వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఫిక్కీ ఫ్రేమ్స్ ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన - శ్రీ పీయూష్ గోయల్ ;
ప్రధాన అంతర్జాతీయ నిర్వాహకులుగా అభివృద్ధి చెందాలని భారతీయ చలన చిత్ర మరియు ప్రకటనల పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చిన - శ్రీ పీయూష్ గోయల్.

Posted On: 11 JUL 2020 7:03PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈ రోజు ఫిక్కీ ఫ్రేమ్స్ ముగింపు సమావేశంలో ఆన్ లైన్ ద్వారా ప్రసంగించారు.  అంతర్జాతీయ నిర్వాహకులుగా అభివృద్ధి చెందే ప్రతిభ, అవకాశాలు, భారతీయ చలన చిత్ర మరియు ప్రకటనల పరిశ్రమ వర్గాలకు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.  వారు నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయవచ్చు, అవార్డులను గెలుచుకోవచ్చు మరియు పరిశ్రమలో ఎక్కువ పెట్టుబడి మరియు మూలధనాన్ని ఆహ్వానించవచ్చు.  జాతీయ సరిహద్దులకు మించి వృద్ధి చెందాలని ఆయన పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చారు.  భారతీయ ప్రకటనలు తయారుచేసేవారు చాలా సృజనాత్మకంగా ఉంటారని అభివర్ణిస్తూ, వారిలో చాలామంది అంతర్జాతీయ ఉత్పత్తులకు నాయకత్వం వహిస్తున్నారని, కేంద్ర మంత్రి పేర్కొన్నారు.  ఏ విషయాన్నైనా అభివృద్ధి చేసి, రూపొందించడంలో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానానికి ఎదగాలని ఆయన కోరారు.   భారతీయ చలన చిత్ర పరిశ్రమ పై కొన్ని దేశాలు సృష్టించిన నిర్బంధ పద్ధతులు, అవరోధాల గురించి ఆయన మాట్లాడుతూ, ఇది ఆమోదయోగ్యం కాదని అన్నారు.  ఇటువంటి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తే, భారతదేశం కూడా అదే పద్ధతిలో ప్రతిస్పందిస్తుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.  దేశంలో చలన చిత్రాల షూటింగ్ వంటి వివిధ అనుమతుల కోసం ఏక గవాక్ష విధానం అమలు చేస్తామనీ, ప్రక్రియల సరళీకరణ, ఆన్‌లైన్ క్లియరెన్సులు, ఇ-గవర్నెన్స్ అమలు వంటి పరిశ్రమ యొక్క నిజమైన డిమాండ్లను సకాలంలో పరిష్కరిస్తామనీ, శ్రీ గోయల్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 

కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాటంలో భారతీయ చలనచిత్ర రంగం చేసిన కృషినీ, వివిధ ఆరోగ్య జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో పోషించిన ముఖ్యమైన పాత్రనీ, శ్రీ గోయల్ ప్రశంసించారు.  అలాగే, దేశంలోని ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా సామాజిక ఇతివృత్తాలను ప్రచారం చేస్తున్నందుకు పరిశ్రమ వర్గాలను ఆయన ప్రశంసించారు.  భారతీయ సహన శక్తికి ప్రతీక అయిన చిత్ర పరిశ్రమ సమకాలీనంగా ఉందని, యువ భారతీయుల ఆకాంక్షను ఇది ప్రతిబింబిస్తోందని మంత్రి అన్నారు.  దేశంలోని 1.35 బిలియన్ల మందికి వినోదం పట్ల పెద్ద ఆశ, ఆకాంక్షలు ఉన్నాయనీ, సినీ పరిశ్రమ ఎప్పుడూ సందర్భోచితంగా స్పందిస్తూనే ఉందనీ, ఆయన పేర్కొన్నారు.  భారతదేశం తన సినిమా పట్ల గర్వంగా ఉందనీ, ఈ పరిస్థితిని వినియోగించుకుని, ప్రపంచంతో నిమగ్నం కావాలని ఆయన సూచించారు.  దేశ ప్రజల విశ్వాసానికి అనుగుణంగా ప్రపంచ దేశాలతో చర్చలు జరుపడమే ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యం కూడా అని ఆయన చెప్పారు. 

ప్రస్తుతం కోవిడ్ మన ముందు ఒక పెద్ద సంక్షోభంగా నిలిచిందనీ, అయితే, గతంలో చాలా సంక్షోభాలను అధిగమించినట్లే దీన్ని కూడా సమర్ధంగా అధిగమించగలమని శ్రీ గోయల్ ధీమా వ్యక్తం చేశారు.   కోవిడ్ అనంతర ప్రపంచంలో లభించే అవకాశాల కోసం మనల్ని మనం సిద్ధం చేసుకుందాం, ఇది మన పనిలో మరియు జీవితంలో కొత్త మార్గాలను సూచిస్తుంది.  ఈ పరిస్థితులను అధిగమించడానికి మనం భిన్నంగా ఆలోచించవలసిన అవసరాన్ని గుర్తించి, నిరంతర ఆవిష్కరణలను పెంపొందించుకోవాలి.  తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, అయితే భయంతో ముందుకు వెళ్ళలేమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలనీ, ఆయన సూచించారు.  "మనం క్రొత్త ప్రపంచ క్రమంతో నిమగ్నమవ్వాలి, క్రొత్త పరిస్థితులను మనకు అనుగుణంగా మలచుకోవాలి.  ఈ మహమ్మారి వల్ల చిత్ర పరిశ్రమతో పాటు వినోద రంగం కూడా ప్రభావితమయ్యింది.  అయితే, భవిష్యత్తులో కార్యకలాపాలు ఎలా నిర్వహించాలనే విషయాన్ని పునఃపరిశీలించుకోవడం చాలా ముఖ్యం.” అని ఆయన అన్నారు.  అన్ ‌లాక్ ప్రక్రియతో భారత ఆర్థిక వ్యవస్థ విశేషమైన పునరాగమన బాట పట్టిందనీ, వినోద పరిశ్రమ కూడా త్వరలో పునరుజ్జీవనాన్ని చవిచూస్తుందనీ, కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 

నియంత్రణ లేని ఓ.టి.టి. వేదికపై  మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.  దీని ద్వారా ప్రసారమయ్యే సమాచారం కొన్ని సార్లు అభ్యంతరకరంగా,  తప్పుగా ఉంటుందనీ, మన దేశాన్నీ, సమాజాన్నీ హేళనగా, పేలవంగా చిత్రీకరిస్తుందనీ మరియు కుటుంబంతో కలిసి చూడడానికి అనువుగా, సభ్యతగా ఉండదనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

చలన చిత్ర పరిశ్రమతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సుమారు 25 లక్షల మంది సంబంధాలు కలిగి ఉన్నారని శ్రీ గోయల్ అన్నారు.  పరిశ్రమకు చెందిన భాగస్వాములందరి పట్ల తగిన శ్రద్ధ తీసుకోవాలనీ, పరిశ్రమలో తక్కువ జీతంతో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకోవాలనీ, తద్వారా పరిశ్రమతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుందనీ ఆయన పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చారు.

ఇటీవలి కాలంలో స్వర్గస్తులైన సుప్రసిద్ధ సినీ ప్రముఖులకు శ్రీ గోయల్ నివాళులర్పించారు.

 (Release ID: 1638079) Visitor Counter : 51