ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్స్
49.47 శాతానికి పెరిగిన రికవరీ రేటు
కోవిడ్ నుంచి కోలుకున్న మొత్తం 1,47,194 మంది.
Posted On:
12 JUN 2020 4:00PM by PIB Hyderabad
కోవిడ్ పాజిటివ్ కేసుల రికవరీ రేటు పెరుగుతూ 49.47 శాతానికి చేరుకుంది. మొత్తం 1,47, 194 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. 1,41,842 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటలలో 6,166 మంది కోవిడ్ వైరస్ నుంచి కోలుకున్నారు.
వ్యాధికి గురైనవారి సంఖ్య రెట్టింపు అయ్యే రేటు, సమయం మెరుగుపడుతూ వస్తున్నాయి. ఇది లాక్‌డౌన్ ప్రారంభ సమయంలో 3.4 రోజుల నుంచి ప్రస్తుతం 17.4 రోజులకు పెరిగింది..
వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల పట్టణాభివృద్ధి కార్యదర్శులతో కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ నియంత్రణ, పరీక్షల నిర్వహణ, వైరస్ బారిన పడిన వారి గుర్తింపు, ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి, కేసుల క్లినికల్ మేనేజ్‌మెంట్, కోవిడ్ -19 నియంత్రణలో కమ్యూనిటీ భాగస్వామ్యం తదితర అంశాలపై దృష్టిపెట్టాల్సిందిగా ఆయన రాష్ట్రాలకు సూచించారు.
వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువుగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిందిగా రాష్ట్రాలకు సూచించారు. అలాగే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠినమైన కంటైన్‌మెంట్ చర్యలు చేపట్టవలసిందిగా కోరారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఇంటినీ పరిశీలించాలని, కంటైన్‌మెంట్ జోన్‌లలో ప్రత్యేక బృందాలను ఇందుకోసం ఏర్పాటు చేయాలని , ప్రాథమిక దశలోనే కేసుల గుర్తింపు అత్యంత కీలకమని రాష్ట్రాలకు సూచించడం జరిగింది. కేసుల అంచనాకు అనుగుణంగా ఆస్పత్రులలో మౌలిక సదుపాయాల స్థాయిని పెంచడం, అవసరమైన పరికరాలను సమకూర్చుకోవడం (ఉదాహరణకు ఆక్సీ మీటర్లు), శిక్షణపొందిన మానవ వనరులు అంటే వైద్యులు, స్టాఫ్ నర్సులు, నాన్ క్లినికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవడం వంటివి చేయాలని కూడా రాష్ట్రాలకు సూచించారు.
వయోధికులు, ఇతర అనారోగ్య సమస్యలు కలిగిన వారికి వైరస్ సోకకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరమని ఈ సమావేశంలో రాష్ట్రాలకు నొక్కి చెప్పారు. ఎయిమ్స్ ఢిల్లీ వంటి సంస్థల కొలాబరేషన్‌తో క్లినికల్ విధానాలను మెరుగుపరచుకుంటూ ఆయా వ్యాధి లక్షణాల ఆధారంగా సకాలంలో రెఫరల్ ఆస్పత్రులకు పంపించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి సంబంధించి పెద్ద ఎత్తున కమ్యూనిటీకి అవగాహన కల్పించడం, సామాజిక దూరాన్ని ప్రోత్సహించడం, కమ్యూనిటీలో కోవిడ్ నియంత్రణకు అనువైన విధానాలను అన్ని కాలాలలో అనుసరించడాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.
ఐసిఎంఆర్ దేశంలో కోవిడ్ పరీక్షల సామర్ద్యాన్ని మరింత పెంచుతూ వస్తోంది. దేశం మొత్తం మీద 877 ప్రయోగశాలలు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఇందులో 637 ప్రభుత్వ ప్రయోగశాలలు కాగా, 240 ప్రైవేటు ప్రయోగశాలలు. గడచిన 24 గంటలలో 1,50,305 శాంపిళ్ళను పరీక్షించారు. ఇప్పటివరకు మొత్తం 53,63,445 శాంపిళ్ళను పరీక్షించారు.
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనల కోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/,@MoHFW_INDIA .
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in ., @CovidIndiaSeva కు పంపవచ్చు
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
****
(Release ID: 1631237)
Visitor Counter : 248
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam