PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 28 AUG 2020 6:18PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  •  భారత్‌లో వరుసగా రెండోరోజు 9 లక్షలకుపైగా నమూనాల పరీక్ష; 4 కోట్లకు చేరువగా మొత్తం పరీక్షలు.
  • గడచిన రెండు వారాల్లో కోటిమందికిపైగా నమూనాల పరీక్ష.
  • భారత్‌లో 26లక్షలకు చేరువగా వ్యాధి నయమైనవారి సంఖ్య; 24 గంటల్లో కోలుకున్నది 60,177మంది.
  • దేశవ్యాప్తంగా 76.28 శాతానికి చేరువైన కోలుకుంటున్నవారి సగటు.
  • నమోదైన కేసులలో మరణాల సగటు మరింత తగ్గి 1.82 శాతానికి పతనం.
  • జాతీయస్థాయిలో నమోదైన మొత్తం కోవిడ్‌ కేసులలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న కేసులు కేవలం 22 శాతం మాత్రమే. 

వరుసగా రెండోరోజు 9 లక్షలకుపైగా నమూనాల పరీక్ష; 4 కోట్లకు చేరువగా మొత్తం పరీక్షలు; గత రెండు వారాల్లోనే కోటి మందికిపైగా నిర్ధారణ పరీక్షలు

కోవిడ్‌-19 మహమ్మారిపై పోరులో కేంద్ర ప్రభుత్వ “పరీక్ష, అన్వేషణ, చికిత్స” త్రిముఖ వ్యూహం ఫలితంగా వరుసగా రెండోరోజు 9 లక్షల నమూనాలను పరీక్షించారు. కాగా, భారత్‌ ఇప్పటికే రోజువారీ 10 లక్షల నమూనాల పరీక్ష సామర్థ్యం సాధించిన నేపథ్యంలో గత 24 గంటల్లో 9,01,338 పరీక్షలు నిర్వహించారు. పరీక్షల సంఖ్య స్థిరంగా పెరుగుతున్న కారణంగా నేటిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య దాదాపు 4 కోట్లకు చేరింది. తద్వారా మొత్తం పరీక్షల సంఖ్య 3,94,77,848గా నమోదైంది. కేవలం గత రెండువారాల్లోనే కోటి మందికిపైగా నమూనాలను పరీక్షించడం ఈ సందర్భంగా గమనార్హం. దీంతో ప్రతి 10 లక్షల జనాభాకు రోజువారీ పరీక్షల సగటు 28,607కు పెరిగింది. దేశంలో పరీక్ష సదుపాయాల నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తూ ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 998, ప్రైవేట్ రంగంలో 566 వంతున మొత్తం 1564 ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1649266

మొత్తం కేసులలో ప్రస్తుత కేసులు 22 శాతమే; కోలుకున్నవారు 26 లక్షల మంది; ప్రస్తుత కేసులకన్నా 18లక్షలకుపైగా అధికం

దేశంలో గడచిన ఐదు నెలల్లో నమోదైన మొత్తం కేసులలో ఇప్పటిదాకా నాలుగింట మూడొంతులు (3/4) కోలుకోగా ఒకవంతు (1/4)కన్నా తక్కువ మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. నానాటికీ కోలుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతోపాటు (స్వల్ప, ఓ మోస్తరు లక్షణాలున్నవారు) ఏకాంత గృహవాస పర్యవేక్షణలో ఉన్న నేపథ్యంలో మొత్తం కోలుకున్నవారి సంఖ్య దాదాపు 26 లక్షలకు చేరువైంది. ఆ మేరకు గత 24 గంటల్లో 60,177 మంది కోలుకున్నారు. దీంతో కోలుకునేవారి జాతీయ సగటు 76.28 శాతానికి చేరింది. ప్రస్తుత కేసులకన్నా కోలుకునే కేసులు 3.5 రెట్లు అధికంగా ఉండటంతో ఈ వ్యత్యాసం ఇవాళ 18,41,925కు చేరింది. ఇక దేశంలో ఇవాళ్టికి 1,723 కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రులు, 3,883 కోవిడ్‌ ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలు, 11,689 కోవిడ్‌ రక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అలాగే వీటిలో 15,89,105 ఏకాంత చికిత్స పడకలు, 2,17,128 ప్రాణవాయు మద్దతు పడకలు, 57,380 ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయి. నిర్ధారిత కేసులకు సమర్థ చికిత్స అందుతున్న కారణంగా మరణాలు స్థిరంగా తగ్గుతూ జాతీయ సగటు ఇవాళ 1.82 శాతానికి పతనమైంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1649261

