ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు 3.42 లక్షలు మాత్రమే

6.35 లక్షలు దాటి పెరుగుతున్న కోలుకున్నవారి సంఖ్య

వెంటిలేటర్లమీద ఉన్నవారు 1% లోపు, ఐసియు లో 2% లోపు, ఆక్సిజెన్ పడకల మీద 3% లోపు

Posted On: 17 JUL 2020 2:34PM by PIB Hyderabad

దేశంలో ఇప్పుడు కోవిడ్ తో బాధపడుతున్నవారి సంఖ్య 3,42,756 మాత్రమే. మొత్తం బాధితులలో 6.35 లక్షల మంది, అంటే 63.33% మంది కోలుకున్నారు. 135 కోట్లతో ప్రపంచంలో జనాభా పరంగా రెండో పెద్ద దేశమైన భారత్ లో నమోదైన పాజిటివ్ కేసులుప్రతి పది లక్షల్లో 727.4 గా నమోదయ్యాయి. ప్రపంచ స్థాయిలో చూసినప్పుడు ప్రతి పదిలక్షల్లో నమోదైన కేసుల పరంగా యూరోపియన్ దేశాలకంటే భారత్ లో నాలుగు నుంచి ఎనిమిది రెట్లు తక్కువ

మరణాల సంఖ్య పరంగా చూసినప్పుడు కూడా  ప్రతి పదిలక్షల్లో 18.6 చొప్పున నమోదు కావటమంటే ప్రపంచంలోనే అతి తక్కువ.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఉమ్మడి కృషి, ఇంటింటి సర్వేల ద్వారా వైరస్ సోకినవారిని గుర్తించటం, నిఘా పెట్టటం, కంటెయిన్మెంట్, బఫర్ జోన్లను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవటం లాంటి చర్యలు బాగా పనికొచ్చాయి. దూకుడుగా పరీక్షలు జరపటం, సకాలంలో బాధితులను గుర్తించటం కారణంగా వైరస్ వ్యాప్తిని నియంత్రించటం సాధ్యమైంది. ఆ విధంగా తొలిదశలోనే చికిత్స చేయటానికి కూడా వీలైంది.

భారత్ స్వల్ప, ఒక మోస్తరు, తీవ్ర లక్షణాలున్న వారిని గుర్తించి వారికి తగిన విధమైన చికిత్స అందించటం ద్వారా ఒక ప్రామాణిక చికిత్సావిధానాన్ని అనుసరించగలిగింది. ఆరోహ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ రూపొందించిన చికిత్సా విధానాన్ని, ప్రమాణాలను పాటించటం ద్వారా తగిన విధంగా వ్యాధిని నియంత్రించగలిగారు.  అలాంటి సమర్థవంతమైన చికిత్సావిధానం తగిన ఫలితాలనిచ్చింది. లక్షణాలు కనబడని వారిని, స్వల్ప లక్షణాలున్న వారిని ఇళ్లలోనే ఉండిపోయేలా చేసి వైద్య పర్యవేక్షణలో ఉంచటం కూడా ఆశించిన ఫలితాలనిచ్చింది. ఒక మోస్తరు లేదా తీవ్ర లక్షణాలున్నవారిని  ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులు లేదా కోవిడ్ వైద్యకేంద్రాలకు తరలించి చికిత్స అందించారు. 


స్వల్ప  లేదా అసలు లక్షణాలే చూపని బాధితులను ఇళ్లలోనే ఐసొలేషన్ లో ఉంచటణ్ వలన ఆస్పత్రులలో పడకల మీద భారం మోపకుండా చేయగలిగారు. దీనివలన తీవ్ర లక్షణాలున్నవారిమీద దృష్టి సారించటానికి, మరణాల సంఖ్యను పరిమితం చేయటానికి సాధ్యమైంది.  దీని ఫలితంగా వెంటిలేటర్లమీద ఉన్నవారు 1% లోపు, ఐసియు లో 2% లోపు,  ఆక్సిజెన్ పడకల మీద 3% లోపు నమోదయ్యారు.

ఆస్పత్రులలో చేరినవారికి సమర్థంగా చికిత్స అందించగలిగేలా దేశవ్యాప్తంగా  వాటిలో మౌలిక సదుపాయాలను కూడా బాగా పెంచారు. దీని ఫలితంగా ఈరోజు కోవిడ్ ఆస్పత్రులన్నిటిలో మౌలిక సదుపాయాలు తగినంతగా ఉన్నాయి.  ప్రస్తుతం కోవిడ్ కోసమే ప్రత్యేకించిన 1383 ఆస్పత్రులు, 3107 కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు., 10,382 కోవిడ సంరక్షక కేంద్రాలు ఉన్నాయి. వాటన్నిటిలో కలిపి మొత్తం 46,673 ఐసియు పడకలు. 21,848 వెంటిలేటర్లు ఉన్నాయి. మాస్కులకు, పిపిఇ కిట్స్ కు కూడా ఎలాంటి కొరతా లేకుండా చూస్తున్నారు. కేంద్రం ఇప్పటివరకూ 235.58 లక్షల ఎన్95 మాస్కులు, 124.26 లక్షల పిపిఇ కిట్లు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందజేసింది.

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  చూడండి. 

***


(Release ID: 1639490) Visitor Counter : 246