PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
22 SEP 2020 6:17PM by PIB Hyderabad
(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- గడచిన 24 గంటల్లో కోలుకున్న కేసులు లక్షకుపైగా (1,01,468) నమోదు.
- కోలుకున్నవారి సంఖ్య సుమారు 45 లక్షలు కాగా, కోలుకునే సగటు 80.86 శాతానికి చేరిక.
- నమోదిత కేసులలో మరణాల సగటు కేవలం 1.59 శాతంగా నమోదు.
- దేశంలో అత్యధిక కేసులున్న 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ ప్రతిస్పందన, సన్నద్ధత, నిర్వహణలపై రేపు ప్రధానమంత్రి సమీక్ష.
- కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో 2020-21కిగాను విశ్వవిద్యాలయాల్లోని అండర్ గ్రాడ్యుయేట్, పీజీ తొలి సంవత్సరం విద్యార్థుల కోసం విద్యా కేలండర్‌పై మార్గదర్శకాలు.
దేశంలో ఒకేరోజు కోలుకున్నవారి సంఖ్యరీత్యా మరో రికార్డు; గత 24 గంటల్లో లక్షమందికిపైగా రోగులకు వ్యాధి నయం
భారతదేశంలో కోలుకునేవారి సంఖ్య నానాటికీ అనూహ్యంగా పెరుగుతూనే ఉంది. ఈ మేరకు వరుసగా నాలుగో రోజు ఈ సంఖ్య మరింత పెరిగి, గడచిన 24 గంటల్లో కొత్తగా లక్షమందికిపైగా (1,01,468) కోలుకున్నారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం కోలుకున్నవారి సంఖ్య నేడు 45 లక్షలకు (44,97,867) చేరువలో ఉంది. దీంతో కోలుకునేవారి జాతీయ సగటు 80.86 శాతానికి పెరిగింది. కాగా, కోలుకున్న కేసులలో 79శాతం పది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు... మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఒడిషా, ఢిల్లీ, కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్‌లలోనే నమోదయ్యాయి. మరోవైపు 32,000 మందికి (31.5 శాతం)వ్యాధి నయం కాగా, జాతీయస్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒకేరోజు 10,000 మంది కోలుకున్నారు. మొత్తంమీద అత్యధికంగా కోలుకునే కేసుల రీత్యా భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే మరణాల సగటు కూడా అత్యల్పంగా 1.59 శాతం వద్ద నిలిచి ఉంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657656
అత్యధిక కేసులున్న 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ ప్రతిస్పందన, సన్నద్ధత, నిర్వహణలపై రేపు ప్రధానమంత్రి సమీక్ష
దేశంలో అత్యధిక కేసులున్న 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ ప్రతిస్పందన, సన్నద్ధత, నిర్వహణలపై రేపు (2020 సెప్టెంబరు 23న) ముఖ్యమంత్రులు, ఆరోగ్యశాఖల మంత్రులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలతో ఈ సమావేశం జరగనుంది. కాగా, దేశంలోని ప్రస్తుత చురుకైన కేసులలో 63 శాతం ఈ ఏడు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అలాగే మొత్తం నిర్ధారిత కేసులలో 65.5 శాతం, మరణాల్లో 77 శాతం కూడా ఈ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657659
దేశవ్యాప్తంగాగల శరీర దారుఢ్య ప్రియులతో ముచ్చటించనున్న ప్రధానమంత్రి
‘సుదృఢ భారతం’ ఉద్యమం తొలి వార్షికోత్సవంలో భాగంగా 2020 సెప్టెంబరు 24న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కార్యక్రమంలో శరీర దారుఢ్యానికి రాయబారులవంటి ఔత్సాహికులు, పౌరులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముచ్చటించనున్నారు. ఆన్‌లైన్ మాధ్యమంద్వారా సాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే ఔత్సాహికులంతా ప్రధానమంత్రి మార్గదర్శనం స్వీకరించడంతోపాటు తమ అనుభవాలను ఆయనతో పంచుకుంటారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657714
ఐఐటీ-గువహటిలో ప్రధానమంత్రి స్నాతకోత్సవ ప్రసంగం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఐఐటీ-గువహటి స్నాతకోత్సవంలో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రసంగించారు. సైన్స్‌సహా అన్నిరకాల జ్ఞానం సమస్యల పరిష్కారానికి ఒక మార్గమని ప్రధాని ఈ సందర్భంగా వివరించారు. నేడు ఐఐటీల వంటి ఉన్నత విద్యాసంస్థలు అభివృద్ధి చెందుతున్న తీరుపై తనకెంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది యువత స్వప్నాలు-ఆకాంక్షలేనని అందుకు వారు సిద్ధంగానూ, ఆరోగ్యంగానూ ఉండాలని ప్రధాని కోరారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657756
