PIB Headquarters

కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 08 OCT 2020 6:25PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • దేశంలోని 35 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి 10 లక్షల జనాభాకు 140 కోవిడ్ పరీక్షలు.
  • మొత్తం 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్ధారిత కేసులు జాతీయ సగటుకన్నా తక్కువ.
  • గత 24 గంటల్లో అత్యధికంగా 83,011 మందికి వ్యాధినయం; నమోదైన తాజా కేసులు 78,524.
  • వరుసగా 17వ రోజునా 10 లక్షలకు లోపే చికిత్సలోగల కేసులు.
  • మహమ్మారిపై ప్రజా ఉద్యమానికి ప్రధానమంత్రి శ్రీకారం; కరోనాపై యుద్ధంలో  ప్రజలంతా ఏకం కావాలని పిలుపు.

దేశంలోని 35 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో రోజూ ప్రతి 10లక్షల జనాభాకు 140 కోవిడ్ పరీక్షలు; 22రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్ధారిత కేసులు జాతీయ సగటుకన్నా తక్కువ; వరుసగా 17వ రోజునా 10 లక్షలలోపే చికిత్సపొందే కేసులు

భారత్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన మేరకు ప్రతి 10 లక్షల జనాభాకు నిత్యం 140 కోవిడ్‌ పరీక్షలు నిరాఘాటంగా సాగుతున్నాయి. ఈ మేరకు 35 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పరిమితిని అధిగమించాయి. తదనుగుణంగా దేశవ్యాప్తంగా నేడు ప్రతి 10లక్షల జనాభాకు సగటు పరీక్షల సంఖ్య 865కు దూసుకుపోయింది. గత 24 గంటల్లో దేశంలో దాదాపు 12లక్షల (11,94,321) పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటిదాకా పరీక్షించిన నమూనాల సంఖ్య 8.34 కోట్లు (8,34,65,975) దాటింది. ఇక 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్ధారిత కేసులు 5 శాతంకన్నా తక్కువగానే ఉన్నాయి. మరోవైపు 22 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్ధారిత కేసులు జాతీయ సగటుకన్నా తక్కువగా నమోదయ్యాయి. దీంతో దేశం మొత్తంమీద పరీక్షించిన కేసులలో నిర్ధారిత కేసులు 8.19శాతం కాగా, ఇది క్రమంగా తగ్గుతోంది. కొత్త కేసులకన్నా కోలుకునే కేసులు అధికంగా ఉంటున్న నేపథ్యంలో ఒక్కరోజులోనే 83,011 మందికి వ్యాధి నయమైంది. అలాగే గత 24గంటల్లో నిర్ధారణ అయిన కొత్త కేసుల సంఖ్య 78,524గా ఉంది. ఫలితంగా నేటిదాకా మొత్తం 58,27,704 మంది కోలుకున్నారు. తదనుగుణంగా కోలుకున్న, చికిత్సలో ఉన్నవారి మధ్య తేడా 49 లక్షలు (49,25,279) దాటింది. ఇక చికిత్సలోగల కేసులు వరుసగా 17వ రోజునా 10 లక్షలకు దిగువనే ఉండటం విశేషం. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య దేశవ్యాప్తంగా నమోదైన కేసులలో కేవలం 13.20 శాతం... అంటే- 9,02,425 మంది ఆస్పత్రులలో ఉన్నారు. నిత్యం కోలుకునేవారి సంఖ్య పెరుగుతూండగా జాతీయ సగటు 85.25 శాతానికి చేరింది. కొత్తగా కోలుకున్నవారిలో 75 శాతం 10 రాష్ట్రాలకు చెందినవారు కాగా, మహారాష్ట్రలో అత్యధికంగా ఒకేరోజు 16,000 మందికిపైగా కోలుకున్నారు. గత 24 గంటల్లో 78,524 కొత్త కేసులు నమోదవగా వీటిలో 79  శాతం మేరకు 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనివే. మొత్తంమీద అత్యధికంగా కేసులు నమోదయ్యే మహారాష్ట్రలో 14,000 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. ఇక 11,000 కేసులతో కర్ణాటక రెండో స్థానంలో ఉంది. దేశంలో గత 24 గంటల్లో 971 మరణాలు సంభవించగా, ఇందులో 82 శాతం కేవలం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉండగా, 355 మరణాలతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662756

కరోనాపై ప్రజా ఉద్యమానికి ప్రధానమంత్రి శ్రీకారం; ఈ యుద్ధంలో  ప్రజలంతా ఏకం కావాలని పిలుపు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కరోనా మహమ్మారిపై ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ యుద్ధంలో ప్రతి ఒక్కరూ కలసిరావాలని ఆయన సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. “మాస్కు ధరించండి... చేతులు తరచూ కడుక్కోండి... సామాజిక దూరం పాటించండి, ఇతరులతో రెండు గజాల దూరం నిబంధన అనుసరించండి” అనే నినాదాలను ఈ సందర్భంగా ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఈ విధంగా అందరం కలసి ముందడుగు వేస్తే కోవిడ్‌-19పై మనం విజయం సాధించగలమని పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఆయన ఈ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా దేశ ప్రజలందరితో “కోవిడ్‌-19 ప్రతిజ్ఞ” చేయించనున్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల్లోని వివిధ మంత్రిత్వశాఖలు సమష్టి కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662615

ఆయుర్వేద పరిశోధనపై అమిటీ విశ్వవిద్యాలయంతో అఖిలభారత ఆయుర్వేద సంస్థ అవగాహన ఒప్పందం

ఆయుష్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ప్రోత్సాహం, అభివృద్ధి దిశగా భాగస్వామ్యాల ఏర్పాటు విధానాన్ని ఆయుష్ మంత్రిత్వశాఖ కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా తన పరిధిలోగల ‘అఖిలభారత ఆయుర్వేద సంస్థ (AIIA) నిన్న అమిటీ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆయుర్వేద శాస్త్రాల్లో పరిశోధనలను ప్రోత్సహించడం ఈ ఒప్పందంలోని ప్రధానాంశంగా ఉంటుంది. ఆయుర్వేద ఔషధాల నాణ్యత-ప్రామాణీకరణసహా పీహెచ్.డి. కోర్సులు కూడా ఇందులో భాగంగా ఉంటాయి. ఇవేగాక మరికొన్ని అంశాలు ఈ ఒప్పందం పరిధిలో ఉండగా, ఉమ్మడి ప్రాజెక్టులు, ప్రచురణలకూ ఇది దోహదపడుతుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662862

కోవిడ్‌-19పై పోరాటం కోసం ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పిలుపు

కోవిడ్-19పై పోరాటంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ ప్రజలంతా ఏకమైతే కోవిడ్-19వంటి ప్రపంచ మహమ్మారిపై పోరాటం సులువు కాగలదని సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ద్వారా ఇచ్చిన సందేశంలో ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా ప్రధాని మోదీ ప్రారంభించిన సామూహిక ఉద్యమంలో చేరాలని కోరారు. ఈ మహమ్మారిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించడం ద్వారా మన దేశం కోవిడ్ నుంచి విముక్తి పొందగలదని తెలిపారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662861

శాశ్వత వైకల్య, ఆశ్రితుల ప్రయోజనాలను లబ్ధిదారులకు కచ్చితంగా చెల్లించేలా ఈఎస్‌ఐసీ నిర్ణయం

కోవిడ్‌-19 పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగాగల బీమా చందాదారులందరికీ శాశ్వత వైకల్య ప్రయోజనం, ఆశ్రితుల ప్రయోజనాలను ప్రతి నెలలోనూ లబ్ధిదారులకు చెల్లించాలని ఈఎస్‌ఐసీ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ప్రాంతీయ/ఉప-ప్రాంతీయ కార్యాలయాల అధిపతులకు ఆదేశాలు జారీచేసింది. తదనుగుణంగా అన్ని కార్యాలయాలూ ఈ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నాయి.  