ఇండోర్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో సూపర్‌ స్పెషాలిటీ భవనాన్ని డిజిటల్‌ మాధ్యమంద్వారా ప్రారంభించిన డాక్టర్‌ హర్షవర్ధన్‌

మధ్యప్రదేశ్‌లోని మహాత్మాగాంధీ స్మారక వైద్య కళాశాలలో సూపర్‌ స్పెషాలిటీ విభాగాన్ని  కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ డిజిటల్‌ మాధ్యమం ద్వారా సంయుక్తంగా ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వనీకుమార్‌ చౌబే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద రూ.237 కోట్లతో ఈ విభాగాన్ని నిర్మించారు. కాగా, మధ్యప్రదేశ్‌లో కోవిడ్‌-19పై పోరుకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 13.99 లక్షల N95మాస్కులు, 7.97 లక్షల పీపీఈలు, 54 లక్షల హెచ్‌సీక్యూ మాత్రలు, 679 వెంటిలేటర్లు సరఫరా చేసిందని డాక్టర్‌ హర్షవర్ధన్‌ చెప్పారు. అంతేకాకుండా 2,32,620 ఆర్‌ఎన్‌ఏ సేకరణ కిట్లు, 5,87,140 ఆర్టీ-పీసీఆర్‌ కిట్లు, 2,55,850 వీటీఎం కిట్లు కూడా అందజేసింది.  

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1649344

‘పీఎం-జేడీవై’ విజయవంతంగా ఆరేళ్లు పూర్తిచేసుకోవడంపై ప్రధానమంత్రి హర్షం

ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (PM-JDY) విజయవంతంగా ఆరేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- “బ్యాంకుల గడప ఎక్కలేనివారికి బ్యాంకు సేవలు అందుబాటులో తేవాలన్న ప్రతిష్టాత్మక లక్ష్యంతో ఆరేళ్ల కిందట ఇదేరోజున ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ప్రారంభించబడింది. ఇది విప్లవాత్మక మార్పు తేవడానికి నాంది కాగా, అనేక పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు పునాదిగా ఉంటూ కోట్లాదిమంది పేదలకు లబ్ధి చేకూరుస్తుంది. అనేక కుటుంబాల భవిష్యత్తు సురక్షితం కావడంలో ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన ప్రశంసనీయ పాత్ర పోషిస్తోంది. ఈ పథకం లబ్ధిదారులలో అధికశాతం గ్రామీణులు.. ముఖ్యంగా మహిళలే. ఈ మేరకు పీఎం-జేడీవై విజయవంతం కావడానికి నిర్విరామంగా కృషిచేసిన వారందరినీ నేను అభినందిస్తున్నాను” అన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1649222

రక్షణ ఉత్పత్తులలో స్వయం సమృద్ధ భారతంపై సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

రక్షణ ఉత్పత్తులలో స్వయం సమృద్ధ భారతంపై సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రసంగించారు. రక్షణ ఉత్పత్తులలో స్వయం సమృద్ధి బాటన సాగడం అత్యంత అవశ్యమని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. రక్షణ సంబంధ ఉత్పాదన పెంపు, నవ్య సాంకేతికత అభివృద్ధి, రక్షణ రంగంలో ప్రైవేటు సంస్థలకు ప్రముఖ పాత్ర కట్టబెట్టడం తమ ధ్యేయమన్నారు. ఈ దిశగా ఒక ఉద్యమం తరహాలో నిర్విరామ రీతిలో కఠోరంగా శ్రమిస్తున్నారంటూ రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు ఆయనకు సహకరిస్తున్న ఇతర బృందాలకు ప్రధాని అభినందనలు తెలిపారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1649168

