రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ఐదు ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణపై

మాండవీయ సమీక్ష

కోవిడ్ సంక్షోభం ఎదురైనా, సెప్టెంబర్ నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్న రామగుండం ప్లాంట్..

గోరఖ్ పూర్, బరౌనీ, సింధ్రీ కర్మాగారాల్లో
వచ్చే ఏడాది మేనెలకల్లా ఉత్పత్తి మొదలు

ఐదు ఎరువుల ప్లాంట్ల పనులు పూర్తయ్యేలా చూడాలని
అధికారులకు మాండవీయ ఆదేశం

Posted On: 12 JUN 2020 2:17PM by PIB Hyderabad

  దేశంలోని ఐదు ఎరువుల కర్మాగారాల పునురుద్ధరణ ప్రక్రియపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి మన్ సుఖ్ మాండవీయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎరువుల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిగింది.

గోరఖ్ పూర్, బరౌనీ, సింధ్రీలోని హిందూస్తాన్ ఉర్వరక్ రసాయన్ లిమిటెడ్ (HURL) ప్లాంట్లు, రామగుండం ఎరువుల, రసాయనాల సంస్థ (RFCL), తాల్చేర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (TFL) ప్లాంట్లపై సమీక్ష జరిగింది. ఐదు ఎరువుల కర్మాగారాలను నిర్వహిస్తున్న RFCL, HURL, TFL సంస్థల సీనియర్ అధికారులు సమీక్షకు హాజరయ్యారు.

ఎరువుల కర్మాగారాల ఆర్థిక ప్రగతి, ఇతర అభివృద్ధి అంశాలపై సమావేశంలో మంత్రి సమీక్షించారు.  కర్మాగారాల పనరుద్ధరణ పనులను సత్వరం పూర్తి చేసేందుకు సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకోవాలని కేంద్రమంత్రి సందర్భంగా అధికారులను ఆదేశించారు.

 

  రామగుండం ఎరువుల రసాయనాల కర్మాగారం అభివృద్ధి పనులు ఇప్పటికే 99.53శాతం పూర్తయ్యాయని, కోవిడ్ వైరస్ సంక్షోభం తలెత్తిన కారణంగా ఏవో కొన్ని చిన్న పనుల్లో కాస్త జాప్యం చోటుచేసుకుందని సమావేశంలో అధికారులు మంత్రికి తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలకల్లా రామగుండం ప్లాంట్ లో ఎరువుల ఉత్పాదన మొదలవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.

అలాగే, గోరఖ్ పూర్ ఎరువుల కర్మాగారం పనులు 77శాతం, సింధ్రీ ప్లాంట్ పనులు 70శాతం, బరౌనీ కర్మాగారం పనులు 69శాతం పూర్తయ్యాయని అధికారులు వివరించారు. గోరఖ్ పూర్, సింధ్రీ, బరౌనీ ప్లాంట్లు వచ్చే ఏడాది మే నెలలోగానే పూర్తవుతాయన్నారు. ఒడిశాలోని తాల్చేర్ ఎరువుల కర్మాగారంలో ప్రస్తుతం ప్రాజెక్టు అవకాశాలపై అంచనా, డిజైన్ల రూపకల్పన పని కొనసాగుతోందని చెప్పారు. కోవిడ్ వైరస్ సంక్షోభం కారణంగా అనేక సవాళ్లు ఎదురై, పనుల్లో కొంత జాప్యం జరిగినప్పటికీ, వేగంగా పని పూర్తిచేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అధికారులు మంత్రికి తెలపారు.

  యూరియా రంగంలో కొత్త పెట్టుబడులకు అవకాశం కల్పించేందుకు, ఈ రంగంలో దేశాన్ని స్వయంసమృద్ధితో తీర్చిదిద్దేందుకు భారత ప్రభుత్వం 2012లో కొత్త పెట్టుబడుల విధానాన్ని ప్రకటించింది. మూతబడిన ఐదు ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం విధానం కిందనే చర్యలు తీసుకుంటోంది. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  (FCIL), హిందూస్తాన్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (HFCL) పరిధిలోని ఐదు ఎరువుల ప్లాంట్లను ప్రభుత్వం ఇపుడు పునరుద్ధరిస్తోంది.

 

ప్రభుత్వం పునరుద్ధరిస్తున్న 5 ప్రభుత్వ రంగ ప్లాంట్లు...

---రామగుండం ఎరువుల, రసాయనాల కర్మాగారం (RFCL)

---తాల్చేర్ ఎరువుల కర్మాగారం ( TFL)

---హిందూస్తాన్ ఉర్వరక్, రసాయన్ లిమిటెడ్ కు చెందిన 3 ప్లాంట్లు  (గోరఖ్ పూర్, బరౌనీ, సింధ్రీ).

***



(Release ID: 1631144) Visitor Counter : 271