PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 21 JUL 2020 8:04PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • 24 గంటల్లో వ్యాధి నయమైనవారు 24,491; ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 7.2 లక్షలకుపైగా నమోదు.
  • కోలుకునేవారి జాతీయ సగటు మెరుగుపడి 62.72 శాతానికి పెరుగుదల.
  • దేశంలో మరణాల సగటు మరింత తగ్గి 2.43 శాతానికి పతనం.
  • డబ్ల్యూహెచ్‌వో నిర్దేశంమేరకు 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 10 లక్షల జనాభాకు రోజూ 140కిపైగా పరీక్షలు.
  • గత 24 గంటల్లో 3.3 లక్షలకుపైగా నమూనాల పరీక్ష.
  • దేశంలో ప్రస్తుతం చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,02,529.
  • సీరో-ఉనికిపై అధ్యయనం ప్రకారం సగటున ఢిల్లీలో ఎల్‌జీజీ ప్రతిరోధక ఉనికి 23.48 శాతం; వ్యాధి సోకినా లక్షణాలు కనిపించనివారి సంఖ్యే అధికం.
  • విద్యార్థుల మానసిక ఆరోగ్యం-శ్రేయస్సు ల‌క్ష్యంగా వారికి తోడ్పాటు కోసం ‘మనోదర్ప‌ణ్’ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన కేంద్ర హెచ్‌ఆర్‌డి శాఖ.

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సమాచారం; వ్యాధి నయమైనవారి సంఖ్య 7.2 లక్షలకుపైగా నమోదు; కోలుకునేవారి సగటు 62.72 శాతానికి చేరిక; మరణాల శాతం 2.46కు తగ్గుదల

దేశ‌ంలో గత 24 గంటల్లో 24,491 మందికి కోవిడ్-19 వ్యాధి నయంకాగా, ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 7,24,577కు చేరింది. దీంతో కోలుకునేవారి జాతీయ సగటు మెరుగుపడి 62.72 శాతానికి పెరిగింది. అలాగే దేశంలో మరణాల సంఖ్య స్థిరంగా తగ్గుతూ 2.43 శాతానికి దిగివచ్చి, ప్రపంచంలో అత్యల్ప మరణశాతంగల దేశాల జాబితాలో భారత కొనసాగుతోంది. మరోవైపు ప్ర‌స్తుత-కోలుకున్న కేసుల మధ్య అంత‌రం 3,22,048కి విస్తరించింది. ప్రస్తుతం దేశ‌వ్యాప్తంగా 4,02,529 మంది వివిధ ఆస్ప‌త్రుల‌తోపాటు ఏకాంత గృహ‌వాసంలో చురుకైన వైద్య ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స పొందుతున్నారు. ఇక దేశంలోని 1274 ప్రయోగశాలల్లో 24 గంటల్లో 3,33,395 రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 1,43,81,303కు పెరిగింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640283

డబ్ల్యూహెచ్‌వో నిర్దేశంమేరకు 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 10 లక్షల జనాభాకు రోజూ 140కిపైగా పరీక్షలు; కేసుల నమోదు శాతం 8.07; 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటుకన్నా తక్కువ

దేశ‌ంలో రోగ నిర్ధారణ పరీక్షల జాతీయ సగటు ఇవాళ ప్రతి పది లక్షల జనాభాకు రోజువారీగా 180కి దూసుకెళ్లింది. కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విడుదల చేసిన ప్రజారోగ్య మార్గదర్శక పత్రంలో అనుమానిత కేసులపై నిశిత నిఘా ఉంచాలని సూచించింది. తదనుగుణంగా అన్ని దేశాల్లో ప్రతి 10 లక్షల జనాభాకు రోజువారీగా కనీసం 140 పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించింది. అయితే, భారత్‌లోని 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 140కిపైగా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కాగా, గోవాలో అత్యధికంగా ప్రతి 10 లక్షల జనాభాకు నిత్యం 1,333 పరీక్షలు నిర్వహిస్తుండటం విశేషం.

