PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 11 JUL 2020 6:28PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • దేశంలో కోవిడ్‌-19 పరిస్థితులపై ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రధానమంత్రి.
 • దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కోలుకున్నవారి సంఖ్య 19,870; ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 5,15,385.
 • యాక్టివ్‌ కేసులకన్నా 2,31,978 మేర అధికంగా నమోదైన కోలుకున్నవారి సంఖ్య; 62.78 శాతానికి పెరిగిన కోలుకునేవారి జాతీయ సగటు.
 • దేశంలో ప్రస్తుతం చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,83,407.
 • ఓ మోస్తరు నుంచి తీవ్రస్థాయిలోగల కోవిడ్‌-19 రోగులకు ‘ఇటోలిజుమాబ్‌’ అత్యవసర వినియోగం కోసం పరిమిత స్థాయిలో అనుమతి.
 • “కోవిడ్‌-19 అనంతరం ‘మేక్‌ ఇన్‌ ఇండియా’పై కేంద్రీకృత దృష్టితో చర్యల”పై ‘టిఫాక్‌’ శ్వేతపత్రం విడుదల.

 

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం:

5 లక్షలు దాటిన వ్యాధి నయమైనవారి సంఖ్య; చురుకైన కేసులకన్నా 2.31 లక్షలు అధికం; 63 శాతానికి చేరువగా కోలుకునేవారి జాతీయ సగటు

దేశంలో కోవిడ్-19 మ‌హ‌మ్మారినుంచి కోలుకునేవారి సంఖ్య ఇవాళ 5 లక్షలు దాటింది. ఈ మేరకు ఇప్పటిదాకా 5,15,385 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. దీంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారితో పోలిస్తే కోలుకున్నవారి సంఖ్య 2,31,978 మేర అధికంగా నమోదు కావడం విశేషం. ఈ అంతరం ప్రగతిశీలంగా పెరుగుతుండటంతో కోలుకునేవారి జాతీయ సగటు 62.78కి చేరగా, గత 24 గంటల్లో 19,870 మందికి వ్యాధి నయమైంది. ప్రస్తుతం తీవ్ర అనారోగ్య పరిస్థితిలోగల, స్వల్ప లక్షణాలున్న, రోగ లక్షణాలు కనిపించని  2,83,407 మంది వివిధ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ఏకాంత గృహవాసంలో చురుకైన వైద్య పర్యవేక్షణ కింద చికిత్స పొందుతున్నారు. ఇక దేశంలోని 1180 ప్రభుత్వ, ప్రైవేటు ప్రయోగశాలల్లో ఇప్పటిదాకా 1,13,07,002 నమూనాలను పరీక్షించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638028

కోవిడ్‌-19 మహమ్మారి సన్నాహాలపై ప్రధాని అధ్యక్షతన సమీక్ష సమావేశం

దేశంలో కోవిడ్‌-19 పరిస్థితులపై ప్రధానమంత్రి  ఇవాళ సమీక్షించారు. దేశీయాంగ, ఆరోగ్య శాఖల మంత్రులు శ్రీ అమిత్‌ షా, డాక్టర్‌ హర్షవర్ధన్‌లతోపాటు నీతి ఆయోగ్‌ సభ్యుడు, మంత్రిమండలి కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో సామాజిక క్రమశిక్షణతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడానికి అందరమూ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కోవిడ్‌పై విస్తృత అవగాహన కల్పించాలని, వ్యాధి వ్యాప్తి నిరోధం గురించి నిరంతరం నొక్కిచెప్పాలని సూచించారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలపై జాతీయస్థాయిలో పర్యవేక్షణతోపాటు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేయాలని ప్రధానమంత్రి ఆదేశించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637975

ఓ మోస్తరు నుంచి తీవ్రస్థాయిలోగల కోవిడ్‌-19 రోగులకు ఇటోలిజుమాబ్‌పరిమిత అత్యవసర వినియోగానికి డీజీసీఐ అనుమతి

