PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 17 JUL 2020 6:24PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • దేశంలో ప్రస్తుతం చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,42,756.
  •  కోవిడ్‌-19 నయమైనవారి సంఖ్య 6.35 లక్షలకు (63.33 శాతం) చేరింది.
  • ప్రపంచంలో అతి తక్కువగా భారత్‌లో మరణాల సంఖ్య ప్రతి 10 లక్షల జనాభాకు 18.6 మాత్రమే.
  • మొత్తం కేసులలో 80 శాతం ఎలాంటి లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలుగలవి కాగా, వైద్య పర్యవేక్షణలో ఏకాంత గృహవాసం సూచించబడింది.
  • అవసరాలకు తగినమేర వైద్యపరమైన ప్రాణవాయువు ఉత్పత్తి, సరఫరా, లభ్యత నిల్వ సామర్థ్యం.
  • కోవిడ్‌-19 ప్రభావంతో నిమిత్తం లేకుండా నిరుటితో పోలిస్తే ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణం 21.2 శాతం అధికంగా నమోదు.

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సమాచారం; యాక్టివ్ కేసులు 3.42 లక్షలు మాత్రమే; పెరుగుతున్న కోలుకునే కేసులు: 6.35 లక్షలు...

దేశ‌ంలో ప్రస్తుతం చికిత్స పొ్ందుతున్న కోవిడ్‌-19 రోగుల సంఖ్య 3,42,756 కాగా, ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 6.35 లక్షలకుపైగా (63.33శాతం) నమోదైంది. మొత్తం 1.35 బిలియన్ల ప్రజలతో ప్రపంచంలో రెండో అత్యధిక జనాభాగల దేశమైన భారత్‌లో నమోదవుతున్న కేసుల సంఖ్య ప్రతి పది లక్షలకు 727.4 మాత్రమే కాగా, కొన్ని ఐరోపా దేశాలతో పోలిస్తే ప్రతి పది లక్షల జనాభాకు మన దేశంలో కేసుల సంఖ్య 4 నుంచి 8 రెట్లు తక్కువ. అలాగే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల సంఖ్య అతి తక్కువగా ప్రతి పది లక్షల జనాభాకు కేవలం 18.6గా మాత్రమే ఉంది. కేసుల సమర్థ వైద్య నిర్వహణ వ్యూహాలు సత్ఫలితాలు ఇస్తుండటమే ఇందుకు కారణం. మొత్తం కేసులలో 80 శాతందాకా ఎలాంటి లక్షణాలులేని, స్వల్ప లక్షణాలుగలవి కావడంతో వైద్య పర్యవేక్షణలో ఏకాంత గృహవాస చికిత్స సూచించబడింది. ఇక ఓ మోస్తరు, తీవ్రస్థాయిలోగల కేసులకు మాత్రం కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రులు, సంరక్షణ కేంద్రాలు, ఆరోగ్యరక్షణ కేంద్రాల్లో చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రులలో చేరే రోగులకు నాణ్యమైన చికిత్స దిశగా వైద్య మౌలిక సదుపాయాల కల్పన ముమ్మరంగా సాగుతోంది. ఈ మేరకు సంయుక్త కృషితో దేశవ్యాప్తంగా ఇవాళ కోవిడ్‌-19 ఆస్పత్రి మౌలిక వసతులు రోజురోజుకూ బలోపేతం అవుతున్నాయి. ప్రస్తుతం 1,383 ప్రత్యేక ఆస్పత్రులు, 3,107 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, మరో 10,382 కోవిడ్‌ రక్షణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639490

నిరుటితో పోలిస్తే ఈ ఏడాది ఖరీఫ్‌ పంటల సాగు విస్తీర్ణం 21.2 శాతం అధికం

దేశవ్యాప్తంగా 17.07.2020 నాటికి 691.86 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఖరీఫ్‌ పంటల సాగు నమోదైంది. నిరుడు ఇదే సమయానికి సాగయిన విస్తీర్ణం 570.86 లక్షల హెక్టార్లు మాత్రమే కాగా, ఈసారి 21.20 శాతం అధికం. ఒకవైపు కోవిడ్‌-19 మహమ్మారి సవాలు విసిరినా ఆ ప్రభావంతో నిమిత్తం లేకుండా పంటసాగు విస్తీర్ణం పెరగడం విశేషం.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639434

