ప్రధాన మంత్రి కార్యాలయం

"ఇండియా ఐడియాస్ సమ్మిట్ 2020" లో ప్రధానమంత్రి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.

Posted On: 22 JUL 2020 9:27PM by PIB Hyderabad

నమస్కారములు !

వ్యాపార నాయకులారా, 

విశిష్ట అతిథులారా, 

'ఇండియా ఐడియాస్ సమ్మిట్'లో ప్రసంగించడానికి నన్ను ఆహ్వానించిన అమెరికా-ఇండియా వ్యాపార మండలి (యు.ఎస్.ఐ.బి.సి) కి నా కృతజ్ఞతలు. ఈ ఏడాది నలభై ఐదవ వార్షికోత్సవం జరుపుకుంటున్న యు.ఎస్.ఐ.బి.సి ని అభినందిస్తున్నాను.   గత దశాబ్దాలుగా, యు.ఎస్.ఐ.బి.సి.  భారతీయ మరియు అమెరికా వ్యాపారాన్ని మరింత సన్నిహితం చేసింది.  ఈ సంవత్సరం ఐడియాస్ సమ్మిట్ కు "ఉత్తమ భవిష్యత్తు నిర్మాణం" అనే ఇతివృత్తాన్ని   యు.ఎస్.ఐ.బి.సి. ఎంపిక చేయడం కూడా చాలా సందర్భోచితంగా ఉంది. 

మిత్రులారా,

ప్రపంచానికి మంచి భవిష్యత్తు అవసరమని మనందరం అంగీకరిస్తున్నాము.  అందువల్ల, మనమందరం సమిష్టిగా భవిష్యత్తుకు ఒక రూపం ఇవ్వాలి.  భవిష్యత్ పట్ల మన విధానం ప్రధానంగా మరింత మానవ సంబంధాలతో కేంద్రీకృతమై ఉండాలని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను.  మన వృద్ధి ఎజెండా ప్రధానంగా పేదలు, దుర్బలులకు సహాయపడేదిగా ఉండాలి.  "సులభతర వాణిజ్యం" అనేది ఎంత ముఖ్యమో, "సులభంగా జీవించడం" అనేది కూడా అంత ముఖ్యం. 

మిత్రులారా,

అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ ఎక్కువగా  సామర్థ్యం మరియు అభివృద్ధిపైనే దృష్టి పెట్టినట్లు ఇటీవలి అనుభవం మనకు నేర్పింది.  సామర్ధ్యం అనేది చాలా మంచి విషయమే. అయితే, ఆ దారిలో పడి, దానితో సమానంగా ముఖ్యమైన విషయంపై దృష్టి పెట్టడం మర్చిపోయాము. అది బాహ్య విపత్తులకు వ్యతిరేకంగా స్థితిస్థాపకత.  స్థితిస్థాపకత అనేది ఎంత ముఖ్యమో గుర్తుచేసేందుకే, ఇప్పుడు ప్రపంచ మహమ్మారి మన ముందుకు వచ్చింది.

మిత్రులారా,

పటిష్టమైన దేశీయ ఆర్థిక సామర్థ్యాల ద్వారా ప్రపంచ ఆర్థిక స్థితిస్థాపకత సాధించవచ్చు.  దీని అర్థం తయారీకి మెరుగైన దేశీయ సామర్థ్యం, ఆర్థిక వ్యవస్థ పరిస్థితులను పునరుద్ధరించడం మరియు అంతర్జాతీయ వాణిజ్యంలో వైవిధ్యం.

మిత్రులారా,

‘ఆత్మ నిర్భర్ భారత్’ పిలుపు ద్వారా భారతదేశం సంపన్నమైన మరియు స్థితిస్థాపకంగా ఉన్న ప్రపంచానికి తోడ్పడుతోంది. ఈ విషయంలో మీ భాగస్వామ్యం కోసం మేము ఎదురుచూస్తున్నాము!

మిత్రులారా,

నేడు, భారతదేశం పట్ల ప్రపంచమంతా  ఆశగా ఎదురుచూస్తోంది.  ఇది ఎందుకంటే, బహిరంగ పరచడం, అవకాశాలు,  ఎంపికల యొక్క సంపూర్ణ కలయికను భారతదేశం అందిస్తుంది.  ఈ విషయాన్ని నేను మరింత వివరంగా చెబుతాను.  ప్రజలలో మరియు పాలనలో దాపరికం లేకుండా భారతదేశం వ్యవహరిస్తుంది.  దాపరికం లేని మనసులు, దాపరికంలేని మార్కెట్లను తయారుచేస్తాయి.  ఇటువంటి బహిరంగ మార్కెట్లు గొప్ప శ్రేయస్సుకు దారితీస్తాయి.  ఇవే, భారత, అమెరికా దేశాలు రెండూ అంగీకరించే సూత్రాలు.