ఐఐటీ-గువహటిలో ప్రధానమంత్రి స్నాతకోత్సవ ప్రసంగ పూర్తిపాఠం
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657710
ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభనుద్దేశించి ప్రసంగించారు. మానవజాతి చరిత్రలో తొలిసారిగా 75 ఏళ్ల కిందట ప్రపంచం మొత్తం కోసం ఒక వ్యవస్థ సృష్టించబడిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఆ మేరకు యుద్ధ బీభత్సాలనుంచి కొత్త ఆశలు మోసులెత్తాయని పేర్కొన్నారు. వ్యవస్థాపక సభ్యదేశాల్లో ఒకటిగా ఐరాస ఆవిర్భావ పత్రంపై భారత్ సంతకం చేసిందని వివరించారు. భారతదేశం తనదైన “వసుధైవ కుటుంబకం” అనే భావనతో ఈ వ్యవస్థ ఆవిర్భావంలో పాలుపంచుకున్నదని తెలిపారు. కాగా, సమగ్ర సంస్కరణలు లోపించడంతో ఐరాస నేడు విశ్వాస సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని స్పష్టం చేశారు. ఆ మేరకు పాత వ్యవస్థలతో ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనడం వీలుకాదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పరస్పర అనుసంధానిత ప్రపంచానికి ప్రతీకవంటి సంస్కరించబడిన బహుపాక్షికత అవసరమని ఆయన అన్నారు
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657718
కోవిడ్-19 మహమ్మారి వేళ 2020-21కిగాను విశ్వవిద్యాలయాల్లోని యూజీ, పీజీ తొలి ఏడాది విద్యార్థులకోసం విద్యా కేలండర్‌పై యూజీసీ మార్గదర్శకాలు
కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో 2020-21కిగాను విశ్వవిద్యాలయాల అండర్-గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యార్థుల తొలి సంవత్సరం విద్యా కేలండరుకు సంబంధించి విశ్వవిద్యాలయ అనుమతుల సంఘం (యూజీసీ) జారీచేసిన మార్గదర్శకాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' ఇవాళ ఆవిష్కరించారు. ఈ మార్గదర్శకాలను 2020 సెప్టెంబర్ 21నాటి సమావేశంలో కమిషన్ ఆమోదించింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657732
రబీ 2021-22 వ్యాపార సీజన్‌లో పంటల కనీస మద్దతు ధరలకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) 2021-22 రబీ పంటల వ్యాపార సీజన్‌కు సంబంధించి నిర్దేశిత పంటలకు కనీస మద్దతు ధరల (ఎంఎస్‌పీ)ను పెంచడానికి ఆమోదం తెలిపింది. స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా ఈ మేరకు తీర్మానించింది. పోషక అవసరాలు, మారుతున్న ఆహార ధోరణలతోపాటు పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రభుత్వం ఈ పంటలకు సాపేక్షంగా అధిక ఎంఎస్‌పీని నిర్ణయించింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657447
జౌళి పరిశ్రమపై కోవిడ్-19 మహమ్మారి ప్రభావం
దేశంలో జౌళి రంగం అత్యంత అసంఘటితమైనది. ఈ నేపథ్యంలో కోవిడ్ మహమ్మారి ప్రతికూల ప్రభావాలనుంచి ఈ రంగాన్ని గట్టెక్కించే దిశగా ఉత్పాదకత-విక్రయాలు, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాల్లో ప్రభుత్వం అనేక ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనికిముందు ఈ రంగంలో సంక్షోభంపై అవగాహన కోసం ‘భారతీయ పట్టు పరిశ్రమపై కోవిడ్ -19 మహమ్మారి ప్రభావం’ పేరిట ప్రభుత్వం ఒక అధ్యయనం నిర్వహించింది. తదనుగుణంగా పలు ప్రత్యేక చర్యలతో జౌళిరంగానికి ఉద్దీపనలను ప్రకటించింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657905
మహమ్మారి సమయంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు, మహిళలు-పిల్లలకు సామాజిక భద్రత
