని ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచ యుద్ధాల విషయంలో మాట్లాడినట్టుగానే కరోనా పూర్వం, కరోనా అనంతరంలాగా ప్రపంచ వ్యవహారాలు మారిపోయాయని ఆయన అన్నారు. ఇది మనం నిర్వహించబోయే పనిలో గణనీయమైన మార్పులు తెస్తోందని ప్రధాని చెప్పారు. మన నూతన జీవన విధానం జన్ సే లేకర్ జగ్ తక్ అనే నియమం మీద వుంటుందని, ఒక వ్యక్తినుంచి మొత్తం మానవాళి వరకూ ఇది ఆధారపడి వుంటుందని ప్రధాని వివరించారు.
మనందరమూ నూతన వాస్తవికతకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసుకోవాల్సి వుందని అన్నారు.
క్రమ క్రమంగా లాక్ డౌన్ నుంచి బైటపడడానికి గాను మనం ప్రయత్నిస్తున్నప్పటికీ వ్యాక్సిన వచ్చేంతవరకూ ఈ మహమ్మారి సమస్య తొలగిపోదని, దీనిపై పోరాటంలో మనకున్న అతి పెద్ద ఆయుధం భౌతిక దూరమేనని ప్రధాని స్పష్టం చేశారు.
రెండు గజాల దూరం ప్రాధాన్యత గురించి ప్రధాని మరోసారి ప్రస్తావించారు. పలువురు ముఖ్యమంత్రులు సూచించినట్టుగా రాత్రిపూట కర్ఫ్యూ అనేది వుండడంవల్ల ...మహమ్మారిపట్ల జాగ్రత్తగా వుండాలనే భావనను ప్రజల్లో కొనసాగిస్తుందని అన్నారు. లాక్ డౌన్ కు సంబంధించి ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా తమ ఫీడ్ బ్యాక్ పంపాలని ప్రధాని కోరారు.
ఈ ఫీడ్ బ్యాక్ ను ఈ నెల 15వ తేదీనాటికి పంపాలని ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లో లాక్ డౌన్ కు సంబంధించి ఎలా వ్యవహరించాలనేదానిపై దీన్ని పంపాలని ప్రధాని కోరారు. లాక్ డౌన్ సమయంలోను, ఎత్తేసిన తర్వాత ఏర్పడే పరిణామాలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేసే బ్లూ ప్రింట్ ఇవ్వాలని అన్నారు.
దేశం ముందున్న అన్ని రకాల సవాళ్లను ఎదుర్కోవడంపై సమగ్రమైన విధానం ఇప్పుడు కావాలని ప్రధాని అన్నారు. రుతుపవనాలు మొదలైన తర్వాత కోవిడ్ -19 కు సంబంధించి అనేక కేసులు నమోదు కావచ్చని, వాటిని ఎదుర్కోవడానికి వీలుగా వైద్య ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సి వుందని ప్రధాని అన్నారు.
అలాగే విద్యారంగంలో బోధనకు సంబంధించి నూతన విధానాలను తయారు చేసుకొని అమలు చేయాలని విధాన నిర్ణేతలను ప్రధాని కోరారు.
పర్యాటక రంగం గురించి ప్రస్తావిస్తూ దేశీయ పర్యాటక రంగంపై దృష్టి పెట్టాల్సి వుందని అన్నారు.
మొదటి దశ లాక్ డౌన్లో తీసుకున్న చర్యలు రెండో దశలో అమలు చేయాల్సిన అవసరం లేదని అలాగే మూడో దశలో తీసుకున్న చర్యలు నాలుగో దశలో అవసరముండవనేది తన గట్టి అభిప్రాయమని ప్రధాని అన్నారు.
దేశంలో ఆర్ధిక పరమైన కార్యకలాపాలను పెంచడానికిగాను ప్రయాణికుల రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకున్నామని..అయితే ఎంపిక చేసిన మార్గాలలనే నడుపుతున్నామని ప్రధాని అన్నారు. పరిమిత సంఖ్యలోనే రైళ్లు నడుస్తాయని అన్నారు. ఏ రాష్ట్రం కూడా అధైర్యంగా లేదని కాబట్టి భవిష్యత్ ఆశాజనకంగా వుందని, అన్ని రాష్ట్రాలు ఐకమత్యంగా నిలిస్తే కోవిడ్ -19 పై విజయం తథ్యమని ప్రధాని దీమా వ్యక్తం చేశారు.
కోవిడ్ -19 సంక్షోభం తర్వాత దేశానికి పలు అవకాశాలు లభిస్తాయని వాటినుంచి లబ్ధి పొందాల్సి వుంటుందని ప్రధాని స్పష్టం చేశారు.
***
(Release ID: 1623182)
Visitor Counter : 336
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam