PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 12 JUL 2020 6:30PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • కోవిడ్‌-19 నుంచి కోలుకున్నవారి సంఖ్య 5.3 లక్షలకుపైగానే; చికిత్స పొందేవారికన్నా వ్యాధి నయమైనవారి సంఖ్య 2.4 లక్షలకుపైగా అధికం; 24 గంటల్లో కోలుకున్నవారు19 వేలకుపైగానే.
  • కోలుకునేవారి జాతీయ సగటు 62.93 శాతానికి పెరుగుదల.
  • దేశంలో ప్రస్తుతం చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2.9 లక్షలు.
  • ప్రతి 10 లక్షలమందికి స‌గ‌టున 8396.4 పరీక్షలు; ఇప్పటిదాకా 1.6 కోట్ల నమూనాల పరీక్ష.
  • తన పరిధిలోని మంత్రిత్వశాఖలలో స్వయం సమృద్ధ భారతం ప్యాకేజీ అమలు తీరును సమీక్షించిన ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌; ఈసీఎల్‌జీఎస్‌ నిధి కింద ఎంఎస్‌ఎంఈలు సహా వ్యాపారాలకు రూ.1.2 లక్షల కోట్లకుపైగా రుణాల మంజూరు.

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం:

కోలుకున్నవారి సంఖ్య 5.3 లక్షలుపైగా; చికిత్సలో 2.9 లక్షల మంది; వీరిక‌న్నా ‌కోలుకున్న‌వారి సంఖ్య 2.4 లక్షలు అధికం; 24 గంటల్లో న‌య‌మైన‌వారు 19వేలకుపైగా; ప్రతి 10 లక్షలమందికి స‌గ‌టున 8396.4 పరీక్షలు

దేశ‌వ్యాప్తంగా కోవిడ్‌-19 నుంచి గడచిన 24 గంటల్లో 19,235 మంది కోలుకోగా ఇప్ప‌టివ‌ర‌కూ వ్యాధి న‌య‌మైన‌వారి సంఖ్య 5,34,620కి పెరిగి కోలుకున్నవారి శాతం 62.93గా న‌మోదైంది. అన్నిరకాల చర్యలవల్ల కోలుకునేవారి సంఖ్య స్థిరంగా పెరుగుతూ చికిత్సలో ఉన్నవారికన్నా 2,42,362 మేర అధికంగా న‌మోదైంది. ప్రస్తుతం 2,92,258 మంది చురుకైన వైద్య ప‌ర్య‌వేక్ష‌ణలో చికిత్స పొందుతున్నారు. ఇక గ‌త 24 గంటల్లో 2,80,151 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, ఇప్ప‌టిదాకా ప‌రీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 1,15,87,153కు పెరిగింది. దీంతో ఇవాళ్టికి ప్రతి పది లక్షల జనాభాలో 8396.4 మందికి పరీక్షలు నిర్వ‌హించిన‌ట్ల‌యింది. ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ దిశ‌గా దేశ‌వ్యాప్త ప్ర‌యోగ‌శాల‌ల నెట్‌వ‌ర్క్ కూడా విస్త‌రిస్తూ ప్ర‌స్తుతం 1194కు చేర‌గా, ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యాన 850, ప్రైవేటు రంగంలో 344 అందుబాటులోకి వ‌చ్చాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638169

