PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
04 JUN 2020 6:27PM by PIB Hyderabad

(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- దేశంలో ఇప్పటిదాకా కోవిడ్-19 వ్యాధి నయమైనవారి సంఖ్య 1,04,107; గడచిన 24 గంటల్లో కోలుకున్నవారి సంఖ్య 3,804.
- ప్రస్తుతం దేశవ్యాప్తంగాగల 1,06,737 యాక్టివ్ కేసులపై చురుకైన వైద్య పర్యవేక్షణ.
- ముమ్మర నిఘా, పరిచితుల అన్వేషణ, కఠిన నిరోధం, పరిసర నియంత్రణ కార్యకలాపాలుసహా పరీక్షల సంఖ్యను పెంచాలని ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సూచన.
- భారత-ఆస్ట్రేలియా నాయకుల వర్చువల్ సదస్సు- ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రధానమంత్రి వెల్లడి.
కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం
దేశంలో గడచిన 24 గంటల్లో 3,804 మందికి కోవిడ్-19 నయం కాగా, ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 1,04,107కు చేరిన నేపథ్యంలో కోలుకునేవారి శాతం 47.99గా నమోదైంది. ప్రస్తుతం 1,06,737 యాక్టివ్ కేసులు చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నాయి. ఇక మరణాల శాతం 2.80కు దిగివచ్చింది. నవ్య కరోనా వైరస్ సోకిన వ్యక్తులను కనుగొనేందుకు పరీక్షల సామర్థ్యాన్ని ఐసీఎంఆర్ మరింత పెంచింది. ఆ మేరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రయోగశాలల సంఖ్యను 498కి పెంచగా, ప్రైవేటు రంగంలోనూ 212కు చేరాయి. దీంతో గత 24 గంటల్లో 1,39,485 నమూనాలను పరీక్షించగా మొత్తం పరీక్షల సంఖ్య 42,42,718కి చేరింది. మరోవైపు సురక్షిత ఈఎన్‌టీ (ENT) పద్ధతులకు సంబంధించి ఆరోగ్య మంత్రిత్వశాక తాజా మార్గదర్శకాలు జారీచేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629401
ఢిల్లీలో కోవిడ్-19 నిర్వహణ, నియంత్రణ సన్నాహాలపై లెఫ్టినెంట్ గవర్నర్, ఆరోగ్య శాఖ మంత్రితో డాక్టర్ హర్షవర్ధన్ సమీక్ష
“ఢిల్లీలో కేసులతోపాటు మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ముమ్మర నిఘా, పరిచితుల అన్వేషణ, కఠిన నిరోధం, పరిసర నియంత్రణ కార్యకలాపాలుసహా పరీక్షల సంఖ్యను ఢిల్లీ ప్రభుత్వం పెంచాల్సి ఉంది” అని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సూచించారు. ఈ మేరకు ఢిల్లీలో కోవిడ్-19 నిరోధం, నియంత్రణ సన్నద్ధతపై సమీక్ష దిశగా దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఆరోగ్య సదుపాయాల పెంపుద్వారా రాజధాని నగరంలో పరీక్షల సంఖ్యను తక్షణం పెంచాల్సిన ఆవశ్యకతను, ప్రాముఖ్యాన్ని ఈ సందర్భంగా మంత్రి నొక్కిచెప్పారు. దీంతోపాటు మరణాల సంఖ్య తగ్గింపు దిశగా కోవిడ్-19 కేసుల వైద్య నిర్వహణను మెరుగుపరచాలని కూడా సూచించారు. ప్రస్తుతం కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నందున అందుబాటులోగల పడకల సంఖ్యను తదనుగుణంగా పెంచాలని, అంతేకాకుండా రోగులను ఆస్పత్రులలో చేర్చుకోవడంలో జాప్యాన్ని నివారించాలని స్పష్టం చేశారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629468
భారత-ఆస్ట్రేలియా వర్చువల్ సదస్సు ప్రారంభోపన్యాసంలో ప్రధానమంత్రి వ్యాఖ్యలు
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1629296
మొజాంబిక్ అధ్యక్షుడు గౌరవనీయ ఫిలిప్ జసింతో న్యూసీతో ప్రధానమంత్రి టెలిఫోన్ సంభాషణ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా మొజాంబిక్ అధ్యక్షుడు గౌరవనీయ ఫిలిప్ జసింతో న్యూసీతో సంభాషించారు. రెండుదేశాల్లో కోవిడ్-19 విసిరిన సవాళ్లపై దేశాధినేతలు ఈ సందర్భంగా చర్చించారు. ఈ ఆరోగ్య సంక్షోభం వేళ మొజాంబిక్ కృషికి మద్దతిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి తెలిపారు. ఇందులో భాగంగా అత్యవసర మందులు, వైద్య పరికరాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఆరోగ్య సంరక్షణసహా ఔషధ రంగంలో రెండు దేశాల మధ్యగల సన్నిహిత సహకారాన్ని అధ్యక్షుడు న్యూసీ కొనియాడారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629218
భారత రాష్ట్రపతితో జార్జియా అధ్యక్షుడి టెలిఫోన్ సంభాషణ
భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్‌తో జార్జియా అధ్యక్షురాలు గౌరవనీయ సలోమీ జౌరాబిషివ్లీ టెలిఫోన్‌ద్వారా సంభాషించారు. భారత-జార్జియాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఈ సందర్భంగా వారు చర్చించారు. కోవిడ్-19 మహమ్మారివల్ల ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రజాజీవన విచ్ఛిన్నం గురించి వారిద్దరూ ప్రస్తావించారు. కోవిడ్-19 వ్యాప్తి నియంత్రణలో జార్జియా జాతీయ కృషి అద్భుతమని రాష్ట్రపతి ప్రశంసించారు. అదేవిధంగా భారత్‌లోనూ కోవిడ్-19 నియంత్రణలో ప్రభుత్వం కఠోరంగా కృషి చేసిందని, ఇది చాలావరకూ విజయవంతమైందని ఆయన చెప్పారు. అలాగే ఈ ప్రపంచ మహమ్మారిపై పోరులో అంతర్జాతీ ప్రయత్నాలను భారత్ ముందుండి నడిపించిందని, 150కిపైగా దేశాలకు ఔషధ సరఫరా చేసిందని వివరించారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629221
అందరి హృదయాలనూ కదిలించిన రైల్వే రక్షకదళం ఉద్యోగి కర్తవ్య స్ఫూర్తి
రైల్వే రక్షకదళం (RPF) కానిస్టేబుల్ శ్రీ ఇందర్‌సింగ్ యాదవ్ విధి నిర్వహణలో కనబరచిన స్ఫూర్తిని రైల్వేశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రశంసించడంతోపాటు ఆయనకు నగదు పురస్కారాన్ని ప్రకటించారు. శ్రీ యాదవ్ నాలుగు నెలల పసికందు కోసం తాను తెచ్చిన పాలప్యాకెట్‌ను వేగంగా వెళ్తున్న రైలువెనుక పరుగెత్తి మరీ ఆమె తల్లికి అందించి తన బాధ్యత నెరవేర్చారు. వివరాలిలా ఉన్నాయి... వలస కార్మిక కుటుంబంలోని శ్రీమతి షరీఫ్ హష్మి తన నాలుగు నెలల బిడ్డతో బెల్గాం నుంచి గోరఖ్‌పూర్‌కు ‘శ్రామిక్ స్పెషల్’ రైలులో ప్రయాణించారు. ఈ రైలు భోపాల్ స్టేషన్‌లో ఆగేసరికి బిడ్డ పాలకోసం ఏడ్వటంతో ప్లాట్‌ఫాంపై కనిపించిన శ్రీ ఇందర్‌సింగ్ యాదవ్‌ను పాలప్యాకెట్ తెచ్చిపెట్టాలని కోరింది. దీంతో ఆయన వేగంగా బయటకు పరుగుతీసి పాలప్యాకెట్‌తో తిరిగి వచ్చాడు. కానీ, అప్పటికే బయల్దేరి రైలు వేగం పుంజుకోగా, పసిబిడ్డ ఆకలిని దృష్టిలో ఉంచుకుని రైలువెనుక పరుగుతీశారు. చివరకు పాలప్యాకెట్‌ను ఆ బిడ్డ తల్లిచేతిలో పెట్టి సంతృప్తిగా నిట్టూర్చారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629376
పట్టణ స్థానిక సంస్థలు, స్మార్ట్ సిటీలలో తాజా పట్టభద్రులకు అవకాశాల కల్పన కోసం “పట్టణాభ్యాస-శిక్షణార్థి కార్యక్రమం” (TULIP)కు శ్రీకారం
దేశంలోని పట్టణ స్థానిక సంస్థలు, స్మార్ట్ సిటీలలో తాజా పట్టభద్రులకు ఉపాధి అవకాశాల కల్పన కోసం “పట్టణాభ్యాస-శిక్షణార్థి కార్యక్రమా” (TULIP) నికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిషాంక్’, గృహ-పట్టణాభివృద్ధిశాక సహాయ (ఇన్‌చార్జి) మంత్రి శ్రీ హర్దీప్ ఎస్.పూరిలతోపాటు అఖిలభారత సాంకేతిక విద్యా మండలి (AITUC) ప్రతినిధులు ఈ మేరకు ఆన్‌లైన్ పోర్టల్‌ను సంయుక్తంగా ప్రారంభించారు. పట్టణ రంగంలో తాజా పట్టభద్రులకు అనుభవాత్మక అభ్యాస అవకాశాలు కల్పించడం ‘తులిప్’ ప్రధానోద్దేశం. కోవిడ్ సంక్షోభ నిర్వహణలో స్మార్ట్ సిటీలు ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తున్నాయి. ఈ మేరకు 47 స్మార్ట్ సిటీలలో స్మార్ట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లను వ్యూహరచన కేంద్రాలుగా వాడుకుంటున్నాయి. అలాగే మరో 34 స్మార్ట్ సిటీలలో ఇలాంటి సదుపాయాల కల్పన త్వరలో పూర్తికానుంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629256
కోవిడ్ నిరోధక చర్యలపై జమ్ముకశ్మీర్ పురపాలక సంస్థల ప్రతినిధులతో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా చర్చించిన డాక్టర్ జితేంద్ర సింగ్
కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా జమ్ముకశ్మీర్‌లోని పురపాలక సంస్థల్లో కోవిడ్ నిరోధక చర్యలపై ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చించారు. కోవిడ్ మహమ్మారి మునుపటి రెండు దశలలో దేశంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న ప్రజలకు నిత్యావసరాల సరఫరాపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమావేశం ఆరంభంలో డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఆ తర్వాతి దశలో వారిని తమతమ స్వస్థలాలకు స్వేచ్ఛగా తరలించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. అయితే, ప్రస్తుత దశలో రెండు అంశాలపై ప్రధానంగా శ్రద్ధ పెట్టామని వివరించారు. అందులో ఒకటి నిరోధం కాగా, రెండోది అవగాహన కల్పించడం. ఈ రెండు లక్ష్యాలను నెరవేర్చడంలో స్థానిక పాలన సంస్థలు, వాటి ప్రతినిధులతోపాటు పౌర సమాజం పాత్రకు అనూహ్య ప్రాముఖ్యం ఉంటుందని ఆయన అన్నారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629344
