ఉప రాష్ట్రపతి సచివాలయం
కరోనా కాలంలో సరైన జీవిత పాఠాలే నేర్చుకున్నారా? ప్రజలకు ఉపరాష్ట్రపతి ప్రశ్న
ఆత్మశోధనకోసం పది సూత్రాల మాతృకను సూచించిన వెంకయ్యనాయుడు
కరోనా మహమ్మారిని ‘సంస్కరణ కర్త’ గా పరిగణించాలని సూచన
Posted On:
12 JUL 2020 11:02AM by PIB Hyderabad
కరోనా వైరస్ బందంలో చిక్కుకున్న గత కొన్ని నెలల కాలంలో మనం గడిపిన జీవితంపై ప్రజలంతా ఆత్మశోధన చేసుకోవాలని, తాము సరైన జీవిత పాఠాలు నేర్చుకున్నామో లేదో తమకు తాముగా అంచనా వేసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్బోధించారు. అనూహ్యంగా ఎదురయ్యే అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన సన్నద్ధతతో ఉన్నామా? అన్నది తమంతట తాము తరచి చూసుకోవాలని కూడా వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
కోవిడ్-19కు కారణాలు, పర్యవసానాలపై ప్రజలతో తన భావనలు పంచుకునేందుకు వెంకయ్య నాయుడు ఫేస్ బుక్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు. “కరోనా కాలంలో జీవిత భావనలు” అన్న శీర్షికతో ఆయన తన అభిప్రాయాలను సంభాషణా శైలిలో వ్యక్తపరిచారు.
ఈ సందర్భంగా ఆయన ఫేస్ బుక్ లో పది ప్రశ్నలను సంధించారు. ఈ ప్రశ్నలకు లభించే సమాధానాలే పలు జీవిత పాఠాలను నేర్పుతాయి. కోవిడ్-19 సంక్షోభంతో ఇళ్లకే పరిమితమైన గత నాలుగు నెలల్లో నేర్చుకున్న జీవిత పాఠాలను, జీవితంలో మార్పులను మదింపు చేసుకునేందుకు ఈ ప్రశ్నలు దోహదపడతాయి. జీవితంపై తగినంత అవగాహన కల్పించుకునేందుకు, భవిష్యత్తులో ఇలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధంగానే ఉన్నామా? అన్నది మదింపు చేసుకునేందుకు ఈ పది సూత్రాల మాతృక ఉపకరిస్తుందని ఉపరాష్ట్రపతి చెప్పారు.
కోవిడ్ వైరస్ మహమ్మారిని కేవలం ఒక వైపరీత్యంగా మాత్రమే పరిగణించరాదని, మన జీవన శైలిని సంస్కరించే ‘దిద్దుబాటుదారు’గా, ‘సంస్కరణ కర్త’ గా చూడాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. జీవన విధానంపై మనకు ఉన్న భావనల్లో మార్పులు తీసుకువచ్చి, ప్రకృతితో, సంస్కృతీ సంప్రదాయాలతో మనం సామరస్య పూరితమైన నైతిక జీవనం గడిపేలా చూసేందుకే ఈ మహమ్మారి వచ్చినట్టుగా భావించవలసి ఉంటుందని అన్నారు. మనం ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవనం గడిపేందుకు ఎప్పటికప్పుడు ఇలాంటి మార్పులు అవసరమని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.
‘కరోనా కాలంలో జీవిత భావనలు’ పేరిట ఫేస్ బుక్ లో తాను వ్యక్తం చేసిన అభిప్రాయాలు జీవిత లక్ష్యాలను సరైన పద్ధతిలో నిర్వచించడానికే అని ఆయన స్పష్టంచేశారు. ప్రకృతితో కలసి సామరస్య పూరితంగా మనుగడ సాగించడానికి వీలుగా వేగవంతమైన ఆధునిక జీవన విధానంలో తగిన మార్పులు చేసుకోవలసిన అవసరాన్ని కూడా ఉపరాష్ట్రపతి ప్రధానంగా తెలియజెప్పారు.