ఛత్తర్‌పూర్‌లోని సర్దార్ పటేల్ కోవిడ్ సంర‌క్ష‌ణ కేంద్రం-ఆస్ప‌త్రిని ప‌రిశీలించిన డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్ష‌వ‌ర్ధ‌న్ ఇవాళ న్యూఢిల్లీలోని ఛత్తర్‌పూర్‌లోగ‌ల‌ సర్దార్ పటేల్ కోవిడ్ సంర‌క్ష‌ణ కేంద్రం-ఆస్ప‌త్రిని (SPCCC)ని సందర్శించారు. ఈ సంద‌ర్భంగా ఇక్క‌డ కోవిడ్-19 నిర్వహణ స్థితిగ‌తుల‌ను ఆయ‌న సమీక్షించారు. కోవిడ్ నియంత్ర‌ణ‌పై ఢిల్లీ ప్ర‌భుత్వంతోపాటు కేంద్ర ప్ర‌భుత్వ స‌మ‌న్వ‌య కృషిలో భాగంగా రాధా స్వామి సత్సంగ్ బియాస్ (RSSB) వద్ద 10,200 పడకల సామ‌ర్థ్యంతో సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ను నిర్మించారు. ఈ సంద‌ర్భంగా అధికారులు అక్క‌డి ప‌రిస్థితుల‌ను మంత్రి నివేదించారు. ఆస్ప‌త్రిలోని మొత్తం 10,200 పడకలలో ప్రస్తుతం 2000 వినియోగంలో ఉన్న‌ట్లు తెలిపారు. ఈ కేంద్రంలో100-116 ప‌డ‌క‌ల‌తో కూడిన 88 విభాగాలుండ‌గా ప్ర‌తి రెండు విభాగాల‌నూ ఒక్కొక్క న‌ర్సింగ్ స్టేష‌న్ ప‌ర్య‌వేక్షిస్తుందని చెప్పారు. ప్ర‌స్తుతం ఈ కేంద్రంలో 20 ఎన్‌క్లోజర్లు 10 నర్సింగ్ స్టేషన్లు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ప‌ది శాతం పడకలు ఆక్సిజన్ మద్దతుగ‌ల‌వి కాగా, కోవిడ్ ప్ర‌త్యేక చికిత్స కేంద్రంలో ప్రాణవాయు స‌ర‌ఫ‌రా ఉంటుంది. ఇప్ప‌టిదాకా ఇక్క‌డ 123 మంది రోగులు చేర‌గా, వారిలో ఐదుగురిని తృతీయ ద‌శ సంరక్షణ కోసం ఇత‌ర ఆస్పత్రుల‌కు తరలించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638225

స్వ‌యం స‌మృద్ధ భార‌తం ప్యాకేజీ- ఇప్ప‌టిదాకా సాధించిన ప్ర‌గ‌తి

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారిపై జాతి పోరాటంలో భాగంగా స్థూల దేశీయోత్పత్తి(GDP)లో 10 శాతానికి స‌మాన‌మైన రూ.20 ల‌క్ష‌ల కోట్ల విలువైన ప్ర‌త్యేక ఆర్థిక-స‌మ‌గ్ర ప్యాకేజీని గౌరవనీయులైన‌ ప్రధాన‌మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 మే 12న ప్రక‌టించారు. ఈ సంద‌ర్భంగా ‘స్వ‌యంస‌మృద్ధ భార‌తం’ నిర్మాణ ఉద్య‌మం చేపడ‌దామంటూ ఆయ‌న పిలుపునిచ్చారు. అనంత‌రం ‘స్వ‌యం స‌మృద్ధ భార‌తం’ ప్యాకేజీ స్వ‌రూప‌-స్వ‌భావాల‌ను కేంద్ర ఆర్థిక‌-కార్పొరేట్ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ‌మ‌తి నిర్మలా సీతారామ‌న్ 2020 మే 13 నుంచి 17వ తేదీవ‌ర‌కు వ‌రుస‌గా ఐదు రోజుల‌పాటు విలేక‌రుల స‌మావేశాల్లో వెల్ల‌డించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల‌కు అనుగుణంగా ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెంటనే కార్య‌క్ర‌మ అమలుకు శ్రీ‌కారం చుట్టిన నేప‌థ్యంలో ఆమె క్రమం తప్పకుండా సమీక్షిస్తూ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. తదనుగుణంగా శ్రీమతి నిర్మలా సీతారామన్‌ నిర్వహించిన తాజా సమీక్షలో గణనీయ ప్రగతి నమోదైనట్లు తేలింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638228

కరోనా వైరస్‌ సమయంలో సముచిత పాఠాలు నేర్చుకున్నామా? ఆత్మశోధన చేసుకుందామని ప్రజలకు ఉప రాష్ట్రపతి పిలుపు

కోవిడ్-19 మ‌హ‌మ్మారి కార‌ణాలు-ప‌రిణామాల‌పై ఉప రాష్ట్రప‌తి వెంకయ్య నాయుడు ఫేస్‌బుక్ వేదికగా ప్ర‌జ‌ల‌తో త‌న మ‌నోభావాల‌ను పంచుకునేందుకు ఉప‌క్ర‌మించారు. ఈ మేర‌కు “కరోనా కాలంలో జీవితానుభ‌వాలు” శీర్షికతో సంభాష‌ణాపూర్వ‌క విధానంలో ఆయన చ‌ర్చ‌కు శ్రీ‌కారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్ర‌జ‌ల‌కు పది ప్రశ్నలు సంధించారు. వీటికి ల‌భించే స‌మాధానాల‌ద్వారా కోవిడ్‌-19 సంక్షోభంతో నాలుగు నెల‌ల‌పాటు ఇళ్ల‌కే ప‌రిమిత‌మైన నేప‌థ్యంలో మ‌నం నేర్చిన జీవిత పాఠాలను, జీవితంలో మార్పులపై మ‌న అంచ‌నాల‌ను నిర్ధారిస్తాయ‌ని పేర్కొన్నారు. జీవితంపై తగిన‌ అవగాహనకు, భవిష్యత్తులో ఇలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు మనం సంసిద్ధ‌మేనా? అన్నది మదింపు చేసుకోవ‌డానికీ ఈ పది సూత్రాల మాతృక ఉపకరిస్తుందని ఉప రాష్ట్రపతి వివ‌రించారు.  కోవిడ్ మహమ్మారిని ఒక వైపరీత్యంగా కాకుండా మన జీవనశైలిని సంస్కరించే దిద్దుబాటుదారుగా,  ‘సంస్కరణ కర్తగా చూడాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. జీవన విధానంపై మన భావనల్లో మార్పులు తెచ్చి ప్రకృతితో, సంస్కృతీ సంప్రదాయాలతో మనం సామరస్యపూరిత నైతిక జీవనం గడిపేలా చేసేందుకే ఇది మ‌న జీవితాల్లో ప్ర‌వేశించిన‌ట్లు భావించాల‌ని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638143

ఫిక్కీ ఫ్రేమ్స్ ముగింపు సమావేశంలో శ్రీ పీయూష్ గోయల్ ప్ర‌సంగం

అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందగల ప్రతిభ, అవకాశాలు భారత చలన చిత్ర- ప్రకటనల పరిశ్రమకు ఉన్నాయని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. వారు నాణ్యమైన ఉత్పత్తులను రూపొందించగలరని, పురస్కారాలను సాధించవచ్చునని, పరిశ్రమకు మరింత పెట్టుబడులను, మూలధనాన్ని ఆకర్షించవచ్చునని చెప్పారు. జాతీయ సరిహద్దులకు మించి వృద్ధి చెందాలని ఆయన పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చారు. కోవిడ్‌ మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఆరోగ్యపరమైన ముందు జాగ్రత్తలపై నాలుగు నెలలపాటు ప్రజల్లో అవగాహన పెంచడంలో భారత చలనచిత్ర పరిశ్రమ కీలకపాత్ర పోషించిందని ప్రశంసించారు. కోవిడ్‌ సంక్షోభం ఇప్పుడు మనముందున్నదని, మునుపటి పలు సంక్షోభాల తరహాలోనే ఇదీ సమసిపోతుందని శ్రీ గోయల్‌ అన్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్‌ అనంతర ప్రపంచంలో పనివిధానాలు, జీవనశైలి అనేక మార్పులకు లోనుకాగలవని, ఆ మేరకు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సంసిద్ధమవుదామని పిలుపునిచ్చారు. ఈ మలుపును అధిగమించే దిశగా వినూత్నంగా ఆలోచించడం అవసరమని, అలాగే నిరంతర ఆవిష్కరణల వైపు సాగాలని చెప్పారు. ఈ క్రమంలో తగు జాగ్రత్త అవసరమే అయినా, లేనిపోని భయాలు మనల్ని వెనక్కులాగకుండా చూసుకోవాలని సూచించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638079

ప్రపంచ జనాభా దినోత్సవం నేపథ్యంలో కుటుంబ నియంత్రణ ఒక మానవ హక్కుల అంశమని నొక్కిచెప్పిన డాక్టర్‌ హర్షవర్ధన్‌