ప్ర‌స్తుతం తీవ్ర‌-దీర్ఘ‌కాలిక చ‌ర్మ‌వ్యాధి సొరియాసిస్ చికిత్స‌కు ఆమోదిత వినియోగంలోగ‌ల   కోవిడ్‌-19 రోగులకు చికిత్స కోసం- మోనోక్లోనల్ యాంటీబాడీ అయిన ‘ఇటోలిజుమాబ్’ (rDNAమూలం) ఔష‌ధాన్ని వైద్య ప్ర‌యోగ ప‌రీక్ష‌ల ఆధారంగా కోవిడ్‌-19 రోగుల చికిత్స‌లో వాడేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమ‌తించింది. అయితే, దీన్ని ఓ మోస్త‌రు, తీవ్ర ల‌క్ష‌ణాలున్న కోవిడ్‌-19 రోగుల‌కు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ప‌రిమితంగా మాత్ర‌మే వినియోగించాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. కాగా, ఓ మోస్త‌రు-తీవ్ర దీర్ఘకాలిక సొరియాసిస్ చ‌ర్మ వ్యాధితో బాధ‌ప‌డే రోగుల చికిత్స కోసం ‘బ‌యోకాన్’ సంస్థ 2013 నుంచి ‘అల్జుమాబ్’ పేరుతో తయారుచేసి విక్ర‌యిస్తోంది. ఈ స్వ‌దేశీ ఔష‌ధాన్ని ఇప్పుడు కోవిడ్‌-19 చికిత్స‌కు ఉప‌యోగ‌ప‌డేలా పున‌ర్నిర్మించారు. ఈ మేర‌కు నిర్వ‌హించిన రెండోద‌శ ప్ర‌యోగాత్మ‌క ప‌రీక్ష‌ల సంద‌ర్భంగా కోవిడ్‌-19 రోగుల‌లో క‌నిపించిన ఫ‌లితాల‌ను బ‌యోకాన్ సంస్థ డీజీసీఐకి స‌మ‌ర్పించింది. కోవిడ్‌-19 వ‌ల్ల ఓ మోస్త‌రు నుంచి తీవ్ర రిస్పిరేట‌రీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS)గ‌ల రోగుల‌లో సైటోకీన్ రిలీజ్ సిండ్రోమ్ (CRS) చికిత్స నిమిత్తం ప‌రిమిత అత్య‌వ‌స‌ర వినియోగం కోసం విక్ర‌యించేందుకు అనుమతించాల‌ని నిర్ణ‌యించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637994

కోవిడ్-19 చికిత్స నిర్వహణపై ప్రామాణిక సంరక్షణ వ్యూహం

కోవిడ్-19ను పూర్తిస్థాయిలో నయంచేసే చికిత్స విధానం ఇప్పటికీ రూపొందని కారణంగా ప్రస్తుతం లక్షణాలు లేనివారు ప్రాతిపదికగా సంరక్షణ మద్దతు పద్ధతిలో ప్రధానంగా వైద్యం  చేస్తున్నారు. అదే సమయంలో శరీరంలో తగినంత నీరు ఉండేవిధంగా జాగ్రత తీసుకోవడం తప్పనిసరి. కాగా, వ్యాధి లక్షణాల తీవ్రతనుబట్టి కోవిడ్-19ను మూడుగా- స్వల్ప, ఓ మోస్తరు, తీవ్ర లక్షణాలున్నవారుగా వర్గీకరించవచ్చు. ఈ నేపథ్యంలో స్వల్ప, ఓ మోస్తరు, తీవ్ర లక్షణాలుగల కేసుల్లో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్దేశించినట్టు  ప్రామాణిక జాగ్రత్తలతో కూడిన చికిత్స విధానం ఎంతో సమర్థంగా ఉంటుందని “కోవిడ్ కేసుల చికిత్స నిర్వహణపై 10-07-2020న వివిధ రాష్ట్రాలతో కేంద్రం నిర్వహించిన దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశంతోపాటు అదే రోజున రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలతో నిర్వహించిన వాస్తవిక సాదృశ సమావేశంలోనూ భారత వైద్య పరిశోధన మండలి (ICMR),  అఖిలభారత వైద్యవిజ్ఞాన శాస్త్రాల సంస్థ (AIIMS) నొక్కిచెప్పాయి. అయితే, సముచిత వైద్య సదుపాయాలున్నచోట, రోగుల పరిస్థితిపై నిశిత పర్యవేక్షణతో మాత్రమే ఇలాంటి పరిశోధనాత్మక చికిత్స విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది. తద్వారా చికిత్సలో సంక్లిష్ట పరిస్థితి ఏర్పడినా తగు నివారణ చర్యలకు వీలుంటుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638032

ఖరీఫ్‌ సీజన్‌లో నిరుటితో పోలిస్తే ఈ ఏడాది 2.5 రెట్లు పెరిగిన సాగు విస్తీర్ణం; నూనెగింజల విస్తీర్ణంలోనూ గణనీయ పెరుగుదల; వరి, ముతక ధాన్యాలు, పత్తి సాగు కూడా అధికమే

దేశంలో కోవిడ్‌-19 మహమ్మారి పరిస్థితుల్లోనూ క్షేత్రస్థాయిలో రైతులకు, వ్యవసాయ కార్యకలాపాలకు కేంద్ర వ్యవసాయ-సహకార-రైతుసంక్షేమ శాఖ అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో దేశవ్యాప్తంగా పంటల సాగు విస్తీర్ణం సంతృప్తికర రీతిలో నమోదైంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637964

కోవిడ్‌-19 అనంతరం మేక్‌ ఇన్‌ ఇండియాపై కేంద్రీకృత దృష్టితో చర్యలపై టిఫాక్‌శ్వేతపత్రం విడుదల

“కోవిడ్-19 అనంతర పరిస్థితుల్లో ‘మేక్ ఇన్ ఇండియా’ కింద దృష్టి కేంద్రీకరించాల్సిన అంశాల”పై కేంద్ర శాస్త్ర-సాంకేతిక; ఆరోగ్య-కుటుంబ సంక్షేమ; భూ  అధ్యయన శాస్త్రాల శాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ శ్వేతపత్రం విడుదల చేశారు. దీంతోపాటు ఔషధ ముడిపదార్థాలు: స్థాయి-సమస్యలు, సాంకేతిక సంసిద్ధత-సవాళ్లు” అంశం కూడా ఈ శ్వేతపత్రంలో భాగంగా ఉంది. సాంకేతిక సమాచార-అంచనా-మూల్యాంకన మండలి  (టిఫాక్-TIFAC) ఈ శ్వేతపత్రాన్ని రూపొందించగా, ఢిల్లీలో నిర్వహించిన ఆన్‌లైన్‌ కార్యక్రమంలో మంత్రి దీన్ని ఆవిష్కరించారు. దేశానికి కీలకమైన ఐదు రంగాలకు సంబంధించి ఆయా రంగాలవారీ బలాలు, మార్కెట్ ధోరణులు, అవకాశాలను ఈ శ్వేతపత్రంలో టిఫాక్‌ పొందుపరిచింది. ఆ మేరకు ఆరోగ్య సంరక్షణ, యంత్రపరికరాలు, ఐసీటీ, వ్యవసాయం, తయారీ రంగం, ఎలక్ట్రానిక్స్ తదితరాలకు సంబంధించి గిరాకీ-సరఫరా, స్వావలంబన, భారీస్థాయి ఉత్పత్తి సామర్థ్యం తదితరాలను ఇందులో వివరించింది. అంతేకాకుండా ప్రజారోగ్యం, సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల రంగం, అంతర్జాతీయ సంబంధాలు: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, నవీకృత వాణిజ్య సంబంధాలు, నవయుగ సాంకేతిక పరిజ్ఞానం తదితరాలను కూడా ఇది వివరించింది. భారత దేశాన్ని స్వయం సమృద్ధం” చేయడంలో తక్షణ సాంకేతిక-విధానపరమైన ఉత్తేజం ఇచ్చే దిశగా  శ్వేతపత్రం సిఫారసులు ఉపకరిస్తాయి. వివిధ రంగాల ఉత్పాదక ప్రక్రియల మధ్యగల పరస్పర సంబంధాల ప్రాతిపదికగా ఆయా రంగాల్లో ఉత్పత్తి-ఆదాయం రెట్టింపు చేసేందుకుగల అవకాశాలను కూడా శ్వేతపత్రం విశదీకరించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637856

