ప్రధాన మంత్రి కార్యాలయం

ఐఐటి, గువాహాటీ స్నాత‌కోత్స‌వాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

విప‌త్తు నిర్వ‌హ‌ణ‌కు, రిస్కు త‌గ్గింపున‌కు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని ఐఐటి, గువాహాటీ ని కోరిన ప్ర‌ధాన మంత్రి

జాతీయ విద్యా విధానం 2020 భార‌త‌దేశాన్ని ప్రపంచంలో విద్యార్జనకు ఒక ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దనుంది: ప‌్ర‌ధాన మంత్రి

Posted On: 22 SEP 2020 2:31PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజున ఐఐటి, గువాహాటీ  స్నాత‌కోత్స‌వాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి ‘జ్ఞానం విజ్ఞాన స‌హితం య‌త్ జ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్’ అనే మాటలను  ప్ర‌స్తావించి, ఈ మాట‌ల‌కు.. విజ్ఞాన శాస్త్రంతో స‌హా జ్ఞాన‌మే అన్ని స‌మ‌స్య‌ల ను ప‌రిష్క‌రించే సాధనం అని అర్థం.. అని పేర్కొన్నారు. 

ప్ర‌స్తుతం ఐఐటి ల వంటి సంస్థ‌లు పురోగ‌మిస్తున్న తీరును చూసి తాను గ‌ర్వపడుతున్నాన‌ని ఆయ‌న అన్నారు.  సేవ చేయ‌డానికి నూతన విషయాలను ఆవిష్క‌రించాలన్న ఈ శక్తే మ‌న దేశాన్ని వేల సంవ‌త్స‌రాల పాటు జ‌వ‌జీవాల తో నిలిపింది అని ఆయ‌న అన్నారు.  

దేశ యువ‌త భ‌విష్య‌త్తు కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అందుకు సంసిద్ధ‌మై ఉండాల‌ని, వారు దేహ‌ దారుఢ్యాన్ని క‌లిగి ఉండాల‌ని ప్ర‌ధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.  వారి క‌ల‌లు, వారి ఆకాంక్ష‌లే భార‌త‌దేశ భ‌విష్య‌త్తుకు రూపును దిద్దుతాయి అని ఆయ‌న అన్నారు.  ఈ దిశ లో ఐఐటి, గువాహాటీ త‌న ప్ర‌య‌త్నాల ను ఇప్ప‌టికే ఆరంభించిందంటూ ఆయ‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.  

ప్ర‌స్తుత మ‌హ‌మ్మారి కాలం లో విద్య సంబంధిత స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌డం లో, ప‌రిశోధ‌న‌లను కొన‌సాగించ‌డంలో ఇబ్బందులు ఎదురైన‌ప్ప‌టికీ, దేశాన్ని స్వ‌యంసమృద్ధంగా మార్చే దిశలో ఈ సంస్థ చేస్తున్న ప్ర‌య‌త్నాల ను ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసించారు.  
జాతీయ విద్య విధానం 2020 (ఎన్ఇపి 2020) ని ఇరవై ఒకటో శ‌తాబ్ద అవ‌స‌రాల‌ ను తీర్చ‌డం తో పాటు  విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం ల‌లో భార‌త‌దేశాన్ని ప్ర‌పంచంలో ఓ నాయ‌కురాలిగా తీర్చిదిద్ద‌ాలన్న లక్ష్యంతో కూడా తీసుకు రావడం జరిగిందని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఎన్ఇపి 2020 ని మ‌ల్టీ-డిసిప్లిన‌రీ గా రూపొందించ‌డం జ‌రిగింద‌ని, వివిధ కోర్సుల‌ ను ఎంపిక చేసుకొనే వెసులుబాటును ఈ విధానం అందిస్తుంద‌ని, బ‌హుళ ప్ర‌వేశాలతో పాటు బ‌హుళ నిష్క్ర‌మ‌ణ లకు కూడా ఈ విధానంలో అవ‌కాశాలు ఉన్నాయ‌ని శ్రీ మోదీ వివరించారు.

