జల శక్తి మంత్రిత్వ శాఖ

జలజీవన్ పథకం: అమలులో రాష్ట్రాల పోటాపోటీ 2020-21లో 10శాతం మించి లక్ష్యం సాధించిన 7రాష్ట్రాలు

Posted On: 21 JUL 2020 6:49PM by PIB Hyderabad

దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్ ద్వారా నీటి సరఫరాకు ఉద్దేశించిన జలజీవన్ పథకం కింద 2019 ఆగస్టు నెలలో ప్రారంభమైంది. 2019-20 సంవత్సరంలో ప్రారంభమైన 7 నెలల్లో దాదాపు 85లక్షల గ్రామీణ ఇళ్లకు నీటి కుళాయిల సదుపాయం ఏర్పాటు చేశారు. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి, లాక్ డౌన్ ముగిసి అన్ లాక్ తొలిదశ మార్గదర్శకాల అమలు మొదలైనప్పటినుంచి,.. 2020-21 సంవత్సరంలో ఇప్పటివరకూ దాదాపు 55లక్షల నీటి కుళాయిల కనెక్షన్లు ఏర్పాటు చేశారు. అంటే,..ప్రతిరోజూ దాదాపు 8లక్షల ఇళ్లకు నీటి కుళాయిలను అమర్చుతున్నారు.

  రోజుకు, బీహార్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం వంటి 7 రాష్ట్రాలు,. జలజీవన్ పథకంపై తమంతట తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను మించి పదిశాతంపైగా పనులను పూర్తి చేశాయి. ఇక, అదే వ్యవధిలో,..తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మణిపూర్ రాష్ట్రాలు కూడా పథకం అమలులో మంచి ప్రగతిని చూపించాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్రాలకు ఉన్న చిత్తశుద్ధిని ఫలితాలు సూచిస్తున్నాయి. జల జీవన్ పథకం కింద నీటి కుళాయిల ఏర్పాటులో రాష్ట్రాలు కనబరిచిన వేగాన్ని కూడా ఇది సూచిస్తోంది.

   దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 18.93కోట్ల ఇళ్లలో 24.30శాతం ఇళ్లకు, అంటే..4.60కోట్ల ఇళ్లకు ఇప్పటికే నీటి కుళాయిల కనెన్షన్లు ఏర్పాటయ్యాయి. మిగిలిన 14.33కోట్ల ఇళ్లను కాలబద్ధమైన పద్ధతిలో నీటి కుళాయిల పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్ష్యంతో రంగంలోకి దిగిన ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రోజూ లక్షకు మించి నీటి కుళాయిల కనెక్షన్లను ఏర్పాటు చేస్తూవస్తున్నాయి.

  జలజీవన్ పథకం అమలుకోసం 2020-21 సంవత్సరంలో 23,500కోట్ల రూపాయలను కేటాయించారు. పైగా, నీటి సరఫరా, పారిశుద్ధ్యం పనులకోసం 15 ఆర్థిక సంఘం నిధుల్లో 50శాతాన్ని, అంటే, 30,375కోట్ల రూపాయలను గ్రామీణ స్థానిక పరిపాలనా సంస్థలకు కేటాయించారు. కేటాయించిన నిధుల్లో 50శాతాన్ని రాష్ట్రాలకు ఇప్పటికే విడుదల చేశారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థల అమలుకు, మరింత మెరుగైన నిర్వహణకు నిధులు దోహదపడతాయి. ప్రజలకు దీర్ఘకాలిక ప్రాతపదికపై పరిశుద్ధమైన మంచినీటిని అందించాలనే లక్ష్య సాధన కేటాయింపులతో మరింత సులభతరమవుతుంది.

  2024 సంవత్సరం నాటికి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లన్నింటికీ తగినంత పరిమాణంలో పరిశుద్ధమైన తాగునీటిని కుళాయిల ద్వారా క్రమంతప్పకుండా అందించాలనే లక్ష్యంతో జలజీవన్ పథకాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. రాష్ట్రాల భాగస్వామ్యంతో పథకాన్ని అమలు చేస్తున్నారు. పథకం అమలుకు జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో అన్ని విధాల కృషి జరుగుతోంది. పథకం అమలుపై రోజువారీ పద్ధతిలో పర్యవేక్షణ కూడా సాగుతోంది.

  కాగా, పథకం లక్ష్యాన్ని 2024 సంవత్సరంలోగా సాధించాలన్న లక్ష్యానికి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చిత్తశుద్ధితో కట్టుబడి పనిచేస్తున్నాయి. 2021లో  పథకాన్ని సంతృప్త స్థాయిలో పూర్తి చేయాలని బీహార్, గోవా, పుదుచ్చేరి, తెలంగాణ రాష్ట్రాలు సంకల్పించాయి. అలాగే, 2022కల్లా సంతృప్త స్థాయిలో పందశాతం లక్ష్యాన్ని చేరుకోవాలని గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, లఢక్, మేఘాలయ, పంజాబ్, సిక్కిం, ఉత్తరప్రదేశ్ ప్రణాళిక వేసుకున్నాయి. 2023నాటికి పనులు పూర్తి చేయాలని అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్ గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలు సంకల్పించాయి. ఇక,..ఆంధ్రప్రదేశ్, అస్సాం, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు మాత్రం 2024నాటికి లక్ష్యం పూర్తి చేయనున్నాయి

  గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా జీవనాన్ని మరింత సౌకర్యవంతంగా చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు, రహదారులు, కాలుష్య రహిత ఇంధనం, విద్యుత్, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు కల్పించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు గ్రామాల్లో ప్రతి ఇంటికీ తాగునీటిని సరఫరా కల్పించేందుకు జలజీవన్ పథకం భారీ ఎత్తున అమలు చేస్తున్నారు. జలజీవన్ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని, గ్రామీణ మహిళలకు నీటిని మోసే ప్రయాస తప్పుతుందని, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులనుంచి వారికి విముక్తి లబిస్తుందని భావిస్తున్నారు.

****(Release ID: 1640323) Visitor Counter : 44