కోవిడ్-19పై పోరుకోసం వైరస్‌వాహక-లక్షిత యాంటీవైరల్స్ రూపకల్పనకు ఎన్‌సీవీటీసీ కృషి
హర్యానాలోని హిసార్‌లోగల నేషనల్ సెంటర్ ఫర్ వెటర్నరీ టైప్ కల్చర్స్ (NCVTC), ఐసీఏఆర్-ఎన్‌ఆర్‌సీ సంస్థలు కరోనా వైరస్‌పై పోరుకోసం తమ భాండాగారంలోని 94 సూక్ష్మ పరమాణు రసాయన నిరోధకాలను పరీక్షించేందుకు సంయుక్తంగా కృషిచేయనున్నాయి. ఇందుకు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బోర్డ్ (సెర్బ్) ఆమోదం తెలిపింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1629361
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- కేరళ: రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలో మరో కోవిడ్-19 మరణం నమోదవడంతో కేరళలో మరణాల సంఖ్య 12కి చేరింది. ఈ మేరకు చెన్నైనుంచి వచ్చి, నిర్బంధవైద్య పర్యవేక్షణలో ఉన్న 73ఏళ్ల మహిళ మరణించింది. కాగా, రాష్ట్రంలో ప్రార్థన స్థలాలను సోమవారం నుంచి తిరిగి తెరవడంపై మత పెద్దలతో ముఖ్యమంత్రి ఈ రోజంతా చర్చించారు. ఇక రాష్ట్రానికి 24 అంతర్జాతీయ విమానాలు రానున్నాయని సమాచారమిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం 12 విమానాల రాకకు మాత్రమే అనుమతి ఇచ్చిందని విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ చెప్పారు. గల్ఫ్ దేశాలలో పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలని, అక్కడి రాష్ట్రవాసులు స్వదేశం రావడంపై ప్రమాణాలనూ నిర్దేశించరాదని సూచించారు. దిగ్బంధ కాలంలో జీతం నిలిపివేత, ఉద్యోగుల తొలగింపుపై ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలు తీసుకుంటున్న చర్యలు కోవిడ్‌పై పోరాటంలో ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. కాగా, రాష్ట్రంలో నిన్న 82 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 1,494కు చేరగా, వీటిలో 832 యాక్టివ్ కేసులున్నాయి.
- తమిళనాడు: పుదుచ్చేరిలో 9మందికి కోవిడ్-19 నిర్ధారణ కాగా, వీరిలో ఆరుగురు జిప్మెర్ భద్రత సిబ్బంది కావడం గమనార్హం. దీంతో ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం కేసుల సంఖ్య 63కు చేరింది. ఇక తమిళనాడులో కోవిడ్ నియంత్రణ చర్యల పర్యవేక్షణ నిమిత్తం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీకాలాన్ని ప్రభుత్వం మూడు నెలలు పొడిగించింది. కాగా, రాష్ట్రంలో జూన్ 8 నుంచి ప్రార్థన స్థలాలను తిరిగి తెరవడంపై ప్రధాన కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో వివిధ మతాల పెద్దలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇక నిన్న 1286 కొత్త కేసుల నమోదుతో తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 25,872కు చేరింది. చెన్నైలో తొలిసారిగా ఒకేరోజు 1012 కేసులు నమోదు కావడం గమనార్హం. మొత్తం కేసులలో యాక్టివ్లు: 11,345, మరణాలు: 208, డిశ్చార్జ్: 14,316. చెన్నైలో యాక్టివ్ కేసులు 8405గా ఉన్నాయి.