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన వాస్తవిక-సాదృశ సమావేశానికి కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ అధ్యక్షత వహించారు. “ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహణ చాలా ముఖ్యం... జనాభా స్థిరీకరణ ప్రాముఖ్యాన్ని, జనావళి భవిష్యత్తుతోపాటు ప్రజారోగ్యంలో అది పోషించే కీలక పాత్రను ఈ కార్యక్రమం నొక్కి చెబుతుంది” అని డాక్టర్‌ హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. “కోవిడ్‌-19 మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో పునరుత్పత్తి సంబంధిత ఆరోగ్య సేవలను అందించడంలోని ప్రాముఖ్యాన్ని గుర్తించడం కూడా ఇప్పుడు కీలకమన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638065

‘రండి.. భార‌త్‌లో ఆవిష్క‌ర‌ణలు చేద్దాం’... ప్ర‌వాస భారత‌ విద్యార్థుల‌కు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పిలుపు

ప్ర‌పంచంలోని వివిధ అగ్రశ్రేణి విశ్వ‌విద్యాలయాల్లో చ‌దివే ప్ర‌వాస భారత విద్యార్థులు స్వ‌దేశం త‌ర‌లివ‌చ్చి వినూత్న‌ ఆవిష్క‌ర‌ణ‌లు చేపట్ట‌డంతోపాటు అందిరాగ‌ల అవ‌కాశాల‌ను అన్వేషించాల‌ని కేంద్ర పెట్రోలియం-సహజవాయువు, ఉక్కు శాఖల‌ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు. “భారత్‌లో మారుమూల‌కూ ఇంధ‌న ల‌భ్య‌త‌”పై నిన్న విదేశాల్లోని చురుకైన యువ భారత మేధావులు, విద్యార్థులు, మిత్రుల బృందంతో ఆయ‌న సంభాషించారు. ప్రస్తుత కోవిడ్ ప‌రిస్థితుల గురించి శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ- “మ‌న‌మిప్పుడు కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి న‌డుమ సాగుతున్నాం. మ‌న జీవిత మౌలిక భావనలనే ఇది నేడు స‌వాలు చేస్తోంది. దీని త‌క్ష‌ణ ప్ర‌భావం ఆర్థిక వ్య‌వ‌స్థను మంద‌గింపజేసినా కాస్త విరామంతో పున‌రాలోచించి, పున‌ర్నిర్మాణం చేసుకునే అవ‌కాశాన్ని కూడా ఈ మ‌హ‌మ్మారి క‌ల్పించింది” అని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638144

 

