వ్యవసాయ మంత్రిత్వ శాఖ

గ్రామీణ భారతం, వ్యవసాయాన్ని బలోపేతం చేసే లక్ష్యం దిశగా రెండు ఆర్డినెన్సులకు రాష్ట్రపతి ఆమోదం

జాతీయ స్థాయిలో అడ్డంకులు లేని వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం చేసుకునేలా రైతులకు వెసులుబాటు
భవిష్యత్‌ పంటలపై తనకు నచ్చిన ధరల వద్ద వ్యాపారులతో ఒప్పందాలు చేసుకునే సాధికారత
నూతన సంస్కరణలతో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని నొక్కివక్కాణించిన కేంద్ర వ్యవసాయ మంత్రి
ఆర్డినెన్సుల అమలు కోసం మద్దతు కోరుతూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర మంత్రి లేఖలు

Posted On: 05 JUN 2020 8:48PM by PIB Hyderabad

    ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా, రైతుల ఆదాయాన్ని పెంచేలా వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించిన నేపథ్యంలో... గ్రామీణ భారతం, వ్యవసాయం, ఇతర అనుబంధ కార్యక్రమాలను మరింత బలోపేతం చేసే క్రింది ఆర్డినెన్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.:

ది ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్&ఫెసిలిటేషన్) ఆర్డినెన్స్‌ 2020
ది ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్ ఆన్‌ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్‌ ఫామ్‌ సర్వీసెస్‌ ఆర్డినెన్స్‌ 2020

    రైతుల ఆదాయం వృద్ధి చేసే లక్ష్యంతో, వ్యవసాయ మార్కెటింగ్‌ సామర్థ్యం, ప్రభావాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ ముందుకుసాగకుండా అడ్డుపడుతున్న కారకాలను గుర్తించడం ద్వారా, "నమూనా వ్యవసాయ ఉత్పత్తులు, పశువుల మార్కెటింగ్‌ (ఏపీఎల్‌ఎం) చట్టం 2017, "నమూనా వ్యవసాయ ఉత్పత్తులు, పశువుల పెంపకం చట్టం 2018" కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.

    వ్యవసాయం, అనుబంధ కార్యక్రమాలన్నీ కొవిడ్‌ సంక్షోభ ప్రభావానికి గురైన నేపథ్యంలో... రైతులు జాతీయ స్థాయిలో ఎక్కడైనా వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునేలా వెసులుబాటు కల్పించేందుకు సంస్కరణలను వేగవంతం చేసి, ఒక చట్టాన్ని తీసుకురావలసిన అవసరం ఏర్పడింది. ఎక్కువమంది కొనుగోలుదారులను అందుబాటులోకి తేవడం ద్వారా, రైతు తన ఇష్టం వచ్చిన ప్రాంతంలో పంటను అమ్ముకునే అవకాశాన్ని కల్పించాల్సిన అవసరాన్ని కూడా కేంద్రం గుర్తించింది. వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకునే ఒప్పందాలకు సౌకర్యవంతమైన విధానం కూడా అవసరమని భావించింది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు ఆర్డినెన్సులకు ఆమోదముద్ర పడింది.

    "ది ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్&ఫెసిలిటేషన్) ఆర్డినెన్స్‌ 2020" (ఆర్డినెన్స్‌పై గెజిట్‌ నోటిఫికేషన్‌ చూసేందుకు క్లిక్‌ చేయండి) దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి అనేక పోటీతత్వ ప్రత్యామ్నాయ మార్గాలను చూపుతుంది. దీనివల్ల రైతులు, వ్యాపారులు స్వేచ్ఛాయుత వాతావరణంలో వారికి నచ్చిన ధరలకు కొనుగోళ్లు, అమ్మకాలు జరపవచ్చు. ఇది, సమర్థవంతమైన, పారదర్శక, అడ్డంకులు లేని జాతీయ స్థాయి వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది. మార్కెట్ల వెలుపల, వివిధ రాష్ట్రాల చట్టాల ప్రకారం గుర్తించిన డీమ్డ్‌ మార్కెట్ల వెలుపల వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే అవకాశాన్ని కూడా ఇది రైతుల ముందుకు తెస్తుంది.

    ది ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్ ఆన్‌ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్‌ ఫామ్‌ సర్వీసెస్‌ ఆర్డినెన్స్‌ 2020, (ఆర్డినెన్స్‌పై గెజిట్‌ నోటిఫికేషన్‌ చూసేందుకు క్లిక్‌ చేయండి) జాతీయ స్థాయిలో వ్యవసాయ ఒప్పందాలు చేసుకునేలా రైతులకు వీలు కల్పిస్తుంది. ఇది, వ్యవసాయ వ్యాపార సంస్థలు, ప్రాసెసర్లు, హోల్‌సేల్‌ వ్యాపారులు, ఎగుమతిదారులు, పెద్దస్థాయి చిల్లర వ్యాపారస్తులతో... ఇరువురికీ సమ్మతమైన ధర వద్ద భవిష్యత్తు పంటలను అమ్ముకునే ఒప్పందాలు చేసుకునేలా రైతులకు రక్షణ కల్పిస్తుంది.

    పై రెండు ఆర్డినెన్సులు, అడ్డంకులు లేని వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారానికి, తనకు నచ్చిన స్పాన్సర్లతో ఒప్పందాలు చేసుకునేలా రైతులకు సాధికారత కల్పిస్తాయి. అత్యంత ప్రాముఖ్యత ఉన్న రైతు స్వేచ్ఛను ఈ రెండు ఆర్డినెన్సుల ద్వారా కేంద్రం అందించింది.

    పై రెండు రెండు ఆర్డినెన్సుల వివరాలను.., కేంద్ర వ్యవసాయం, సహకారం, రైతుల సంక్షేమ విభాగం వెబ్‌సైట్‌ agricoop.nic.in లో చూడవచ్చు.

    కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్‌, ఈ రెండు ఆర్డినెన్సులను వివరిస్తూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. వ్యవసాయ రంగంలో సంస్కరణల అమలుకు సహకరించాలని లేఖలో కోరారు. నూతన సంస్కరణల వాతావరణంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని, ఇందుకోసం రాష్ట్రాల మద్దతును మంత్రి నొక్కివక్కాణించారు.



(Release ID: 1629810) Visitor Counter : 510