ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

చత్తార్ పూర్ లోని సర్దార్ పటేల్ కోవిడ్ సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి డాక్టర్ హర్షవర్ధన్

వైద్య సిబ్బంది, ఐటిబిపి నిస్వార్థ సేవలకు ప్రశంసలు

Posted On: 12 JUL 2020 5:08PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు  న్యూ ఢిల్లీలోని చత్తార్ పూర్ కొవిడ్ కేర్ సెంటర్ ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న కోవిడ్ చికిత్స తీరుతెన్నులను సమీక్షించారు. కోవిడ్ మీద పోరులో భాగంగా ఢిల్లీ చత్తార్ పూర్ లోని రధ స్వామి సత్సంగ్ బియాస్  10,200 పడకల సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ ( ఎస్ పి సి సి సి)  ను రూపు దిద్దిన సంగతి తెలిసిందే.

ఈ పర్యటనలో భాగంగా మంత్రి అక్కడ జరుగుతున్న చికిత్సను, అందుతున్న ఇతర సేవలను సమీక్షించారు. అక్కడి వంటశాలను, స్టోర్స్ ను కూడా మంత్రి పరిశీలించారు. ఈ ఆరోగ్య కేంద్రంలో నేచురోపతి తో బాటు ఆయుర్వేద వైద్య విధానాన్ని అనుసరిస్తూ బాధితుల రోగ నిరోధకశక్తి పెంచే చత్యలు తీసుకుంటున్నారు. ఉదయాన్నే ఆయుర్వేద కషాయం ఇవ్వఅంతోబాటు ఆహార నిపుణుల సూచనలకు అనుగుణంగా ఆహారం అందిస్తారు. రాత్రికి పసిపు వెసిన పాలు ఇవ్వటంతో అది పూర్తవుతుంది. పిపిఇ కిట్ ధరించిన ఆరోగ్య మంత్రి అక్కడ చికిత్స పొందుతున్న 12 మంది బాధితులతో మాట్లాడారు. వారి మంచీ చెడ్డా, సౌకర్యాలను, అందుతున్న వైద్యాన్ని అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, ఆరోగ్యకరమైన వాతావరణం, టాయిలెట్ల నిర్వహణ వంటి విషయాల గురించి కూడా తెలుసుకున్నారు. బాధితులు ఈ విషయాలన్నిటిలో పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్ హర్ష వర్ధన్ అక్కడి నర్సింగ్ కేంద్రాలను కూడా సందర్శించి వైద్యులు, నర్సింగ్, శానిటేషన్ కార్మికులు సిబ్బంది అందిస్తున్న నిస్వార్థ సేవలను కొనియాడారు.  

ఒకప్పుడు కోవిడ్ సోకి చికిత్స అనంతరం కోలుకున్న 30 మంది ఆ కేంద్రంలో కోవిడ్ వాలంటీర్లుగా పనిచేస్తుండగా మంత్రి వారితో కూడా సంభాషించారు. వాళ్ళను కోవిడ్ యోధులుగా అభివర్ణిస్తూ అంకిత భావంతో అందిస్తున్న సేవలకు అభినందనలందజేశారు. ఈ కేంద్రం ప్రత్యేకత ఏంటంటే     స్థానికులు, కొందరు దాతల సహకారంతో ఇది నడుస్తోంది. విరాళాలు, వస్తువులు, పడకలు, ఆక్సిజెన్ సిలిండర్ల రూపంలో దాతలు సహకరిస్తున్నారు.

అనంతరం కేంద్ర మంత్రికి  అక్కడి పరిస్థితిని వివరించారు. ఇప్పటికే ఈ కేంద్రంలో  మొత్తం 10200 పడకలు ఉండగా ప్రస్తుతం అక్కడ 2000పడకలు వాడకంలో ఉన్నాయి. మొత్తం 88  హాల్స్ ఉండగా ఒక్కో హాలులో 100-116 వరకు పడకలు సిద్ధం చేశారు. ప్రతి రెండు హాల్స్ కూ ఒకటి చొప్పున నర్సింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 20 హాల్స్ కు గాను 10 నర్సింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. పడకల్లో 10% ఆక్సిజెన్ తో కూడిన  పూర్తిస్థాయి కోవిడ్ చికిత్సా కేంద్రాలకు కేటాయించారు. అందులో123 మంది బాధితులను చేర్చగా వాళ్లలో ఐదుగురు దీర్ఘ కాల రోగాలున్న వారిని చికిత్స నిమిత్తం తరలించారు.  

