ఆయుష్
ఆయుర్వేద పరిశోధన కోసం అమిటీ విశ్వవిద్యాలయంతో 'ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద' ఎంవోయూ
Posted On:
08 OCT 2020 12:08PM by PIB Hyderabad
ఆరోగ్య సంరక్షణలో ఆయుష్ పద్ధతుల ప్రోత్సాహం, అభివృద్ధికి భాగస్వామ్యాలు కుదుర్చుకోవాలన్న ఆయుష్ మంత్రిత్వ శాఖ విధానంలో భాగంగా, అమిటీ విశ్వవిద్యాలయంతో, దిల్లీలోని 'ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద' (ఏఐఐఏ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆయుర్వేద శాస్త్ర పరిశోధనల ప్రోత్సాహంపై ఈ ఎంవోయూ దృష్టి పెడుతుంది.
భారతీయ వైద్య విధానాలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని; అమిటీ విశ్వవిద్యాలయం 2018లో నెలకొల్పిన 'అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్'తో ప్రస్తుత ఎంవోయూ కుదిరింది. ఆయుర్వేద ఔషధాల నాణ్యత సహకారం, ప్రామాణీకరణతోపాటు సహజ ఉత్పత్తుల రసాయన, ఔషధ శాస్త్రాల్లో పీహెచ్‌డీ కోర్సులను ఎంవోయూ అందిస్తుంది. ఫార్మాస్యూటిక్స్, ఫార్మాకోడైనమిక్స్, ఫార్మాకోకైనెటిక్స్ కోర్సులను సహకార ప్రాముఖ్యత గల అంశాలుగా గుర్తించారు. ఎంవోయూ కింద ఉమ్మడి ప్రాజెక్టులు, ప్రచురణలు చేపడతారు.
ఆయుర్వేదంలో అత్యాధునిక పరిశోధనలతోపాటు, ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద శాస్త్ర విజ్ఞాన ప్రోత్సాహం, వ్యాప్తికి ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని భావిస్తున్నారు. సంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక శాస్త్రాలతో మేళవించి, ఆయుర్వేద పరిశోధనకు కొత్త కోణాలను అద్దుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత కరోనా సమయంలో, భారత వైద్య రీతులను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసేందుకు, ప్రోత్సహించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ భారీగా కృషి చేస్తోంది. శాస్త్రీయ అధ్యయనాల ద్వారా నిరూపితమైన రోగనిరోధక పరిష్కారాలను అందించిన ఆయుర్వేదం, తనదైన ముద్రను వేసింది. ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఆయుష్ ఆరోగ్య పరిష్కారాల పరిధిని పెంచడానికి, సంబంధిత సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవలసిన అవసరాన్ని మంత్రిత్వ శాఖ అంగీకరించింది. ఆయుష్ రంగంలో పెట్టుబడులను పెంచే వ్యూహంగా, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తోంది. ఈ వ్యూహంలో భాగమే ప్రస్తుతం కుదిరిన ఎంవోయూ.
జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఉపయోగపడే విజ్ఞానం, విధానాలను పెంపొందించడానికి రెండు సంస్థలు కలిసి పనిచేస్తాయి.
***
(Release ID: 1662862)
Visitor Counter : 207