విజ్ఞాన శాస్త్రం కావ‌చ్చు లేదా మాన‌వ విజ్ఞాన శాస్త్రాలు కావ‌చ్చు, అన్ని విభాగాల కు నిధుల ను అందించడానికి, అలాగే ప‌రిశోధ‌న‌లకు అవ‌స‌ర‌మైన ఆర్ధిక స‌హాయం చేయ‌డానికి అన్ని ఫండింగ్ ఏజెన్సీల తో మెరుగైన సమన్వయాన్ని నెలకొల్పడం కోసం నేష‌న‌ల్ రిస‌ర్చ్ ఫౌండేష‌న్ ను ఏర్పాటుచేయాలని కూడా ఎన్ఇపి ప్రతిపాదిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు.    

విదేశీ విశ్వ విద్యాల‌యాలు భార‌త‌దేశం లో వాటి అనుబంధ క్యాంప‌స్ ల‌ను ఏర్పాటు చేసేందుకు ఎన్ఇపి అనుమతిని ఇస్తుంద‌ని, ఇది భార‌తీయ విద్యార్థులకు ప్ర‌పంచ శ్రేణి అనుభ‌వాన్ని ఇవ్వగలదని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఎన్ఇపి భార‌త‌దేశాన్ని ప్ర‌పంచంలో విద్యార్జనకు ఒక ప్ర‌ధాన గమ్యస్థానం గా ఆవిష్కరిస్తుంద‌ని ఆయ‌న అన్నారు.  

భార‌త్ అనుస‌రిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్ పాలిసీ’ కి కేంద్ర స్థానం లో దేశ ఈశాన్య ప్రాంతం ఉంద‌ని, అలాగే ఈ ప్రాంతం ఆగ్నేయ ఆసియా తో భార‌త‌దేశం సంబంధాల కు ఒక ప్రవేశద్వారంగా కూడా ఉంద‌ని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.  ఈ దేశాల‌ తో మ‌న సంబంధాల‌కు సంస్కృతి (క‌ల్చ‌ర్‌), వాణిజ్యం (కామ‌ర్స్‌), సంధానం (క‌నెక్టివిటీ), సామ‌ర్ధ్యం (కెపాసిటీ) లు కీల‌కంగా ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు.  ఇదే మాదిరిగా విద్య మ‌రొక కొత్త మాధ్య‌మంగా కానున్నద‌ని, దీనికి ఐఐటి గువాహాటీ ఒక ప్ర‌ధాన కేంద్రం గా రూపుదిద్దుకొంటుందని ఆయ‌న చెప్పారు.  ఈశాన్య ప్రాంతానికి ఇది కూడా ఒక కొత్త గుర్తింపును ఇస్తుంద‌ని, ఇక్క‌డ  కొత్త అవ‌కాశాలూ లభిస్తాయ‌ని ప్రధాన మంత్రి అన్నారు.  

ఈశాన్య ప్రాంతం లో మౌలిక స‌దుపాయాల అభివృద్ధికి.. ప్ర‌త్యేకించి రైల్వేలు, హైవేలు, ఎయ‌ర్‌ వేస్‌, వాట‌ర్ వేస్ వికాసానికి ప్ర‌భుత్వం ఎంతో ప్రాధాన్యాన్ని ఇస్తున్న కారణంగా ఇక్క‌డ కొత్త కొత్త అవ‌కాశాలు అందివస్తాయని  ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  

స్నాత‌కోత్స‌వం లో 300 మందికి పైగా యువత  పిహెచ్‌డి ల‌ను అందుకొంటున్నందుకు ప్ర‌ధాన మంత్రి సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.  వారు దేశం అభ్యున్న‌తికి తోడ్పడే విధం గా వారి వారి ప‌రిశోధ‌న‌ల ను కొన‌సాగించాల‌ని ఆయ‌న విజ్ఞప్తి చేశారు.  విద్యార్థులు ఈ ప్రాంతం అభివృద్ధిచెందేటట్లు వారి ప‌రిశోధ‌నలను ఏ విధం గా ముడిపెట్టవ‌చ్చో ఆలోచించాలి అని ఆయ‌న కోరారు.  

ఐఐటి గువాహాటీ ఒక సెంట‌ర్ ఫార్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అండ్ రిస్క్ రిడక్షన్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాల‌ని ప్ర‌ధాన మంత్రి సూచన చేస్తూ, ఈ సెంట‌ర్ ఈ ప్రాంతం లో విప‌త్తుల‌ను ఎదుర్కొనే నైపుణ్యాన్ని అందించ‌గ‌లుగుతుంద‌న్నారు. 


https://youtu.be/G-0WkqwA_9A


***



(Release ID: 1657756) Visitor Counter : 227