ప్రధాన మంత్రి కార్యాలయం
ఐక్య రాజ్య సమితి సాధారణ సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
Posted On:
22 SEP 2020 12:18PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఐక్య రాజ్య సమితి సాధారణ సభను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, 75 సంవత్సరాల క్రిందట యావత్తు ప్రపంచం కోసం మొట్టమొదటిసారిగా ఒక సంస్థ ను ఏర్పాటు చేయడం జరిగిందని, యుద్ధ భయం నుంచి ఒక కొత్త ఆశ రేకెత్తిందన్నారు. ఐరాస అధికారపత్రంలో వ్యవస్థాపక సంతకందారుగా భారతదేశం ఆ పవిత్ర దార్శనికత లో పాలుపంచుకొందని, ఇది భారతదేశ స్వీయ సిద్ధాంతమైన ‘వసుధైవ కుటుంబకమ్’ (ఈ సృష్టి అంతా ఒకే కుటుంబం అనే భావన) కు అద్దం పట్టిందన్నారు.
అభివృద్ధి, శాంతి అనే ఆశయాల ను ముందుకు తీసుకుపోయిన వారందరికీ- ఐరాస శాంతి పరిరక్షక దళం సహా- ప్రధాన మంత్రి శ్రద్ధాంజలిని ఘటిస్తూ మన ప్రపంచం ప్రస్తుతం ఒక ఉత్తమ ప్రాంతం గా ఉందంటే దీనికి కారణం ఐక్య రాజ్య సమితేనని చెప్పారు. ఈ రోజున అంగీకరిస్తున్న ఐరాస ప్రకటన ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, సాధించింది ఎంతో ఉన్నా సిసలు లక్ష్య సాధన ఇప్పటికీ ఇంకా అసంపూర్తి గానే మిగిలిందన్నారు. చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయని ఈ రోజున మనం స్వీకరిస్తున్న దీర్ఘ ప్రభావ ప్రకటన సూచిస్తోంది. ఆ పనుల్లో.. ఘర్షణ ను నివారించడం, అభివృద్ధి జరిగేటట్లు చూడటం, జలవాయు పరివర్తన సంబంధిత సమస్యలను పరిష్కరించడం, అసమానతలను తగ్గించడం, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాల ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం.. వంటి కార్యాలు ఉన్నాయని ప్రధాన మంత్రి వివరించారు. ఐక్య రాజ్య సమితిని సైతం సంస్కరించవలసిన అవసరం ఉందన్న సంగతిని ఈ ప్రకటన అంగీకరిస్తోందని ఆయన అన్నారు.
సమగ్ర సంస్కరణల కు చోటు ఇవ్వకుండా ఐరాస విశ్వాస సంబంధిత సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ప్రధాన మంత్రి అన్నారు. కాలం చెల్లిన వ్యవస్థలతో వర్తమాన సవాళ్ళను ఎదుర్కోలేం అని ఆయన చెప్పారు. దేశాలన్నీ పరస్పరం సంధానమై ఉన్న ఈనాటి ప్రపంచంలో, మనకు సంస్కరణలకు తావు ఉండే బహుళ పక్షీయ సంస్థలు అవసరం అని ప్రధాన మంత్రి అన్నారు. అటువంటి సంస్థలు నేటి వాస్తవాలకు అద్దం పడుతూ, స్టేక్ హోల్డర్స్ అందరికీ వారి అభిప్రాయాలను వినిపించేందుకు అవకాశాలిస్తూ, సమకాలీన సవాళ్ళ ను పరిష్కరించేవి అయి ఉండాలి, మానవాళి సంక్షేమం పట్ల ఆ సంస్థలు శ్రద్ధ వహించాలి అని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి గమ్యాన్ని చేరే దిశ లో, అన్ని దేశాల తో కలసి పని చేసేందుకు భారతదేశం ఎదురుచూస్తోందని ప్రధాన మంత్రి అన్నారు.
***
(Release ID: 1657718)
Visitor Counter : 261
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam