PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 23 JUL 2020 6:37PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • గ‌త 24 గంట‌ల్లో రికార్డు స్థాయిన దాదాపు 30 వేల‌మంది కోలుకోగా, ఇప్ప‌టిదాకా వ్యాధి న‌య‌మైనవారి సంఖ్య 7.82 లక్షలకుపైగా న‌మోదు.
 • జాతీయంగా కోలుకునేవారి సగటు 63.18 శాతానికి చేరిక.
 • ప్రస్తుతం చికిత్స పొందుతున్న కోవిడ్‌-19 వాస్తవ కేసుల సంఖ్య 4,26,167 మాత్రమే.
 • మరణాల శాతం స్థిరంగా తగ్గుతూ ప్రస్తుతం 2.41కి పతనం.
 • భారత దేశంలో పెట్టుబడులకు మునుపెన్నడూ ఇటువంటి తరుణం రాలేదు: ప్రధానమంత్రి.
 • కోవిడ్‌-19పై పోరుకు భారత డిజిటల్‌ ఆవిష్కరణల విశేష తోడ్పాటు: శ్రీ రవిశంకర్‌ ప్రసాద్‌.

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సమాచారం; ఒకేరోజు వ్యాధి నయమైనవారి సంఖ్య అత్యధికంగా దాదాపు 30 వేల‌కు చేరగా, కోలుకున్నవారి సంఖ్య 7.82 లక్షలకుపైగా న‌మోదు

దేశంలో కరోనా వైరస్ బారిన‌ప‌డి కోలుకున్న‌వారి సంఖ్య ఇవాళ వ‌రుస‌గా రెండోరోజు కూడా గణనీయంగా పెరిగింది. ఈ మేర‌కు గత 24 గంటల్లో అత్యధికంగా 29,557 మందికి వ్యాధినయం కాగా, ఆస్ప‌త్రుల నుంచి ఇళ్ల‌కు వెళ్లారు. దీంతో ఇప్ప‌టిదాకా కోలుకున్న‌వారి సంఖ్య 7,82,606కు చేర‌గా, కోలుకునేవారి జాతీయ స‌గ‌టు 63.18 శాతానికి పెరిగింది. ఇక చికిత్స పొందుతున్న‌-కోలుకున్న కేసుల సంఖ్య మ‌ధ్య అంత‌రం 3,56,439కి పెరిగిన నేప‌థ్యంలో ఇప్పుడు కేవ‌లం 4,26,167 మంది మాత్ర‌మే చురుకైన వైద్య ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స పొందుతున్నారు. అలాగే కేంద్ర-రాష్ట్రాల సంయుక్త కృషి ఫలితంగా మరణాల శాతం స్థిరంగా దిగివస్తూ ఇవాళ్టికి 2.41 శాతంగా నమోదైంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640676

‘భారత చింతనా సదస్సు-2020’లో కీలకోపన్యాసం చేసిన ప్రధానమంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న ‘భారత చింతనా సదస్సు-2020’లో కీలకోపన్యాసం చేశారు. భారత-అమెరికా వాణిజ్య మండలి ఈ సదస్సుకు ఆతిథ్యమిచ్చింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- ప్రగతి పయనంలో పేదలకు, దుర్బలవర్గాలకు అగ్ర ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ‘వాణిజ్య సౌలభ్యం’ తరహాలోనే ‘జీవన సౌలభ్యం’ కూడా అత్యంత ప్రధానమని స్పష్టం చేశారు. వెలుపలినుంచి తగిలే దెబ్బను కాచుకోగల శక్తి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఉండాల్సిన అవసరాన్ని ప్రపంచ మహమ్మారి మనకు విశదం చేసిందని పేర్కొన్నారు. ఈ శక్తిని మనం బలమైన దేశీయ ఆర్థిక వ్యవస్థల సామర్థ్యంతోనే సాధించగలమని చెప్పారు. ఆ మేరకు స్వయం సమృద్ధ భారతం పిలుపుద్వారా మరింత సౌభాగ్యవంతమైన, దృఢమైన ప్రపంచ నిర్మాణానికి భారత్‌ తనవంతు కృషి ప్రారంభించిందని వివరించారు. గడచిన ఆరేళ్ల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలను మరింత సంస్కరణాత్మకంగా, ఆంక్షలరహితంగా రూపొందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆ మేరకు సంస్కరణలు పోటీతత్వాన్ని ప్రోత్సహించి, పారదర్శకతను పెంచడంతోపాటు డిజిటలీకరణ విస్తరణకు, వినూత్న ఆవిష్కరణలకు, విధాన స్థిరత్వానికి బాటలు పరిచాయన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640713

‘భారత చింతనా సదస్సు-2020’లో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తిపాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640566

మణిపూపూర్‌లో సుర‌క్షిత నీటి సరఫరా ప‌థ‌కానికి ప్రధానమంత్రి శంకుస్థాపన

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్య‌మంద్వారా మ‌ణిపూర్‌లో ర‌క్షిత నీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కానికి శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ- దేశమంతా నేడు కోవిడ్-19పై నిర్విరామంగా పోరాడుతుండగా తూర్పు-ఈశాన్య భారత ప్రాంతాలు భారీవర్షాలు-వరదలతో ద్వంద్వ సవాళ్లను ఎదుర్కొన‌వ‌ల‌సి వ‌చ్చింద‌న్నారు. ఈ ప్ర‌కృతి వైప‌రీత్యాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోగా, అనేకమంది నిరాశ్రయులయ్యారని విచారం వ్య‌క్తం చేశారు. ఇక దిగ్బంధం సమయంలో వలస కార్మికులు తిరిగివచ్చేందుకు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇక ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద మణిపూర్‌లో సుమారు 25 లక్షల మంది పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందాయ‌ని చెప్పారు. అలాగే రాష్ట్రంలో 1.5 లక్షల మందికిపైగా మహిళలకు ఉజ్వ‌ల పథకం కింద ఉచిత వంట‌గ్యాస్ ల‌భించింద‌ని పేర్కొన్నారు. ఇక ప్ర‌స్తుతం రూ.3వేల కోట్ల‌తో చేప‌డుతున్న నీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కం పూర్త‌యితే రాష్ట్రంలో నీటికోసం ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులు తొల‌గిపోతాయ‌ని, ముఖ్యంగా మ‌హిళలకు ఎంతో ఊర‌ట ల‌భిస్తుంద‌ని వివ‌రించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640323

లేహ్‌లోని ‘డీఐహెచ్‌ఏఆర్‌’లో కోవిడ్‌-19 పరీక్ష సదుపాయం ఏర్పాటు చేసిన డీఆర్‌డీవో

కేంద్రపాలిత ప్రాంతమైన లేహ్‌లోగల కోవిడ్‌-19 పరీక్షల సామర్థ్యం పెంపు దిశగా రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (DRDO) అక్కడి ‘డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై ఆల్టిట్యూడ్‌ రీసెర్చ్‌’ (DIHAR)లోని ప్రయోగశాలలో కొత్త సదుపాయం ఏర్పాటు చేసింది. లదాఖ్‌ లెఫ్టినెట్‌ గవర్నర్‌ శ్రీ ఆర్‌.కె.మాధుర్‌ నిన్న ప్రారంభించారు. భారత వైద్య పరిశోధన మండలి (ICMR) నిర్దేశిత భద్రత ప్రమాణాలకు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటైన ఈ ప్రయోగశాల ఇప్పటికే వ్యాధి సోకినవారి విషయంలోనూ తగిన శ్రద్ధ వహించడంలో తోడ్పడనుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640300

‘సీపీఎస్‌ఈ’ల ‘కేపెక్స్‌’పై ఆర్థికమంత్రి రెండో సమీక్ష సమావేశం

కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ ఇవాళ పౌర విమానయానం, ఉక్కుశాఖల కార్యదర్శులు, రైల్వేబోర్డు చైర్మన్లుసహా పై మంత్రిత్వశాఖల పరిధిలోని 7 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ (CPSE)ల సీఎండీలతో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ‘మూలధన వ్యయం’ (CAPEX)పై సమీక్షించారు. కోవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక వృద్ధిని వేగిరపరచే దిశగా ఆర్థికమంత్రి వివిధ భాగస్వాములతో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాలలో ఇది రెండోది కావడం ఈ సందర్భంగా గమనార్హం. ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను నిర్దేశించిన మేరకు మూలధన వ్యయం సంపూర్ణ స్థాయిలో ఉండేవిధంగా చూసుకోవాలని ఆమె నిర్దేశించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640744