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో దేశంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా (01.06.2017 నాటికి) 51-59 ఏళ్ల వయస్సుగల అంగన్‌వాడీ కార్యకర్తలు/సహాయకులకు జీవిత బీమా మొత్తాన్ని ప్రభుత్వం రూ.30,000 నుంచి రూ.2,00,000కు పెంచింది. అయితే, పైన పేర్కొన్న సామాజిక భద్రత బీమా పథకాలపై 2020 ఏప్రిల్ 1 నుంచి పూర్తి ప్రీమియం చెల్లింపు పద్ధతికి మార్చబడ్డాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657788
మహమ్మారి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణపై ‘ఈసీఐ’ వెబినార్‌లో అభిప్రాయాలు పంచుకున్న ప్రజాస్వామ్య దేశాలు
ప్రపంచంలోని ప్రజాస్వామ్య ప్రగతి దిశగా సమయానుసారం పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా అందరూ పాలుపంచుకునే రీతిలో ఎన్నికల నిర్వహణపై ప్రపంచవ్యాప్త ఎన్నికల నిర్వహణ సంస్థల (ఇఎంబి)కుగల నిబద్ధతను భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ శ్రీ సునీల్ అరోరా నొక్కిచెప్పారు. ఈ మేరకు “కోవిడ్-19 వేళ ఎన్నికల నిర్వహణ సంబంధిత అంశాలు-సవాళ్లు, విధివిధానాలు; మీ దేశ అనుభవాల కలబోత”పై నిన్న ప్రారంభించిన అంతర్జాతీయ వెబినార్ ముగింపు కార్యక్రమంలో ఆయన ఇవాళ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చర్చలు, అభిప్రాయాల ఆదానప్రదానం సందర్భంగా వెల్లడైన సార్వత్రిక అంశాలను శ్రీ అరోరా వివరించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657511
మహిళలపై గృహహింస సంఘటనల్లో పెరుగుదల
కోవిడ్-19 ఫలితంగా దిగ్బంధం మొదలైన నాటినుంచీ జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాలద్వారా ఒక ప్రకటనపూర్వక ప్రచార కార్యక్రమం చేపట్టింది. అంతేకాకుండా సాధారణ ఫిర్యాదుల పరిష్కారంసహా గృహ హింస కేసుల స్వీకరణకు 10.04.2020న వాట్సాప్ నంబర్ 72177 35372ను కూడా ప్రారంభించింది. కమిషన్ ఇలా అదనపు మార్గాలను అందుబాటులోకి తేవడంతో కొన్నేళ్లుగా గృహహింసతో వేదన అనుభవిస్తున్న మహిళలుసహా పలువురు తమ బాధలను నివేదించారు. ఈ మేరకు రాజ్యసభలో ఇవాళ ఒక ప్రశ్నకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ లిఖితపూర్వక సమాధానమిస్తూ వెల్లడించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657716
కోవిడ్-19 పరిస్థితులున్నప్పటికీ సజావుగా పనిచేసిన ఆర్టీఐ వ్యవస్థ
కోవిడ్-19 మహమ్మారి సమయంలోనూ కేంద్ర సమాచార కమిషన్ తన విధులను సజావుగా కొనసాగించిందని ఈశాన్య ప్రాంత అభివృద్ధి-పీఎంవో, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పెన్షన్లు, అణుశక్తి-అంతరిక్షం శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మేరకు ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాల విస్తృత వినియోగంతోపాటు ఆడియో/వీడియో సదుపాయాలద్వారా విజ్ఞప్తులు/ఫిర్యాదుల విచారణను నిర్వహించినట్లు పేర్కొన్నారు. తదనుగుణంగా కేంద్ర సమాచార కమిషన్ 2020 మార్చి నుంచి 17.09.2020దాకా మొత్తం 4,491 ఆన్‌లైన్ అభ్యర్థనలను పరిశీలించినట్లు వివరించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657902
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లో 9, 10 తరగతుల విద్యార్థులు ప్రత్యేక తరగతులకు హాజరు కావడం కోసం తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలలకు వచ్చే సమయంలో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చూడాలని విద్యాశాఖ కార్యదర్శిని పాలన యంత్రాంగాధిపతి ఆదేశించారు. అలాగే ఉపాధ్యాయులు కూడా క్రమం తప్పకుండా తమకుతాముగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
- పంజాబ్: రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు విద్య సంబంధిత కార్యకలాపాలను తప్పనిసరి చేయాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్-19 అనంతరం పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని అమలు చేయనుంది. భౌతిక కార్యకలాపాలతోనే విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటం సాధ్యం. అంతేగాక విద్యార్థుల సంయమనం, శ్రద్ధ, శారీరక సమతౌల్యం కూడా పెరుగుతుంది. అలాగే నాయకత్వ భావనను కూడా వారు ప్రోది చేసుకోగలరు.
