ఉక్కు మంత్రిత్వ శాఖ
దేశంలో కోవిడ్ అన్‌లాక్ నేపథ్యాన జీవితం మరియు జీవనోపాధి మధ్య సమతౌల్యత సాధించాలిః శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పిలుపు
Posted On:
21 JUL 2020 6:45PM by PIB Hyderabad
ఉక్కు మంత్రిత్వ శాఖ ఈ రోజు నిర్వహించిన “వర్కింగ్ ఇన్ కోవిడ్-19” అనే వెబ్‌నార్ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖల మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కోవిడ్ అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైందని ప్రజలు తిరిగి పనుల్లోకి చేరేటప్పుడు వైరస్ వ్యాప్తి ఇక్కడ చాలా ఉందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలో అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలతో జీవితం మరియు జీవనోపాధిల మధ్య సమతౌల్యత కలిగి ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. కోవిడ్-19 వ్యతిరేకంగా పోరాడటానికి గడిచిన కొన్ని నెలల కాలంలో తాము మహమ్మారికి వ్యతిరేకంగా పలు రకాలైన ప్రోటోకాల్స్ ను మరియు అభ్యాసాలను ఏర్పాటు చేశామని అన్నారు. వైరస్ సంక్రమణ వ్యాప్తిని కట్టడి చేసేందుకు గాను నిపుణులు అందించిన అన్ని రకాల సిఫారసులను అనుసరించడం, సామాజిక దూరాన్ని నిర్ధారించడం, ముసుగులు ధరించడం, చేతులు కడుక్కోవడం వంటి చర్యలను కొనసాగించాలని కూడా సూచించారు. ఈ సందర్భంగా ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్ సింగ్ కులాస్టే మాట్లాడుతూ దేశంలో మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఉక్కు శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, మరింత మెరుగైన ఆరోగ్యకర జీవనశైలిని అవలంబించాల్సిన అవసరం గురించి వివరించారు. పట్టణ ప్రజలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాలు మరియు గిరిజన బెల్ట్‌లోని ప్రజలు ఈ మహమ్మారి బారిన పడటం చాలా తక్కువ అని ఆయన అన్నారు. వారివారి జీవనశైలి, ఆహారపు అలవాట్లు మరియు ప్రకృతితో ఉన్న సాన్నిహిత్యమే ఇందుకు కారణమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా
మాట్లాడుతూ అన్‌లాక్ నేపథ్యంలో పనిని తిరిగి ప్రారంభించేప్పుడు సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ముఖానికి తగిన ముసుగులు ధరించడం, కొత్త సాధారణ స్థితికి సర్దుబాటు కావడం, సామాజిక దూరం, చేతులు కడుక్కోవడం, స్వీయ పర్యవేక్షణ, కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు సంక్రమణ వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గించే విధంగా కార్యాలయ పద్ధతుల పునరమరిక చేసుకోవాలని ఆయన అన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఎండీఎన్ఐవై డైరెక్టర్ డాక్టర్ ఈశ్వర్ వి.బసవరెడ్డి మాట్లాడుతూ రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడే ప్రాథమిక యోగా భంగిమలు మరియు అభ్యాసాలను గురించి వివరించారు. ఈ వెబ్‌నార్ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ మరియు దాని పరిధిలో పని చేస్తున్న సీపీఎస్ఈల అధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 1640300)
Visitor Counter : 281