- కర్ణాటక: రాష్ట్ర ఆరోగ్యశాఖలోని కాంట్రాక్టు ఉద్యోగుల డిమాండ్ల పరిశీలనకు ముఖ్యమంత్రి అంగీకరించిన నేపథ్యంలో తమ సమ్మెపిలుపును వారు ఉపసంహరించుకున్నారు. కాగా, రాష్ట్రంలో కోవిడ్-19 చికిత్స కోసం సాధారణ వార్డుకు రూ.10,000, ఐసీయూతోపాటు వెంటిలేటర్ సదుపాయంతో స్పెషల్ వార్డుకు రూ.20,000 వంతున రోజువారీ వ్యయాన్ని నిర్ణయించాలని ప్రైవేటు ఆసుపత్రి సంఘాలు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు ప్రసార మాధ్యమాల సమాచారం. మరోవైపు రాష్ట్రంలో పోలీసు శాఖపై హోంశాఖతో సమీక్ష సందర్భంగా ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసుల పనితీరును ముఖ్యమంత్రి అభినందించారు. ఇవాళ ఒకేరోజు రాష్ట్రంలో 267 కేసులు నమోదవగా పెరిగి, ఒకరు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4063కు చేరింది. వీటిలో యాక్టివ్: 2,494, మరణాలు: 53, కోలుకున్నవి:1514గా ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి ఇవాళ ‘వైఎస్‌ఆర్ వాహనమిత్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆటో-టాక్సీ యజమానులైన 2,62,493మంది లబ్ధిదారులకు రూ.10 వేలు వంతున పంపిణీచేశారు. కాగా, తూర్పు గోదావరి జిల్లా పెద్దపూడి మండలంలోని గొల్లల మామిడాడ గ్రామంలో 116 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కాకినాడలోని ఒకేఒక వ్యక్తిద్వారా వీరందరికీ వ్యాధి సంక్రమించినట్లు సమాచారం. రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,986 నమూనాలను పరీక్షించిన నేపథ్యంలో 98 కొత్త కేసులు, 29 డిశ్చార్జ్, 3 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 3377. యాక్టివ్: 1033, రికవరీ: 2273, మరణాలు: 71గా ఉన్నాయి.
- తెలంగాణ: ఉస్మానియా వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రులలో 32 మంది వైద్యులకు కోవిడ్-19 నిర్ధారణ అయినట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం (T-JUDA) తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులు, చేతివృత్తులవారి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ‘కరోనా రిలీఫ్ ఫండ్’ ఏర్పాటు చేయాలని సామాజిక ఉద్యమకారులు డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్రంలో జూన్ 3నాటికి మొత్తం కేసుల సంఖ్య 3020గా ఉంది. నేటివరకూ 448మంది వలసదారులు, విదేశాలనుంచి తిరిగి వచ్చినవారికి రోగ నిర్ధారణ అయింది.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో ఇవాళ2,560 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 74,860కి పెరిగింది. వీటిలో39,935 యాక్టివ్ కేసులు కాగా, హాట్‌స్పాట్ ముంబైలో1,276 కొత్త కేసుల నమోదుతో నగరంలో మొత్తం కేసులు43,492కు పెరిగాయి. బుధవారం122మంది మరణించగా వీరిలో49 మంది ముంబైవాసులు కావడం గమనార్హం. మహారాష్ట్రమంతటా, ముంబైలలో కరోనా వైరస్ కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నిసర్గ తుఫాను కారణంగా తాత్కాలికంగా ఖాళీ చేయించిన పౌరులందరికీ కోవిడ్-19 పరీక్షలు నిర్వహించి, రెండు రోజులపాటు పరిశీలనలో ఉంచాలని బృహన్‌ముంబై నగరపాలక కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ అధికారులను ఆదేశించారు. కాగా, లోతట్టు ప్రాంతాల్లో, సముద్ర దీరంలో నివసించేవారిని ఖాళీచేయించిన బీఎంసీ అధికారులు వారికి సమీప పాఠశాలల్లో ఆశ్రయం కల్పించారు.
- గుజరాత్: రాష్ట్రంలో485 కొత్త కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం కేసుల సంఖ్య18,100కు చేరింది. వీటిలో 4,776 యాక్టివ్ కేసులున్నాయి. కొత్త కేసుల్లో290 అహ్మదాబాద్ నుంచి నమోదవగా, బుధవారం30 కొత్త మరణాలు కూడా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య1,122కు చేరింది.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 168 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య8,588కి పెరిగింది. ఇప్పటిదాకా 371 మంది మరణించగా, గత 24 గంటల్లో 224 మంది కోలుకున్నారు. కరోనావైరస్ సంక్రమణ గరిష్ఠంగా నమోదవుతున్న మూడు నగరాలు- ఇండోర్, ఉజ్జయిని, భోపాల్‌లలో వ్యాధి నియంత్రణ పరిస్థితులు, చర్యలను రాష్ట్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ నరోత్తం మిశ్రా తమ శాఖ అధికారులతో సమీక్షించారు.
- రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ68 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 9,720కి చేరింది. వీరిలో ఇప్పటివరకు6,819 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో అత్యధికంగా భరత్‌పూర్, జైపూర్, జోధ్‌పూర్, చురు జిల్లాలనుంచి నమోదయ్యాయి.
- ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో బుధవారం రాత్రిదాకా86 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 668కి చేరింది. వీటిలో 489యాక్టివ్ కేసులున్నాయి. ఇక అదే రాత్రి ముంగేలి, బెమెతారా, బలోద్, బిలాస్‌పూర్‌లోని వివిధ ఆసుపత్రుల నుంచి పూర్తిగా కోలుకున్న19 మంది రోగులు డిశ్చార్జ్ కాగా, ఉదయం40 మందిని ఆస్పత్రి నుంచి విడుదల చేశారు.
- గోవా: రాష్ట్రంలో ఒకేరోజు భారీగా47 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య126కు చేరింది. వీటిలో 69 యాక్టివ్ కేసులున్నాయి. కొత్త రోగులు అధికశాతం (42మంది) వాస్కోలోని మాంగోర్ హిల్ ప్రాంతవాసులు. కాగా, వీరిలో ఐదుగురు కరోనా ప్రభావిత ప్రాంతాలకు ప్రయాణించిన చరిత్రగలవారు.
- అరుణాచల్ ప్రదేశ్: దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న అరుణాచల్ ప్రదేశ్ వాసులు9500 మంది తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 2000మంది తమ సొంత రాష్ట్రాలకు వెళ్లారు.
- అసో్ం: రాష్ట్రంలో రెండుసార్లు నిర్వహించిన పరీక్షలో వ్యాధి పూర్తిగా నయమైనట్లు నిర్ధారించాక 29 మంది రోగులను ఇళ్లకు పంపారు. దీంతో ఇప్పటివరకూ డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 442కాగా, మరో 1428 మంది చికిత్స పొందుతున్నారు.
- మణిపూర్: మణిపూర్‌లో మరో 13 మందికి కోవిడ్-19 నిర్ధారణ అయింది. దీంతో కేసుల సంఖ్య 121కి పెరిగింది. నిన్న వ్యాధి నిర్ధారణ అయిన రోగులలో ఒకరు ప్రయాణ చరిత్ర లేని నర్సుకాగా, మిగిలినవారంతా ఇతర ప్రాంతాలనుంచి తిరిగి వచ్చినవారే.
- మిజోరం: మిజోరంలో 2020 జూన్ 15 నుంచి పాఠశాలలు తిరిగి తెరవడానికి తాత్కాలికంగా నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చెప్పారు.
- నాగాలాండ్: కోహిమాలోని నాగా హాస్పిటల్ అథారిటీ (NHAK) కోవిడ్-19 ఆస్పత్రిగా మారిన నేపథ్యంలో ఇప్పటిదాకా నలుగురు రోగులను ఇక్కడ చేర్చారు. రాష్ట్రంలో కోవిడ్-19 మహమ్మారి సమయంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నత-మాధ్యమికోన్నత పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన ఆన్‌లైన పరీక్షకు 20,000 మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు.
- త్రిపుర: రాష్ట్రంలోని హపానియా ప్రదర్శన కేంద్రం హాలులో టీఐడీసీ-పశ్చిమ త్రిపుర జిల్లా పాలన యంత్రాంగం ఉద్యమస్థాయిలో కోవిడ్ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ 400 పడకలు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఐదుగురు రోగులను ఇక్కడ చేర్చారు.
PIB FACT CHECK



******
(Release ID: 1629486)
Visitor Counter : 284
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam