ఆర్థిక మంత్రిత్వ శాఖ

కేంద్రప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడి వ్యయంపై రెండవ సమీక్షా సమావేశం నిర్వహించిన - ఆర్ధికమంత్రి.

Posted On: 23 JUL 2020 5:23PM by PIB Hyderabad

ఈ ఆర్ధిక సంవత్సరం (ఎఫ్.వై) లో మూలధన వ్యయాన్ని సమీక్షించడానికి, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయానం, ఉక్కు మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, రైల్వే బోర్డు చైర్మన్ (సి.ఆర్.బి) తో పాటు, ఈ మంత్రిత్వ శాఖలకు చెందిన 7 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సి.పి.ఎస్.ఈ.ల) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లతో, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి ఆర్థిక మంత్రి వివిధ భాగస్వాములతో నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల పరంపరలో ఇది రెండవ సమావేశం.

2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈ ఏడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకూ కలిపి మొత్తం మూలధన వ్యయం లక్ష్యం 24,663 కోట్ల రూపాయలు.  2019-20 ఆర్థిక సంవత్సరంలో, ఈ ఏడు కేంద్రప్రభుత్వరంగ సంస్థలకు కలిపి మొత్తం మూలధన వ్యయం లక్ష్యం 30,420 కోట్ల రూపాయలు కాగా, సాధించినది 25,974 కోట్ల రూపాయలు, అంటే 85 శాతం.  2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సాధించినది 3,878 కోట్ల రూపాయలు (13 శాతం), కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సాధించినది 3,557 కోట్ల రూపాయలు (14 శాతం). 

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పుంజుకోవడంలో సి.పి.ఎస్.ఈ. లు పోషించవలసి ముఖ్యమైన పాత్ర గురించి ఆర్ధిక మంత్రి ప్రస్తావిస్తూ, సి.పి.ఎస్.ఈ. లు తమ లక్ష్యాలను సాధించడానికి మెరుగైన పనితీరు కనబరచాలని ప్రోత్సహించారు మరియు 2020-21 ఆర్థిక సంవత్సరానికి వారికి అందించిన మూలధన వ్యయాన్ని సక్రమంగా, గడువు లోపల పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.  కోవిడ్-19 ప్రభావం నుండి దేశ ఆర్ధిక వ్యవస్థ కోలుకోవడానికి సి.పి.ఎస్.ఈ.ల మెరుగైన పనితీరు పెద్ద ఎత్తున సహాయపడుతుందని శ్రీమతి సీతారామన్ చెప్పారు. 

2020-21 ఆర్థిక సంవత్సరం రెండవ త్రై మాసికం ముగిసే నాటికి మూలధన వ్యయంలో 50 శాతం వినియోగించే విధంగా సి.పి.ఎస్.ఈ.ల పనితీరును నిశితంగా పరిశీలించాలనీ, అందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలనీ, కేంద్ర ఆర్థిక మంత్రి సంబంధిత కార్యదర్శులను, రైల్వే బోర్డు చైర్మన్ను కోరారు.  పరిష్కరించని సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవడానికి వీలుగా వాటిని వెంటనే డి.ఈ.ఏ. / డి.పి.ఈ. / డి.ఐ.పి.ఏ.ఎమ్. లకు నివేదించాలని శ్రీమతి సీతారామన్ సూచించారు.  సి.పి.ఎస్.ఈ. ల మూలధన వ్యయం నిర్వహణపై తాను ప్రతీ నెలా ఇటువంటి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తానని ఆర్థిక మంత్రి చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎదుర్కొంటున్న అవరోధాలను, ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఎదురౌతున్న సమస్యలను ఈ సందర్భంగా చర్చించారు.  అసాధారణ పరిస్థితి ఎదురైనప్పుడు, అసాధారణ ప్రయత్నాలు అవసరమనీ, సమిష్టి కృషితో, మనం మెరుగైన పనితీరును ప్రదర్శించడంతో పాటు, భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన ఫలితాలను సాధించడానికి కూడా అవి సహాయపడతాయని, ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

*****



(Release ID: 1640744) Visitor Counter : 247