PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 06 JUN 2020 6:27PM by PIB Hyderabad

(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • గత 24 గంటల్లో 4,611 మంది కోలుకోగా కోవిడ్‌-19 నయమైనవారి సంఖ్య 1,14,073కు పెరిగి, కోలుకునేవారి శాతం 48.2కు చేరింది.
  • 1,15,942 యాక్టివ్‌ కేసులు వైద్య పర్యవేక్షణలో ఉండగా.. మరణాలు 6,642గా నమోదయ్యాయి.
  • గత 24 గంటల్లో 1,37,938 నమూనాలు పరీక్షించగా; ఇప్పటివరకూ మొత్తం పరీక్షల సంఖ్య 45,24,317గా ఉంది.
  • వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల్లో నిమగ్నమైన రైతులకు, గ్రామీణ భారతానికి ఉత్తేజ‌మిచ్చే లక్ష్యంతో రాష్ట్రపతి రెండు ఆర్డినెన్సుల‌ను జారీచేశారు.

 

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం

గడచిన 24 గంటల్లో 4,355 మందికి కోవిడ్‌-19 నయంకాగా, ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 1,14,073కు చేరిన నేపథ్యంలో కోలుకునేవారి శాతం 48.20గా నమోదైంది. ప్రస్తుతం 1,15,942 యాక్టివ్‌ కేసులు చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నాయి. మరోవైపు నవ్య కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులను కనుగొనే దిశగా పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని ఐసీఎంఆర్‌ మరింత పెంచింది. ఆ మేరకు  దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రయోగశాలల సంఖ్య 520కి, ప్రైవేటు ప్రయోగశాలల సంఖ్య 222కు (మొత్తం 742 ల్యాబ్‌లు) చేరగా, గత 24 గంటల్లో 1,37,938 నమూనాలను పరీక్షించారు. దీంతో దేశమంతటా ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 45,24,317కి చేరింది.

 

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629881

ఆపరేషన్‌ సముద్ర సేతు – మాలె నుంచి 700 మంది భారతీయులతో ట్యుటికోరిన్‌ బయల్దేరిన ఐఎన్‌ఎస్‌ జలాశ్వ

భారత నావికాదళ నౌక జలాశ్వ తన మూడో విడత ప్రయాణంలో 04 జూన్‌ 20న మాల్దీవ్స్‌ రాజధాని మాలె చేరింది. ఆపరేషన్‌ సముద్ర సేతుకింద విదేశీ రేవు పట్టణాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశం తరలించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి భారత నావికాదళం తనవంతు సేవలందిస్తోంది. ఇందులో భాగంగా 05 జూన్‌ 20న సాయంత్రం 700 మంది భారతీయులతో తిరిగి భారత్‌కు బయల్దేరిన ఐఎన్‌ఎస్‌ జలాశ్వ 07 జూన్‌ 20న ట్యుటికోరిన్‌ చేరుకోనుంది. సముద్ర ప్రయాణం సందర్భంగా ఈ నౌకలో  కోవిడ్‌ సంబంధిత విధివిధానాలను తూచా తప్పకుండా పాటిస్తారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629907

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రువాండా అధ్యక్షుడు గౌరవనీయ పాల్‌ కగామీల మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రువాండా అధ్యక్షుడు గౌరవనీయ పాల్‌ కగామీ టెలిఫోన్‌ ద్వారా సంభాషించారు. కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా రెండు దేశాల ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు ఎదురైన సవాళ్ల గురించి ఈ సందర్భంగ వారిద్దరూ చర్చించారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడంతోపాటు పౌరుల సంక్షేమం కోసం తమతమ దేశాల్లో తీసుకున్న చర్యల గురించి సమాచారం ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో రెండు దేశాల్లోని భారత, రువాండా పౌరులకు వీలైనంత సహాయసహకారాలు అందించేందుకు పరస్పరం అంగీకరించారు. కరోనావైరస్‌పై పోరాటంలో రువాండాకు సహాయపడటంతోపాటు వైద్యపరంగానూ సహకారం అందిస్తామని రువాండా అధ్యక్షుడికి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629774

వ్యవసాయ రంగం, గ్రామీణ భారతానికి ఉత్తేజ‌మిచ్చే లక్ష్యంతో రెండు ఆర్డినెన్సులు జారీచేసిన రాష్ట్రప‌తి

