భారత ఎన్నికల సంఘం
కోవిడ్ 19 యొక్క పరిమిత విధి విధానాలు, మానవ వనరులు, భద్రతా నిబంధనల దృష్ట్యా, బీహార్ శాసనసభ ఎన్నికలు మరియు ఉప ఎన్నికలలో 65 ఏళ్లు పైబడిన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని విస్తరించకూడదని నిర్ణయించిన - ఈ.సి.ఐ.
Posted On:
16 JUL 2020 7:12PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని, విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం, దేశంలో ఎప్పటికప్పుడు లాక్ డౌన్ మార్గదర్శకాలను జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ జారీ చేసింది. విపత్తు నిర్వహణ చట్టం, 2005 కింద ఏర్పాటు చేసిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, చైర్‌పర్సన్ మరియు కేంద్ర హోం శాఖ కార్యదర్శి జారీ చేసిన 17.05.2020 తేదీ నాటి మార్గదర్శకాల ప్రకారం, “దుర్బలమైన వ్యక్తుల రక్షణ: 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు మరియు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు అవసరమైన మరియు ఆరోగ్య ప్రయోజనాల కోసం తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు.”
అదే సమయంలో, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 05.04.2020 మరియు 18.05.2020 తేదీలలో జారీ చేసిన సూచనలలో, కోవిడ్-19 పాజిటివ్ / అనుమానిత వ్యక్తుల కోసం నిర్బంధం (గృహ / సంస్థాగత) యొక్క వివరణాత్మక విధానాన్ని సూచించింది.
ఇటువంటి అసాధారణ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, పోలింగ్ స్టేషన్లలో 65 ఏళ్ళు పైబడిన ఓటర్ల దుర్బలత్వం మరియు బహిర్గతం తగ్గించడానికి మరియు కోవిడ్ పాజిటివ్ ఓటర్లు మరియు క్వారంటైన్ లో ఉన్న ఓటర్లు వారి ఓటింగ్ హక్కులను కోల్పోకుండా ఉండటానికి ఐచ్ఛిక పోస్టల్ బ్యాలెట్ సదుపాయాలను విస్తరించాలని కమిషన్ సిఫారసు చేసింది. కమిషన్ చేసిన ఈ సిఫారసుపై, చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ 19.06.2020 తేదీన సవరించిన నిబంధనలను ప్రకటించింది. అయితే, ఈ అధికార నిబంధనను అమలు చేయడానికి ముందు, ఎన్నికల సమయంలో, ప్రజల ప్రాతినిధ్య చట్టం, 1951 సెక్షన్ 60 (సి) కింద కమిషన్ తగిన నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈ అధికార నిబంధనలను అమలు చేయడానికి ముందు, కమిషన్ నిరంతరం క్షేత్ర పరిస్థితిని మరియు కార్యాచరణ యొక్క విధివిధానాలను నిరంతరంగా అంచనా వేస్తుంది.
ఇటువంటి అసాధారణ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని, రాబోయే ఉప ఎన్నికలు మరియు బీహార్ శాసనసభ ఎన్నికల సంసిద్ధతను కమిషన్ నిరంతరం పర్యవేక్షిస్తోంది. కోవిడ్-19 పరిస్థితులలో, ముఖ్యంగా వృద్ధులు మరియు దుర్బలమైన ఓటర్లు సులువుగా ఓటు వేయడానికి వీలుగా, ప్రతి పోలింగ్ కేంద్రానికి ఓటర్ల సంఖ్యను వెయ్యికి పరిమితం చేస్తూ, కమీషన్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రం అదనంగా సుమారు 34,000 పోలింగ్ కేంద్రాలను (45 శాతం ఎక్కువ) ఏర్పాటు చేస్తోంది. దీంతో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 1,06,000 కు పెరుగుతుంది. దీనివల్ల, బీహార్ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో వాహనాల అవసరాలతో సహా 1.8 లక్షల మంది పోలింగ్ సిబ్బందిని మరియు ఇతర అదనపు వనరులను సమీకరించే బలీయమైన రవాణా సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. రాబోయే ఉప ఎన్నికలకు కూడా ఇటువంటి సవాళ్లనే ఎదుర్కోవలసి వస్తుంది.
ఈ అన్ని సమస్యలు, సవాళ్లు, అడ్డంకులను పరిగణలోకి తీసుకుని మరియు ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్యను 1000 కి పరిమితం చేసే నిర్ణయం దృష్ట్యా, బీహార్ లో రాబోయే సాధారణ ఎన్నికలలో మరియు సమీప భవిష్యత్తులో జరగే ఉప ఎన్నికలలో 65 ఏళ్లు పైబడిన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని విస్తరించాలనే నోటిఫికేషన్ జారీ చేయకూడదని కమిషన్ నిర్ణయించింది. అయితే, 80 ఏళ్లు పైబడిన ఓటర్లు, దివ్యాంగులైన ఓటర్లు, అత్యవసర సేవల్లో నిమగ్నమైన ఓటర్లు మరియు క్వారంటైన్ (గృహ / సంస్థాగత) లో ఉన్న కోవిడ్-19 పాజిటివ్ / అనుమానితులైన ఓటర్లకు ఐచ్ఛిక పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఈ ఎన్నికలలో విస్తరించబడుతుంది.
*****
(Release ID: 1639220)
Visitor Counter : 251