మిత్రులారా,

గత ఆరు సంవత్సరాల కాలంలో, మన ఆర్థిక వ్యవస్థలను మరింత బహిరంగంగా, సంస్కరణల ఆధారంగా చేయడానికి మేము చాలా ప్రయత్నాలు చేసాము.  సంస్కరణలు ‘పోటీతత్వాన్ని’,  మెరుగైన ‘పారదర్శకత’ ను, విస్తరించిన ‘డిజిటలైజేషన్’ ను, భారీ ‘ఆవిష్కరణ’ లతో పాటు మరియు మరింతగా ‘విధాన స్థిరత్వం’ ఉండేలా చేశాయి.

మిత్రులారా,

భారతదేశం ఇప్పుడు అవకాశాలకు కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది.  టెక్నాలజీ రంగానికి చెందిన ఒక ఉదాహరణ చెప్తాను.  ఇటీవల, భారతదేశంలో ఒక ఆసక్తికరమైన నివేదిక బహిర్గతమైంది.  పట్టణాల్లో ఇంటర్నెట్ వినియోగదారుల కంటే గ్రామీణ ఇంటర్నెట్ వినియోగదారులు ఎక్కువగా ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది.  ఆ సంఖ్య ఎంత ఉంటుందో ఒక సారి ఊహించండి!  భారతదేశంలో ఇప్పుడు సుమారు అర్ధ బిలియన్ మంది దాకా ఇంటర్నెట్ ను ఉపయోగించేవారు ఉన్నారు.  వీరంతా అనుసంధానమై ఉన్నారు.  ఇది మీకు చాలా పెద్దగా అనిపించటం లేదూ? అయితే, మీ ఊపిరిని ఒక్క సారి బిగపట్టండి. ఎందుకంటే, మరో అర్ధ బిలియన్ మందికి పైగా ప్రజలు త్వరలో ఇంటర్ నెట్ తో అనుసంధానం కావడానికి సిద్ధంగా ఉన్నారు.  5-జి, బిగ్ డేటా విశ్లేషణలు, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్-చైన్ మరియు ఇంటర్నెట్ విషయాల వంటి సాంకేతిక పరిజ్ఞానాలలో అవకాశాలు చాలా ఉన్నాయి.

మిత్రులారా,

భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. మా రైతుల కృషికి పెట్టుబడి పెట్టవలసిందిగా, భారతదేశం మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. వ్యవసాయ రంగంలో భారతదేశం ఇటీవల చారిత్రాత్మక సంస్కరణలు చేసింది. వ్యవసాయ పెట్టుబడులు, యంత్రాలు, వ్యవసాయ ఉత్పత్తుల నిర్వహణ, తినడానికి సిద్ధంగా ఉండే పదార్ధాలు,  మత్స్య ఉత్పత్తులు, సేంద్రీయ ఉత్పత్తులు వంటి వ్యవసాయ రంగానికి చెందిన అనేక విభాగాల్లో పెట్టుబడి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారతదేశ ఆహార ప్రాసెసింగ్ రంగం 2025 నాటికి, అర ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా.  మరింత ఆదాయ వనరులను పెంపొందించుకోడానికీ, భారత వ్యవసాయ రంగంలో పెట్టుబడి అవకాశాలను వినియోగించుకోడానికీ  నొక్కడానికి ఇప్పుడు సరైన సమయం!

ఆరోగ్య సంరక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టవలసిందిగా భారతదేశం మిమ్మల్ని ఆహ్వానిస్తోంది.  భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ రంగం ప్రతి సంవత్సరం 22 శాతం కంటే ఎక్కువ వేగంగా పెరుగుతోంది.  మెడికల్-టెక్నాలజీ, టెలి-మెడిసిన్ మరియు వ్యాధి నిర్ధారణ అంశాలలో భారతీయ సంస్థలు కూడా పురోగమిస్తున్నాయి.  భారత‌, అమెరికా దేశాలు ఇప్పటికే ఫార్మా రంగంలో పటిష్టమైన భాగస్వామ్యాన్ని నిర్మించాయి.  భారతీయ ఆరోగ్య సంరక్షణ రంగంలో స్థాయినీ, వేగాన్నీ సాధించడానికి వీలుగా మీ పెట్టుబడిని విస్తరించడానికి ఇప్పుడు ఉత్తమ సమయం!