‘స్వ‌యం స‌మృద్ధ భార‌తం’ కార్య‌క్ర‌మంలో భాగంగా రైతుల ఆదాయం పెంపుదిశ‌గా వ్యవసాయ రంగంలో సంస్కరణల అమ‌లుకు కేంద్ర ప్రభుత్వం చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యాలు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో వ్య‌వ‌సాయం, అనుబంధ కార్య‌క‌లాపాల్లో నిమ‌గ్న‌మైన రైతుల‌కు, గ్రామీణ భారతానికి ఉత్తేజ‌మిచ్చే రెండు ఆర్డినెన్సులపై రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది: ఈ మేర‌కు “రైతు ఉత్ప‌త్తులు.. వ‌ర్త‌క-వాణిజ్యం (ప్రోత్సాహం, స‌దుపాయాలక‌ల్ప‌న‌) ఆర్డినెన్స్‌-2020”తోపాటు “రైతుకు (సాధికార‌త‌-ర‌క్ష‌ణ‌) గిట్టుబాటు ధ‌రపై భ‌రోసాకు అంగీకారం-వ్య‌వ‌సాయ సేవ‌ల ఆర్డినెన్స్‌-2020”ని ఆయ‌న జారీచేశారు. దేశ‌వ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ కార్యక‌లాపాల ప‌ర్యావ‌ర‌ణం మొత్తం కోవిడ్‌-19 సంక్షోభంతో ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో రైతులు జాతీయ స్థాయిలో ఎక్కడైనా వ్యవసాయ ఉత్పత్తులను విక్ర‌యించే వెసులుబాటు కల్పించేలా సంస్కరణలను వేగవంతం చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ఒక చట్టం తేవాల్సి వ‌చ్చింది. అంతేకాకుండా సంభావ్య‌ కొనుగోలుదారుల సంఖ్యను అధికం చేయ‌డం ద్వారా రైతు తానెంచుకున్న ప్రాంతంలో, మెరుగైన ధ‌ర‌కు త‌న ఉత్ప‌త్తుల‌ను విక్ర‌యించుకునే అవకాశం క‌ల్పించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను కూడా ప్ర‌భుత్వం గుర్తించింది. అందుకు తగినట్లు వ్యవసాయ ఉత్పత్తుల విక్ర‌య‌ ఒప్పందాలకు అనువైన విధానం కూడా అవసరమని భావించి, ఈ రెండు ఆర్డినెన్సులను జారీచేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629810

‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ స్కీమ్‌’ కింద మంజూరు చేసిన పనుల ప్రగతిపై హెచ్‌ఆర్‌డి మంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం

దేశంలో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ స్కీమ్‌’ (IoE)కింద మంజూరు చేసిన వివిధ పనుల ప్రగతిపై మానవ వనరుల అభివృద్ధిశాఖ (MHRD) మంత్రి శ్రీ రమేస్‌ పోఖ్రియాల్‌ ‘నిషాంక్‌’ తన అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ పనులతోపాటు ‘ఉన్నతవిద్య ఆర్థిక సహాయ సంస్థ’ (HEFA)ను పర్యవేక్షించేందుకు 15 రోజుల్లోగా మంత్రిత్వశాఖలో ఒక ప్రాజెక్టు నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. అలాగే ఐవోఈ అవగాహన ఒప్పందం మేరకు దీని పరిధిలోని వివిధ ప్రభుత్వ సంస్థలు చేసే వ్యయం కోసం ఎంహెచ్‌ఆర్‌డి నిధులను విడుదల చేస్తుందని శ్రీ నిషాంక్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుతం నిర్మాణ కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో ఈ కార్యకలాపాలను వేగిరం చేయాల్సిందిగా ఆయన కోరారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629778

భారత-ఆస్ట్రేలియాల మధ్య ద్వైపాక్షిక శాస్త్రవిజ్ఞాన సహకారం కింద కోవిడ్‌-19 పరిశోధనల కోసం ప్రతిపాదనలకు ఆహ్వానం

