రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఆప‌రేష‌న్ స‌ముద్ర సేతు- 700 మంది భారతీయుల‌తో మాలే నుంచి భార‌తకు ప‌య‌న‌మైన ఐఎన్ఎస్ జ‌లాశ్వ‌

Posted On: 06 JUN 2020 11:05AM by PIB Hyderabad

'ఆప‌రేష‌న్ స‌ముద్ర సేతు' కార్య‌క్ర‌మంలో ఐఎన్ఎస్ జ‌లాశ్వ నౌక చురుకుగా పాల్గొంటోంది. ఈ ఆప‌రేష‌న్‌లో భాగంగా మూడో ద‌శ ప‌ర్య‌ట‌న‌లో భారతీయ నావికా దళం నౌక ఐఎన్ఎస్ జ‌లాశ్వ గురువారం (4వ తేదీ) మాల్దీవులోని మాలేకు చేరుకుంది. కోవిడ్ -19 ప్ర‌త్యేక ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. మన పౌరులను విదేశీ తీరాల నుండి సముద్ర మార్గం ద్వారా స్వ‌దేశానికి తీసుకురావడానికి భారత్ మొద‌లుపెట్టిన ప్ర‌య‌త్నానికి భారత నావికా దళం త‌గిన తోడ్పాటును అందిస్తూ వ‌స్తోంది. ఇందులో భాగంగా, ఐఎన్ఎస్ జ‌లాశ్వ నౌక శుక్ర‌వారం (05న‌) సాయంత్రం
మాలే నుంచి 700 మంది భారతీయ పౌరులను తీసుకొని భార‌త్‌కు తిరుగు ప‌య‌న‌మైంది. ఈ

 


సమయంలో జ‌లాశ్వ‌ ఓడను మాల్దీవుల కోస్ట్ గార్డ్ కమాండెంట్ కల్నల్ మొహమ్మద్ సలీమ్ సందర్శించారు. భారత ప్రభుత్వం చేప‌ట్టిన 'మిషన్ వందే భారత్' యొక్క విస్తృత ప‌రిధి కింద
ఐఎన్ఎస్ జ‌లాశ్వ తాజా ప‌ర్య‌ట‌న‌తో మాల్దీవులు మరియు శ్రీలంక నుండి దాదాపు 2700 మంది భారతీయ పౌరులను విజయవంతంగా భారత తీరాలకు తీసుకువ‌చ్చిన‌ట్టు కానుంది. కోవిడ్‌-19 ప్రోటోకాల్‌లను ఆన్‌బోర్డ్‌లో క‌చ్చితంగా పాటిస్తూ ఈ భార‌తీయుల త‌ర‌లింపు కార్య‌క్ర‌మాన్ని నావికా ద‌ళం నౌక ఐఎన్ఎస్ జ‌లాశ్వ చేప‌డుతోంది. ఈ నౌన ఆదివారం (07వ తేదీన‌) త‌మిళ‌నాడులోని టుటికోరిన్‌కు చేరుకుంటుంది. మాలే నుంచి తీసుకువ‌స్తున్న భార‌తీయుల‌ను నావికా ద‌ళం వారు తమిళనాడులోని టుటికోరిన్ వద్ద దింపి స్థానిక రాష్ట్ర అధికారుల సంరక్షణకు అప్పగించనున్నారు.

 



(Release ID: 1629907) Visitor Counter : 250