 

Combined Final 21st July Press Brief.jpg

మొత్తంమీద దేశవ్యాప్తంగా పరీక్షల సంఖ్య పెరుగుతున్నప్పటికీ నిర్ధారణ అవుతున్న రోగుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ 8.07 శాతానికి తగ్గింది. ఆ మేరకు 30 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్ధారిత కేసులు జాతీయ సగటుకన్నా అతి తక్కువగా ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640317

రక్తజీవద్రవ్య ఉనికిపై ఢిల్లీలో 2020 జూన్‌లో అధ్యయనం నిర్వహించిన జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం, కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ ఆదేశం మేరకు జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వంతో సంయుక్తంగా ‘రక్తజీవ ద్రవ్య ఉనికి’పై అధ్యయనం నిర్వహించింది. ఈ మేరకు 2020 జూన్‌ 27 నుంచి 2020 జూలై 10వ తేదీదాకా ముమ్మర బహుళదశ నమూనాల పద్ధతిలో పరీక్షలు నిర్వహించింది. ఇందుకోసం మొత్తం 11 జిల్లాలకు అధ్యయన బృందాలను ఏర్పాటు చేశారు. తదనుగుణంగా ఎంపిక చేసినవారి లిఖితపూర్వక అనుమతితో రక్త నమూనాలు సేకరించి, వారి రక్తజీవ ద్రవ్యంలో ‘ఎల్‌జీజీ’ ప్రతిరోధకాల ఉనికిపై అధ్యయనం చేశారు. ఇలా 21,387 నమూనాలను పరీక్షించగా, ఢిల్లీ అంతటా ప్రజల రక్తజీవ ద్రవ్యంలో సగటున 23.48 శాతం మేర ప్రతిరోధకాల ఉనికి ప్రస్ఫుటమైంది. అంటే... వ్యాధి సోకినప్పటికీ రోగనిరోధక శక్తి కారణంగా ఆ లక్షణాలు కనిపించని వారి సంఖ్యే అధికంగా ఉన్నట్లు తేలింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640137

విద్యార్థుల మానసిక ఆరోగ్యం-శ్రేయస్సు ల‌క్ష్యంగా తోడ్పాటు కోసం కేంద్ర హెచ్‌ఆర్‌డి శాఖ రూపొందించిన ‘మనోదర్ప‌ణ్’ కార్య‌క్ర‌మానికి మంత్రి శ్రీకారం

దేశంలోని విద్యార్థుల మానసిక ఆరోగ్యం-శ్రేయస్సు ల‌క్ష్యంగా వారికి స‌హాయ‌ప‌డ‌టం కోసం కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ రూపొందించిన ‘మనోదర్ప‌ణ్’ కార్య‌క్ర‌మాన్ని మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ఇవాళ న్యూఢిల్లీలోప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కోవిడ్‌-19 వ‌ల్ల శారీర‌క‌ ఆరోగ్య‌ సమస్యలేగాక మిశ్రమ భావోద్వేగాలతో మానసిక-సామాజిక ఒత్తిడి ఏర్ప‌డుతోంద‌ని పేర్కొన్నారు. విద్యారంగంలో నిరంతర విద్యపై దృష్టితోపాటు విద్యార్థుల మానసిక క్షేమానికీ స‌మ‌ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంద‌ని త‌మ శాఖ భావించినట్లు తెలిపారు. ఆ మేర‌కు మనోదర్ప‌ణ్పేరిట సహాయ కేంద్రంతోపాటు ఆన్‌లైన్‌ వనరులద్వారా సలహాసంప్రదింపులకు వీలు కల్పిస్తూ కార్య‌క్ర‌మాన్ని రూపొందించిన‌ట్లు వెల్ల‌డించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640259