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • పంజాబ్: రాష్ట్రంలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న  దృష్ట్యా విశ్వవిద్యాలయ/కళాశాల పరీక్షలను రద్దు చేయాలన్న జూలై 3నాటి తమ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అనుమతి కోరుతూ పంజాబ్ ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాశారు. ఆ మేరకు సెప్టెంబర్ నాటికి తుది పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించడంపై నిర్ణయాన్ని పునఃపరిశీలించేలా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖతోపాటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కు సూచించాలని ప్రధానమంత్రిని కోరారు.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో పర్యాటకులకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లోని పర్యాటక యూనిట్లను ప్రారంభించడంపై పర్యాటక-పౌర విమానయాన శాఖ ప్రామాణిక విధాన ప్రక్రియను జారీచేసింది. ఆ మేరకు హిమాచల్ ప్రదేశ్ సందర్శించదలిచే పర్యాటకులు సదరు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. తదనుగుణంగా పర్యాటక విభాగం పోర్టల్‌ “Covid-19 e-pass.hp.gov.in”లో 48 గంటలముందు వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. అంతేకాకుండా కోవిడ్‌ సోకలేదని ఐసీఎంఆర్ ఆమోదిత ప్రయోగశాల జారీచేసిన ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకురావాలి. అయితే, ఇది వారు రాష్ట్రంలో ప్రవేశించే  మూడు రోజుల ముందు జారీచేసినదై ఉండాలి. దీంతోపాటు పర్యాటకులు తమ మొబైల్‌లలో ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • కేరళ: రాష్ట్రంలో కోవిడ్-19తో బాధపడుతున్న ఇడుక్కి స్థానిక మహిళ ఈ ఉదయం ఎర్నాకుళంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించింది. యాంటిజెన్ పరీక్షపై వదంతులను నమ్మవద్దని ఆరోగ్యశాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కాగా, రాష్ట్రంలో నిన్న 488 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 234 పరిచయం ద్వారా సోకినట్లు తేలింది. ప్రస్తుతం 3,442 మంది చికిత్స పొందుతుండగా  వివిధ జిల్లాల్లో 1,82,050 మంది నిఘాలో ఉన్నారు.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 81 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 1,418కి పెరిగింది; ప్రస్తుతం 661 మంది చికిత్స పొందుతున్నారు. ఇక తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రామాణిక విధాన ప్రక్రియను జారీచేసింది. తుది సెమిస్టర్ పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ మూల్యాంకనంపై సొంత విధానం రూపొందించుకునేలా రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కాగా, మదురైలో దిగ్బంధాన్ని ప్రభుత్వం జూలై 14వరకు పొడిగించింది. అటుపైన జూన్ 24 వరకు అమలయ్యే దిగ్బంధం నిబంధనలు జూలై చివరివరకు అమల్లో ఉంటాయి. రాష్ట్రంలో నిన్న 3965 కొత్త కేసులు, 69 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,34,226; యాక్టివ్‌ కేసులు: 46,410; మరణాలు: 1898; చెన్నైలో చురుకైన కేసులు: 17,989గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం దిగ్బంధం అమలు చేయబడింది. మరోవైపు బెంగళూరు అర్బన్‌- గ్రామీణ జిల్లాల్లో జూలై 14 నుంచి 22వరకు దిగ్బంధం అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది; దీనిపై రేపు మార్గదర్శకాలు జారీకానున్నాయి. ఇక రాష్ట్రంలో పీపీఈ కిట్లు, హస్త పరిశుభ్రకాలు, ఐవీ ద్రవాలను ప్రస్తుత మార్కెట్ ధరకన్నా ఎక్కువకు కొనుగోలు చేయడాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ సమర్థించుకుంది. మహమ్మారి సమయంలో ధరలు గతిశీలంగా ఉంటాయని ఈ సందర్భంగా చెప్పారు. కాగా, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సి.టి.రవికి కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. రాష్ట్రంలో నిన్న 2798 కొత్త కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం బెంగళూరు నగరంలో 1533 కేసులుండగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు: 36,216; యాక్టివ్‌ కేసులు: 20,883; మరణాలు: 613గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని తిరుపతిలోగల అలిపిరివద్ద 1704, తిరుమలలో 1,865 నమూనాలను పరీక్షించగా, తిరుమల-తిరుపతి దేవస్థానం సిబ్బందిలో 91మందికి కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కేసులు ఎక్కువగా నమోదవుతున్న 97 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను  జూలై 20నుంచి అమలు చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఇక రాష్ట్రంలోని కళాశాలలు 196 పనిదినాలతో ఆగస్టు 3నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే సీబీఎస్‌ఈ తరహాలో 2020-21 విద్యా సంవత్సరంలో పాఠ్యాంశాల్లో 30 శాతం తగ్గించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 17,624 నమూనాలను పరీక్షించగా, 1933 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే 846మంది డిశ్చార్జి కాగా, 19 మంది మరణించారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 29,168; యాక్టివ్‌ కేసులు: 13,428; మరణాలు: 328; డిశ్చార్జ్: 15,412గా ఉన్నాయి.
