ప్రధాన మంత్రి కార్యాలయం

రక్షణ సంబంధిత తయారీ లో ఆత్మనిర్భర్ భారత్ అంశం పై ఏర్పాటైన చర్చాసభ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

రక్షణ సంబంధిత తయారీ లో స్వయంసమృద్ధియుతం గా ఎదగడం అవసరమని నొక్కిపలికిన ప్రధాన మంత్రి; ఈ దిశ లో అనేక నిర్దిష్ట చర్యల ను తీసుకోవడమైందని స్పష్టీకరణ

రక్షణ రంగం లో ఆత్మనిర్భరత అనేది హిందూ మహాసముద్ర ప్రాంతం లో ఒక నికర సేవా ప్రదాత గా భారతదేశం భూమిక ను పెద్దది గా చేయగలదని పేర్కొన్న ప్రధాన మంత్రి

Posted On: 27 AUG 2020 7:57PM by PIB Hyderabad

రక్షణ సంబంధిత తయారీ లో ఆత్మనిర్భర్ భారత్ అంశం పై ఈ రోజు న ఏర్పాటైన చర్చాసభ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.  రక్షణ సంబంధిత తయారీ లో స్వయంసమృద్ధి బాట న సాగిపోవడం అవసరమని ప్ర‌ధాన మంత్రి ఉద్ఘాటిస్తూ, రక్షణ సంబంధిత ఉత్పత్తి ని పెంచడం, నూతన సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధిపరచడం, ఇంకా రక్షణ రంగం లో ప్రైవేటు సంస్థల కు ప్రముఖ పాత్ర ను ఇవ్వడం మన ధ్యేయం గా ఉంది అన్నారు.
 
ఒక ఉద్యమం తరహా లో పనిచేస్తున్నందుకు, కఠోరం గా శ్రమిస్తున్నందుకు రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ ను, ఆయన యొక్క యావత్తు జట్టు ను ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, రక్షణ రంగ సంబంధి ఉత్పత్తుల లో స్వయంసమృద్ధి ని సాధించాలన్న లక్ష్యం నేటి చర్చాసభ నుండి తప్పక వేగగతి ని అందుకోగలుగుతుందన్నారు.  
  
భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించుకొన్న వేళ,   భారతదేశం లో రక్షణ ఉత్పత్తుల తయారీ కి భారత్ లో గొప్ప శక్తి సామర్ధ్యాల తో పాటు తత్సంబంధిత అనుకూల వ్యవస్థ ఉన్నాయని, అయితే దశాబ్దాల పాటు గంభీరమైన యత్నాలు ఏవీ కూడా జరుగలేదని ప్రధాన మంత్రి అన్నారు.  పరిస్థితి ఇప్పుడు మారుతోందని, రక్షణ రంగం లో సంస్కరణల ను తీసుకువచ్చేందుకు నిరంతరాయమైనటువంటి మరియు పట్టువిడవని రీతి లో కృషి జరుగుతోందని ఆయన అన్నారు.  లైసెన్సులను ఇచ్చే ప్రక్రియ ను మెరుగుపరచడం, సమాన అవకాశాల ను కల్పించడం, ఎగుమతి  ప్రక్రియ ను సరళతరం చేయడం- ఈ ప్రకారం గా అనేక నిర్దిష్ట  చర్యల ను ఈ దిశ లో తీసుకోవడం జరిగిందని ప్రధాన మంత్రి వివరించారు.

ఒక ఆధునికమైన భారతదేశాన్ని, స్వయంసమృద్ధియుతమైన భారతదేశాన్ని నిర్మించాలంటే రక్షణ రంగం లో విశ్వాస భావన ను రగుల్కొలపడం ఎంతయినా అవసరమని ప్రధాన మంత్రి అన్నారు.  దశాబ్దాల తరబడి పెండింగులో ఉన్నటువంటి సిడిఎస్ నియామకం వంటి నిర్ణయాలను ప్రస్తుతం తీసుకోవడమైందని, ఇది న్యూ ఇండియా యొక్క విశ్వాసాని కి ప్రతిబింబం గా ఉందన్నారు.  చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) ను నియమించడం త్రి విధ దళాల మధ్య ఉత్తమ యోగవాహకత కు,  సమన్వయాని కి దారి తీసిందని, రక్షణ సంబంధిత ఉపకరణాల సేకరణ ను పెంచడానికి కూడాను సహాయకారి అయిందని ఆయన అన్నారు.  అదే విధం గా, రక్షణ ఉత్పత్తుల తయారీ లో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కు ఆటోమేటిక్ రూట్ ద్వారా అనుమతి ని ఇవ్వడమనేది న్యూ ఇండియా ధైర్యాని కి అద్దం పడుతోందని ఆయన అన్నారు.