సుస్థిర-హరిత నిర్మాణశైలికి ప్రాధాన్యమివ్వాలని ఉపరాష్ట్రపతి పిలుపు

దేశంలో హరిత నిర్మాణశైలిని ప్రోత్సహించడంతోపాటు స్వయంగా అనుసరించాలని భవన వాస్తు శిల్పులకు ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. రాబోయే నిర్మాణ ప్రాజెక్టులలో సౌరశక్తివంటి పునరుపయోగ ఇంధన వనరులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రజల ఆరోగ్యం, జీవనోపాధిపై కోవిడ్-19 మహమ్మారి దుష్ప్రభావంపై ఆయన విచారం వ్యక్తంచేశారు. ముఖ్యంగా భారీస్థాయిలో కొనసాగుతున్న నిర్మాణ పనులు నిలిచిపోవడంతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడిందని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మహమ్మారి విసిరిన సవాలుకు తగిన రీతిలో ప్రతిస్పందించాలని భవన వాస్తు శిల్పులు, రూపకర్తలకు పిలుపునిచ్చారు. “వాస్తు శిల్పులు సరికొత్త మార్గాలు అన్వేషించాలి... మహమ్మారిని, దాని పర్యవసానాలను పరిష్కరించగల పరిష్కారాలను కనుగొనడంలో రూపనిర్మాణంపై సహాయపడగల రీతిలో  చర్చలకు వీలు కల్పించాలి” అని ఆయన చెప్పారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637961

కోవిడ్‌-19పై పోరాటం దిశగా కొత్త ఉత్పత్తికి ఆర్‌సిఎఫ్‌ రూపకల్పన; హస్త పరిశుభ్రత కోసం ఐసోప్రొపిల్‌ ఆల్కహాల్‌ ఆధారిత జెల్‌ తయారీ

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637986

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • పంజాబ్: రాష్ట్రంలో పదో తరగతి, ఓపెన్ స్కూల్, గోల్డెన్‌ చాన్స్‌సహా తిరిగి పరీక్షలు రాసే విద్యార్థులందరికీ పెండింగ్ పరీక్షలను రద్దు చేయాలని పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొన్ని సబ్జెక్టుల పరీక్షలను పంజాబ్ పాఠశాల విద్యాబోర్డు (పీఎస్‌ఈబీ) నిర్వహించగా, ఆ తర్వాత రద్దచేయాల్సిన వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాసిన పరీక్షల ఉత్తమ ప్రతిభ ఆధారంగా ఫలితం ప్రకటిస్తామని పీఎస్‌ఈబీ పేర్కొంది.
 • హర్యానా: రాష్ట్రంలో కోవిడ్‌ మహమ్మారివల్ల దెబ్బతిన్న కార్యకలాపాలు ఇప్పుడు నెమ్మదిగా పుంజుకుంటున్నాయని హర్యానా ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాగా, కోవిడ్‌-19 నియంత్రణ, నిర్వహణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత దిగ్బంధ విముక్తి రెండోదశలో అన్ని కార్యకలాపాలు వేగం అందుకున్నాయి. కాగా, కోవిడ్‌ మహమ్మారి సమయంలో ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.3,000 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.
 • కేరళ: కోవిడ్‌-19 కేసుల కొత్త విస్తరణ కేంద్రంగా మారిన పూంతురాలో వ్యాధి వ్యాప్తి నివారణ కార్యక్రమాల బలోపేతంలో భాగంగా రెవెన్యూ, పోలీసు, ఆరోగ్యశాఖ  అధికారులతో సత్వర ప్రతిస్పందన బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో కోవిడ్-19 సామాజిక సంక్రమణ కనిపిస్తున్నదని, ఈ మేరకు లక్షణరహిత రోగుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని భారత వైద్య సంఘం (ఐఎంఎ) పునరుద్ఘాటించింది. కాగా, శుక్రవారం గుండెపోటుతో మరణించిన ఎర్నాకుళం వ్యక్తితోపాటు చెర్తాల తాలూకా ఆసుపత్రిలో గైనకాలజిస్టుసహా 8మందికి వ్యాధి నిర్ధారణ అయింది. కేరళలో నిన్న కొత్త కేసులు నమోదుకాగా, వీటిలో 204 స్థానికంగా సంక్రమించాయి. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో 1,84,112 మంది పరిశీలన నిఘాలో ఉన్నారు.
 • తమిళనాడు: పుదుచ్చేరిలో 64 తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1337కు పెరిగింది; దీంతోపాటు ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 18కి పెరిగింది. డిజిటల్ సదుపాయ సమస్యల దృష్ట్యా ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణ అసాధ్యమని, విద్యార్థుల కోసం మూల్యాంకన పద్ధతుల రూపకల్పనలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి లేఖ రాశారు. మరోవైపు ఇరాన్‌ నుంచి 681 మంది మత్స్యకారులను భారత నావికాదళం నౌకలో తీసుకురాగా, తగినంత స్థలం లేనందువల్ల  అక్కడే మిగిలిపోయిన మరో 40మందిని స్వదేశానికి రప్పించాలని కోరారు. రాష్ట్రంలో నిన్న 3680 కొత్త కేసులు, 4163 రికవరీలు, 64 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 1,30,261; యాక్టివ్ కేసులు: 46,105; మరణాలు: 1829; చెన్నైలో యాక్టివ్ కేసులు: 18,616గా ఉన్నాయి.
 • కర్ణాటక: రాష్ట్ర రాజధాని బెంగళూరులో కోవిడ్-19 కేసులు గణనీయంగా పెరగడంతో ప్రభుత్వం ఇవాళ్టినుంచి నగరంలో ర్యాపిడ్‌ యాంటిజెన్ పరీక్షలను ప్రారంభించింది, దీనితో 30 నిమిషాల్లో ఫలితం తేలుతుంది. అంతేకాకుండా పరీక్షల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. కోవిడ్ రోగులకు పడకల లభ్యతపై సకాల డిజిటల్ సమాచార వ్యవస్థ ఏర్పాటుపై ప్రభుత్వం పరిశీలించాల్సి ఉందని హైకోర్టు సూచించింది. కాగా, వారాంతపు దిగ్బంధం అమలు అవసరం లేదని, దీనిపై నిపుణులతో సంప్రదించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రెవెన్యూ మంత్రి చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో మరణాల సంఖ్య 500 దాటింది. నిన్న 2313 కొత్త కేసులు నమోదవగా, 1003 మంది డిశ్చార్జి అయ్యారు. అలాగే 57 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 33,418; క్రియాశీల కేసులు: 19,035; మరణాలు: 543గా ఉన్నాయి.
 • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 45,240 పడకల సామర్థ్యంగల 76 కోవిడ్ రక్షణ కేంద్రాలను ప్రభుత్వం గుర్తించింది. తదనుగుణంగా స్వల్పలక్షణ, లక్షణరహిత కేసుల చికిత్స కోసం ప్రతి జిల్లాలో కనీసం 3,000 పడకల లభ్యతకు భరోసా ఇస్తూ చర్యలు తీసుకుంటోంది. రోగుల కీలక అవసరాలు తీర్చడంపై పర్యవేక్షణ నిమిత్తం ఆసుపత్రి ప్రాంగణాల్లో వసతుల కల్పనకు.. ముఖ్యంగా మరుగుదొడ్డి సౌకర్యాలు, వైద్య పరికరాలు, సంచార ఎక్స్-రే, ఈసీజీ, ఇతర ప్రయోగశాల పరికరాల మెరుగుదల కోసం రూ.కోటి మంజూరు చేసింది. కాగా, నెల్లూరు జిల్లాలో కోవిడ్-19తో మరణించిన ముగ్గురి మృతదేహాలను ఎర్త్‌మూవర్‌తో అమానవీయంగా ఖననం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఆర్డీవోను ప్రత్యేక విచారణాధికారిగా నియమిస్తూ కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో నిన్న 1608 కొత్త కేసులతోపాటు 15 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 25,422 యాక్టివ్ కేసులు: 11,936 మరణాలు: 292గా ఉన్నాయి.