అవసరాలకు తగినమేర వైద్యపరమైన ప్రాణవాయువు ఉత్పత్తి, సరఫరా, లభ్యత నిల్వ సామర్థ్యం

కోవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్యపరమైన ప్రాణవాయువు సరఫరా, నిల్వ సామర్థ్యం పెంపు తదితరాలపై కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ ఇవాళ సమీక్షించారు. అయితే, వైద్యపరమైన ప్రాణవాయువు ఉత్పత్తి, నిల్వ, రవాణా, సరఫరాలలో పెద్దగా సమస్యలేవీ లేవని స్పష్టమైంది. దేశంలో 2020 ఏప్రిల్‌ నాటికి రోజువారీ వైద్య-ఆక్సిజన్‌ వినియోగం 902 టన్నులు కాగా, జూలై 15నాటికి అది 1,512 టన్నులకు పెరిగింది. వాడకానికి తగినట్లుగా ప్రస్తుతం 15వేల టన్నులకుపైగా నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లో వైద్య-ఆక్సిజన్‌ ఉత్పత్తి సరఫరా ప్రతి నెల చివరి అంచనాలకు తగిన స్థాయిలో ఉంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639507

కోవిడ్‌-19పై పోరులో భాగంగా ప్ర‌యాణ సామ‌గ్రి త‌నిఖీ కోసం అతినీల‌లోహిత కిర‌ణ వ్య‌వ‌స్థకు ఏఆర్‌సీఐ-వేహాంత్ టెక్నాల‌జీస్ సంస్థ‌లు సంయుక్తంగా రూప‌క‌ల్ప‌న‌‌

కోవిడ్‌-19 వ్యాధి ప్ర‌పంచమంత‌టా వేగంగా వ్యాపించ‌డానికి జాతీయ‌-అంత‌ర్జాతీయ ప్ర‌యాణాలు ప్ర‌ధాన కార‌ణాలు. ఈ నేపథ్యంలో ప్రయాణ సామ‌గ్రివల్ల వ్యాధి సంక్రమించడాన్ని నిరోధించే దిశగా ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ARCI) హైదరాబాద్, భార‌త ప్ర‌భుత్వ శాస్త్ర-సాంకేతిక శాఖ (DST)లోని స్వయంప్రతిపత్తిగ‌ల ప‌రిశోధ‌న‌-అభివృద్ధి కేంద్రం, భారత ప్ర‌భుత్వం, నోయిడాలోని వేహాంత్ టెక్నాలజీస్ ‘కృతిస్కాన్’ పేరిట అతినీల‌లోహిత సామ‌గ్రి త‌నిఖీ కన్వేయర్‌ వ్య‌వ‌స్థ‌ను త‌యారుచేశాయి. కొన్ని సెకన్ల వ్యవధిలోనే సామగ్రిని తనిఖీ సామర్థ్యంగల ఈ వ్యవస్థ విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, వాణిజ్య సంస్థలలో వినియోగానికి అనువుగా ఉంటుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639381

కోవిడ్-19 భద్రత విధానాలు, మానవశక్తి, సదుపాయాల కల్పన పరిమితుల దృష్ట్యా బీహార్‌ అసెంబ్లీ-ఇతర ఉప ఎన్నికలలో 65 ఏళ్లు దాటిన ఓటర్లకు తపాలా ఓటు సదుపాయం విస్తరించరాదని కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌ నిర్ణయం

కోవిడ్‌-19 మహమ్మారి, దిగ్బంధం మార్గదర్శకాల దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాలవద్ద కోవిడ్‌ బారినపడే ప్రమాదం ఉన్న దృష్ట్యా 65 ఏళ్లు దాటినవారు, కోవిడ్‌ పాజిటివ్‌ రోగులు, నిర్బంధవైద్య పరిశీలనలో ఉన్నవారు ఓటుహక్కు కోల్పోకుండా చూడటంలో భాగంగా వారికి తపాలా ఓటు సదుపాయం కల్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ సిఫారసు చేసింది. కాగా, ప్రస్తుత అనూహ్య పరిస్థితుల నడుమ బీహార్‌ అసెంబ్లీ సాధారణ ఎన్నికలతోపాటు రాబోయే ఉప ఎన్నికల ఏర్పాట్ల సన్నద్ధతను కమిషన్‌ నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి పోలింగ్‌ కేంద్రంలో... ప్రత్యేకించి వృద్ధులు, దుర్బలవర్గాల ఓటర్లు సులభంగా తమ హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఓటర్ల సంఖ్యను వెయ్యికి తగ్గించింది. ఈ నేపథ్యంలో, రాష్ట్రం అదనంగా సుమారు 34,000 పోలింగ్ కేంద్రాలను (45 శాతం అధికంగా) ఏర్పాటు చేస్తోంది. దీంతో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 1,06,000కు పెరుగుతుంది. దీనివల్ల, బీహార్ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో వాహనాల అవసరం ఏర్పడటంతోపాటు 1.8 లక్షలమంది పోలింగ్ సిబ్బందిని ఇతర అదనపు వనరులను సమీకరించే బలీయమైన రవాణా సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది.  రాబోయే ఉప ఎన్నికలకు కూడా ఇటువంటి సవాళ్లనే ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమస్యలు, సవాళ్లు, అడ్డంకులను పరిగణనలోకి తీసుకుని, ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్యను 1000కి పరిమితం చేసే నిర్ణయం దృష్ట్యా 65 ఏళ్లు పైబడిన ఓటర్లకు తపాలా ఓటు సౌకర్యాన్ని విస్తరించడంపై నోటిఫికేషన్ జారీ చేయరాదని కమిషన్ నిర్ణయించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639220

విశ్వమహమ్మారిని అంతంచేసే చర్యల్లో జాతికి ప్రభుత్వం తోడ్పాటు; ప్లాస్టిక్ పరిశ్రమ ప‌రిర‌క్ష‌ణ‌కు అన్నివిధాలా కృషి: శ్రీ మాండవీయ

కోవిడ్-19 ప్రభావం నుంచి ప్లాస్టిక్ పరిశ్రమ ప‌రిర‌క్ష‌ణ‌కు చట్టం పరిధిలో ప్రభుత్వం స‌క‌ల చ‌ర్య‌లూ తీసుకుంటుంద‌ని కేంద్ర రసాయనాలు-ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ హామీ ఇచ్చారు. ఈ పరిశ్రమకు సంబంధించి నిన్న నిర్వ‌హించిన ఒక వెబినార్‌లో శ్రీ మాండవీయ ప్రసంగించారు. నేటి ఆవిష్కరణాత్మక, స్పర్థాత్మక ప్రపంచంలో భారత ప్లాస్టిక్‌ పరిశ్రమ పర్యావరణపరంగా సుస్థిరం కావాలని ఆయన చెప్పారు. “కోవిడ్‌-19 అంతమయ్యేలోగా ఈ మహమ్మారిపై ప్రతిస్పందనలో భాగంగా ప్రతి నెలా 89 మిలియన్ల వైద్య మాస్కులు, 76 మిలియన్ల పరీక్షా చేతి తొడుగులు, 1.6 మిలియన్ల కళ్లద్దాలు వంటివి అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో భారత్‌ను కరోనా వైరస్‌ రహితంగా తీర్చిదిద్దడంలో ప్లాస్టిక్‌ పరిశ్రమ సవాలును అవకాశంగా మలచుకోవాలి” అని ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639159

బయోటెక్నాలజీ విభాగం, పరిశోధన సంస్థలద్వారా కోవిడ్ -19 టీకాలు, చికిత్స రోగ నిర్ధారణ సదుపాయాల అభివృద్ధి వేగవంతం