దేశీయం గా సేకరణ కై కేపిటల్ బడ్జెటు లో కొంత భాగాన్ని కేటాయించడం వంటి చర్యలు,  దేశీయం గా సేకరించడానికి 101 వస్తువుల ను నిర్దేశించడం వంటి నిర్ణయాలు భారతదేశ రక్షణ పరిశ్రమల కు ప్రోత్సాహాన్ని ఇవ్వగలుగుతాయని ప్రధాన మంత్రి చెప్పారు.  సేకరణ ప్రక్రియ ను వేగవంతం చేయడం,  పరీక్షా విధానాన్ని క్రమబద్ధం చేయడం మొదలైన విషయాల పై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కూడా ఆయన అన్నారు.   ఆయుధ కర్మాగారాల ను కార్పొరేట్ సంస్థలు గా మార్చడాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఆ ప్రక్రియ పూర్తి అయిందంటే గనక అది ఇటు కార్మికులను, అటు రక్షణ రంగాన్ని బలపరచగలుగుతుందన్నారు.

ఆధునిక సామగ్రి, ఉపకరణాల తయారీ లో స్వయంసమృద్ధి ని సాధించడానికి సాంకేతిక విజ్ఞానం  స్థాయి ని అధికం చేయవలసిన అవసరాన్ని గురించి ప్రధాన మంత్రి ఉద్ఘాటిస్తూ, డిఆర్ డిఒ కు అదనం గా ప్రైవేటు రంగం లో,  విద్యా సంస్థల లో పరిశోధనల ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.   విదేశీ సంస్థ ల భాగస్వామ్యం తో జాయింట్ వెంచర్ ల ద్వారా ఉత్పత్తి చేయడం పై శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

ప్రభుత్వం ‘సంస్కరణ, ఆచరణ మరియు పరివర్తన’ అనే మంత్రం తో ముందుకు సాగుతోందని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, బౌద్ధిక సంపద, పన్ను ల విధానం, ఇన్ సోల్వన్సి ఎండ్ బ్యాంక్రప్టసి, అంతరిక్షం, ఇంకా అణు శక్తి ల వంటి రంగాల లో పెద్ద సంస్కరణలు చోటు చేసుకోనున్నాయన్నారు.

మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ఉత్తర్ ప్రదేశ్ లో,  తమిళ నాడు లో రెండు రక్షణ కారిడర్ ల పనులు పురోగతి లో ఉన్నాయన్నారు.  అత్యంత ఆధునికమైనటువంటి మౌలిక సదుపాయాల ను ఉత్తర్ ప్రదేశ్,  తమిళ నాడు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తో నిర్మించడం జరుగుతోందన్నారు.  దీనికోసం వచ్చే అయిదు సంవత్సరాల లో 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యాన్ని నిర్దేశించడమైందన్నారు.

నవ పారిశ్రామికవేత్తల ను, మరీముఖ్యం గా ఎంఎస్ఎం ఇల తో, స్టార్ట్- అప్స్ తో అనుబంధం కలిగివున్న నవ పారిశ్రామికవేత్తల ను, ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఐడెక్స్ [iDEX] కార్యక్రమం సానుకూలమైనటువంటి ఫలితాల ను అందుకొంటోందని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ ప్లాట్ ఫార్మ్  ద్వారా 50 కి పైగా స్టార్ట్- అప్స్ సైన్యం లో వినియోగం కోసం టెక్నాలజీ ని, ఇంకా ఉత్పత్తులను అభివృద్ధి చేశాయని ఆయన అన్నారు. 
 
‘రక్షణ సంబంధిత ఉత్పత్తి మరియు ఎగుమతి ప్రోత్సాహక విధానం ముసాయిదా’ విషయం లో అందిన సూచనలు మరియు స్పందన లు ఈ విధానాన్ని సాధ్యమైనంత త్వరలో అమలుపరచడం లో సహాయకారి గా ఉంటాయని ఆయన అన్నారు.

స్వయంసమృద్ధం గా ఎదగాలనే, ఒక ఆత్మనిర్భర్ భారత్ గా రూపొందాలనేటటువంటి మన సంకల్పాన్ని నెరవేర్చుకోవడం లో ఉమ్మడి కృషి సహాయకారి కాగలదని పేర్కొంటూ తన ప్రసంగాన్ని ప్రధాన మంత్రి ముగించారు.

https://youtu.be/91idITBd9wc
 


*** 



(Release ID: 1649168) Visitor Counter : 199