భారత, ఆస్ట్రేలియాల మధ్య 2020లో కోవిడ్‌-19 ద్వైపాక్షిక సహకారంపై ప్రధానమంత్రులు శ్రీ నరేంద్ర మోదీ, గౌరవనీయ స్కాట్‌ మారిసన్‌ సంయుక్త ప్రకటన చేశారు. ఈ మేరకు 2020 జూన్‌ 4నాటి భారత-ఆస్ట్రేలియా నాయకుల వర్చువల్‌ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రకటించారు. తదనుగుణంగా భారత ప్రభుత్వంలోని శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ (DST), ఆస్ట్రేలియా ప్రభుత్వంలోని పరిశ్రమలు-శాస్త్ర, ఇంజనీరింగ్‌-వనరులశాఖ (DISER)  కోవిడ్‌-19పై సంయుక్త పరిశోధన ప్రాజెక్టులకు ప్రతిపాదనలను ఆహ్వానించాయి. ఈ మేరకు ‘భారత-ఆస్ట్రేలియా వ్యూహాత్మక పరిశోధన నిధి’ (AISRF) కింద ఆసక్తిగల పరిశోధకులు, శాస్త్రవేత్తలు ముందుకు రావాలని సూచించాయి. కాగా, శాస్త్రవిజ్ఞాన రంగంలో భారత-ఆస్ట్రేలియా ప్రభుత్వాల సంయుక్త నిర్వహణ-నిధి వితరణతో ఈ వేదిక పనిచేస్తుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629703

మోదీ ప్రభుత్వం 2.0 ఏడాది పాలనలో ఈశాన్యభారత అభివృద్ధి మంత్రిత్వశాఖ సాధించిన విజయాలపై కరదీపిక, ఈ-వెర్షన్లను ఆవిష్కరించిన  డాక్టర్ జితేంద్ర సింగ్

ఈశాన్య భార‌త ప్రాంతం దేశానికి ఒకవిధంగా ఆదర్శప్రాయంగా మారిందని కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ అన్నారు. గడచిన ఆరేళ్లలో అభివృద్ధికి విజయవంతమైన నమూనాగా ఆవిర్భవించడంతోపాటు కరోనా వైరస్‌ నిర్వహణలోనూ మిగిలిన రాష్ట్రాలకు మార్గదర్శిగా రూపొందిందని పేర్కొన్నారు. అలాగే పూర్వ పరిస్థితులను తిరిగి నెలకొల్పడంలోనూ దేశం మొత్తానికీ మార్గనిర్దేశం చేసిందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం గత ఆరేళ్లలో ఈశాన్య భారత ప్రాంతానికి ఇచ్చిన ప్రాముఖ్యం, ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని డాక్టర్‌ సింగ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629979