ప్ర‌ధాన‌మంత్రి జ‌న్‌ధన్‌ యోజ‌న (పీఎం-జేడీవై)- ఆర్థిక సార్వజనీనత కోసం జాతీయ కార్యక్రమానికి ఆరేళ్లు పూర్తి

దేశంలో స‌మ్మిళిత వృద్ధికి దోహ‌ద‌ప‌డగల ఆర్థిక సార్వజనీనతను సాధించడం కేంద్ర ప్ర‌భుత్వ జాతీయ ప్రాథమ్యం. ఈ హామీ దిశగా చేపట్టిన కీలక చర్యలో భాగమే ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (PM-JDY). ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సార్వజనీనత చర్యల్లో ఒకటి. దీనికి ఇవాళ్టితో 6వ వార్షికోత్సవం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక-కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ ఈ పథకం ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటించారు. ఈ మేరకు- “మోదీ ప్రభుత్వ ప్రజాకేంద్రక ఆర్థిక విధానాల్లో ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన పునాదిరాయి వంటిది. ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ, కోవిడ్‌-19 ఆర్థిక స‌హాయం, పీఎం-కిసాన్‌, గ్రామీణ ఉపాధి హామీ పథకం వేత‌నాల పెంపు, జీవిత‌/ఆరోగ్య‌ బీమా క‌ల్ప‌న‌ వంటివి ఉన్నాయి. అయితే, వయోజనులలో ప్ర‌తి ఒక్క‌రికీ బ్యాంకు ఖాతా ప్రారంభమయ్యేలా చూడటం ఇందులో ప్రధానాంశం కాగా, దీంతోపాటు దాదాపు నిర్దేశిత ల‌క్ష్యాల‌న్నీ పూర్త‌య్యాయి” అన్నారు. కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌ కూడా ఈ సందర్భంగా ప్రసంగించారు. ఇక 2020 ఆగస్టు 19నాటికి దేశంలో పీఎం-జేడీవై ఖాతాల సంఖ్య 40.35 కోట్లు కాగా, ఇందులో గ్రామీణ ప్రాంతాలకు చెందినవి 63.6 శాతం, మహిళలకు చెందిన ఖాతాలు 55.2 శాతంగా ఉండటం విశేషం.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1649102

కోవిడ్-19 కాలంలో ‘ఒకే భారతం-శ్రేష్ఠ భారతం’ కింద వివిధ కార్యక్రమాలు నిర్వహించిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజిమెంట్

దేశ పౌరులలో “ఒకే భారతం-శ్రేష్ఠ భారతం” స్ఫూర్తిని నిరంతర ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ మేరకు కోవిడ్-19 మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న కాలంలోనూ ‘ఎన్‌సీహెచ్‌ఎంసీటీ’తోపాటు ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్‌’కు అనుబంధంగాగల ‘సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్’ 2020 మే 8 నుంచి 2020 ఆగస్టు 24 వరకూ వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది. ఇందులో భాగంగా 2020 మే నెలలో 20 సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్ మేనేజ్‌మెంట్ సంస్థలు నిర్వహించిన 27 కార్యకలాపాలలో 32 జోడు రాష్ట్రాలకు చెందిన 6,141 మంది పాల్గొన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1649217

అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయంలో జవహర్‌లాల్ నెహ్రూ వైద్య కళాశాల (JNMC) పరీక్షా కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి

కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ నిన్న దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం (AMU) లో జవహర్‌లాల్ నెహ్రూ వైద్య కళాశాల (JNMC) పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2 కోట్ల నిధులతో ఈ కేంద్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ- ప్రపంచం మొత్తం కోవిడ్-19 సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో విద్యారంగంలో తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. అయినప్పటికీ దేశంలోని విద్యార్థుల అభ్యాసానికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు. కాగా, స్వాతంత్య్ర పోరాట కాలంలో అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం కీలకపాత్ర పోషించిందని గుర్తుచేశారు. దేశమంతా కోవిడ్-19 మహమ్మారివల్ల బాధపడుతున్న సమయంలో విశ్వవిద్యాలయ వైద్య కళాశాల కొత్త ఆశలు కల్పిస్తున్నదని పేర్కొన్నారు. కరోనావైరస్ వ్యాప్తివల్ల ప్రతికూలత ఏర్పడినా నిరంతర సానుకూల పరివర్తనాత్మకత ఆధారంగా సర్వతోముఖాభివృద్ధి సాధించడంలో నిర్విరామ కృషి చేశారంటూ ఏఎంయూ ఉప కులపతిని మంత్రి అభినందించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1649056

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 78 కొత్త కేసుల నమోదుతో క్రియాశీల కేసులు 1007కు చేరాయి. కాగా, అరుణాచల్‌ ప్రదేశ్‌లో కోలుకునేవారి సగటు 72 శాతానికిపైగా నమోదైన నేపథ్యంలో ఇప్పటిదాకా 2621 మంది కోలుకున్నారు.
  • అసోం: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2345 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. దీంతో గురువారందాకా అసోంలో వ్యాధి నయమైనవారి సంఖ్య  79307కు పెరగ్గా, 19219 చురుకైన కేసులున్నాయి.
  • మణిపూర్: రాష్ట్రంలో 24 గంటల్లో 140 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 119 ప్రయాణ చరిత్ర లేనివి కాగా, 128 మంది కోలుకున్నారు. మణిపూర్‌లో కోలుకునేవారి సగటు 69 శాతంగా ఉంది.
  • మేఘాలయ: రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 1222కుగాను 414 మంది బీఎస్‌ఎఫ్, సాయుధ దళాల సిబ్బంది కాగా. 808 మంది ఇతరులున్నారు. మేఘాలయలో ఇప్పటిదాకా 899మంది కోలుకున్నారు.
  • మిజోరం: మిజోరం రాష్ట్రంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య ఇవాళ 1000 స్థాయిని దాటింది.
  • నాగాలాండ్: రాష్ట్రంలో వోఖా జిల్లా ఇన్‌ఛార్జిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి వై.ప్యాటన్ జిల్లాలో కోవిడ్‌ పరిస్థితులను సమీక్షించారు. నాగాలాండ్‌లోని కొన్ని గ్రామాలు, కాలనీలలో ప్రవేశంపై ఆంక్షలమీద ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. కాగా, కొత్త కేసులు వెలుగులోకి రావడంతో కోహిమాలో మరో 5 ప్రదేశాలను జిల్లా యంత్రాంగం మూసివేసింది.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో గురువారం 14,718 కొత్త కేసులతోపాటు 355 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 7,33,568కు, మృతుల సంఖ్య 23,444కు పెరిగాయి. పుణె నగరంలో నిత్యం 1,000కిపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ కోలుకునేవారి సగటు 80.48 శాతంగా నమోదై, ముంబైతో సమానంగా 81.32 శాతానికి చేరువవుతోంది. ఏదేమైనా మహారాష్ట్ర రాజధాని ముంబైతో పోలిస్తే పుణెలో క్రియాశీల కేసులు ఎక్కువగా ఉన్నాయి.
  • గుజరాత్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,190 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 91,329కి చేరింది. ఇందులో 258 కేసులు నమోదైన సూరత్ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 20,000 దాటింది. ఇక అహ్మదాబాద్‌లో 163, వడోదరలో 123 కొత్త కేసులున్నాయి. గురువారం 76,227 పరీక్షలు నిర్వహించగా ఇప్పటిదాకా పరీక్షించిన నమూనాల సంఖ్య 20 లక్షలు దాటింది.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో పనిచేస్తున్న 9 మందితోపాటు ముఖ్యమంత్రి నివాసంలో పనిచేసే  వ్యక్తి ఒకరికి కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌ పాల్గొనాల్సిన కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. కాగా, గురువారం 633 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 75,303కు చేరింది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలోని 10 జిల్లాల్లో కోవిడ్-19 మహమ్మారి నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్ ఆరోగ్యశాఖతోపాటు ఇతర అధికారులను ఆదేశించారు. ఈ జాబితాలో ఇండోర్, గ్వాలియర్, భోపాల్, జబల్పూర్, ఝబువా, శివపురి, ధార్, ఖార్గోన్, ఉజ్జయిని, సాగర్ జిల్లాలున్నాయి. క్రియాశీల కేసుల సంఖ్యరీత్యా మధ్యప్రదేశ్ దేశంలోనే 16వ స్థానంలో ఉంది. కాగా, గురువారం క్రియాశీల కేసుల సంఖ్య 12,422కు చేరింది.
