రక్షణ మంత్రిత్వ శాఖ
దేశీయ రక్షణ ఉత్పత్తుల రంగానికి పెద్ద ఊరట
వస్తువులు లేదా సేవల కాంట్రాక్టులకు నాలుగు నెలల మినహాయింపు
ఈ గడువు కాలంలో కాంట్రాక్ట్ పూర్తి చేయకపోయినా చర్యలుండవు
స్వదేశీ కాంట్రాక్టర్లకు మాత్రమే ఈ అవకాశం
Posted On:
12 JUN 2020 12:36PM by PIB Hyderabad
కరోనా కారణంగా స్వదేశీ రక్షణ రంగ ఉత్పత్తులపై ప్రభావం పడి, ప్రస్తుతమున్న కాంట్రాక్టులను సకాలంలో పూర్తి చేయలేకపోతున్న దేశీయ కాంట్రాక్టర్లకు ఊరటనిచ్చేలా భారత రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వస్తువులు లేదా సేవల పంపిణీ కాంట్రాక్టులకు నాలుగు నెలల వెసులుబాటు కల్పించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తర్వాత, దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువడ్డాయి. మార్చి 25 నుంచి జులై 24వ తేదీ వరకు ఈ వెసులుబాటు అమల్లో ఉంటుందని ఆదేశాల్లో రక్షణ శాఖ పేర్కొంది. కాంట్రాక్ట్ సామగ్రి లేదా సేవల పంపిణీలో జాప్యం, ద్రవ్య నష్టాలపై రుసుములు విధించేటప్పుడు వెసులుబాటు కాలం మినహాయించబడుతుందని కూడా ఆదేశాల్లో పేర్కొంది.
కరోనా కారణంగా దెబ్బతిన్న దేశీయ రక్షణ ఉత్పత్తుల రంగానికి ఇది పెద్ద ఊరటగా మారనుంది. వెసులుబాటు కాల వ్యవధిలో, భారతీయ వ్యాపారులు కాంట్రాక్ట్ వస్తువులు లేదా సేవలను పంపిణీ చేయాల్సిన అవసరం లేదు. ఈ నిర్ణయంతో ప్రభావితమయ్యే ఒప్పందాల్లో ప్రత్యేకంగా సవరణలు చేయాల్సిన అవసరం లేదని కూడా రక్షణ శాఖ వెల్లడించింది.
ఉత్పత్తులు లేదా సేవల పంపిణీలో మినహాయింపుల కోసం విదేశీ కాంట్రాక్టర్లు రక్షణ శాఖను సంప్రదించాలి. ఆయా దేశాల్లో ఉన్న పరిస్థితులను బట్టి విదేశీ కాంట్రాక్టర్ల విషయంలో నిర్ణయం తీసుకుంటారు.
(Release ID: 1631141)
Visitor Counter : 321