కోవిడ్-19 ప్రభావాన్ని తగ్గించేందుకు బయోటెక్నాలజీ శాఖ (డీబీటీ) దాని పరిధిలోని 16 పరిశోధన సంస్థలు నిర్విరామంగా కృషిచేస్తున్నాయి. కోవిడ్-19 పరిష్కారాన్వేషణ దిశగా బహుముఖ పరిశోధన-అభివృద్ధిలో లోతుగా నిమగ్నమయ్యాయి. అదే సమయంలో స్వావలంబన సాధన ల‌క్ష్యంగా దేశీయ రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల ప‌రిజ్ఞానాభివృద్ధిపై ప్ర‌ధానంగా దృష్టి సారించాయి. ఇందులో భాగంగా డీబీటీ-టీహెచ్ఎస్‌టీఐ రూపొందించిన చౌక‌ధ‌ర ‘కలరిమెట్రిక్ పీసీఆర్ ఆధారిత ప‌ద్ధ‌తి సాంకేతిక‌త, ఆప్టామెర్-ఆధారిత సార్స్‌-కోవ్‌2 యాంటిజెన్ డిటెక్షన్ టెక్నాలజీల’ను రెండు కంపెనీలు... ‘జినీ, మోల్బియో డయాగ్నాస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌’ల‌కు పరిమితంగా హ‌క్కులు బ‌దిలీ చేశారు. అలాగే స్వ‌యంగా రూపొందించిన ఐజీజీ ఎలిజా సాంకేతిక‌త‌ను ఎగ్జైటాన్ డయాగ్నాస్టిక్స్ లిమిటెడ్‌కు బ‌ద‌లాయించారు. ‌మ‌రోవైపు న్యూఢిల్లీలోని డీబీటీ-ఆర్జీసీబీ-పీవోసీటీ సర్వీసెస్ సంయుక్తంగా తక్కువ ఖర్చుతో వైరస్‌ రవాణా మాధ్య‌మాన్ని, వాణిజ్య అవసరాలకు అనువైన ఆర్ఎన్ఏ సంగ్ర‌హ‌ణ కిట్‌ను అభివృద్ధి చేసింది. పరిశ్రమలు, అంకుర సంస్థ‌లు, విద్యావేత్త‌ల నుంచి వచ్చిన అభ్యర్థనల మేర‌కు డీబీటీ-టీహెచ్ఎస్‌టీఐ 2500 న‌మూనాల‌ను అంద‌జేసింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639270

28 రాష్ట్రాల్లోని 2.63 ల‌క్ష‌ల గ్రామీణ స్థానిక సంస్థ‌ల‌కు రూ.15,187.5 కోట్ల ఆర్థిక స‌హాయాన్ని 2020 జూలై 15న విడుదల చేసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌శాఖ‌

పంచాయతీరాజ్‌, జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ‌శాఖ ప‌రిధిలోని తాగునీరు-పారిశుధ్య విభాగం సిఫారసు మేరకు 28 రాష్ట్రాల్లోని 2.63 లక్షల గ్రామీణ స్థానిక సంస్థలకు 2020 జూలై 15న ఆర్థిక మంత్రిత్వశాఖ రూ.15187.5 కోట్ల ఆర్థిక స‌హాయాన్ని విడుద‌ల చేసింది. ఇది 15వ ఆర్థిక సంఘం 2020-21కిగాను తొలివిడ‌త కింద సిఫారసు చేసిన మేర‌కు ష‌ర‌తులతో కూడిన నిధికింద విడుద‌లైంది. ఈ నిధుల‌తో తాగునీటి సరఫరా, వాన‌నీటి సంర‌క్ష‌ణ‌, జ‌ల పున‌రుప‌యోగం, పారిశుధ్యంస‌హా బ‌హిరంగ విస‌ర్జ‌న విముక్త స్థితిగతుల నిర్వహణ త‌దిత‌రాల కోసం మాత్ర‌మే వినియోగించాల్సి ఉంటుంది. కేంద్ర పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ-రైతు సంక్షేమశాఖల మంత్రి శ్రీ నరేంద్రసింగ్‌ తోమర్‌ ఈ మేరకు వెల్లడించారు. కోవిడ్‌-19 సవాళ్లతో కునారిల్లుతున్న సమయంలో గ్రామీణ స్థానిక సంస్థలకు ఈ నిధుల విడుదల ఎంతో సముచితమని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639509

భారత వ్యవసాయ పరిశోధన మండలి 92వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణ

భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) 92వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్న వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమశాఖ మంత్రి శ్రీ నరేంద్రసింగ్‌ తోమర్‌ మాట్లాడుతూ- గడచిన 9 దశాబ్దాల్లో దేశ వ్యవసాయ పురోగమనం కోసం వ్యవసాయ శాస్త్రవేత్తలు చేసిన కృషిని కొనియాడారు. శాస్త్రవేత్తల పరిశోధన సహకారంతోపాటు అన్నదాత అవిరళ కృషివల్ల నేడు మన దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మిగులు సామర్థ్యం సాధించిందన్నారు. కోవిడ్-19వల్ల దిగ్బంధం విధించినప్పటికీ రికార్డు స్థాయిలో దిగుబడులు సాధించిన రైతులోకాన్ని అభినందించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639212