మీడియా పరిశ్రమలో కోవిడ్ ప్రభావిత ఆర్థిక ఒత్తిడిపై ఉప రాష్ట్రపతి ఆందోళన

దేశవ్యాప్తంగా మీడియా పరిశ్రమలో కోవిడ్ ప్రభావిత ఆర్థిక ఒత్తిడిపై ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల నడుమ ఉద్యోగుల విషయంలో కారుణ్యం, శ్రద్ధ చూపుతూ వారి అండగా నిలవాలని యాజమాన్యాలను కోరారు. కీర్తిశేషులైన శ్రీ ఎం.పి.వీరేంద్ర కుమార్‌ స్మారకార్థం నిన్న ఏర్పాటు చేసిన వాస్తవిక సాదృశ సమావేశంలో ఉప రాష్ట్రపతి ఆయనకు నివాళి అర్పించారు. శ్రీ వీరేంద్ర కుమార్ వంటివారి నుంచి స్ఫూర్తి పొందాలని, సాటి పౌరులతో మరింత సానుభూతి ప్రదర్శించాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత మహమ్మారి కాలంలో సరైన, ప్రామాణిక సమాచారం అందించాల్సిన ప్రాముఖ్యాన్ని ఉప రాష్ట్రపతి నొక్కిచెప్పారు. కర్తవ్య నిర్వహణలో ముప్పు ఉన్నప్పటికీ మహమ్మారిపై సముచిత సమాచారంతో ప్రజలకు మరింత సాధికారత కల్పించిందంటూ మీడియాను ఆయన ప్రశంసించారు. అయినప్పటికీ  కోవిడ్‌-19 చికిత్సకు సంబంధించి రుజువులు, ఆధారాల్లేని ప్రచారం విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640481

దేశ సార్వ‌భౌమ‌త్వ అంశాల‌పై డిజిటల్ వేదికలు ప్రతిస్పందనాత్మ‌కంగా, జ‌వాబుదారీగా ఉండాలి: శ్రీ రవిశంకర్ ప్రసాద్

డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై జి-20 దేశాల మంత్రులస్థాయి వాస్త‌విక సాదృశ సమావేశానికి కూట‌మి అధ్య‌క్ష హోదాలో సౌదీ అరేబియా ఇవాళ ఆతిథ్యమిచ్చింది. ఇందులో భారత్ తరఫున కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫ‌ర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి సంక్షోభ తరుణంలో అంత‌ర్జాతీయ స్థాయిగ‌ల పటిష్టమైన సరఫరా వ్యవస్థను రూపొందించాల్సి ఉందన్నారు. ప్రపంచ స్థాయి సరఫరా వ్యవస్థతో సాన్నిహిత్యం ఉండేలా పెట్టుబడులకు ఆకర్షణీయ గ‌మ్యంగా భారత్‌ను తీర్చిదిద్దాలన్న ప్రధాని దార్శనికతను ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్రస్తావించారు. కోవిడ్-19 సంక్షోభాన్ని ప్రపంచంలోని అనేక దేశాలక‌న్నా భార‌త్ మెరుగ్గా ఎదుర్కొన్న‌దని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వ పటిమ వల్లనే ఇది సాధ్యమైందని వివరించారు. కోవిడ్-19పై పోరులో ఎంతగానో సహాయపడిన డిజిటల్ పరితజ్ఞాన సృజనాత్మకత గురించి కేంద్రమంత్రి ప్రస్తావించారు. ఈ మేర‌కు ‘ఆరోగ్యసేతు’ మొబైల్ యాప్, నిర్బంధవైద్య ప‌రిశీల‌న‌లోగ‌ల బాధితుల పర్యవేక్షణకు ఉపయోగపడిన జియో ఫెన్సింగ్ వ్యవస్థ, కోవిడ్-19 సావధాన్ బల్క్ మెస్సేజింగ్ వ్యవస్థ తదితరాల గురించి సమావేశంలో వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640323

పీఎంజీకేఏవై-2 కింద 19.32 ల‌క్ష‌ల ట‌న్నుల ఆహారధాన్యాలను తీసుకెళ్లిన రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతాలు

దేశంలో దిగ్బంధం విధించిన నాటినుంచి సుమారు 139.97 ల‌క్ష‌ల ట‌న్నుల ఆహార ధాన్యాల‌ను 4999 స‌ర‌కు ర‌వాణా రైళ్ల‌ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల‌కు తీసుకెళ్లగా, 2020 జూన్‌ 30దాకా మొత్తం 285.07 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు రవాణా అయ్యాయి. కాగా, 2020 జూలై 1 నుంచి 26.69 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను 953 రైళ్లద్వారా రవాణా చేశారు. రైలు మార్గంతోపాటు రహదారులు, జలమార్గాల్లోనూ రవాణా సాగింది. తదనుగుణంగా 2020 జూలై 1 నుంచి మొత్తం 50.91 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు రవాణా అయ్యాయి. ఇక ఈశాన్యా రాష్ట్రాలకు 2020 జూలై 1 నుంచి 1.63 లక్షల ఆహార ధాన్యాలను రవాణా చేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640505

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • పంజాబ్: రాష్ట్రంలో కోవిడ్ పరీక్షల సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా పాటియాలా, అమృత్‌సర్‌, ఫరీద్‌కోట్‌లోని మూడు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వైరల్ ప్రయోగశాలల  కోసం ఏడు ఆటోమేటిక్ ఆర్‌ఎన్‌ఎ సేకరణ యంత్రాలను కొనుగోలు చేయాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, ఇప్పటికే మొహాలీ, లూధియానా, జలంధర్‌ నగరాల్లో కొత్త ఏర్పాటుచేసిన ప్రయోగశాలల కోసం మరో నాలుగు కొనుగోలు చేయనుంది. ‘మిషన్ ఫతే’ కింద రాష్ట్రంలో పరీక్షలను ముమ్మరం చేయడం ద్వారా మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
 • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధానికి సమర్థ చర్యలు తీసుకుంటున్నట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ ఆరోగ్యశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఆర్.డి.ధీమాన్ చెప్పారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి సంబంధిత విధివిధానాలు ఇతర రాష్ట్రాలకన్నా పటిష్ఠంగా ఉన్నాయని, రోగ నిర్ధారణ పరీక్షలు చురుగ్గా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం- వ్యాధి సంక్రమణ 5 శాతంకన్నా తక్కువగా ఉండాలని పేర్కొన్నారు. ఇక సమగ్ర పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రంలో కరోనా కేసులు 1.3 శాతానికి పరిమితం కాగా, మరణాల విషయంలోనూ రాష్ట్రంలో అతి తక్కువగా 0.84 శాతంగా మాత్రమే ఉందన్నారు. పరీక్షలకు సంబంధించి జాతీయ సగటు ప్రతి 10 లక్షల జనాభాకు 11,000 కాగా- రాష్ట్రంలో 17000గా ఉందని వివరించారు.
 • కేరళ: రాష్ట్రంలో కోవిడ్-19 వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో జూలై 27న నిర్వహించాల్సిన అసెంబ్లీ సమావేశాన్ని కేరళ ప్రభుత్వం రద్దుచేసింది. వచ్చే సోమవారం ప్రత్యేక మంత్రిమండలి సమావేశం సందర్భంగా రాష్ట్రంలో మళ్లీ దిగ్బంధం విధించడంపై నిర్ణయం తీసుకోనున్నారు. సామాజిక సంక్రమణకు సంబంధించిన సంకేతాల నేపథ్యంలో రాష్ట్రంలో పూర్తి దిగ్బంధానికి బదులు ప్రాంతీయంగా విధిస్తే ప్రభావం బాగా ఉంటుందని ఐఎంఎ సూచించింది. రాష్ట్రంలో మరో మూడు కోవిడ్ మరణాలు సంభవించగా మొత్తం మృతుల సంఖ్య 48కి చేరింది. రాష్ట్రంలోని నిన్న ఒకేరోజున 1038 కొత్త కేసులతో కొత్త రికార్డు నమోదైంది. వీటిలో 785 స్థానిక పరిచయాల ద్వారా సంక్రమించాయి. వివిధ జిల్లాల్లో 8,818 మంది చికిత్స పొందుతుండగా 1.59 లక్షలమంది పరిశీలనలో ఉన్నారు.
 • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 123 కొత్త కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,420కి చేరింది. వీటిలో యాక్టివ్‌ కేసులు 987కాగా, మృతుల సంఖ్య 33గా ఉంది. కాగా, తమిళనాడులోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రూ.2.34కోట్లతో ఏర్పాటైన ప్లాస్మా బ్యాంకును రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సి.విజయబాస్కర్ ప్రారంభించారు. రాష్ట్రంలోని విద్యార్థులు మార్కుల జాబితాల కోసం జూలై 24-30 తేదీలమధ్య పాఠశాలలకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక కళాశాలల్లో ఫైనల్ ఇయర్ విద్యార్థులు మినహా అందరికీ సెమిస్టర్ పరీక్షలను ప్రభుత్వం రద్దుచేసింది. రాష్ట్రంలో నిన్న 5,849 కొత్త కేసులు, 74 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,86,492; యాక్టివ్‌ కేసులు: 51,765; మరణాలు: 3144; చెన్నైలో యాక్టివ్ కేసులు: 13,941గా ఉన్నాయి.
 • కర్ణాటక: రాష్ట్రంలో నిత్యం కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి రెట్టింపు వ్యవధి రీత్యా కర్ణాటక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలతో పోలిస్తే ప్రథమ స్థానంలోకి వెళ్లింది. రాష్ట్రంలో నిన్న 4,764 కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 75,833కు చేరింది. కొత్త కేసులలో ఒక్క బెంగళూరు నగరంలోనే 2050 నమోదవడం గమనార్హం. నిన్నటిదాకా మొత్తం కేసులు: 75,834; యాక్టివ్‌ కేసులు: 47,069; మరణాలు: 1519; డిశ్చార్జి: 27,239గా ఉన్నాయి.
 • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలోని ఇటానగర్ రాజధాని ప్రాంతంలోగల వివిధ ప్రదేశాలలో రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. సుమారు 20 బృందాలు ఈ కర్తవ్యంలో నిమగ్నమై ఉండగా నిన్న రెండు వేలకుపైగా పరీక్షలు నిర్వహించగా, 28 కేసులు నిర్ధారణ అయ్యాయి. రాజధాని ఇటానగర్ ప్రాంతంలోని మూడు ప్రధాన ఆస్పత్రులను రోగకారకాల నిర్మూలన కోసం మూసివేశారు. రాష్ట్రంలోని ఏకైక వైద్య కళాశాల ఆస్పత్రి (TRIHMS) మాత్రం అత్యవసర-కేన్సర్ చికిత్స అందిస్తుంది.
 • మణిపూర్: రాష్ట్రంలో వారంపాటు దిగ్బంధం విధింపుపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అవసరమైన సేవలు/వస్తు సరఫరా, వ్యవసాయం, సంబంధిత కార్యకలాపాలు, ప్రజావసరాల సంస్థలు పనిచేస్తాయి.
 • నాగాలాండ్: రాష్ట్రంలో 90 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 61 కొహిమాలో, 26 దిమాపూర్‌లో, 2 పెరెన్‌లో, 1 ఫెక్‌ ప్రాంతంలో నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 1174కు చేరాయి. నాగాలాండ్‌లో ప్రస్తుతం 688 యాక్టివ్‌ కేసులుండగా, ఇప్పటిదాకా 486 మంది కోలుకున్నారు.
 • మిజోరం: రాష్ట్రంలో ఇవాళ ఐదుగురు కోవిడ్‌-19 రోగులు కోలుకోవడంతో డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 142 కాగా, ఇప్పటిదాకా 184 మంది కోలుకున్నారు.
 • ఆంధ్రప్రదేశ్: విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్)లో ‘కోవాక్సిన్’ టీకా ప్రయోగాత్మక పరీక్షలకు వైద్యవిద్య డైరెక్టరేట్ నుంచి అనుమతి అందాల్సి ఉంది. కాగా, ప్రయోగ పరీక్షల నిర్వహణకు భారత వైద్య పరిశోధన మండలి ఎంపిక చేసిన 12 ఆసుపత్రులలో కేజీహెచ్ కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19పై పోరు దిశగా వైద్య సేవల కోసం రాష్ట్రంలోని ప్రైవేటు డాక్టర్లుసహా ఇతర వైద్యులు, వైద్య నిపుణులను గుర్తించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఇక జూలై 15 నుంచి 22 వరకు విధించిన ఆంక్షలు ముగియడంతో రాష్ట్ర రహదారి రవాణా సంస్థ ఆంధ్రప్రదేశ్-కర్ణాటక మార్గంలో అంతర్రాష్ట్ర బస్సులను ఇవాళ తిరిగి ప్రారంభించింది. రాష్ట్రంలో నిన్న 6045 కొత్త కేసులు, 65 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 64,713; యాక్టివ్‌ కేసులు: 31,763; మరణాలు: 823గా ఉన్నాయి.