‘ఇండియా ఐడియాజ్ సమిట్’లో జూలై 22వ తేదీన కీలకోపన్యాం చేయ‌నున్న ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూలై 22న ఇండియా ఐడియాజ్ సమిట్లో కీలj ఉపన్యాసం చేయ‌నున్నారు. అమెరికా-భార‌త్ వాణిజ్య మండ‌లి వాస్త‌విక సాదృశ మాధ్య‌మంద్వారా ఈ శిఖ‌రాగ్ర స‌ద‌స్సుకు ఆతిథ్య‌మిస్తోంది. ఈ సంవత్సరం మండలి 45వ వార్షికోత్సవం నేప‌థ్యంలో మెరుగైన భవిష్యత్ నిర్మాణంఇతివృత్తంగా ఈ స‌దస్సును నిర్వ‌హిస్తోంది. భార‌త‌, అమెరికా ప్ర‌భుత్వాల నుంచి విధాన నిర్ణేత‌లు, రాష్ట్రస్థాయి అధికారులతోపాటు వాణిజ్య‌-పౌర స‌మాజాల నుంచి మేధో సంప‌న్నులు కూడా ఇందులో పాలుపంచుకుంటారు. మ‌రోవైపు భార‌త‌-అమెరికాల మ‌ధ్య స‌హ‌కారం, కోవిడ్ అనంత‌ర ప్ర‌పంచంలో రెండు దేశాల‌మ‌ధ్య భ‌విష్య‌త్ సంబంధాలు వంటి అంశాలు కూడా స‌ద‌స్సు చ‌ర్చ‌నీయాంశాల్లో భాగంగా ఉంటాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640157

స్వ‌యం స‌మృద్ధ భార‌తం ల‌క్ష్య‌సాధ‌న దిశ‌గా కోటిమంది యువ వ‌లంటీర్ల స‌మీక‌ర‌ణకు యూనిసెఫ్‌తో యువ‌జ‌న వ్య‌వ‌హారాలు-క్రీడాశాఖ‌ భాగ‌స్వామ్యం

ప్రధానమంత్రి పిలుపునిచ్చిన స్వ‌యం స‌మృద్ధ భార‌తం ల‌క్ష్య‌సాధ‌న దిశ‌గా యువజన వ్యవహారాలు-క్రీడా మంత్రిత్వ శాఖ కోటి మంది స్వ‌చ్ఛంద కార్య‌క‌ర్త‌ల‌ను సమీకరిస్తున్నద‌ని ఆ శాఖ‌ మంత్రి శ్రీ కిర‌ణ్ రిజిజు తెలిపారు. ఇందుకోసం యునిసెఫ్ వేదిక *యువాహ్*తో ఆసక్తి వ్యక్తీకరణ ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు చెప్పారు. భారత యువతలో స్వచ్ఛంద సేవా భావం నింపేందుకు ఈ భాగస్వామ్యం కృషి చేస్తుంద‌ని, అలాగే చదువు నుంచి ఉత్పాదక ఉపాధివైపు పరిణ‌తికి, చురుకైన పౌరులుగా వారిలో నైపుణ్యం నింపటానికి కూడా దోహదం చేస్తుంద‌న్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640043

దేశంలో తొలి విద్యుత్ వాహ‌న చార్జింగ్ ప్లాజాకు కేంద్ర ఇంధ‌న‌శాఖ మంత్రి శ్రీ‌కారం

దేశంలో ఇంధన సామర్థ్యం పెంపు, విద్యుత్ వాహ‌న వినియోగానికి ప్రోత్సాహం లక్ష్యంగా కేంద్ర విద్యుత్-న‌వ్య, పునరుత్పాదక ఇంధన శాఖ‌ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ ఢిల్లీలోని షెమ్స్‌ఫోర్డ్ క్ల‌బ్బులో దేశంలో తొలి ప్ర‌భుత్వం విద్యుత్ వాహ‌న చార్జింగ్ ప్లాజాను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ సింగ్ మాట్లాడుతూ- దేశంలో ఇ-మొబిలిటీని విస్త‌రించ‌డానికి, సౌకర్యవంతం చేయడానికి ఈ ప్లాజా ఒక కొత్త అవ‌కాశం క‌ల్పిస్తుంద‌న్నారు. దేశంలో బలమైన ఇ-మొబిలిటీ పర్యావరణ వ్యవస్థ రూపక‌ల్ప‌న‌కు ఇటువంటి వినూత్న ఆవిష్క‌ర‌ణ‌లు తప్పనిసరి అన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640123