 • తెలంగాణ: రాష్ట్రంలో కోవిడ్-19 నిర్వహణపై పర్యవేక్షణ కోసం ప్రభుత్వం 11మంది సభ్యులతో వైద్యబృందాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుడి నేతృత్వంలో పనిచేసే ఈ బృందం రాష్ట్రంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తుంది. కాగా- రాష్ట్రంలో నిన్నటిదాకా నమోదైన కేసులు: 32,224; యాక్టివ్: 12,680; మరణాలు: 339; డిశ్చార్జెస్:19,205గా ఉన్నాయి.
 • అసోం: రాష్ట్రంలో దిగ్బంధంవల్ల బలహీనవర్గాలకు ఇబ్బందుల నేపథ్యంలో అసోం ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్‌ సమస్యను గుర్తించారు. ఈ మేరకు నిరాశ్రయులకు, రోజుకూలీలకు, సమాజంలోని పేదలకు ఆహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
 • మణిపూర్: రాష్ట్రంలోని తంగల్ కీథెల్ వద్ద వంతులవారీగా దుకాణాలు తెరవడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది.
 • మేఘాలయ: రాష్ట్రంలో ఇవాళ 76 మందికి కోవిడ్‌-19 నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 215కు చేరగా, ఇప్పటివరకూ 45 మంది కోలుకున్నారు.
 • మిజోరం: రాష్ట్రంలో ఇవాళ ఏడుగురు కోవిడ్-19 రోగులు కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం మిజోరంలో 76 యాక్టివ్‌ కేసులుండగా, ఇప్పటిదాకా 150 మంది కోలుకున్నారు.
 • నాగాలాండ్: రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ  బలోపేతానికి అదనపు వైద్యులు, నర్సుల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని నాగాలాండ్‌లోని కోవిడ్‌-19 ఉన్నతస్థాయి కమిటీ ఆరోగ్యశాఖను ఆదేశించింది.
 • సిక్కిం: రాష్ట్రంలోని ఎస్టీఎన్ఎమ్ ఆస్పత్రిలోని కోవిడ్‌-19 ప్రత్యేక కేంద్రంలో 65 ఏళ్ల అత్యంత పెద్ద వయస్కుడు, రెండేళ్ల వయసున్న చిన్నారికి చికిత్స విజయవంతమైందని ఆస్పత్రి వైద్యవిద్య అధిపతి వెల్లడించారు.
 • మహారాష్ట్ర: రాష్ట్రంలో 7,862 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2,38,461కు పెరిగింది. ఇప్పటిదాకా 1,32,625 మంది కోలుకోగా తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం 95,647మంది చికిత్స పొందుతున్నారు. ఇక ముంబైలో నమోదైన కేసుల సంఖ్య స్థిరీకరించబడినా పుణె, థానె, కల్యాణ్‌, మీరా-భయాందర్ వంటి నగరాల్లో కోవిడ్-19 రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
 • గుజరాత్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 875 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 40,155కు పెరిగింది. ఇక తాజాగా 14 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2,024కు చేరింది. కొత్త కేసులలో సూరత్ నుంచి గరిష్ఠంగా 202 కేసులు నమోదవగా, 165 కేసులతో అహ్మదాబాద్‌ రెండో స్థానంలో ఉంది.
 • రాజస్థాన్: రాష్ట్రంలో ఈ ఉదయందాకా 170 కొత్త కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. దీంతో కేసులు 23,344కు, మరణాలు 499కి పెరిగాయి.  అల్వార్ జిల్లాలో నేటి కొత్త కేసులలో 40, జైపూర్‌లో 33, ఉదయపూర్‌లో 31 వంతున కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాజస్థాన్‌లో ప్రస్తుతం 5211 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో 17,634 మంది కోలుకున్నారు.
 • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 316 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 16,657కు పెరిగింది. కాగా- గ్వాలియర్‌లో అత్యధికంగా 60, భోపాల్‌లో 57, ఇండోర్‌లో 44 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3538కాగా, ఇప్పటివరకూ 12,481మంది కోలుకున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'కిల్ కరోనా ప్రచారం'లో 66శాతం జనాభాపై సర్వే పూర్తయింది.
 • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో శుక్రవారం 166 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,832కు పెరిగింది. రాయ్‌పూర్‌, బలోడాబజార్ జిల్లాల్లో ఒకేరోజు గరిష్ఠంగా 34 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 787గా ఉంది.
 • గోవా: గోవాలో శుక్రవారం 100 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 2,251కి చేరాయి. ఇప్పటిదాకా కోలుకున్న రోగుల సంఖ్య 1347, యాక్టివ్‌ కేసుల సంఖ్య 895గా ఉంది.

FACTCHECK

Image

 

******(Release ID: 1638081) Visitor Counter : 19