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్‌-19 పరీక్షల కోసం మొత్తం 10,790 నమూనాలను సేకరించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 46 కాగా, ఒక వ్యక్తి కోలుకున్నారు. మరో 1700 నమూనాల పరీక్ష ఫలితాలు వెలువడాల్సి ఉంది.
  • అసోం: రాష్ట్రంలో రెండుసార్లు కోవిడ్‌-19 పరీక్షల తర్వాత వ్యాధి నయమైనట్లు ఫలితాలు రావడంతో 38 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 547కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1770గా ఉంది.
  • మణిపూర్: రాష్ట్రంలో మరో 11 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 143కు చేరింది. కాగా, 52 మంది (36 శాతం) కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
  • మిజోరం: రాష్ట్రంలో కోవిడ్‌-19 నమూనాలను పరీక్షించేందుకు RT-PCR యంత్ర పరికరం అందింది. దీన్ని ఐజాల్‌లోగల జోరం వైద్యకళాశాలలో అమర్చనున్నారు.
  • నాగాలాండ్: నాగాలాండ్‌కు చెందిన 12 మంది పౌరులు ఇవాళ అసోంలోని గువహటినుంచి ఎయిరిండియా విమానంలో తిరిగి వచ్చారు. వీరందరికీ తప్పనిసరి ఆరోగ్య తనిఖీతోపాటు వర్గీకరించడం కోసం అగ్రి ఎక్స్‌పో ప్రాంగణానికి తరలించారు. నాగాలాండ్‌లో ట్రూ-నాట్ యంత్రాల కోసం విడిభాగాల కొనుగోలుకు మొకోక్‌చంగ్‌ వాణిజ్య-పరిశ్రమల సమాఖ్య జిల్లా కోవిడ్‌-19 కార్యాచరణ బృందానికి రూ.3 లక్షలు విరాళంగా ఇచ్చింది.
  • కేరళ: రాష్ట్రంలో మరో కోవిడ్‌-19 మరణం నమోదు కావడంతో మొత్తం మరణాల సంఖ్య 15కు చేరింది. ఈ మేరకు మళప్పురంలోగల మంజేరి వైద్యకళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, సంతోష్ ట్రోఫీ ఆటగాడు హంసాకోయా (63) ఇవాళ తుదిశ్వాస విడిచారు. రాష్ట్రంలో ప్లాస్మా థెరపీ చికిత్స పొందిన తొలి వ్యక్తి ఆయనే కావడం విశేషం. కాగా, ఆయన కుటుంబంలో మరో ఐదుగురికీ కోవిడ్‌ వ్యాధి సోకిన నేపథ్యంలో వారు కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కోళికోడ్‌లోని వైద్య కళాశాల ఆస్పత్రిలో కోవిడ్-19 రోగితో సన్నిహిత సంబంధాలున్న 190మంది ఆరోగ్య కార్యకర్తల నమూనాలను పరీక్షించగా, 118మందికి వ్యాధి సోకలేదని తేలింది. ఇక గల్ఫ్‌ దేశాల్లో మరో ఆరుగురు కేరళీయులు మరణించడంతో ఇప్పటిదాకా మరణించినవారి సంఖ్య 170 దాటింది. ఇక రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య నిన్న మరో 111 మందికి వ్యాధి సోకగా ప్రస్తుతం 973 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.
  • తమిళనాడు: పుదుచ్చేరిలోని ఇందిరాగాంధీ వైద్యకళాశాల ఆస్పత్రి జూన్ 8 నుంచి కోవిడేతర రోగులకు వైద్యసేవలు అందించనుంది. మరోవైపు ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మరో ఐదుగురికి వ్యాధి నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 104కు చేరింది. ఇక తమిళనాడులోని ప్రైవేటు ఆస్పత్రులలో కోవిడ్-19 చికిత్సకు ప్రభుత్వం రోజువారీ రేట్లు నిర్ణయించింది. ఈ మేరకు ఐసీయూలో చికిత్సకు గరిష్ఠంగా రూ.15వేలు; జనరల్ వార్డు, గ్రేడ్-1, 2 ఆసుపత్రులలో గరిష్ఠంగా రూ.7,500, గ్రేడ్-3, 4 ఆస్పత్రులలో రూ.5000 వంతున నిర్ణయించింది. రాష్ట్రంలోని పరిశ్రమలలో వలస కార్మికులకు బదులు తమిళనాడు కార్మికులను నియమించాలని ముఖ్యమంత్రి యాజమాన్యాలను కోరారు. చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఒకవైపు కేసుల సంఖ్య పెరుగుతుండగా, వైద్యసిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. నిన్న చెన్నైలో 1116సహా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1438 కొత్త కేసులతోపాటు 12 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 28694, యాక్టివ్ కేసులు: 12697, మరణాలు: 232, డిశ్చార్జ్: 15762. చెన్నైలో యాక్టివ్ కేసులు 9437గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లను అవసరమైన ముందుజాగ్రత్త చర్యలతోపాటు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తెరవడానికి ప్రభుత్వం అనుమతించింది. కాగా, మహారాష్ట్రనుంచి తిరిగి వచ్చినవారికి రాష్ట్రం కొత్త ప్రామాణి ప్రక్రియ విధివిధానాలను నిర్దేశించింది. ఈ మేరకు పరీక్షల్లో వ్యాధి సోకలేదని తేలినప్పటికీ 21 రోజుల గృహ నిర్బంధం తప్పనిసరి చేసింది. చిక్కమగళూరు జిల్లాలో