ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కుటుంబ నియంత్రణను మానవ హక్కుల సమస్యగా నొక్కి చెప్పిన డాక్టర్ హర్ష్ వర్ధన్

- కోవిడ్‌యేత‌ర సేవ‌ల‌కు దీనిని తప్పనిసరి చేయ‌డాన్ని ప్రశంసించారు

- “కుటుంబ నియంత్రణను ఆర్ఎంఎన్‌సీఏహెచ్ ప్ల‌స్ ఎన్ కార్య‌క్ర‌మంలో ప్రధాన భాగంలో ఉంచే వ్యూహం విజయవంతమైంది”

- “‌2019లో గర్భనిరోధక మందుల వాడకం 5.5 కోట్ల అవాంఛిత‌ గర్భాలు, 1.1 కోట్ల జననాల‌ను, 18 లక్షల అసురక్షిత గర్భస్రావాల్ని, 30,000 మేర‌ ప్రసూతి మరణాలను నివారించడానికి సహాయపడింది"

Posted On: 11 JUL 2020 6:25PM by PIB Hyderabad

 

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (హెచ్ఎఫ్‌డ‌బ్ల్యూ) మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఈ రోజు న్యూఢిల్లీలో దృశ్య మాధ్య‌మిక వేదిక‌పై సమావేశం నిర్వ‌హించారు. మంత్రి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశంలో హెచ్ఎఫ్‌డ‌బ్ల్యూ శాఖ స‌హాయ మంత్రి శ్రీ అశ్విన్ కుమార్ చౌబే కూడా ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తూ డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడారు. "ప్రపంచ జనాభా దినోత్సవాన్ని స్మరించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది జనాభా స్థిరీకరణ యొక్క ప్రాముఖ్యతను.. ప్రజల భవిష్యత్తును మరియు వారి ఆరోగ్యం విష‌యంలో కీలక పాత్రను ఇది నొక్కి చెబుతుంది" అని అన్నారు. కోవిడ్ -19 మహమ్మారి ఎదుర్కొంటున్న సవాళ్ల కారణంగా పునరుత్పత్తి ఆరోగ్య సేవలను అందించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం ఇప్పుడు మరింత క్లిష్టంగా మారింది అని అన్నారు.
భర్తీ స్థాయి సంతానోత్పత్తికి చేరువలో..
ఆర్ఎంఎన్‌సీఏహెచ్ ప్ల‌స్ ఎన్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావ‌డాన్ని మంత్రి ఈ సంద‌ర్భంగా ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. కుటుంబ నియంత్రణను ఆర్ఎంఎన్‌సీఏహెచ్ ప్ల‌స్ ఎన్ కార్య‌క్ర‌మంలో ప్రధాన భాగంలో చేర్చే వ్యూహం ఈ కార్య‌క్ర‌మం విజయవంతం చేయ‌డానికి దోహ‌దం చేసింద‌ని అన్నారు. “గత దశాబ్దంలోనే మన క్రూడ్ బ‌ర్త్ రేటు (సీబీఆర్) 21.8 (ఎస్‌ఆర్‌ఎస్ 2011) నుండి 20కి (ఎస్‌ఆర్‌ఎస్ 2018) తగ్గగా, మొత్తం ఫెర్టిలిటీ రేట్ (టీఎఫ్‌ఆర్) 2.4 (ఎస్‌ఆర్‌ఎస్ 2011) నుండి 2.2 (ఎస్‌ఆర్‌ఎస్ 2018) కు తగ్గింది. టీనేజ్ సంతానోత్పత్తి 16 (ఎన్ఎఫ్‌హెచ్ఎస్ III) నుండి 7.9 (ఎన్ఎఫ్‌హెచ్ఎస్ IV) కు సగానికి తగ్గింది” అని అన్నారు. ఈ ప్రయత్నాల‌తో  భారతదేశం భర్తీ స్థాయి సంతానోత్పత్తికి  చేర్చ‌గ‌లిగిన‌ట్టుగా వివ‌రించారు. దేశంలోని 36 రాష్ట్రాలు/ ‌కేంద్ర ‌పాలిత ప్రాంతాల‌లో 25 ఇప్ప‌టికే భర్తీ స్థాయి సంతానోత్పత్తికి చేరువ‌య్యాయ‌ని తెలిపారు. గౌరవనీయులైన ప్రధాన మంత్రి నిబద్ధత మేర‌కు స్వచ్ఛ భారత్ అభియాన్ సామాజిక ఉద్యమంగా రూపాంతరం చెందిన విధంగానే జనాభా స్థిరీకరణ మిషన్‌ను సమాన శక్తివంతమైన ఒక ప్ర‌జ‌ల ఉద్యమంగా మార్చాలని ఆయన విజ్ఞ‌ప్తి చేశారు.
కుటుంబ నియంత్రణతో మహిళలకు గౌరవం..
దేశంలో కుటుంబ నియంత్రణ మహిళలకు గౌరవాన్ని అందిస్తుంద‌ని అన్నారు ముఖ్యంగా పేదలు మరియు అట్టడుగున ఉన్న మ‌హిళ‌ల‌కు గౌర‌వాన్ని అందించ‌గ‌ల‌దని తెలిపారు. ఇది లింగ సమానత్వం, తల్లి మరియు పిల్లల ఆరోగ్యం, పేదరిక నిర్మూలన మరియు మానవ హక్కుల ప్రచారం కోసం మా ప్రయత్నాలకు మూలస్తంభంగా నిలుస్తుంద‌ని తెలిపారు. ప్ర‌పంచ కుటుంబ నియంత్ర‌ణ -2020 ఉద్యమంలో భారతదేశం ఒక ప్రాథమిక భాగం అని డాక్టర్ హర్ష్ వర్ధన్ అన్నారు. “ప్రతిష్టాత్మక కుటుంబ నియంత్ర‌ణ -2020 లక్ష్యాలను సాధించేందుకు గాను భారత ప్రభుత్వం గణనీయమైన దేశీయ నిధులను పెట్టుబడి పెట్టింది. కుటుంబ నియంత్రణలో ప్రధాన కార్యక్రమాలలో మిషన్ పరివర్ వికాస్, ఇంజెక్షన్ కాంట్రాసెప్టివ్ ఎంపీఏ, ఫ్యామిలీ ప్లానింగ్- లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎల్‌ఎంఐఎస్), ఫ్యామిలీ ప్లానింగ్ కమ్యూనికేషన్స్ క్యాంపెయిన్ ఉన్నాయి. జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం “అంత‌రా” కార్యక్రమంలో భాగంగా ఇంజెక్ట్ చేయదగిన గర్భనిరోధకాన్ని ప్రజారోగ్య వ్యవస్థలో ప్రవేశపెట్ట‌డ‌మైంది. ఈ త‌ర‌హా గర్భనిరోధకం అత్యంత ప్రభావవంతమైనది మరియు దంప‌తుల మారుతున్న అవసరాలను తీర్చగలదు మరియు మహిళలు త‌మ సంతానం మ‌ధ్య అంత‌రం ఉండేలా చూసుకొనేందుకు కూడా ఇది స‌హాయప‌డుతుంది.” “ట్రాక్ 20 అంచనాల ప్రకారం, 2019 ఏడాది గర్భనిరోధకాల‌ వాడకం ఫలితంగా దాదాపుగా 5.5 కోట్ల అవాంఛిత‌ గర్భాల‌ను, 1.1 కోట్ల జననాల‌ను, 18 లక్షల మేర అసురక్షితమైన‌ గర్భస్రావాల‌ను మరియు 30,000 ప్రసూతి మరణాలను నివారించ‌డం పరంగా
ఈ పెట్టుబడి మాకు ఎంతో గొప్ప డివిడెండ్లను చెల్లించింది.” అని మంత్రి వెల్ల‌డించారు.
ఎబీ-హెచ్‌డ‌బ్ల్యూసీ మొబైల్ యాప్ ఆవిష్క‌ర‌ణ‌..
