PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 12 JUN 2020 6:39PM by PIB Hyderabad

(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • కోవిడ్‌-19 నయమయ్యేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ 1,47,194కు చేరగా, కోలుకునేవారి శాతం 49.47కు చేరింది. ప్రస్తుతం 1,41,842 యాక్టివ్‌ కేసులు చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నాయి.
  • దిగ్బంధం విధింపు సమయంలో కేసులు రెట్టింపయ్యే వ్యవధి 3.4 రోజులు కాగా,  ఇప్పుడు 17.4 రోజులకు పెరిగింది.
  • కేసుల నియంత్రణ, పరీక్షలు, జాడతీయడం, ఆరోగ్య వసతుల ఉన్నతీకరణ, వైద్య నిర్వహణ, సామాజిక భాగస్వామ్యం తదితరాలపై దృష్టి సారించాలి: రాష్ట్రాలకు కేబినెట్‌ కార్యదర్శి సూచన.  
  • వస్తుసేవల పన్ను చట్టం, ప్రక్రియలలో మార్పులకు జీఎస్టీ మండలి నిర్దిష్ట సిఫారసులు.
  • కోవిడ్‌ అనంతరం కాలంలో భారత భవిష్యత్తును నిర్వచించేది నాణ్యతే: శ్రీ పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్య

 

Image

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం; వ్యాధి నయమైనవారి సంఖ్య 1,47,194; కోలుకునేవారి శాతం 49.47కు పెరుగుదల

దేశంలో కోవిడ్‌-19 నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా మెరుగుపడుతూ ప్రస్తుతం 49.47 శాతానికి చేరగా, వ్యాధి నయమైన వారి సంఖ్య 1,47,194కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,41,842 కాగా, వీరందరూ ఇప్పుడు చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. గత 24 గంటల్లో 6,166మంది కోలుకున్నారు. ఇక దిగ్బంధం విధించేనాటికి కేసులు రెట్టింపయ్యే వ్యవధి 3.4 రోజులు కాగా- ప్రస్తుతం 17.4 రోజులకు పెరిగింది.

   కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి ఇవాళ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య, పట్టణాభివృద్ధి శాఖల కార్యదర్శులతో దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం నిర్వహించారు. కోవిడ్‌-19 సమర్థ నిర్వహణరీత్యా కేసుల నియంత్రణ, పరీక్షలు, జాడతీయడం, ఆరోగ్య వసతుల ఉన్నతీకరణ, వైద్య నిర్వహణ, సామాజిక భాగస్వామ్యం తదితరాలపై ప్రధానంగా దృష్టి సారించాలని ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాలకూ సూచించారు.

మరోవైపు నవ్య కరోనా వైరస్‌ సోకినవారిని గుర్తించేందుకు ఐసీఎంఆర్‌ పరీక్ష సదుపాయాలను గణనీయంగా పెంచింది. ఆ మేరకు దేశంలో ప్రస్తుతం మొత్తం 877 (ప్రభుత్వ రంగంలో 637, ప్రైవేటు రంగంలో 240) ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 1,50,305సహా ఇప్పటిదాకా మొత్తం 53,63,455 నమూనాలను వీటిలో పరీక్షించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631237

కోవిడ్‌-19 నేపథ్యంలో పట్టణ రవాణా సేవల దిశగా రాష్ట్రాలు/యూటీలు/నగరాలు/ మెట్రోరైలు కంపెనీలు తగు చర్యలు తీసుకోవాలి