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • చండీగఢ్‌: ఈ కేంద్రపాలిత ప్రాంతంలోగల ఉద్యానాలు, సుఖ్నా సరస్సు, మార్కెట్లు తదితర బహిరంగ ప్రదేశాల్లో తనిఖీ, మాస్కు ధారణ, సామాజిక దూరం పాటింపు తదితరాలపై మరింత కఠినంగా వ్యవహరించాలని నగరపాలన యంత్రాంగాధిపతి ఆదేశించారు. కోవిడ్‌పై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పనలో భాగంగా వివిధ కాలనీలు, సెక్టార్లలో మరిన్ని జెండా కవాతులు నిర్వహించాలని డీజీపీని ఆదేశించారు. ఆస్పత్రులలో తగిన భద్రత కల్పించి ఆరోగ్య కార్యకర్తలకు భయాందోళనలు లేకుండా చూడాలని కోరారు.
  • పంజాబ్: రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో కోవిడ్‌-19 పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవటానికి రాష్ట్ర జైళ్ల విభాగం త్రిముఖ వ్యూహాన్ని రూపొందించింది. ఈ మేరకు నివారణ, తనిఖీ-గుర్తింపు, చికిత్స-ఉపశమనం పద్ధతిలో అధికారులు ముందడుగు వేయనున్నారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయిలో దైనందిన కార్యకలాపాల సందర్భంగా సిబ్బందితోపాటు ఖైదీలకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర, జిల్లాస్థాయి పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసింది.
  • హర్యానా: రాష్ట్రంలో నమోదైన కోవిడ్‌ రోగులలో ఇప్పటిదాకా 75 శాతం కోలుకున్నారని, అలాగే కేసుల రెట్టింపు వ్యవధి కూడా 22-23 రోజుల స్థాయికి పెరిగిందని హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ చెప్పారు. దీన్నిబట్టి రాష్ట్రంలో సామాజిక సంక్రమణ సంకేతాలు లేవని స్పష్టం అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, భారత్ బయోటెక్ తయారుచేసిన టీకాపై రోహ్తక్ లోని పండిట్ భగవత్ దయాళ్‌ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మానవ ప్రయోగ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఇది సానుకూల ఫలితం ఇవ్వగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా సుమారు 70 మందికి స్వచ్ఛందంగా టీకా తీసుకున్నారని, వారిలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించకపోవడం రాష్ట్రానికి, ఆరోగ్య శాఖకు పెద్ద విజయమేనన్నారు.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో జాతీయ అంబులెన్స్‌ సర్వీస్‌-108 కింద వాహనాలు పాతబడిపోయిన నేపథ్యంలో 38 కొత్త వాహనాలను సమకూర్చుకునేందుకు హిమాచల్‌ ప్రదేశ్‌ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మరోవైపు కోవిడ్-19 మహమ్మారివల్ల నిధుల కటకట ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రంలో బస్సు ఛార్జీలను పెంచాలని నిర్ణయించింది.
  • కేరళ: రాష్ట్రంలో ఇవాళ మరొకరు మరణించడంతో మృతుల సంఖ్య 44కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టులో కోవిడ్‌ పరిస్థితిని సమీక్షించిన తర్వాత పాఠశాలలను తిరిగి తెరవడంపై నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ అలూవాలో 18 మంది సన్యాసినులకు వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. వీరంతా ఇటీవల కరోనా వైరస్‌కు బలైన ఒక సన్యాసినితో పరచయస్తులు కావడం గమనార్హం. ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిడ్ రోగుల చికిత్సపై అనిశ్చితిని త్వరలో తొలగిస్తామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ తెలిపారు. రాష్ట్రంలో నిన్న 794 కొత్త కేసులు నమోదవగా, వీటిలో 519 పరిచయాలద్వారా సంక్రమించినవే. మరో 24 కేసులకు మూలాలు తెలియరాలేదు. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో 7,611 మంది చికిత్స పొందుతుండగా 1.65 లక్షల మంది నిఘాలో ఉన్నారు.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మరొకరి మరణంతో మృతుల సంఖ్య 30కి చేరింది. ఇక మంగళవారం 91 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2179కి పెరిగింది. తమిళనాడులో 2020-21 విద్యా సంవత్సరానికి 75 శాతం ఫీజు వసూలుకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు స్వాగతించాయి. కాగా, చెన్నైలో ఇప్పటిదాకా 70,000 మంది కోలుకున్న నేపథ్యంలో కోలునేవారి శాతం 81కి పెరిగింది. ఇక నగరంలో నిన్న 1298 తాజా కేసులు నమోదు కాగా, మొత్తం యాక్టివ్‌ కేసులు 15,127కు పెరిగాయి. ఇది నగరంలోని మొత్తం 87,235 కేసులలో 17 శాతంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా నిన్న 4985 కొత్త కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 1,75,678; యాక్టివ్‌ కేసులు: 51,348; మరణాలు: 2551గా ఉన్నాయి.
  • కర్ణాటక: బెంగళూరు పట్టణ-గ్రామీణ జిల్లాల్లో వారంపాటు విధించిన దిగ్బంధం రేపు ముగియనున్న నేపథ్యంలో ఇక పొడిగించరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగశాల నివేదికలకు-వ్యాధి వ్యాప్తికి మధ్య వ్యవధి తక్కువగా ఉన్నందున నమూనాల పరీక్ష ఫలితాలు ఆలస్యం కాకుండా చూడాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. బెంగళూరు నగరంలో 1452సహా కర్ణాటకలో నిన్న 3648 కొత్త కేసులు, 72 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 67,420; యాక్టివ్‌ కేసులు: 42,216; మరణాలు: 1403గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్ చికిత్స, అత్యవసర-ఖరీదైన ఔషధాల వినియోగంపై ప్రైవేట్ ఆస్పత్రులు భారీగా ఛార్జీలు వసూలు చేయడంపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గుంటూరు జిల్లాలోని వెలగపూడిలో రాష్ట్ర అసెంబ్లీ నుండి 9 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని గుంటూరు గ్రామీణ ఎస్పీ హెచ్చరించారు. కాగా, కరోనా కేసుల నేపథ్యంలో తిరుమల-తిరుపతి దేవస్థానం ఇవాళ్టినుంచి దర్శన టైమ్ స్లాట్ టోకెన్ల జారీని ఆపివేసింది. ఇక తిరుపతి పట్టణం మొత్తాన్ని ఆగస్టు 5 వరకు నియంత్రణ జోన్‌గా ప్రకటించారు. రాష్ట్రంలో నిన్న 4074 కొత్త కేసులు, 54 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 53,724; యాక్టివ్‌ కేసులు: 28,800; మరణాలు: 696గా ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలో కోలుకునేవారి శాతం 72కు పెరిగింది. అదే సమయంలో మరణాలు 1 శాతంకన్నా తక్కువగా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. వైరస్ వ్యాప్తి దృష్ట్యా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో దుకాణదారులు స్వచ్ఛందంగా వ్యాపారాలను మూసివేశారు. రాష్ట్రంలో నిన్న 1198 కొత్త కేసులు, 7 మరణాలు నమోదవగా, కొత్త కేసులలో 510 ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. మొత్తం కేసులు: 46,274; యాక్టివ్‌ కేసులు: 11,530; మరణాలు: 422గా ఉన్నాయి.
  • మహారాష్ట్ర: ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో కేసులు సోమవారం 2 లక్షలస్థాయిని దాటాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసులు 3,18,695కు చేరి మరో విషాదకర మైలురాయికి చేరింది. కాగా, ముంబైలో లక్షకుపైగా కేసులు నమోదవగా మిగిలిన లక్షకుపైగా కేసులు థానే, నవీ ముంబై, పాల్ఘర్, రాయ్‌గఢ్‌లలో గణనీయంగా నమోదయ్యాయి. కాగా, ఆక్స్‌ ఫర్డ్‌ కరోనా టీకాపై భారతదేశంలో మానవ  ప్రయోగ పరీక్షలు ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానున్నాయి.
