శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 తో పోరాటంలో భాగంగా లగేజీని పూర్తిగా క్రిమిసంహారకంగా స్కాన్ చేయడం కోసం ఒక యూ.వి.వ్యవస్థను సంయుక్తంగా అభివృద్ధి చేసిన - ఏ.ఆర్.సి.ఐ. మరియు వేహాంట్ టెక్నాలజీస్ సంస్థలు.

Posted On: 17 JUL 2020 12:42PM by PIB Hyderabad

కోవిడ్-19 వైరస్ వ్యాప్తికి దేశీయ మరియు అంతర్జాతీయ ప్రయాణాలు ఒక ప్రధాన కారణంగా ఉంది.  ప్రయాణాల్లో లగేజీ ఒక అనివార్యమైన భాగం, లగేజీ నిర్వహణ లో అనేక మంది వ్యక్తుల ప్రమేయం ఉంటుంది. వైరస్ వ్యాప్తికి లగేజీ కాంటాక్ట్ పాయింట్లుగా ఉంటుంది. అందువల్ల అవి చేతులు మారిన ప్రతిసారీ వాటిని త్వరగా క్రిమిసంహారక స్కాన్ చేయవలసి ఉంటుంది.  లాక్ డౌన్  అనంతర కాలంలో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు మరియు వాణిజ్య సంస్థలలో ప్రయాణీకుల రద్దీ పెరగడంతో,  కోవిడ్-19 కు వ్యతిరేకంగా సమర్థవంతంగా పోరాడటానికి కొన్ని సెకన్లలో లగేజీని పూర్తిగా క్రిమిసంహారకంగా స్కాన్ చేయడానికి వేగవంతమైన వ్యవస్థ యొక్క తక్షణ అవసరం ఉంది.

లగేజీ ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి, భారతప్రభుత్వ శాస్త్ర, సోంకేతిక శాఖకు చెందిన స్వయంప్రతిపత్తి  పరిశోధన, అభివృద్ధి సంస్థ, హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏ.ఆర్.సి.ఐ) మరియు నోయిడా లోని వేహాంట్ టెక్నాలజీస్ సంస్థ సంయుక్తంగా కృతి స్కాన్ ® యు.వి. బ్యాగేజ్ క్రిమిసంహారక వ్యవస్థ ను రూపొందించాయి.  

అభివృద్ధి చేసిన ఈ కాంపాక్ట్ యు.వి.సి. కన్వేయర్ వ్యవస్థ కొన్ని సెకన్లలో కన్వేయర్ గుండా వెళుతున్న లగేజీపై సమర్థవంతంగా క్రిములు లేకుండా చేస్తుంది.  ఈ వ్యవస్థ లగేజీ పై ఉన్న  క్రిములను వేగంగా సంహరించడానికి, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు, హోటళ్ళు, వాణిజ్య సముదాయాలు, ప్రయివేటు సంస్థలలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది.

యు.వి.సి. ఆధారిత క్రిమిసంహారక వ్యవస్థలు వేగంగా క్రిమిసంహారక సామర్ధ్యానికి ప్రసిద్ది చెందాయి, ఈ క్రిమిసంహారక ప్రక్రియ పొడిగా, రసాయన రహితంగా జరుగుతుంది.  254 ఎన్.ఎమ్ వద్ద యు.వి.సి వికరణీకిరణం దాని క్రిమి సంహారక లక్షణాలకు ప్రసిద్ది చెందింది, ఈ ప్రక్రియ అనంతరం లగేజీపై రసాయన అవశేషాలు ఏమీ మిగిలి ఉండవు.  యు.వి.సి. కిరణం లగేజీ ఉపరితలంపై ప్రసరించగానే, వైరస్ లోని జన్యు పదార్ధాన్ని సత్వరమే విచ్చిన్నం చేసి, వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది.

కృతి స్కాన్ యు.వి. అధునాతన లగేజీ క్రిమిసంహారక వ్యవస్థలో,  లగేజీని క్రిమిసంహారక సొరంగంలోకి పంపడానికి వీలుగా ప్రత్యేకంగా మోటార్లు అమర్చిన కన్వేయర్‌ను రూపొందించి, అమర్చారు.  సూక్ష్మజీవులు మరియు వైరస్ లను నిష్క్రియం చేయడానికి అవసరమైన కిరణాలను యు.వి.సి. లైట్ (254 ఎన్.ఎమ్) ద్వారా ప్రసారం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.  ఈ వ్యవస్థలో ఉపయోగించే యు.వి.-సి. లైట్లును బాగా సురక్షితంగా అమర్చడం జరిగింది. అందువల్ల, ఈ వ్యవస్థ పరిసరాల్లో ఉండే సిబ్బందికి లేదా ప్రయాణీకులకు దీనివల్ల ఎటువంటి హానీ కలగదు.  అయితే, యు.వి.సి. వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు, మానవ జోక్యం పనికిరాదని గట్టిగా సలహా ఇవ్వడం జరిగింది. 

ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏ.ఆర్.‌సి.ఐ) డైరెక్టర్ డాక్టర్ జి. పద్మనాభన్ మాట్లాడుతూ,  "యు.వి.సి. ఆధారిత క్రిమిసంహారక వ్యవస్థలలో ఏ.ఆర్.సి.ఐ. తన గత అనుభవంతో, యు.వి. మోతాదు స్థాయిలు మరియు క్రిమిసంహారక సొరంగంలో యు.వి.సి. తీవ్రతలను మ్యాపింగ్ చేయడంలో మార్గదర్శకత్వం వంటి అంశాలలో సహకారాన్ని అందించింది, తద్వారా అవసరమైన తీవ్రత అన్ని అవసరమైన ప్రదేశాలలో అందుబాటులో ఉండడానికి వీలుకలిగింది.  అదేవిధంగా కృతి స్కాన్ ® యు.వి. లగేజీ క్రిమిసంహారక వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో మరియు ఉత్పత్తి చేయడంలో గత అనుభవం, నైపుణ్యం కలిగిన వేహాంట్  టెక్నాలజీస్ సంస్థ, కృతిస్కాన్ యు.వి.సి. వ్యవస్థను రికార్డు సమయంలో అభివృద్ధి చేయగలిగింది “. అని వివరించారు. 

"కోవిడ్-19 సంక్షోభం కొనసాగుతున్న ఈ సమయంలో ప్రజలను సురక్షితంగా ఉంచాలనే ఏకైక లక్ష్యంతో వీహాంట్ టెక్నాలజీస్ సంస్థ 24 గంటలూ పనిచేస్తోంది.  వైరస్ వ్యాప్తి చెందడానికి ప్రయాణీకుల లగేజీ ఒక మాధ్యమంగా పనిచేసే అవకాశం ఉన్నందువల్ల, మేము ఏ.ఆర్.సి.ఐ.  తో కలిసి  కృతి స్కాన్ ® యు.వి. లగేజీ క్రిమిసంహారక వ్యవస్థను సంయుక్తంగా అభివృద్ధి చేసాము.  ఛాంబర్ లోని సెన్సింగ్ విధానం స్వయంచాలకంగా ఏదైనా వస్తువు యొక్క ప్రవేశాన్ని గుర్తించి వ్యవస్థ పనిచేసేలా చేస్తుంది, లోపలి ప్రవేశించిన వస్తువు యొక్క 360-డిగ్రీల ఉపరితలాన్ని క్రిమిసంహారకం చేస్తుంది, ” అని వీహాంట్ టెక్నాలజీస్ సంస్థ, సహా వ్యవస్థాపకులు, ముఖ్య కార్యనిర్వహణాధికారి, శ్రీ కపిల్ బర్డెజా తెలియజేశారు.  

"వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయాల్లో, ఆర్ధిక వృద్ధిని అనుమతించడానికి వీలుగా, ఆరోగ్య సమస్యలు కూడా క్రమంగా పరిష్కరింపబడుతున్న క్రమంలో, సురక్షిత ప్రయాణాలు చేయడానికి ఇటువంటి ఆవిష్కరణలు ఎంతగానో దోహదపడతాయి." అని డి.ఎస్.టి. కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ పేర్కొన్నారు. 

 

వివిధ ప్రయోజనాల కోసం, వివిధ ప్రదేశాల కోసం,  వివిధ సొరంగ పరిమాణాలతో, ఆయా లగేజీల సామాను పరిమాణాలను బట్టి, వ్యవస్థలను అమర్చవచ్చు. ఆయా మోడళ్ళ రకానికి అనుగుణంగా, వేర్వేరు కన్వేయర్ వేగంతో ఈ వ్యవస్థలు పని చేస్తాయి.  సాధారణంగా చేతితో పట్టుకుని చేసే, క్రిమిసంహారక పద్ధతులతో పోలిస్తే, ఈ వ్యవస్థ చాలా వేగంగా కేవలం ఎనిమిది సెకన్లలో సమర్థవంతంగా లగేజీపై క్రిములు లేకుండా చేస్తుంది.

*****



(Release ID: 1639381) Visitor Counter : 214