కేంద్ర గృహనిర్మాణ-పట్టణాభివృద్ధి మంత్రిత్వశాక అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, నగరాలు, మెట్రో రైలు కంపెనీలకు సూచనాపూర్వక ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు పట్టణ రవాణా సేవల దిశగా మూడంచెల [స్వల్పకాలిక (6నెలల్లోపు), మధ్యకాలిక (ఏడాది లోపు), దీర్ఘకాలిక (1-3 ఏళ్ల లోపు)] వ్యూహాన్ని దశలవారీగా అమలు చేయాలని అందులో కోరింది. కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా స్థానిక, ప్రాంతీయ, అంతర్జాతీయ రవాణా వ్యవస్థలు సహా మన జీవన విధానాలపై దుష్ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ సూచనలు జారీ చేసింది. అయితే, కోవిడ్‌-19 కారణంగా విభిన్న ప్రజారవాణా మార్గాలతోపాటు హరిత, కాలుష్యరహిత, సౌకర్యవంతమైన, సుస్థిర పరిష్కారాలను అన్వేషించే అవకాశం కూడా లభించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రతిపాదించిన మూడంచెల వ్యూహంలో భాగంగా మోటారేతర, ప్రజారవాణా వ్యవస్థలపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించింది. అదే సమయంలో ప్రయాణికుల కోసం సమాచార ప్రదాన వ్యవస్థసహా చార్జీల చెల్లింపుల కోసం అందుబాటులోగల సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించాలని పేర్కొంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631246

వస్తుసేవల పన్ను (GST) చట్టం, ప్రక్రియలలో మార్పులకు జీఎస్టీ మండలి నిర్దిష్ట సిఫారసులు

కేంద్ర ఆర్థిక-కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా వస్తుసేవల పన్ను (GST) మండలి 40వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జీఎస్టీ చట్టం, ఇతర ప్రక్రియలలో నిర్దిష్ట మార్పులు సూచించింది. ఈ మేరకు గడువుదాటిన కాలపు రిటర్నుల దాఖలుపై ఆలస్యరుసుము తగ్గింపుసహా వ్యాపార సౌలభ్య చర్యలను సూచించింది. తదనుగుణంగా 2020 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకుగాను రిటర్నుల దాఖలులో చిన్న పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చింది. అలాగే తదుపరి పన్ను వ్యవధుల (2020 మే, జూన్‌, జూలై నెలల)కు సంబంధించి కూడా ఊరటనిచ్చింది. రిజిస్ట్రేషన్‌ రద్దు నిర్ణయం ఉపసంహరణ కోరే గడువును పొడిగింపునకు ఒకసారి అవకాశం కల్పించింది. ఇక సీజీఎస్టీ చట్టం-2017, ఐజీఎస్టీ చట్టం-2017లలో సవరణలకు ఉద్దేశించి ఆర్థిక చట్టం-2020లో చేర్చిన కొన్ని నిబంధనలను 30.06.2020 నుంచి అమలు చేయాలని కూడా మండలి నిర్ణయించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631245

భార‌త నాణ్యత మండలిపై శ్రీ పీయూష్‌ గోయల్‌ సమీక్ష; నాణ్యమైన ఉత్పత్తులు-సేవలద్వారానే స్వయం సమృద్ధ భారతం రూపొందుతుందని స్పష్టీకరణ

భారతదేశ భవిష్యత్తును నిర్వచించేది నాణ్యత మాత్రమేనని కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు భారత నాణ్యత మండలి (QCI) పనితీరుపై ఆయన ఇవాళ సమీక్షించారు. నాణ్యమైన దేశీయ ఉత్పత్తులు, సేవల ప్రాతిపదికగానే స్వయం సమృద్ధ భారతం ఎదుగుతుందని, దినదినాభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా గోయల్‌ చెప్పారు. దీనికి తగినట్లుగా సామాన్య మానవులదాకా ఈ నాణ్యతా స్పృహ వేళ్లూనుకోవాల్సి ఉందని, అలాగే మన జీవితాల్లోని అన్ని అంశాల్లోనూ నాణ్యత సంస్కృతి పాదుకొనడం ముఖ్యమని సూచించారు. తదనుగుణంగా కోవిడ్‌ అనంతరం శకంలో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కృతమవుతున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయాలని భారత నాణ్యత మండలికి గోయల్‌ పిలుపునిచ్చారు. అటుపైన స్థానిక పరిస్థితులకు సంబంధించిన వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటిని అవసరమైన మేరకు మన దేశంలో ఆచరించేలా చూడాలని చెప్పారు. అంతేకాకుండా దేశంలో నైపుణ్యాంతరాలపైన కూడా క్యూసీఐ విశ్లేషణ చేపట్టాలని, వాటిని పూరించేందుకు సూచనలు చేయాలని కోరారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631252

కోవిడ్‌-19 పరిస్థితుల నేప‌థ్యంలో మూల‌ధ‌న వ‌స్తుసేవ‌ల కొనుగోలు కాంట్రాక్టుల గ‌డువును 4 నెల‌లు పెంచిన ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి పరిస్థితుల నేప‌థ్యంలో దేశీయ విక్రేత‌లకు వెసులుబాటు క‌ల్పిస్తూ మూల‌ధ‌న వ‌స్తుసేవ‌ల కొనుగోలు కాంట్రాక్టుల గ‌డువును ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ 4 నెల‌ల‌పాటు పొడిగించింది. ఈ మేర‌కు మంత్రిత్వ శాఖ‌లోని కొనుగోళ్ల విభాగం ఒక ఉత్త‌ర్వు జారీచేసింది. “అనివార్య ప‌రిస్థితుల వెసులుబాటు గ‌డువు నాలుగు నెల‌ల‌పాటు... అంటే 2020 మార్చి 25 నుంచి 2020 జూలై 24కు పొడిగించ‌బ‌డింది” అని అందులో పేర్కొంది. అలాగే “కాంట్రాక్ట్ సామగ్రి/సేవల ప్ర‌దానంలో జాప్యం, ద్రవ్య నష్టాలపై రుసుముల విధింపులో వెసులుబాటు కాలం మినహాయించబడుతుంది” అని కూడా వివ‌రించింది. కోవిడ్‌-19 ప‌రిస్థితుల‌వ‌ల్ల ఉత్ప‌త్తి కార్య‌క్ర‌మంపై దుష్ప్ర‌భావాన్ని ఎదుర్కొంటున్న దేశీయ రక్ష‌ణ‌రంగ ప‌రిశ్ర‌మ‌ల‌కు ఈ వెసులుబాటుతో ఊర‌ట ల‌భించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631141

రాష్ట్రాలు కోరిన మేరకు ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్ల ఏర్పాటు కొనసాగించనున్న రైల్వేశాఖ

రాష్ట్రాలు కోరిన మేరకు ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లను సమకూర్చడంద్వారా వలస కార్మికుల సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయం కల్పించేందుకు భారత రైల్వేశాఖ కట్టుబడి ఉంది. ఈ మేరకు రైల్వే బోర్డు చైర్మన్‌ లేఖరాసిన నేపథ్యంలో వివిధ రాష్ట్రాలనుంచి ఇప్పటిదాకా 63 రైళ్ల ఏర్పాటు కోసం అభ్యర్థనలు అందాయి. ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్ల ఏర్పాటు కోరిన రాష్ట్రాల జాబితాలో కేరళ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, జమ్ముకశ్మీర్‌ ఉన్నాయి. తదనుగుణంగా రాష్ట్రాలవారీగా ఆంధ్రప్రదేశ్‌ 3, గుజరాత్‌ 1, జమ్ముకశ్మీర్‌ 9, కర్ణాటక 6, కేరళ 32, తమిళనాడు 10, పశ్చిమబెంగాల్‌ 2 వంతున శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లను సమకూర్చాలని కోరాయి. కాగా, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి అభ్యర్థన ఇంకా అందాల్సి ఉంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631145

స్వయం సమృద్ధ భారతం ప్యాకేజీ కింద మే, జూన్‌ నెలల్లో 45.62 లక్షల మంది లబ్ధిదారులకు 22,812 టన్నుల ఆహారధాన్యాల పంపిణీ; దీంతోపాటు రాష్ట్రాలు/యూటీలద్వారా 2,092 టన్నుల పప్పుదినుసుల సరఫరా