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1662622

భారత-ఐరోపా సమాఖ్యల భాగస్వామ్యానికి వాణిజ్యం-ఆర్థిక వ్యవస్థ ముఖ్యమైన స్తంభాలు: శ్రీ పీయూష్‌ గోయల్‌

భారత-ఐరోపా సమాఖ్యల భాగస్వామ్యానికి వాణిజ్యం-ఆర్థిక వ్యవస్థ ముఖ్యమైన స్తంభాలని కేంద్ర రైల్వే, వాణిజ్య-పరిశ్రమ శాఖల మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్ అన్నారు. ఐరోపా సమాఖ్య-భారత సంయుక్త ఆర్థిక వృద్ధిపై దౌత్య-పారిశ్రామిక నాయకత్వ సదస్సును ఉద్దేశించి నిన్న ఆయన ప్రసంగించారు. స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) దిశగా ఐరోపా సమాఖ్యతో కలసి పనిచేయడంపై ఆశాభావం వ్యక్తం చేశారు. వేగవంతమైన ఫలితాలు పొందడం కోసం ఈ ప్రయత్నాలను ప్రాధాన్య వాణిజ్య ఒప్పందంతో ప్రారంభించవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేశారు. కోవిడ్‌ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి భారత-ఐరోపా సమాఖ్య సంయుక్తంగా కృషి చేశాయని ఈ సందర్భంగా శ్రీ గోయల్‌ గుర్తుచేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662625

నిరుటితో పోలిస్తే కోవిడ్ నేప‌థ్యంలోనూ 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో 60శాతం ఎక్కువ పొడవైన పనులను కాంట్రాక్టుకిచ్చిన ఎన్‌హెచ్ఏఐ

కేంద్ర రోడ్డురవాణా-రహదారుల మంత్రిత్వశాఖ పరిధిలోని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1330 కిలోమీటర్ల పొడవైన రహదారుల నిర్మాణ పనులను కాంట్రాక్టుదారులకు అప్పగించింది. ఈ మేరకు 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇదే తొలి అర్థభాగంలో 1.6 రెట్లు అధికంగా- అంటే... 828 కిలోమీటర్ల మేర పనులను ఎన్‌హెచ్‌ఏఐ అప్పగించింది. వీటికి సంబంధించి భూ సేకరణ ప్రక్రియను కూడా 80 నుంచి 90 శాతం పూర్తిచేసింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662621

5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, స్వావలంబన భారతం సాకారం దిశగా నైపుణ్య కల్పన-నైపుణ్య పునశ్చరణ, నైపుణ్య ఉన్నతీకరణ, పారిశ్రామిక అనుబంధ నైపుణ్యాలు అవసరం: డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే

పీహెచ్‌డీ చాంబర్‌ 115వ వార్షిక సదస్సు సందర్భంగా గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తరఫున, స్వయం తన తరఫున కేంద్ర నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపక శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని చురుకైన నాయకత్వాన్ని, కోవిడ్‌ కష్టకాలంలో చేపట్టిన విస్తృత చర్యలను పాండే ప్రశంసించారు. ముఖ్యంగా కోవిడ్‌-19 మహమ్మారి నడుమ గత 7 నెలల కాలంలో ప్రతి రాష్ట్రం/జిల్లాలోగల విద్యా-నైపుణ్య విభాగాలు వినూత్న ఆలోచనలతో కలిసి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా రూపొందడం కోసమేగాక స్వయం సమృద్ధం అయ్యే దిశగా ముందడుగు వేయడానికి నైపుణ్య కల్పన, నైపుణ్య పునశ్చరణ, నైపుణ్య ఉన్నతీకరణ, నైపుణ్య శిక్షణ కేంద్రాలు, పారిశ్రామిక అవసరాలు/అనుబంధ నైపుణ్యాలు ముఖ్యమైనవని పాండే స్పష్టం చేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662499