  • గుజరాత్: న్యూఢిల్లీనుంచి గత వారం కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చిన తర్వాత గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలో కోవిడ్-19 పరీక్షల సంఖ్యను రెట్టింపు చేసింది. ఇక జాతీయంగా మరణాల సగటు 2.5 శాతం కాగా,  రాష్ట్రంలో అంతకన్నా అధికంగా 4.5 శాతం నమోదవుతోంది. రాష్ట్రంలో మొత్తం కేసులు 49,353 కాగా, వాటిలో 11,513 యాక్టివ్‌ కేసులున్నాయి.
  • రాజస్థాన్: కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలస కార్మికుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్‌ యోజన కింద తొలి నెలలో రాజస్థాన్ అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పించింది. ఈ మేరకు విడుదల చేసిన అధికార గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 4.1 కోట్ల మందికి ప్రభుత్వం ఉపాధి చూపింది.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో గత నెలలో కరోనావైరస్ కేసులు పెరగడంతో అర్ధరాత్రి నుంచి రాయ్‌పూర్, బిర్గావ్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7 రోజుల తాజా దిగ్బంధం ఆంక్షలు విధించారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, సెమీ-ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూసివేయబడతాయి. ప్రజా రవాణా నిలిపివేస్తారు. ఇక బిలాస్‌పూర్, కోర్బా, దుర్గ్‌లలో గురువారం నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వస్తుంది.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల కోసం 1.5 లక్షల రాపిడ్ డయాగ్నాస్టిక్ టెస్ట్ (ఆర్డిటి) యాంటిజెన్ కిట్లు అందుబాటులో ఉన్నాయని కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ జంపా చెప్పారు. ఇందులో సోమవారం లక్ష కిట్లు అరుణాచల్‌ ప్రదేశ్‌కు చేరిన నేపథ్యంలో వీటిని త్వరలో అన్ని జిల్లాలకు పంపిణీ చేయనున్నారు.
  • అసోం: రాష్ట్ర ముఖ్యమంత్రిర శ్రీ సర్వానంద సోనోవాల్ ఇవాళ బొంగైగావ్ జిల్లాలో వరద పరిస్థితిని పరిశీలించి వరద బాధితులను పరామర్శించారు.
  • మణిపూర్: రాష్ట్రంలో ఇవాళ కోవిడ్‌-19 రోగులు 100 శాతం కోలుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన నోనీ, ఫెర్జాల్, టెంగ్నౌపాల్ జిల్లాలకు చెందిన ముందువరుస యోధులను మణిపూర్‌ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.బీరేన్‌సింగ్‌ అభినందించారు. కాగా, మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలో అన్ని ప్రధాన మార్కెట్లు, ఆధ్యాత్మిక ప్రదేశాలను ఇవాళ్టినుంచి మూసివేశారు.
  • మిజోరం: రాష్ట్రంలోని 10 జిల్లా ఆస్పత్రులకు ట్రూలాబ్ కోట్రో రియల్ టైమ్ క్వాంటిటేటివ్ మైక్రో పిసిఆర్ మెషిన్ (ట్రూనాట్)ల కొనుగోలు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధినుంచి రూ.1.18కోట్లు మంజూరు.
  • నాగాలాండ్: రాష్ట్రంలో 9 కొత్త కేసులు నిర్ధారణ కాగా, దిమాపూర్‌లో 6, మోన్‌లో 2, పెరెన్‌లో 1 వంతున నమోదయ్యాయి. నాగాలాండ్‌లో మొత్తం కేసులు 1030 కాగా, 546 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటిదాకా 484 మంది కోలుకున్నారు.

*****



(Release ID: 1640321) Visitor Counter : 257