భారత ఆహార సంస్థ (FCI) వద్ద ప్రస్తుతం 270.89 లక్షల టన్నుల ధాన్యం, 540.80 లక్షల టన్నుల గోధుమ- మొత్తం (ప్రస్తుతం కొనసాగుతున్న వరి, గోధుమ కొనుగోళ్లతో గిడ్డంగులకు చేరాల్సిన ఆహారధాన్యాల కాకుండా) 811.69 లక్షల టన్నుల మేర ఆహారధాన్యాల నిల్వలున్నాయి. కాగా, దేశవ్యాప్తంగా జాతీయ ఆహార భద్రత చట్టం (NFSA) కింద, ఇతర సంక్షేమ పథకాల కోసం నెలకు సుమారు 55 లక్షల టన్నుల ఆహారధాన్యాలు అవసరం. ఈ నేపథ్యంలో స్వయం సమృద్ధ భారతం ప్యాకేజీ కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు 5.48 లక్షల టన్నుల ఆహారధాన్యాలు తీసుకెళ్లాయి. ఇందులో 22,812 టన్నుల మేర మొత్తం (మే నెలలో 35.32 లక్షల మంది, జూన్‌ నెలలో 10.30లక్షల మంది వంతున) 45.62 లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీ చేశాయి. ఇక పీఎంజీకేవై కింద ఏప్రిల్‌-జూన్‌ మధ్య 3 నెలలకు పంపిణీ కోసం 104.3 లక్షల టన్నుల ధాన్యం, 15.2 లక్షల టన్నుల గోధుమ అవసరం. ఇందులో వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు 94.71 లక్షల టన్నుల ధాన్యం, 14.20 లక్షల టన్నుల గోధుమలను తరలించుకు వెళ్లాయి.  

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631235

కోవిడ్‌-19 ఆటంకపరచినా 2020 సెప్టెంబరుకల్లా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి మొదలయ్యే అవకాశం; గోరఖ్‌పూర్‌, బరౌనీ, సింధ్రీలలో 2021 మే నాటికి ఉత్పత్తి ప్రారంభంపై అంచనాలు

దేశంలోని ఐదు ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ పనుల ప్రగతిపై కేంద్ర రసాయనాలు-ఎరువులశాఖ సహాయమంత్రి శ్రీ మన్‌సుఖ్‌ మాండవీయ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా అధికారులతో సమీక్షించారు. కాగా, ‘రామగుండం ఎరువులు-రసాయనాల సంస్థ’ ఇప్పటికే 99.53 శాతం పనులను పూర్తిచేసిందని, మిగిలిన కొద్దిపనులు కోవిడ్‌-19 కారణంగా ఆలస్యమయ్యాయని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ఇవి త్వరలోనే పూర్తికాగలవని, 2020 సెప్టెంబరు ఆఖరుకల్లా అక్కడ యూరియా ఉత్పత్తి మొదలయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. మరో మూడు ఎరువుల కర్మాగారాల పనులు... గోరఖ్‌పూర్‌ 77 శాతం, సింధ్రీ 70 శాతం, బరౌనీ 69 శాతం వంతున పూర్తయినట్లు చెప్పారు. ఈ మూడు ఫ్యాక్టరీల పునరుద్ధరణ పనులు 2021 మే నెలనాటికి పూర్తికాగలవని అంచనా వేసినట్లు తెలిపారు.  

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631144

జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లో భూ ప్రకంపనలు: ‘భయపడనక్కర్లేదు’... జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం అధిపతి భరోసా

ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లో ఇటీవల భూగర్భంలో ప్రకంపనలు కనిపించినప్పటికీ భయాందోళనలకు గురికావద్దని జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం (NCS) డైరెక్టర్‌ డాక్టర్‌ బి.కె.బన్సాల్‌ ప్రజలకు భరోసా ఇచ్చారు. అయితే, భూకంపం ముప్పును తగ్గించే దిశగా ఉపశమన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630974

అనుభవ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ‘సహకార మిత్ర’ పథకానికి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ శ్రీకారం

ఈ పథకాన్ని ప్రారంభించిన అనంత‌రం శ్రీ తోమర్ మాట్లాడుతూ- విశిష్ట సహకార రంగ ఆర్థికాభివృద్ధి సంస్థ అయిన ‘నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ (NCDC) సహకార రంగ వ్యవస్థాపన అభివృద్ధి పర్యావరణ వ్యవస్థలో సామర్థ్య వికాసం ద్వారా అనేక కార్యక్రమాలను ప్రారంభించిందని చెప్పారు. ఇందులో భాగంగా  యువతకు ఉప‌కార వేత‌నంతో కూడిన అనుభ‌వ శిక్ష‌ణ క‌ల్పిస్తున్న‌ట్లు చెప్పారు. దీంతోపాటు యువ స‌హ‌కార వ్య‌వ‌స్థాప‌కుల‌కు అంకుర సంస్థ‌ల త‌ర‌హాలో సరళీకృత ష‌ర‌తుల‌తో ప్రాజెక్టు రుణాలు కూడా ల‌భిస్తాయ‌న్నారు. అలాగే యువ వృత్తి నిపుణుల న‌వ్య‌-ఆవిష్క‌ర‌ణాత్మ‌క ఆలోచ‌న‌లను స‌హ‌కార సంస్థ‌ల‌కు అందుబాటులోకి తేవ‌డంలో స‌హ‌కార మిత్ర ప‌థకం తోడ్ప‌డుతుంద‌ని చెప్పారు. అదే స‌మ‌యంలో అనుభ‌వ శిక్ష‌ణార్థులకు ఈ రంగంలో స్వావ‌లంబ‌న దిశ‌గా అనుభ‌వ స‌ముపార్జ‌న వీలుంటుందని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631253