  • తెలంగాణ: హైదరాబాద్‌లోని కోవిడ్‌ ప్రత్యేక చికిత్స కేంద్రమైన గాంధీ ఆస్పత్రిని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆదివారం సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. మహమ్మారిపై పోరాటంలో వైద్యులతోపాటు ఇతర సిబ్బందికి కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా, రాష్ట్రంలోని కోవిడ్-19 రోగులలో దాదాపు 83 శాతం రోగలక్షణాలు కనిపించని లేదా స్వల్ప లక్షణాలుగలవారు లేదా ఏకాంత గృహచికిత్స పొందుతున్నవారే. దీంతో ప్రభుత్వం ఏకాంత గృహచికిత్స కిట్ల పంపిణీ ప్రారంభించింది. రాష్ట్రంలో నిన్నటిదాకా నమోదైన మొత్తం కేసులు: 33,402; యాక్టివ్‌ కేసులు: 12,135; మరణాలు 348; డిశ్చార్జి అయినవి: 20,919గా ఉన్నాయి.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలోని ఇటానగర్ క్యాపిటల్ కాంప్లెక్స్‌ను జూలై 20 వరకు దిగ్బంధించడంపై ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలు జారీచేసింది. నిర్దేశిత సేవలు మినహా వ్యాపార సంస్థలు తెరవడంతోపాటు వాహనాల రాకపోకలపై నిషేధం అమలులో ఉంటుంది. ఇక అన్ని మతపరమైన సంస్థలు మూసివేయబడిన నేపథ్యంలో ఇటానగర్ క్యాపిటల్ కాంప్లెక్స్‌లో జూలై 20 వరకు ఏ మత సమ్మేళనానికీ అనుమతి లేదు.
  • అసోం: రాష్ట్రంలోని జీఎంసీహెచ్‌ కోవిడ్‌ సంరక్షణ కేంద్రం ఐసీయూలో చేర్చిన ముగ్గురు రోగులు ఇవాళ ప్రాణాలు కోల్పోయారు.
  • మణిపూర్: రాష్ట్రంలోని తౌబాల్ వద్ద 100 పడకల కోవిడ్‌ సంరక్షణ కేంద్రం ప్రారంభమైంది. దీంతో జిల్లాలో కోవిడ్‌ తక్షణావసరాలను ఈ కేంద్రం తీర్చనుంది.
  • మేఘాలయ: రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య ప్రస్తుతం 248కి చేరగా, వీరిలో బిఎస్ఎఫ్ జవాన్లు 178మంది ఉన్నారు. కాగా, ఇప్పటివరకూ 45 మంది కోలుకున్నారు.
  • మిజోరం: రాష్ట్ర గవర్నర్‌ (2020 జూన్‌ నెల జీతంలో 30శాతం) రూ.1,05,000/ మొత్తాన్ని మిజోరం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో గత 25 రోజులుగా కోవిడ్-19వల్ల సంభవించే మరణాలు ప్రతి ఐదోరోజు 1,000 వంతున పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా మరణాల సంఖ్య 10,116 కాగా, ప్రాణనష్టం విషయంలో మహారాష్ట్ర దేశంలోని ఇతర రాష్ట్రాలకన్నా అగ్రస్థానంలో ఉంది. ఇక గత 24గంటల్లో 8,139 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 2,46,600కు చేరింది. వీటిలో యాక్టివ్‌ కేసులు 91,457గా ఉన్నాయి. మరోవైపు ధారవి ప్రాంతంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అనుసరించిన వ్యాధి నియంత్రణ వ్యూహాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రశంసించింది.
  • గుజరాత్: రాష్ట్రంలో 872 కొత్త కేసులతో శనివారం సాయంత్రానికి మొత్తం కేసుల సంఖ్య  41,027కు చేరగా, ప్రస్తుతం 10,308 మంది చికిత్స పొందుతున్నారు. ఆ మేరకు గుజరాత్‌లోని మొత్తం కేసులలో యాక్టివ్‌ కేసులు 25శాతంగా ఉన్నాయి. వీరిలో కొందరు ఇళ్లలో చికిత్స పొందుతుండగా, మరికొందరు ఆసుపత్రులలో కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కేసులలో కోలుకుని ఇళ్లకు వెళ్లినవారు 70 శాతం కాగా, మరణాలు 5 శాతంగా ఉన్నాయి.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ 153 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 23,901కి చేరింది. వీటిలో 5,492 యాక్టివ్‌ కేసులు కాగా, 507 మరణాలు సంభవించినట్లు మధ్యప్రదేశ్‌ ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, కొత్త కేసులలో గరిష్ఠంగా 42 అల్వార్ జిల్లాలో నమోదయ్యాయి.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో శనివారం అత్యధికంగా 544 కేసులు నమోదవగా మొత్తంకేసులు 17,201కి చేరాయి. ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 12,679 కాగా, 3878 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కాగా, కొత్త కేసులలో మొరెనా నుంచి (101) గరిష్ఠంగా నమోదవగా, ఇండోర్ (89 కేసులు), భోపాల్ (72 కేసులు), గ్వాలియర్ (58 కేసులు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో 65 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,897కు చేరగా, ప్రస్తుతం 810 మంది చికిత్స పొందుతున్నారు.
  • గోవా: గోవాలో 117 కొత్త కేసులతో మొత్తం కేసులు 2,368కి చేరాయి. ఇప్పటిదాకా 12 మంది మరణించగా, ప్రస్తుతం 928మంది చికిత్స పొందుతున్నారు.

 

*****



(Release ID: 1638236) Visitor Counter : 238