భారతదేశం మిమ్మల్ని విద్యుత్తు రంగంలో పెట్టుబడి పెట్టవలసిందిగా  ఆహ్వానిస్తోంది.   భారతదేశం గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా పరిణామం చెందుతున్న నేపథ్యంలో, అమెరికా కంపెనీలకు పెట్టుబడి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  స్వచ్ఛమైన ఇంధన రంగంలో కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  మీ పెట్టుబడికి ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి, భారతీయ విద్యుత్ రంగంలోకి ప్రవేశించడానికి ఇదే సరైన సమయం!

మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టాలని భారతదేశం మిమ్మల్ని ఆహ్వానిస్తోంది.    మన చరిత్రలో అతిపెద్ద మౌలిక సదుపాయాల కల్పనను మన దేశం చూస్తోంది. రండి, లక్షలాది మందికి గృహనిర్మాణం కల్పించడంలో లేదా దేశంలో రోడ్లు, రహదారులు, ఓడరేవులను నిర్మించడంలో భాగస్వామి కావాలని కోరుతున్నాను. 

పెట్టుబడులకు భారీ అవకాశం ఉన్న మరొక ప్రాంతం పౌర విమానయాన రంగం.  వచ్చే 8 సంవత్సరాలలో విమాన ప్రయాణికుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా.  రాబోయే దశాబ్దంలో వెయ్యికి పైగా కొత్త విమానాలను చేర్చాలని ప్రముఖ ప్రైవేట్ భారతీయ విమానయాన సంస్థలు యోచిస్తున్నాయి.  భారతదేశంలో ఉత్పాదక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఎంచుకునే ఏ పెట్టుబడిదారునికైనా, ఇది ఒక గొప్ప అవకాశం, ఇది ప్రాంతీయ మార్కెట్లను సరఫరా చేయడానికి ఒక స్థావరంగా మారుతుంది.  నిర్వహణ, మరమ్మతు, ఆపరేషన్ సౌకర్యాల ఏర్పాటుకు కూడా అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.  మీ విమానయాన లక్ష్యాలకు ఒక రూపం ఇవ్వడానికి, భారత విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనువైన సమయం.

రక్షణ రంగం, అంతరిక్ష రంగాలలో పెట్టుబడులు పెట్టాలని భారతదేశం మిమ్మల్ని ఆహ్వానిస్తోంది.  రక్షణ రంగంలో పెట్టుబడుల కోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్.‌డి.ఐ) పరిమితిని 74 శాతానికి పెంచుతున్నాం.  రక్షణ పరికరాలు, స్థావరాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి భారతదేశం రెండు రక్షణ కారిడార్లను ఏర్పాటు చేసింది.  ప్రయివేటు మరియు విదేశీ పెట్టుబడిదారులకు మేము ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రతిపాదిస్తున్నాము.  కొన్ని వారాల క్రితం, మేము అంతరిక్ష రంగంలో విప్లవాత్మక సంస్కరణలను ఆమోదించాము.  రండి, భవిష్యత్తులో అభివృద్ధి చెందే ఈ రంగాలలో భాగస్థులవ్వండి.  

ఆర్ధిక మరియు బీమా రంగాలలో పెట్టుబడులు పెట్టవలసిందిగా భారతదేశం మిమ్మల్ని ఆహ్వానిస్తోంది.  బీమా రంగంలో పెట్టుబడుల కోసం భారతదేశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచింది.  ఇప్పుడు బీమా మధ్యవర్తులలో పెట్టుబడులు పెట్టడానికి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంది.  భారతదేశంలో భీమా మార్కెట్ 12 శాతానికి పైగా రేటుతో పెరుగుతోంది, 2025 నాటికి 250 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా.  మా ఆరోగ్య భరోసా పధకం-ఆయుష్మాన్ భారత్ మరియు మా పంటల బీమా పధకం-ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తో పాటు,  జన సురక్ష లేదా సామాజిక భద్రతా పథకాల విజయంతో, బీమా ఉత్పత్తులను త్వరగా స్వీకరించడానికి మరియు అంగీకరించడానికి ప్రభుత్వం గట్టి పునాది వేసింది. దీంతో, ఆరోగ్యం, వ్యవసాయం, వ్యాపారం మరియు జీవిత బీమా లలో బీమా కవరేజీని పెంచడానికి అనేక అవకాశాలు ఉన్నాయి.  దీర్ఘకాలిక మరియు హామీతో కూడిన ఆదాయాన్ని సంపాదించడానికి, భారత బీమా రంగం ప్రస్తుతం ఉత్తమ పెట్టుబడి ఎంపికలలో ఒకటిగా ఉంది. 