కుటుంబ నియంత్రణ ద్వారా లభించే ప్రయోజనాలపై మంత్రి అశ్విని కుమార్ చౌబే మాట్లాడుతూ “కుటుంబ నియంత్రణ జనాభాను స్థిరంగా ఉంచడమే కాకుండా మహిళలు, కుటుంబాలు మరియు సమాజాలకు మంచి ఆరోగ్యాన్ని కల్పించడంలో సహాయపడుతుంది. జనాభా స్థిరీకరణ గరిష్ట జనాభా అభివృద్ధికి వనరులు అందుబాటులో ఉండ‌టాన్ని ఇది నిర్ధారిస్తుంది. ప్రస్తుతం భారతదేశానికి ఇది చాలా ముఖ్యం, దేశ జనాభాలో దాదాపు 50 శాతం 15-49 సంవత్సరాల పునరుత్పత్తి వయస్సులో ఉన్నారు” అని తెలిపారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఎబీ-హెచ్‌డ‌బ్ల్యూసీ మొబైల్ అప్లికేషన్‌ను ఆరోగ్య మంత్రి ఆవిష్క‌రించారు. దేశంలో ఎబీ-హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లలో డేటా రిపోర్టింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ఈ యాప్ రూపొందించబడింది. ఇప్ప‌టికే వివిధ రాష్ట్రాలు, జిల్లాలు వినియోగిస్తున్న ఎబీ-హెచ్‌డ‌బ్ల్యూసీ పోర్టల్‌కు ఇది కొన‌సాగింపు చ‌ర్య‌. ఇది ఎబీ-హెచ్‌డ‌బ్ల్యూసీలలో వివిధ సేవా వినియోగానికి సంబంధించిన డేటాను రియల్ టైమ్ పనితీరు పర్యవేక్షణకు మరియు ప్రణాళికకు ఇది ఒక సాధనంగా ఉప‌యోగ‌ప‌డ‌నుంది.
ఇది పరీక్షించబడిన వ్యక్తులపై నిజ సమయ సమాచారాన్ని అందిస్తుంది, ఆరోగ్య సేవలు మరియు ఔషధాల పంపిణీ, ఫుట్‌ఫాల్స్ మరియు పీహెచ్‌సీలకు చేసిన రిఫరల్స్ గురించి తెలియ‌జేస్తుంది. ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ కార్మికులపై కోవిడ్‌-19 అదనపు బాధ్యతలను విధించిందని పేర్కొన్న కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్, కోవిడ్ -19 మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి అవిశ్రాంత సేవలు చేసినందుకు హెచ్‌డ‌బ్ల్యూసీని ప్రశంసించారు. కోవిడ్‌యేత‌ర ముఖ్యమైన ఇత‌ర సేవలు అత్య‌ధికంగా ప్రభావితం కాకుండా చేస్తుండ‌డాన్ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తుతించారు. హెచ్‌డ‌బ్ల్యూసీ
కార్య‌ద‌ర్శి ప్రీతి సుదాన్, ఎంఓహెచ్‌డ‌బ్ల్యూసీ ఓఎస్‌డీ శ్రీ రాజేష్ భూషణ్‌తో పాటు ఎన్‌హెచ్‌ఎం మిషన్ డైరెక్టర్ శ్రీమతి వందన గుర్నాని ఆర్‌సీహెచ్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ మనోహర్ అగ్నాని ఇతర సీనియర్ అధికారులు ఈ కార్య‌క్ర‌మంలో
పాల్గొన్నారు. ఆయా కార్య‌క్ర‌మాల అభివృద్ధి భాగ‌స్వాము‌లు వర్చువల్ మాధ్యమాల ద్వారా ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు.

 

****



(Release ID: 1638065) Visitor Counter : 239