కోవిడ్‌-19 నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబరు 14దాకా నడవనున్న తూర్పు రైల్వే పార్శిల్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లు

కోవిడ్‌-19 దిగ్బంధం సమయంలో నిత్యావసరాలు, నశ్వర వస్తువులు, వైద్య పరికరాలు, మందులు తదితర అత్యవసర సామగ్రిని దేశంలోని నలుమూలలకూ చేరవేయడం కోసం తూర్పు రైల్వే వివిధ మార్గాల్లో పార్శిల్‌ ఎక్స్‌ ప్రెస్ రైళ్ల దశలవారీగా నడిపింది. ప్రస్తుతం తూర్పు రైల్వే నడుపుతున్న పార్శిల్‌ రైళ్లు హౌరా-గువహటి, సీల్దా-గువహటి, హౌరా- అమృతసర్‌ మార్గాల్లో నడుస్తున్నాయి. ప్రస్తుత అవసరాల దృష్ట్యా నిర్దేశిత రోజుల్లో 2020 డిసెంబర్ 14 వరకుఈ మార్గాల్లో సేవలను కొనసాగించనుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639058

 

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • పంజాబ్: ప్రస్తుత మహమ్మారి సమయంలో ప్రైవేట్ ఆస్పత్రుల లాభార్జనాపేక్షను అదుపులో పెట్టేందుకు పంజాబ్ ప్రభుత్వం ఈ ఆసుపత్రులకు కోవిడ్ చికిత్స రేట్లను నిర్ణయించింది. ఈ మేరకు డాక్టర్‌ కె.కె.తల్వార్‌ ఆధ్వర్యంలోని కమిటీ ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్య కళాశాలలకు రేట్లు ఖరారు చేసింది. ఇందులో ఏకాంత చికిత్స పడకలు, ఐసీయూలో చికిత్ససహా చేరిన రోజునుంచి రోజువారీ ఖర్చుల కింద వసూలు చేయాల్సిన మొత్తాలను నిర్దేశించింది. కోవిడ్ చికిత్సకు ఈ ఆస్పత్రులు విపరీతంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది.
  • హర్యానా: రాష్ట్రంలో కోవిడ్‌-19 నుంచి దివ్యాంగులకు రక్షణ, భద్రత దిశగా హర్యానా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. ఇక 50 శాతం... అంతకన్నా అధిక వైకల్యంగల, రెండు కళ్లూ కనిపించని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు రోజువారీ/కాంట్రాక్ట్ సిబ్బంది ఇళ్లనుంచి పనిచేసేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో గురువారం ఒకేరోజు అత్యధికంగా 8641 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 2,84,281కి పెరిగింది. అలాగే 5527 మంది కోలుకోగా, 266 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,14,648 యాక్టివ్‌ కేసులుండగా ఇప్పటిదాకా 1,58,140 మంది కోలుకున్నారు. ఇక మరణాల సంఖ్య 11,194గా ఉంది. గ్రేటర్ ముంబైలో 1498 కొత్త కేసులతో పాటు 707 మంది కోలుకోగా 56 మరణాలు నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం ముంబైలో మొత్తం రోగుల సంఖ్య 97751 కాగా, యాక్టివ్‌ కేసులు 23,694గా ఉన్నాయి. కాగా, ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 68,537కు పెరిగింది. ముంబైలో మరణాలు 5520 కాగా రాష్ట్రంలో కోలుకునేవారి శాతం 55.63గా, ముంబైలో 70 శాతంగా ఉంది.
  • గుజరాత్: రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 45,481కాగా, ప్రస్తుతం 11,289 మంది చికిత్స పొందుతుండగా ఇప్పటిదాకా 32103 మంది కోలుకున్నారు. గురువారం 10 మంది మరణించడంతో మృతుల సంఖ్య 2089కి పెరిగింది. కాగా, సూరత్ నగరం కొత్త హాట్‌స్పాట్‌గా మారుతున్న నేపథ్యంలో నలుగురు సభ్యుల కేంద్రబృందం అక్కడ పర్యటించి గురువారం రాత్రి స్థానిక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. ఇక ఇవాళ బృందం సభ్యులు సివిల్ ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్త హాట్‌స్పాట్‌లుగా మారుతున్న వివిధ ప్రాంతాలను కూడా బృందం సభ్యులు సందర్శించారు.