ఎలాంటి ఆతురతకు తావులేని జీవన విధానానికి ఆయన పలు సూచనలు చేశారు. సరైన ఆలోచనా విధానం, జీవన విధానం, ఆరోగ్యవంతమైన జీవితంకోసం ఆహారాన్ని ఔషధంగా పరిగణించడం, ఇహలోక కార్యకలాపాలకు అతీతంగా ఆధ్యాత్మిక జీవన కోణాన్ని స్పశించడం, మంచీ చెడూ విచక్షణను తెలుసుకోవడం,ఇతరులపట్ల సామాజిక బాధ్యతగా మెలగడం, సామాజిక బంధంతో ఒక అర్థవంతమైన జీవన విధానాన్ని అలవరుచుకోవడం వంటి సూచనలను ఉపరాష్ట్రపతి తన ఫేస్ బుక్ పోస్టులో పొందుపరిచారు.
తరచుగా తలెత్తుతున్న వైపరీత్యాలకు గల కారణాలను గురించి వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా ప్రస్తావించారు. “ఈ భూగోళానికి మన అవసరం లేదు. మనకే భూగోళంతో అవసరం ఉంది. మొత్తం భూగోళం మానవులకోసమే అన్నట్టుగా మానవులు పెత్తనం చలాయించడంవల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది. పలు రకాల ప్రతికూల పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి” అని ఆయన అభిప్రాయపడ్డారు.
కరోనా కాలంలో ఎదురైన అనుభవాలు పునాదిగా జీవితంపై మరింత స్వయంశోధన కోసం ఉపరాష్ట్రపతి 10 సూత్రాల మాతృక మరెన్నో సూచనలు చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తికి కారణాలేమిటో తెలుసుకుని, జీవన విధానాన్ని మార్చుకునేందుకు సిద్ధపడినవారు తల్లిదండ్రుల, పెద్దల సంరక్షణలో తాము చేస్తున్న తప్పులేమిటో గుర్తించారని, తదుపరి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనడానికి సన్నద్ధమయ్యారని, తమ జీవన ధర్మాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని పొందారని, తాము ఇన్నాళ్లూ కోల్పోయిందేమిటో తాము ఇళ్లకే పరిమితమైనపుడు గుర్తించారని ఈ సూత్రాల్లో ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
సమాజంలోని కొన్ని వర్గాలపై ఈ మహమ్మారి చూపించిన ప్రతికూల ప్రభావాన్ని గురించి కూడా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. “మనమంతా సమానులుగా పుట్టాం. కాలం గడుస్తున్న కొద్దీ చివరకు సమానత్వంలో భేదాలు తలెత్తాయి. కొన్ని వర్గాల ప్రజల కష్టాలను, కడగండ్ల తీవ్రతను ఈ మహమ్మారి ఎత్తిచూపింది. అది అవి ఆయా వర్గాల ప్రజల స్వయంకృతం కానేకాదు. వారి కష్టాలను తీర్చవలసిన అవసరం ఉంది. జీవితంలో మీరు అనుసరిస్తున్న మార్గాలే ఇతరుల కష్టాలు పెరగడానికి కారణాలు.” అని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.
లార్వాగా జీవితంలో మందగమనం పాటించి, ఆ తర్వాత కోశస్థదశనుంచి అందమైన రూపంతో సీతాకోక చిలుక ఎదిగినట్టుగానే, ప్రజలు కూడా ప్రస్తుత సంక్షోభ సమయంలో సరైన జీవనపాఠాలు నేర్చుకుని సురక్షితమైన జీవనంకోసం సీతాకోక చిలుకల్లాగా ఎదగాలని ఉపరాష్ట్రపతి ఉద్బోధించారు.
***
(Release ID: 1638143)
Visitor Counter : 277