  • కేరళ: రాష్ట్రంలో కోవిడ్-19 వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వివిధ రంగాల్లో నమూనాల పరీక్షకు సంబంధించిన సవరించిన రక్షణ ప్రణాళికను ఆరోగ్యశాఖ రూపొందించింది. ఇందులో భాగంగా ప్రతి వారం నమూనాలను సేకరించి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించేలా చూడాలని స్థానిక స్వపరిపాలన సంస్థలను ఆదేశించింది. కేరళలోని చాలా జిల్లాల్లో నిత్యం 100కుపైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నిన్న 2,406 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో 22,673మంది చికిత్స పొందుతుండగా 1.93 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో గత 24 గంటల్లో ఒకేరోజు అత్యధికంగా 604 కొత్త కేసులతోపాటు 9 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 13,024కు, క్రియాశీల కేసులు 4745కు, మరణాలు 199కి పెరిగాయి. రైలు ప్రయాణ సేవల నిలిపివేతవల్ల ఏప్రిల్ నుండి జూలై వరకు రూ.100 కోట్లకుపైగా ఆదాయం నష్టపోయినట్లు దక్షిణ రైల్వే పరిధిలోని తిరుచ్చి డివిజన్‌ పేర్కొంది. కాగా, మహమ్మారి విజృంభణ సమయంలోనూ గరిష్ఠ పెట్టుబడుల ఆకర్షణలో తమిళనాడు అన్ని రాష్ట్రాలకన్నా ముందంజ వేసిందని ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి అన్నారు. దీనివల్ల రాష్ట్రంలో మరిన్ని ఉద్యోగావకాశాల సృష్టి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
  • కర్ణాటక: రాష్ట్రంలో పాఠశాలలు ఎప్పుడు ప్రారంభమవుతాయో, ఆ తర్వాత తరగతులు ఎలా సాగుతాయో ఇప్పుడే చెప్పలేమని కర్ణాటక ప్రాథమిక-మాధ్యమిక విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ చెప్పారు. కాగా, రాష్ట్రంలో నిన్న ఒకేరోజు అత్యధికంగా 9,386 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,09,792 కు చేరుకుంది. కొత్త కేసులలో అత్యధికం రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరానికి చెందినవే కావడం గమనార్హం.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్ రోగులకు చికిత్స సందర్భంగా ప్రాణాలర్పించిన ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి నెలలోగా ప్రభుత్వోద్యోగం ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ వైద్య-ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. కాగా, రాష్ట్రంలోని జైళ్లలో 1,375 మంది ఖైదీలతోపాటు 241 మంది సిబ్బంది కోవిడ్-19 బారినపడ్డారని జైళ్ల విభాగం డీజీపీ ప్రకటించారు. అయితే, వీరిలో కేవలం ఒక్క ఖైదీ మాత్రమే ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. నమోదిత కేసులలో అధికశాతం లక్షణరహితం కాగా, చికిత్స సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక రాష్ట్రంలో గురువారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 3.93 లక్షలుగా ఉంది.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 2932 కొత్త కేసులు, 11 మరణాలు నమోదవగా 1580 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 520 జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే. తెలంగాణలో మొత్తం కేసులు: 1,17,415; క్రియాశీల కేసులు: 28,941; మరణాలు: 799; డిశ్చార్జి: 87,675గా ఉన్నాయి. రాష్ట్రంలో కోవిడ్-19 పరీక్షల సామర్థ్యాన్ని ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ పెంచుతూ వస్తోంది. ఈ మేరకు  వారం రోజులుగా నిత్యతం 50,000-60,000 మేర పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

FACT CHECK

***



(Release ID: 1649398) Visitor Counter : 174