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఈ ఉదయం 159, నిన్న రాత్రవరకూ 737 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,333కు పెరిగింది. అయితే, కోలుకున్నవారి 20,028గా ఉంది. ప్రస్తుతం 6,666 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ్టి కేసులలో బికనేర్‌ (32), నాగౌర్ (26), జైపూర్ (22) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో ఎన్నడూలేని రీతిలో ఇవాళ ఒకేరోజు అత్యధికంగా 735 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 20,378కి పెరిగింది. అయితే, ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5562కాగా, గురువారం 219 మందికి వ్యాధి నయం కావడంతో కోలుకున్నవారి సంఖ్య 14,127కు చేరింది. ఇక గురువారం ఏడుగురు మరణించగా మృతుల సంఖ్య 689కి పెరిగింది.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో గురువారం అత్యధికంగా 197 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,754కి చేరింది. ప్రస్తుత యాక్టివ్ కేసులు 1,282కాగా, ఇవాళ వివిధ ఆస్పత్రుల నుంచి 127 మంది డిశ్చార్జి కావడంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 3,451కి చేరింది.
  • గోవా: గోవాలో గురువారం 157 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 3,108కి పెరిగింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 127గా ఉంది.
  • అసోం: రాష్ట్రంలోని నౌగావ్‌లో కోవిడ్‌-19 రోగులకు చికిత్సకు సంబంధించి వైద్యులు, నర్సులతో సంభాషించేందుకు అసోం ముఖ్యమంత్రి శ్రీ సర్వానంద సోనోవాల్ పౌర ఆస్పత్రిని సందర్శించారు. కోవిడ్ నియంత్రణ చర్యలను మరింత మెరుగుపరచడంపై డీసీ, ఎస్పీసహా ఇతర జిల్లా స్థాయి అధికారులతో సమావేశంలో ఆయన చర్చించారు.
  • మణిపూర్: రాష్ట్రంలో తౌబల్‌ జిల్లా మొయిజింగ్ అవాంగ్ లీకై సర్పంచుతోపాటు నలుగురు వ్యక్తులకు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి రాపిడ్ యాంటిజెన్ పరీక్ష నిర్వహించారు.
  • మిజోరం: రాష్ట్రంలోని 194 చర్చి మందిరాలు ప్రస్తుతం కోవిడ్‌ దిగ్బంధవైద్య పరిశీలన కేంద్రాలు ఉపయోగించబడుతున్నాయి.
  • నాగాలాండ్: రాష్ట్రంలోని మోన్ జిల్లా కార్యాచరణ బృందం జిల్లాలో ఆర్థిక పునరుద్ధరణకు, తిరిగివచ్చిన వారికి ఉపాధి కల్పనకు కమిటీని ఏర్పాటు చేసింది. నాగాలాండ్‌లోని పెరెన్ జిల్లా కార్యాచరణ బృందం అక్కడి ముఖ్యమంత్రి కార్యాలయ భవనంతోపాటు RSETI భవనం, పర్యాటకశాఖ పరిధిలోని పర్ణశాలలుసహా  సెయింట్ జేవియర్ కాలేజ్ ఆడిటోరియం హాల్, వెటర్నరీ కాలేజ్ హాస్టల్‌ను కోవిడ్‌ ఏకాంత చికిత్స కేంద్రాలుగా రూపొందించింది.
  • కేరళ: స్థానిక స్వపరిపాలన సంస్థల పరిధిలో కోవిడ్‌ ప్రత్యేక చికిత్స కేంద్రాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్య శాఖ సిఫారసు చేసిన ప్రతి ప్రాంతంలో ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. మరోవైపు కేరళలో ఇద్దరి మరణంతో మొత్తం మృతుల సంఖ్య 39కి పెరిగింది. ఇక ఇద్దరు పోలీసులకు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో క్రైమ్ బ్రాంచ్ ప్రధాన కార్యాలయాల కార్యకలాపాలు నిలిపివేశారు. కాగా, రాజధానిలో వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఐదు కొత్త నియంత్రణ జోన్లను ప్రకటించారు. స్థానిక వ్యాప్తిని నిరోధించేందుకు జిల్లాలోని అన్ని తీరప్రాంత రహదారులను మూసివేశారు. నిన్న రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 722 కొత్త కేసులు నమోదవగా 5,372 మంది చికిత్స పొందుతున్నారు. వివిధ జిల్లాల్లో 1.83లక్షలమంది నిఘాలో ఉన్నారు.