యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల సాధనకు యూనిసెఫ్ తో కలిసి కోటిమంది వలంటీర్ల సమీకరణ

ఈ సంక్షోభ సమయంలో ఈ భాగస్వామ్యం చాలా కీలకం:
యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు

Posted On: 20 JUL 2020 7:18PM by PIB Hyderabad

ప్రధాని ఇచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ పిలుపును సాకారం చేసేందుకు యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  కోటి మంది వలంటీర్లను సమీకరిస్తున్నట్టు ఆ శాఖా మంత్రి శ్రీ కిరెన్ రిజిజు ప్రకటించారు. ఇందుకోసం యునిసెఫ్ వారి వేదిక యువాహ్ తో ఆసక్తి వ్యక్తీకరణ ఒప్పందం కుదుర్చుకున్నారు. భారత యువతలో స్వచ్ఛంద సేవా భావం నింపేందుకు ఈ ఉమ్మడి భాగస్వామ్యం పనిచేస్తుంది. అదే విధంగా చదువు నుంచి ఉత్పాదక పని వైపు పరిణామం చెందటానికి, చురుకైన పౌరులుగా నైపుణ్యం నింపటానికి కూడా దోహదం చేస్తుంది.  కేంద్ర మంత్రి శ్రీ కిరెన్ రెజిజు సమక్షంలో యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీమతి ఉషా శర్మ. భారత్ లో యూనిసెఫ్ ప్రతినిధి డాక్టర్ యాస్మిన్ అలి హక్  ఈ కార్యక్రమాన్ని ప్రారంబించారు.


ఈ భాగస్వామ్యపు ప్రాధాన్యం గురించి మంత్రి మాట్లాడుతూ, ఈ సంక్షోభ సమయంలో దీనికి ఎంతో ప్రాధాన్యముందన్నారు. ఇప్పుడున్న విధానాలకు అండగా నిలవటంలో, వాటి అమలు మీద దృష్టి కేంద్రీకరించటంలో ఇది సరైన పాత్ర పోషించగలుగుతుందని అభివర్ణించారు. భారత యువతకు ప్రధాని ఒక కచ్చితమైన దిశా నిర్దేశం చేశారని, ఆత్మ నిర్భర్ భారత్ ను ముందుకు నడపాల్సిన బాధ్యత యువత మీదనే ఉందని అన్నారు. యువ జనాభా అత్యధికంగా ఉన్న భారతదేశంలో ఏ రంగంలోనైనా యువత పాత్రే అద్భుతమైన మార్పులు తీసుకురాగలుగుతుందన్నారు. ఈ మార్పు భారత్ కే పరిమితం కాకుండా అంతర్జాతీయ వేదిక మీద కూడా ప్రభావం చూపగలుగుతుందన్నారు.

యువత అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకోవటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గుర్తు చేశారు. భారత దేశం ఎంతో కాలంగా ఎదుర్కుంటున్న సమస్యలకు, సవాళ్లకు ఇలాంటి సరికొత్త ఆలోచనలే పరిష్కారం చూపగలవని అభిప్రాయపడ్డారు.  ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజలకు మధ్య ఒక వారధిలా ఈ వలంటీర్లు పనిచేస్తారని మంత్రి చెప్పారు.  

 



అటు మంత్రిత్వశాఖ, ఇటు ఐక్యరాజ్య సమితి చేసే కృషికి ఈ వలంటీర్ల సేవలు తోడుగా ఉంటాయని, తద్వారా విద్య, నైపుణ్యాభివృద్ధి, యువత ఎదుర్కుంటున్న నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యేందుకు కృషి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా నిలవటానికి, నైపుణ్యాలను మరింతగా పెంచుకోవటానికి, సామాజిక, ఆర్థిక అవకాశాలను సజావుగా ఉపయోగించుకోవటానికి దారులు చూపే ఈ కార్యక్రమం యువతను భాగస్వాములను చేస్తుందన్నారు. సమాజంలో మార్పులకు దారులు వేస్తూ యువతకు భవిష్యత్ విద్యావకాశాలు, ఉపాధి విషయంలో మార్గదర్శనం చేస్తుంది. విధాన రూపకర్తలకు తెలియజేసేలా అభిప్రాయ సేకరణ జరగటం కోసం ఎన్ ఎస్ ఎస్, ఎన్ ఐ కె ఎస్ లాంటి కార్యకర్తల సేవలు ఎంతగానో ఉపయోగపడబోతున్నాయన్నారు. ఆవిధంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతామన్నారు.

 ఈ భాగస్వామ్యం గురించి యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీమతి ఉషాశర్మ మాట్లాడుతూ "యువాహ్" కార్యక్రమాన్ని ఒక అద్భుత అవకాశంగా అభివర్ణించారు. యువత కలల్ని సాకారం చేసుకోవటానికి ఇదొక సరైన వేదిక అవుతుందన్నారు. యువత కోసం, యువత చేత నడిచే సంస్థ అన్నారు. ఎన్ వై కె ఎస్, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లకు ఒక ఉన్నతమైన వేదికను కల్పిస్తుందని చెబుతూ అంతర్జాతీయ నిపుణులతో కూడా ముఖాముఖి మాట్లాడే అవకాశం కలుగుతుందన్నారు.

భారత్ లో యునిసెఫ్ ప్రతినిధి, యు ఎన్ రెసిడెంట్ కో ఆర్డినేటర్ అయిన డాక్టర్ యాస్మిన్ అలి హక్ మాట్లాడుతూ, యువాహ్ లో కీలపాత్ర భాగస్వామి అయిన యువజన, క్రీడా వ్యవహారాల మంత్రిత్వశాఖ కొన్ని దశాబ్దాలుగా యువతను ముందుకు నడిపించటంలో ప్రధాన భూమిక నిర్వహిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ దేశంలోని యువత తమ ఎజెండాను ముందుకు నడుపుకోవటానికి, విధానపరమైన నిర్ణయాలలోనూ తమ అభిప్రాయాలకు చోటు దక్కేలా చూసుకోవటానికి వీలుకలుగుతుందన్నారు. ఆ విధంగా వారి జీవితాలు మెరుగుపడటంలో వారే కీలకమవుతారన్నారు.

 

***


(Release ID: 1640043) Visitor Counter : 258