ఆయుర్వేద పరిశోధనపై అమిటీ విశ్వవిద్యాలయంతో అఖిలభారత ఆయుర్వేద సంస్థ అవగాహన ఒప్పందం

ఆయుష్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ప్రోత్సాహం, అభివృద్ధి దిశగా భాగస్వామ్యాల ఏర్పాటు విధానాన్ని ఆయుష్ మంత్రిత్వశాఖ కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా తన పరిధిలోగల ‘అఖిలభారత ఆయుర్వేద సంస్థ (AIIA) 2020 అక్టోబరు 7న అమిటీ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆయుర్వేద శాస్త్రాల్లో పరిశోధనలను ప్రోత్సహించడం ఈ ఒప్పందంలోని ప్రధానాంశంగా ఉంటుంది. ఆయుర్వేదంలో కొన్ని అత్యాధునిక పరిశోధనలుసహా ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద శాస్త్రాల సంబంధిత విజ్ఞానం ప్రాచుర్యం పొందడానికి ఈ భాగస్వామ్యం దోహదపడగలదని భావిస్తున్నారు. ఇది సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రాలతో అనుసంధానించడంసహా ఆయుర్వేద పరిశోధనలకు కొత్త కోణాలను జోడించే వీలుంటుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662862

“మానసిక ఆరోగ్యం: కోవిడ్-19 అనంతర భవిష్యత్తు”పై అంతర్జాతీయ సదస్సును ఆన్‌లైన్‌ద్వారా ప్రారంభించిన శ్రీ థావర్‌చంద్ గెహ్లోత్‌

“మానసిక ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు: కోవిడ్‌-19 అనంతర భవిష్యత్తు” పేరిట వర్చువల్‌ కార్యక్రమాన్ని కేంద్ర సామాజిక న్యాయం-సాధికారతశాఖ మంత్రి శ్రీ థావర్‌చంద్ గెహ్లోత్‌ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియా-భారత సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ క్రెయిగ్ జెఫ్రీ సహాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా థావర్‌చంద్‌ గెహ్లోత్‌ ప్రారంభోపన్యాసం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యల పెరుగుదల ధోరణిని ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో భారత దేశంలో మానసిక సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు, కార్యక్రమాలను వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662889