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో గడచిన 24 గంటల్లో ముగ్గురు మరణించడంతో మృతుల సంఖ్య 25కు చేరింది. ప్రస్తుతం మొత్తం కేసులు 1,832కు చేరగా, 793 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, తమిళనాడులోని ఐఐటీ-ఎం ప్రోత్సాహంగల అంకుర సంస్థ ఐసీయూతోపాటు వైద్యులకు వసతి, ఏకాంత చికిత్స సదుపాయాలు, వైద్య పరీక్షలకు తగినరీతిలో ప్రత్యేక గదులతో ‘మెడికాబ్’ పేరిట 15 పడకల ప్రీ-ఫాబ్రికేటెడ్ యూనిట్‌ను అభివృద్ధి చేసింది. కాగా, తమిళనాడులో గురువారం 4,549 కొత్త కేసులు నమోదుకాగా, వీటిలో చెన్నైసహా ఉత్తర తమిళనాడులోని ఆరు జిల్లాల్లో సగం కేసులుండటం గమనార్హం. రాష్ట్రంలో నిన్నటిదాకా మొత్తం కేసులు: 1,56,369; యాక్టివ్‌ కేసులు: 46,714; మరణాలు: 2236; చెన్నైలో యాక్టివ్ కేసులు: 15,038గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలో విపత్తు నిర్వహణ చట్టం అమలుతోపాటు కోవిడ్ రోగులకు చికిత్స నిరాకరించే ప్రైవేట్ ఆసుపత్రులకు జరిమానా విధించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కర్ణాటకలో నిన్న 4169 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 51,422కు చేరింది. వీటిలో బెంగళూరు నగరంలో నమోదైన కేసులు 2344 కావడం గమనార్హం. రాష్ట్రంలో నిన్నటిదాకా మొత్తం కేసులు: 51,422; యాక్టివ్‌ కేసులు: 30,655; మరణాలు: 1032గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలని బహిరంగ ప్రదేశాల్లో, కార్యాలయాల్లో, ప్రయాణ సమయంలో మాస్క్‌ ధారణను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇవాళ తదనుగుణంగా ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, తిరుపతి పురపాలక సంస్థల పరిధిలోని విశ్వవిద్యాలయాల సిబ్బంది తదుపరి ఆదేశాలు జారీచేసేదాకా ఇంటినుంచే పనిచేయాలని కమిషనర్ సూచించారు. ఇక గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో 15 మందికి వ్యాధి సోకడంత కొన్నివిభాగాలు తాత్కాలికంగా మూతపడ్డాయి; మరోవైపు ఉద్యోగుందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్ష నిర్వహిస్తున్నారు.  గుంటూరు జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రేపటినుంచి జిల్లావ్యాప్తంగా వారంపాటు దిగ్బంధం విధిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. కాగా, రాష్ట్రంలో గత 24 గంటల్లో 2602 కొత్త కేసులు నమోదవగా 837 మంది కోలుకున్నారు... 42 మంది మరణించారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 40,646; యాక్టివ్‌ కేసులు: 19,814; మరణాలు: 534గా ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలో రాబోయే 15 రోజుల్లో కోవిడ్-19 కేసులు తగ్గుతాయని నిపుణులు పేర్కొన్నారు. గడచిన వారం రోజులుగా నమూనాల పరీక్షలు ముమ్మరం చేసినప్పటికీ తెలంగాణలో కేసుల సంఖ్య తగ్గింది. ఆ మేరకు కొద్ది రోజులుగా నమోదయ్యే కేసులు 20 శాతం నుంచి 10 శాతానికి దిగివచ్చాయి. ముఖ్యంగా యాంటిజెన్‌ పరీక్షసహా ఇప్పుడు రోజుకు 10,000దాకా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, నిన్న రాష్ట్రంలో 1676 కొత్త కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 41,018; యాక్టివ్‌ కేసులు: 13,328; మరణాలు 396; డిశ్చార్జి: 27,295గా ఉన్నాయి.

*****

 



(Release ID: 1639523) Visitor Counter : 233