 • తెలంగాణ: రాష్ట్రంలో నమూనాల పరీక్ష సంఖ్యను ప్రభుత్వం రోజుకు 25వేల స్థాయికి పెంచింది. ఈ మేరకు ప్రస్తుతం ప్రైవేట్ ప్రయోగశాలలు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలవద్ద ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలతోపాటు ప్రభుత్వ ప్రయోగశాలలలో ‘పీసీఆర్’ పరీక్షలద్వారా రోజుకు 15,000దాకా  నమూనాలను పరీక్షించే వీలుంది. ఇక తెలంగాణలో నిన్న 1554 కొత్త కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి; కాగా, కొత్త కేసులలో 842 జీహెచ్‌ఎంసీలో నమోదైనవే. మొత్తం కేసులు: 49,259; యాక్టివ్‌ కేసులు: 11,155; మరణాలు: 438; డిశ్చార్జి: 37,666గా ఉన్నాయి.
 • మహారాష్ట్ర: రాష్ట్రంలో మునుపెన్నడూ లేని రీతిలో బుధవారం ఒకేరోజు 10,576 కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 3,37,607కు చేరింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 5,552 మంది కోలుకోవడంతో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,36,980కి తగ్గింది. కాగా, మృతుల సంఖ్య 12,556గా ఉంది. ముంబై, థానే, పాల్ఘర్, నవీ ముంబైసహా ముంబై మహానగర ప్రాంతంలోని ఆస్పత్రులలో కరోనా వైరస్ బెడ్ మేనేజ్‌మెంట్పర్యవేక్షణ కోసం సింగిల్ కమాండ్ సెంటర్‌ ఏర్పాటుచేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జనజీవనంలో సాధారణ స్థితి నెలకొల్పేందుకు కృషి సాగుతున్నందున మహారాష్ట్రలో భారీస్థాయిలో దిగ్బంధం అవసరంలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, వ్యాయామశాలలు, షాపింగ్ మాల్స్ సహా రాష్ట్రంలో వివిధ వ్యాపారాలు/ సేవల పునఃప్రారంభం దిశగా ప్రభుత్వం ప్రామాణిక విధాన ప్రక్రియలపై కసరత్తు చేస్తున్నదని ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే చెప్పారు.
 • గుజరాత్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,020 తాజా కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 51,485కు పెరిగింది. ముఖ్యంగా సూరత్‌లో అత్యధికంగా 256 కేసులు నమోదవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వజ్రాల నగరంలో 11,128 కేసులుండగా, జిల్లాలో మృతుల సంఖ్య 500 దాటింది.
 • రాజస్థాన్: రాష్ట్రంలో 961 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 32,334కు పెరిగాయి. అత్యధికంగా జోథ్‌పూర్‌ (212), అల్వార్ (180), జైపూర్ (85) జిల్లాల్లో నమోదయ్యాయి. కాగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 8,387 మాత్రమే.
 • మధ్యప్రదేశ్: రాష్ట్ర సహకారశాఖ మంత్రి అరవింద్ సింగ్ భదోరియాకు కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా, గురువారం రాష్ట్రంలో 747 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసులు 24,842కు చేరాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,236గా ఉంది.
 • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో 230 కొత్త కేసులు నమోదవగా వీటిలో అధికశాతం రాయ్‌పూర్ (70), సుఖ్మా (36), దుర్గ్ (28) జిల్లాల పరిధిలో ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలోని రాయ్‌పూర్‌ సహా 7 పట్టణ కేంద్రాల్లో కఠినమైన పోలీసు బందోబస్తు నడుమ దిగ్బంధం అమలవుతోంది.

****(Release ID: 1640777) Visitor Counter : 16