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో 210 కొత్త కేసులు నమోదవగా వీటిలో ఇటానగర్ రాజధాని ప్రాంతంలో గత 24 గంటల్లో 101 కేసులున్నాయి.
- అసోం: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1795 మంది కోలుకున్నారు. కాగా, ప్రస్తుతం అసోంలో మొత్తం కేసుల సంఖ్య 1,59,320గా ఉంది. వీరిలో ఇప్పటిదాకా 1,29,130 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం 29,609 కేసులు చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నాయి.
- మణిపూర్: రాష్ట్రంలో 116 కొత్త కోవిడ్ కేసులు నమోదవగా మొత్తం కేసులు 9010కి చేరాయి. ఇక మణిపూర్‌లో కోలుకునేవారి సగటు 76 శాతం కాగా, ప్రస్తుతం 2113 క్రియాశీల కేసులున్నాయి. కోవిడ్ మహమ్మారికి మరో ఇద్దరి మరణంలో రాష్ట్రంలో మృతుల సంఖ్య 59కి పెరిగింది.
- మేఘాలయ: రాష్ట్రంలో ప్రస్తుతం చురుకైన కేసుల సంఖ్య 2169గా ఉంది. వీరిలో 355 మంది బీఎస్‌ఎఫ్, ఇతర సాయుధ దళాలకు చెందినవారు కాగా, ఇప్పటిదాకా 2527 మంది కోలుకున్నారు.
- మిజోరం: రాష్ట్రంలో నిన్న 107 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 1692కు చేరాయి. ప్రస్తుతం 680 క్రియాశీల కేసులున్నాయి.
- నాగాలాండ్: రాష్ట్రంలోని ప్రస్తుత క్రియాశీల కేసులలో 2614మంది సాయుధ దళాలు, పోలీసు సిబ్బంది కాగా, 1448మంది నాగాలాండ్‌కు తిరిగి వచ్చినవారు. మరో 1154 మంది పరిచయాలవల్ల వ్యాధికి గురైనవారు, 326 మంది ముందువరుస చికిత్స విధుల్లోగల ఆరోగ్య సంరక్షణ సిబ్బంది ఉన్నారు.
- కేరళ: రాష్ట్రంలో కరోనా పరీక్షల నిర్వహణ నేపథ్యంలో కోవిడ్ నిర్ధారిత కేసుల సగటు 9.1 శాతానికి చేరింది. ఈ మేరకు జాతీయ సగటు (8.7%)ను అధిగమించింది. కాగా, అక్టోబర్-నవంబర్ చివరికల్లా ఇది మరింత గరిష్ఠ స్థాయికి చేరుతుందని రాష్ట్ర సామాజిక భద్రతా మిషన్ డైరెక్టర్ డాక్టర్ ముహమ్మద్ అషీల్ చెప్పారు. అయితే, ప్రతి 10 లక్షల జనాభాకు మరణాల సగటు తక్కువగానే ఉందని తెలిపారు. ఇవాళ కొచ్చిలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ మృతుల సంఖ్య 554కు పెరిగింది. కేరళలో నిన్న 2,910 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం 39,285మంది చికిత్స పొందుతున్నారు. మరో 2,18,907 మంది పరిశీలనలో ఉన్నారు.
- తమిళనాడు: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరో రెండు నెలల్లో కోవిడ్-19కు ముందు స్థాయికి చేరగలదని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ సి.రంగరాజన్ అన్నారు. ఈ అంచనాలకు సంబంధించి 250 పేజీల నివేదికను సోమవారం ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామికి అందజేశారు. కాగా, రాష్ట్రంలో గత రెండు వారాల్లో 50,212 కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. వీటిపై జరిమానాల విధింపుతో రాష్ట్రవ్యాప్తంగా రూ.1.06 కోట్లదాకా వసూలైనట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి తెలిపారు. తమిళనాడులో నిన్న 5,344 కొత్త కేసులు 60మంది మరణించారు; సోమవారం నమోదైన కేసుల్లో 31 శాతం కోయంబత్తూరుసహా పశ్చిమ జిల్లాలకు చెందినవే.
- కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్ వ్యూహమందిరం గణాంకాల ప్రకారం... కర్ణాటకలో కోలుకునే రోగుల సగటు సోమవారం నాటికి 80.35 శాతంగా ఉంది. ఇప్పటిదాకా నమోదైన అత్యధిక సగటు ఇదే. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆశా కార్మికులు ముందువరుస యోధులుగా విధులు నిర్వర్తించినా నెలకు రూ.4,000 మాత్రమే చెల్లిస్తుండగా, వారు రూ.12వేలు డిమాండ్ చేస్తున్నారు.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో గత 50 రోజులలో తొలిసారి, విశాఖపట్నం జిల్లాలో (ముందురోజు 342తో పోలిస్తే) సోమవారం 200కన్నా తక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 47,516గా ఉంది. గుంటూరు జిల్లాలో సోమవారందాకా నమోదైన 49,978 కేసులలో 43,062 మంది కోలుకోగా, ప్రస్తుతం 6,418 చురుకైన కేసులున్నాయి. గణాంకాల ప్రకారం రోజూ సుమారు 800 కొత్త కేసులు నమోదవుతుండగా కొన్ని రోజులుగా కోవిడ్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది.
- తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2166 కొత్త కేసులు, 10 మరణాలు నమోదవగా 2143మంద కోలుకున్నారు. కొత్త కేసులలో 309 జీహెచ్‌ఎంసీనుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,74,774; క్రియాశీల కేసులు: 29,649; మరణాలు: 1052; డిశ్చార్జి: 1,44,073గా ఉన్నాయి. తెలంగాణలో పాఠశాలలు, కళాశాలలు సరికొత్త పరిస్థితులకు అలవాటు పడుతున్నాయి. ఆన్‌లైన్ బోధన/టెలి-కౌన్సెలింగ్, సంబంధిత కార్యకలాపాల కోసం పాఠశాలలు/కళాశాలలకు గరిష్ఠంగా 50 శాతం బోధన-బోధనేతర సిబ్బందిని విధుల్లో నియమించడానికి విద్యాశాఖ అనుమతి ఇచ్చింది.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో సోమవారం 32,007 మంది కోలుకోగా ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 9,16,348కి చేరింది. మహారాష్ట్రలో కోలుకునేవారి సగటు 74.84 శాతం కాగా, మరణాల సగటు 2.7 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,74,623 క్రియాశీల కేసులున్నాయి.
- గుజరాత్: రాష్ట్రంలో వరుసగా నాలుగోరోజు 24 గంటల్లో 1,430కిపైగా కేసులు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 1,24,767కు చేరింది. మరోవైపు 17 మంది మరణించడంతో మృతుల సంఖ్య 3,339కి పెరిగింది. ఇక సూరత్‌లో 290 కేసులు నమోదవగా పక్షం రోజుల్లో అత్యధికం కావడం గమనార్హం. అలాగే అహ్మదాబాద్‌లో 177, రాజ్‌కోట్ 143, వడోదర 137, జామ్‌నగర్ 123 వంతున కేసులు నమోదయ్యాయి.
- రాజస్థాన్: రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్-19 రోగులకు సౌకర్యాలు కల్పించడానికి రాజస్థాన్ ప్రభుత్వం 181 నంబరుతో హెల్ప్‌లైన్ ప్రారంభించింది. ఆస్పత్రిలో పడకల లభ్యత, చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని ఈ కేంద్రం అందజేస్తుంది. రాజస్థాన్‌లో కరోనా నుంచి కోలుకునేవారి సగటు 83 శాతం దాటడం విశేషం కాగా, మరణాల సగటు కూడా అత్యల్పంగా 1.6 శాతమేనని ఆరోగ్యశాఖ తెలిపింది.
- ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో గత మూడు వారాల్లో 56,678 కొత్త కేసులు నమోదయ్యాయి. రాయ్‌పూర్‌సహా ఛత్తీస్‌గఢ్‌లో 12 తీవ్ర ప్రభావిత జిల్లాలున్నాయి. ఈ నేపథ్యంలో వారం నుంచి 10 రోజులపాటు తాజా దిగ్బంధం విధించాలని పాలన యంత్రాంగాలు నిర్ణయించాయి. ఛత్తీస్‌గఢ్‌లో 3.22 కోట్ల జనాభా ఉండగా, మొత్తం కేసుల సంఖ్య 88,181గానూ ఇప్పటిదాకా మరణించినవారి సంఖ్య 690గా ఉంది. కాగా, రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులలో 64 శాతానికి పైగా, ఇప్పటిదాకా సంభవించిన మరణాల్లో 60 శాతంవరకూ గడచిన మూడు వారాల్లోనే నమోదవడం గమనార్హం.
FACT CHECK
******
(Release ID: 1657937)
Visitor Counter : 300