శిక్షణ పొందిన వారితో ఆరోగ్య కేంద్రంలో సైకలాజికల్ కౌన్సిలింగ్, సైకియాట్రీ సేవలు కుడా అందిస్తున్నారు. బాధితులకు ధ్యానం, యోగా తరగతులు నిర్వహించటంతోబాటు ఐటిబిపి రిఫరల్ హాస్పిటల్ వారి టెలీమెడిసిన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ప్రతి ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రికీ ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు, ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఒక్కో షిఫ్ట్ కూ పనిచేసేలా ఏర్పాటు జరిగింది. ప్రతి వైద్య బృందమూ 8 రోజుల చికిత్సలో పాల్గొన్న అనంతరం క్వారంటైన్ కు పంపి,  వాళ్ళ స్థానంలో ఇంకో బృందాన్ని అక్కడ నియమిస్తారు.  పైగా 10 శాతం మంది వైద్య సిబ్బందిని అదనంగా ఎమర్జెన్సీ అవసరాల కోసం అందుబాటులో ఉంచుతారు.

కోవిడ్ కేంద్రంలో సంసిద్ధత పట్ల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. "గౌరవ ప్రధాని సారధ్యంలో నిరంతరం మార్గదర్శనం చేస్తున్నాం. కోవిడ్ మీద పోరాడేందుకు అవసరమైన అన్ని ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచుతూ ఉన్నాం." అన్నారు. ఢిల్లీ జిల్లా అధికారులు, ఐటిబిపి ఉమ్మడిగా చేస్తున్న సమన్వయ కృషిని ఆయన అభినందించారు. డాక్టర్లు, ఐటిబిపి, బి ఎస్ ఎఫ్ అందిస్తున్న నిస్వార్థమైన సేవలు ప్రశంసనీయమన్నారు. కోవిడ్ బాధితుల విషయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ప్రాణ రక్షక అంబులెన్సులు, ఎక్స్ రే సౌకర్యం, ఆక్సిజెన్ సిలిండర్లు, బై ఫేజిక్ డీఫైబ్రిలేటర్లు, పల్స్ ఆక్సీమీటర్లు, సక్షన్ యంత్రాలు తదితర వైద్య పరికరాలన్నీ  అందుబాటులో ఉన్నాయన్నారు.

ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ మీడియాతో మాట్లాడుతూ, భారతదేశంలో చికిత్సా విధానం ప్రధానంగా  వీలైనంత త్వరగా బాధితులను గుర్తించటం కోసం పరీక్షలు పెంచటం మీద దృష్టి సారించిందన్నారు. నిఘా,  సకాలంలో బాధితుల గుర్తింపు, సత్వర చికిత్స ద్వారా బాధితులలో మరణాల సంఖ్య అతి తక్కువగా 2.66% ఉండేట్టు చూశామన్నారు. కోలుకున్నవారి శాతం 63%  ఉండటంలోనే విజయం దాగి ఉందన్నారు. ఇప్పటికి దాదాపు 5.3 లక్షలమందికి పైగా బాధితులు కోలుకున్నారన్నారు. లాక్ దౌన్ సడలింపులు ఇచ్చేకొద్దీ " రెండు గజాల దూరం "  అనే " సామాజిక టీకా"  వాడకం చాలా కష్టమై పోయిందని చెబుతూ, అందరూ ప్రవర్తనాపరమైన మార్పుకు కట్టుబడి ఉండాలని కోరారు.

ఈ సందర్శనలో మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెంట దక్షిణ ఢిల్లీ కలెక్టర్ డాక్టర్ బి ఎం మిశ్రా, ఐటిబిపి ఐగి శ్రీ ఆనంద స్వరూప్, కమాండెంట్ బేస్ కాంప్ డాక్టర్ ప్రశాంత్ మిశ్రా, జిల్లా అధికారులు, ఐటిబిపి, సిఎస్ ఎఫ్ కు చెందిన ఇతర అధికారులు, రాధా స్వామి సత్సంగ్ బియాస్ ప్రతినిధులు కూడా ఉన్నారు.

 

****(Release ID: 1638225) Visitor Counter : 192