ఇవాళ 16 మంది రోగులకు వ్యాధి నయం కావడంతో జిల్లా కోవిడ్‌రహితమైంది. కాగా, శుక్రవారం 515 కొత్త కేసుల నమోదుతో ఒకేరోజు నమోదైన కేసుల సంఖ్యలో రికార్డు నెలకొంది. అదే సమయంలో ఎప్పటిలాగానే వీరిలో 482 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం కేసులు: 4835, యాక్టివ్‌ కేసులు: 3088, మరణాలు: 57, కోలుకున్నవి: 1688గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని తిరుమలేశుని ఆలయంలో జూన్ 8 నుంచి ప్రయోగాత్మక దర్శనాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అలిపిరి తనిఖీ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో కోవిడ్‌-19 పరీక్ష కేంద్రంగా రూపొందించారు.  రాష్ట్రంలో మొత్తం 4,36,335 నమూనాలను పరీక్షించగా వీటిలో 1.02 శాతం మాత్రమే నిర్ధారిత కేసులున్నాయి. కొత్త కేసులు 161 కాగా, 29 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక 12,771 నమూనాలను పరీక్షించిన తర్వాత గత 24 గంటల్లో మరణం సంభవించలేదు. మొత్తం కేసులు: 3588. యాక్టివ్: 1192, రికవరీ: 2323, మరణాలు: 73 కాగా, వలసదారులలో నిర్ధారిత రోగుల సంఖ్య 741, కాగా వారిలో 467 మంది యాక్టివ్‌ కేసులు. విదేశాల నుంచి వచ్చినవారికి సంబంధించి 131 కేసులలో 127 యాక్టివ్‌గా ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలోని డయాలసిస్ రోగులు, వారితో ప్రాథమిక పరిచయాలున్నవారు నవ్య కరోనా వైరస్ బారినపడుతున్నారు. శుక్రవారం ఇలాంటి కేసులు నాలుగు నమోదయ్యాయి. దక్షిణభారత స్థాయిలో రెండోశ్రేణి వ్యాధి సంక్రమణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా, కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో దేశంలోనే ఆరో స్థానంలో ఉంది. రాష్ట్రంలో జూన్ 4 నాటికి మొత్తం కేసులు 3290 కాగా- వలసదారులు, విదేశాలనుంచి వచ్చినవారిలో 448 మందికి వ్యాధి నిర్ధారణ అయింది.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో ఇవాళ 2,436 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 80,229కు చేరింది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 42,215గా ఉంది. హాట్‌స్పాట్ ముంబైలో 1,150 కొత్త కేసుల నమోదు నేపథ్యంలో మొత్తం కేసుల సంఖ్య 45,854కు పెరిగింది. అయితే, వీరిలో 25,539 మంది కోలుకోగా వీరి శాతం 43.81గా ఉంది. మరోవైపు మరణాలు 3.55 శాతంగా ఉన్నాయి.
  • గుజరాత్: రాష్ట్రంలో ఇవాళ 510 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 19,000 దాటింది. శుక్రవారం 35 మంది రోగులు మరణించగా, అదేరోజు 344మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోలుకునేవారి శాతం పెరుగుతూ మే చివరి వారంలో 44.3 శాతం నుంచి ప్రస్తుతం 68.05 శాతానికి చేరింది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో ఇవాళ 234 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 8996కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 2734కాగా, కొత్త కేసులలో అధికశాతం ఇండోర్, భోపాల్ హాట్ స్పాట్ల నుంచి నమోదవగా, నీముచ్ జిల్లా తర్వాతి స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఇప్పటిదాకా మరణాలు 384గా ఉన్నాయి.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ 44 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 10,128కి పెరిగింది. కొత్త కేసుల్లో అధికశాతం పాలి, చురు జిల్లాలనుంచి నమోదయ్యాయి. కేసుల రెట్టింపు వ్యవధి రాష్ట్రంలో 20 రోజుల స్థాయికి చేరగా, కోలుకునేవారి శాతం కూడా మెరుగుపడి 70 శాతంకన్నా ఎక్కువగా నమోదైంది.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో శుక్రవారం 127, ఇవాళ 18 వంతున కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 894కు చేరింది. రాష్ట్రంలో మార్చి 18 తర్వాత ఒకేరోజులో ఎక్కువ కేసులు నిన్న నమోదయ్యాయి. మొత్తంమీద గత మూడురోజుల్లోనే 300 కొత్త కేసులు నమోదవడం గమనార్హం.
  • గోవా: గోవాలో 30 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 196కు చేరాయి. కాగా, రాష్ట్రానికి తిరిగి వచ్చిన 415 మంది ప్రయాణికులను ప్రస్తుతం నిర్బంధవైద్య పర్యవేక్షణలో ఉంచారు.

 

******



(Release ID: 1629987) Visitor Counter : 273