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • మహారాష్ట్ర: రాష్ట్రంలో గురువారం 3607 కొత్త కేసులతో మొత్తం కేసుల 97,648కు చేరాయి. ఇందులో 47,968 యాక్టివ్‌ కేసులు కాగా, నిన్న 152 మరణాలు నమోదయ్యాయి. హాట్‌స్పాట్ ముంబైలో 1540 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 53,985కు పెరిగింది. నగరంలోని ఆస్పత్రులలో పడకల కోసం కోవిడ్-19 రోగులు ఎదుర్కొంటున్న కష్టాలను పరిగణనలోకి తీసుకున్న బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ వికేంద్రీకృత ఆస్పత్రి పడకల నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు మొత్తం 24 వార్డుల్లో అమలులోకి తెచ్చింది.
  • గుజరాత్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 513 తాజా కేసుల నమోదుతో గుజరాత్‌లో మొత్తం కేసులు 22,032కు పెరిగాయి. గత 24 గంటల్లో 366మంది డిశ్చార్జ్ కాగా, కోలుకునేవారి సంఖ్య 15,109కి చేరింది. అలాగే గడచిన 24 గంటల్లో మరో 38 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,385కు పెరిగింది. కాగా, ప్రైవేటు ప్రయోగశాలల్లో రోగ నిర్ధారణ పరీక్షల నిషేధంపై నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు MD వైద్య విద్యార్హతగల ప్రైవేట్ వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఆధారంగా ఇవాళ్టినుంచి పరీక్షలు చేసేందుకు అనుమతించింది.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఈ ఉదయందాకా 92 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో అధికశాతం సిరోహి నుంచి నమోదు కాగా, జైపూర్ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో కోలుకునేవారు 74 శాతానికిపైగా నమోదవడం ఓ సానుకూల పరిణామం. ఈ మేరకు మొత్తం 11,930 మంది రోగులలో ఇప్పటిదాకా 8843 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,818 కాగా, ఇప్పటిదాకా 269 మంది మరణించారు.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో మొత్తం కేసుల 10,241కి చేరగా, వీరిలో గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు కూడా ఉన్నాయి. ఇక గురువారం 4 మరణాలు సంభవించడంతో మరణాల సంఖ్య 431కి పెరిగింది. రాష్ట్రంలో మే 31న దిగ్బంధం సడలించినప్పటి నుంచి 2,152 కొత్త కేసులు అదనంగా చేరాయి.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో నిన్న 46 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 1398కి చేరింది. వీటిలో 945 యాక్టివ్‌ కేసులున్నాయి.
  • గోవా: రాష్ట్రంలో నిన్న 30 కొత్త కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 417కు పెరిగింది. వీటిలో 350 యాక్టివ్‌ కేసులున్నాయి.
  • పంజాబ్: కోవిడ్ వ్యాధి సామాజిక వ్యాప్తి, రాష్ట్రంలో మహమ్మారి తీవ్రస్థాయికి చేరేందుకు ఇంకా రెండు నెలల వ్యవధి ఉందన్న అంచనాల నడుమ- పంజాబ్‌ అంతటా వారాంతాల్లో, ప్రభుత్వ సెలవు దినాల్లో కఠిన దిగ్బంధం అమలుకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. ఆ మేరకు ఈ-పాస్ ఉన్నవారు మినహా మరెవరూ సంచరించకుండా చూడాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా ఇలాంటి కఠిన చర్యలు అవసరమని, తద్వారా ఈ కేసుల తీవ్ర స్థాయికి చేరకుండా నిరోధించడం సాధ్యమని ఆయన అన్నారు. కరోనా వైరస్‌కు టీకా లేదా సముచిత చికిత్స ఏదీ సమీప భవిష్యత్తులో లభించే అవకాశం లేనందువల్ల మహమ్మారిపై పోరుకు కఠిన విధానాలు మాత్రమే మార్గమన్నారు.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో ‘హమ్‌కేర్‌, ఆయుష్మాన్ భారత్ పథకాల కింద కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్స సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. మహమ్మారి కారణంగా సమాజంలోని దుర్బలవర్గాలకు వర్గాలవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్రంలోని సుమారు 5.69 లక్షల మంది అర్హతగలవారికి మూడు నెలలకుగాను ముందుగానే సామాజిక భద్రత పెన్షన్ అందజేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా 44,000 కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేసినట్లు వెల్లడించారు.
  • కేరళ: ముంబై నుంచి జూన్ 9న రాష్ట్రానికి తిరిగి వచ్చి కన్నూర్‌లో నిర్బంధవైద్య పర్యవేక్షణలోగల మరో వ్యక్తి మరణించాడు. దీంతో కేరళలో కోవిడ్ మరణాల సంఖ్య 19కి పెరిగింది. మరోవైపు  త్రిస్సూర్‌లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికుల నుంచి పెంచిన చార్జీల వసూలు కోసం ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు సింగిల్‌ జడ్జి బెంచి ఇచ్చిన అనుమతిని కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ నిలిపివేసింది. కాగా, గల్ఫ్‌ దేశాల్లో ఆరుగురు కేరళీయులు కోవిడ్-19కు బలి కావడంతో మొత్తం మరణాల సంఖ్య 215కు పెరిగింది. మొత్తంమీద రాష్ట్రం వెలుపల కోవిడ్-19వల్ల దాదాపు 300మంది మలయాళీలు మరణించారు. రాష్ట్రంలో నిన్న 83 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం 1,258 మంది చికిత్స పొందుతున్నారు.
  • తమిళనాడు: తమిళనాడులో మద్యం ఆన్‌లైన్ లేదా ప్రత్యక్ష విక్రయాలకు ఒక విధానం రూపకల్పన కోసం సుప్రీంకోర్టు  అనుమతించింది. విదేశాలలో చిక్కుకున్న తమిళులకు సంబంధించి మద్రాస్ హైకోర్టు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాతకు నోటీసు జారీచేసింది. చెన్నై-చెంగల్పట్టు సరిహద్దులో అధికారులు వాహన తనిఖీ ముమ్మరం చేసిన నేపథ్యంలో చెల్లుబాటయ్యే ఇ-పాసులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. కాగా, చెన్నైలో మళ్లీ సంపూర్ణ దిగ్బంధం విధిస్తారంటూ వచ్చిన కథనాలు వదంతులు మాత్రమేనని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో నిన్న 1875 కొత్త కేసులు నమోదవగా, 1372మంది కోలుకున్నారు; 23 మంది మరణించారు. చెన్నైలో 1406 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 38716కు చేరింది. యాక్టివ్ కేసులు: 17659, మరణాలు: 349, చెన్నైలో యాక్టివ్ కేసులు: 13,310గా ఉన్నాయి.
  • కర్ణాటక: దిగ్బంధం పూర్తిగా తొలగించిన తర్వాతే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల విద్యార్థులకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తుందని ఉన్నత విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సి.ఎన్.అశ్వత్ నారాయణ్ తెలిపారు. అలాగే వైద్యవిద్యశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ మాట్లాడుతూ ఐఎల్ఐ రోగులను విడిగా పరీక్షించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో నిన్న  204 కొత్త కేసులు నమోదవగా, 114 మంది డిశ్చార్జి అయ్యారు. మూడు మరణాలు నమోదయ్యాయి. మొత్తం నిర్ధారిత కేసులు: 6245, యాక్టివ్‌ కేసులు: 3195, మరణాలు: 72, కోలుకున్నవి: 2976గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రూ.కోట్ల మేర ESIC కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలున్న నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ నేత కె.అచ్చెన్నాయుడును అవినీతి నిరోధక శాఖ శ్రీకాకుళం జిల్లాలో అరెస్ట్ చేసింది. కాగా, రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ పద్ధతుల్లో 9,712 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ఉద్యోగి ఒకరికి కోవిడ్-19 నిర్ధారణ కావడంతో ఆలయం మూసివేయబడింది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 11,775 నమూనాలను పరీక్షించగా, 141 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 59మంది డిశ్చార్జ్ కాగా, మరణాలేవీ సంభవించలేదు. మొత్తం కేసులు: 4402. యాక్టివ్: 1723, రికవరీ: 2599, మరణాలు: 80గా ఉన్నాయి.
  • తెలంగాణ: గాంధీ ఆసుపత్రిలో సమ్మె చేస్తున్న జూనియర్ వైద్యులు ఇవాళ ఉదయం కొన్ని షరతులతో ఆందోళన విరమించి, వెంటనే విధులకు హాజరయ్యారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా వైరస్ తిరిగి పట్టుబిగించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,320కి పెరిగింది. వీటిలో 2,162 యాక్టివ్‌ కేసులున్నాయి.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో ఇప్పటివరకు 13,479 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మొత్తం కేసులు 67 కాగా, వీటిలో 63 యాక్టివ్‌ కేసులున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో దిగ్బంధం ఉల్లంఘనల సంఖ్య 12,272కు చేరగా, పోలీసులు 624 మందిని అరెస్జ్‌ చేయడంతోపాటు 891 వాహనాలను స్వాధీనం చేసుకుని జరిమానా కింద రూ.27 లక్షలు వసూలు చేశారు.
  • మణిపూర్: కమ్‌జోంగ్‌, నోనీ జిల్లాల కోసం ఆరోగ్యశాఖ మంత్రి ఇవాళ రెండు అంబులెన్సు వాహనాలు అందజేశారు. కోవిడ్‌-19 నిర్ధారిత, సంభావ్య రోగుల రవాణా కోసం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం కింద వీటిని సమకూర్చారు.
  • మిజోరం: చెన్నై నుంచి మిజోరం తిరిగి వచ్చిన వారందరికీ కోవిడ్‌ నిర్ధారణ పరీక్ష నిర్వహిస్తామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. చెన్నై తిరిగి వచ్చినవారికి వివిధ రాష్ట్రాల్లో తప్పనిసరిగా పరీక్షలు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
  • నాగాలాండ్: రాష్ట్రంలో పెట్రోలియం ఉత్పత్తులపై కోవిడ్‌-19 రుసుము విధింపును వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రభుత్వ స్పందన సమర్పణ కోసం గువహటి హైకోర్టు-కోహిమా ధర్మాసనం మూడు వారాల గడువిచ్చింది. కాగా, నాగాలాండ్‌కు తిరిగివచ్చిన లోథా తెగ వారికోసం దిపూపర్‌వద్ద సంప్రదాయ పద్ధతిలో నిర్మించిన పూరిళ్లు ఎదురుచూస్తున్నాయి. సంప్రదాయ నాగాశైలిలో నిర్మించిన ఈ పూరిళ్లలో ఒక్కొక్కదానిలో 15 మంది లోథాలు ఉంటారు.
  • త్రిపుర: రాష్ట్రంలో కోవిడ్‌-19 పరిస్థితిపై చర్చించడానికి ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖతోపాటు ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు.

 

Image

*****



(Release ID: 1631278) Visitor Counter : 260