నేను మీకు కొన్ని అవకాశాలను తెలియజేశాను.  అది కూడా ఆ సలహాలకు ఎటువంటి రుసుము తీసుకోకుండా.  

మిత్రులారా,

మార్కెట్లు తెరిచి ఉన్నప్పుడు, అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఎంపికలు చాలా ఉన్నప్పుడు, ఆశావాదం వెనుకబడి ఉంటుందా! కీలకమైన వ్యాపార రేటింగుల‌లో భారతదేశం స్థాయి పెరిగినప్పుడు, ముఖ్యంగా "సులభతర వాణిజ్యం" కేటగిరిలో ప్రపంచ బ్యాంకు రేటింగులను గమనించినప్పుడు, మీరు ఆశావాదాన్ని చూడవచ్చు. 

పెట్టుబడి అనేది విశ్వాసానికి గీటురాయి.  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ప్రతి సంవత్సరం, మేము రికార్డు స్థాయికి చేరుకుంటున్నాము.  ప్రతి సంవత్సరం అంతకు ముందు సంవత్సరం కంటే చాలా ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి.  భారతదేశంలో 2019-20 ఆర్ధిక సంవత్సరంలో 74 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తాయి.   అంతకుముందు సంవత్సరం కంటే ఇది 20 శాతం పెరుగుదల.  అమెరికా నుండి ‘హామీ ఇచ్చిన పెట్టుబడులు’ ఈ సంవత్సరం ఇప్పటికే 40 బిలియన్ డాలర్లను దాటిందని యు.ఎస్.ఐ.బి.సి. లోని మిత్రులు తెలియజేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న మహమ్మారి సమయంలో కూడా ఏమి జరిగిందో కూడా గమనించండి.  కోవిడ్ మధ్యలో, అంటే 2020 ఏప్రిల్ నుండి జూలై మధ్య కాలంలో భారతదేశం 20 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది.

అయితే, భారతదేశం ఇంకా చాలా అవకాశాలను అందిస్తుంది.  అదేవిధంగా, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు శక్తినిచ్చేది మా దగ్గర ఉంది.

మిత్రులారా,

భారతదేశం యొక్క పెరుగుదల అంటే: మీరు విశ్వసించదగిన దేశంతో వాణిజ్య అవకాశాల పెరుగుదల, పెరుగుతున్న బహిరంగతతో ప్రపంచ సమైక్యత పెరుగుదల, స్థాయిని అందించే మార్కెట్‌ కు ప్రాప్యతతో మీ పోటీతత్వం పెరుగుదల.  అదేవిధంగా, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండడంతో, మీ పెట్టుబడికి తగిన రాబడి కూడా పెరుగుతుంది. 

మిత్రులారా,

ఈ విషయంలో, అమెరికా కంటే కొంతమంది మంచి భాగస్వాములు ఉన్నారు.  భారత, అమెరికా దేశాలు రెండూ భాగస్వామ్య విలువలతో కూడిన శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలు.  మనమిద్దరం సహజ భాగస్వాములం.  గతంలో భారత-అమెరికా రెండు దేశాల స్నేహ బంధం ఉన్నత శిఖరాలకు చేరుకుంది.   మహమ్మారి తర్వాత ప్రపంచం వేగంగా పూర్వ వైభవానికి చేరుకోడానికి మన భాగస్వామ్యం ముఖ్యమైన పాత్ర పోషించవలసి సమయం ఆసన్నమైంది.  అమెరికా పెట్టుబడిదారులు తరచూ ఒక రంగం లేదా దేశంలోకి ప్రవేశించడానికి ముందు సరైన సమయం కోసం ఎదురుచూస్తారు.  భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంతకంటే మంచి సమయం ఎప్పుడూ లేదని, నేను వారికి చెప్పాలని అనుకుంటున్నాను. 

భారత-అమెరికా దేశాల మధ్య  ఆర్థిక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడంలో యు.ఎస్.ఐ.బి.సి. నాయకత్వానికి నేను మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.  యు.ఎస్.‌ఐ.బి.సి. నూతన శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాను. 

భారత-అమెరికా స్నేహం మరింతగా పెరగాలని ఆశిస్తున్నాను !

నమస్కారములు !

 ధన్యవాదములు!

*****



(Release ID: 1640566) Visitor Counter : 324