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • అసోం: రాష్ట్రంలో నిన్న 2,561 మందికి వ్యాధి నయం కాగా, కోలుకున్నవారి సగటు 82.87 శాతానికి పెరిగింది. దీంతో ఇప్పటిదాకా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినవారి సంఖ్య 1,57,635కు చేరగా, ప్రస్తుతం 31,786 మంది చికిత్స పొందుతున్నారు.
  • మిజోరం: రాష్ట్రంలో నిన్న రెండు కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 2,150కి చేరగా, ప్రస్తుతం చికిత్స పొందేవారి సంఖ్య 231గా ఉంది.
  • నాగాలాండ్: రాష్ట్రంలో 53 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 6,715కు పెరిగాయి. ఇప్పటిదాకా 5,444 మంది కోలుకోగా ప్రస్తుతం 1,142 మంది చికిత్స పొందుతున్నారు.
  • సిక్కిం: రాష్ట్రంలో ఇద్దరు మరణించగా, 18 కొత్త కేసులు నమోదయ్యాయి. సిక్కింలో ఇప్పటిదాకా 2,534 మంది కోలుకోగా, ప్రస్తుతం 590 మంది చికిత్స పొందుతున్నారు.
  • కేరళ: రాష్ట్రంలో రోజువారీగా 10,000కు మించి కోవిడ్‌ కేసుల నమోదుతోపాటు పరీక్షల్లో నిర్ధారిత కేసులు దాదాపు 15 శాతానికి చేరిన నేపథ్యంలో బార్లు, బీర్/వైన్ పార్లర్లను తెరిచేందుకు అనుమతించరాదని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, ప్రస్తుత తరహాలోనే ప్రైవేట్‌ బార్లు కౌంటర్లలో అమ్మకాలను, అదీ సాయంత్రం 5 గంటలదాకా మాత్రమే కొనసాగిస్తాయి. కాగా, కోవిడ్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి మాట్లాడుతూ- రాష్ట్రంలో ఇటీవల 90 శాతం కోవిడ్‌ కేసులు పరిచయాల కారణంగానే నమోదైనట్లు పేర్కొన్నారు. అలాగే ఓణం సమయంలో సామాజిక దూరం నిబంధనలను సడలించడం కూడా ఇందుకు దారితీసిందని, ఈ పరిస్థితుల నడుమ బార్లను తెరిస్తే పరిస్థితి మరింత విషమిస్తుందని ఆయన వాదించారు. కాగా, కేరళలో నిన్న 10,606 కొత్త కేసులు నమోదవగా 6,161మంది కోలుకున్నారు. ఒకేరోజు ఇంతపెద్ద సంఖ్యలో కేసులు, కోలుకున్న రోగులు ఇప్పటిదాకా ఇదే అత్యధికమని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 92,161మంది చికిత్స పొందుతుండగా 2.67 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు. మృతుల సంఖ్య 906గా ఉంది.
  • తమిళనాడు: కోయంబత్తూరులోని కోడిస్సియా వాణిజ్య ప్రదర్శన ప్రాంగణంలోగల కోవిడ్ సంరక్షణ కేంద్రంలో ఆక్సిజన్ సరఫరాసహా అదనపు పడకల ఏర్పాటుపై జిల్లా యంత్రాంగం ప్రణాళిక ప్రకటించింది. లక్షణరహిత కోవిడ్‌ బాధితుడొకరు మరణించిన నేపథ్యంలో సౌకర్యాల లేమిపై ఇక్కడి రోగులు ఆందోళన చేసిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. కాగా, సెప్టెంబరు నెలలో కోవిడ్-19 కేసుల వ్యాప్తి తగ్గినట్లు కడలూరు జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తమిళనాడులో నిన్న 5,447 కొత్త కేసులు నమోదవగా 67 మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మొత్తం కేసుల సంఖ్య 6,35,855కు చేరగా, మృతుల సంఖ్య   9,984కు పెరిగింది.
  • కర్ణాటక: రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ కోవిడ్‌-19 నియంత్రణ చర్యలపై 11 జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, సీఈవోలు, డీహెచ్‌వోలు, ఎస్పీలతో సమీక్షించారు. కర్ణాటకలో అక్టోబర్ 12 నుంచి ‘సంవేదా సిరీస్‌’ ఆన్‌లైన్ విద్య కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి సురేష్‌కుమార్‌ తెలిపారు. ఇందులో భాగంగా 5,6,7 తరగతుల విద్యార్థులకు పాఠాల బోధన సాగుతుందని పేర్కొన్నారు. కర్ణాటకలో బుధవారం అత్యధికంగా 10,947 కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 6,68,652కు చేరింది. ప్రస్తుతం 1,16,153 మంది చికిత్స పొందుతుండగా,  113 కొత్త కోవిడ్ మరణాలతో మృతుల సంఖ్య 9,574కు చేరింది.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో ఇప్పటిదాకా 1,475 మంది నుంచి 1,838 యూనిట్ల ప్లాస్మాను సేకరించి, 1,385 మందికి ప్లాస్మా చికిత్స అందించారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 232 మంది ప్లాస్మా దానంచేయగా 302 మందికి చికిత్స చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 66,769 నమూనాలను పరీక్షించిన నేపథ్యంలో మొత్తం కేసుల సంఖ్య 7,34,427కు పెరిగింది. ఇక క్రియాశీల కేసుల సంఖ్య  49,513 కాగా, 6,349మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 6,78,828కి చేరింది. నిన్న మరో 34 మంది మరణించడంతో మరణాల సంఖ్య 6,086కు పెరిగింది.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1896 కొత్త కేసులు, 12 మరణాలు నమోదవగా 2067 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 294 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 2,06,644; క్రియాశీల కేసులు: 26,368; మరణాలు: 1201; డిశ్చార్జి: 1,79,075గా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం బుధవారం దిగ్బంధ విముక్తి-5.0 కింద మార్గదర్శకాలను జారీచేసింది. అయితే, పాఠశాలలు, సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, అక్టోబర్ 15 నుంచి వ్యాపారాల మధ్య ప్రదర్శనలకు అనుమతిస్తూ మార్గదర్శకాలిచ్చింది.

FACT CHECK

 

Image

*****


(Release ID: 1662891) Visitor Counter : 239