రాష్ట్రప‌తి స‌చివాల‌యం

భారత రాష్ట్రపతికి టెలిఫోను చేసిన - జార్జియా అధ్యక్షుడు

Posted On: 03 JUN 2020 7:38PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీ రాంనాథ్ కోవింద్ ఈ రోజు (03-06-2020 తేదీన) జార్జియా అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి  సలోమ్ జౌరాబిచ్విలి తో టెలిఫోనులో సంభాషించారు.

ఇరువురు నాయకులు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. జార్జియాతో  స్నేహపూర్వక సంబంధాలు చాలా విలువైనవిగా భారతదేశం భావిస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు.  వాణిజ్య, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో తమ సంబంధాలపై ఇరు దేశాలు ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. శిక్షణ, సామర్థ్య నిర్మాణ రంగంలో జార్జియాతో సహకారాన్ని ముందుకు తీసుకురావడం భారతదేశానికి సంతోషంగా ఉందని అన్నారు. 

కోవిడ్-19 మహమ్మారి నుండి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను, అదేవిధంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలకు కలిగిన ఇబ్బందులను గురించి రాష్ట్రపతి ప్రస్తావిస్తూ, కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేయడంలో జార్జియా చేపట్టిన జాతీయ ప్రయత్నాలు చెప్పుకోదగ్గవని ప్రశంసించారు.   కోవిడ్-19 యొక్క వ్యాప్తిని అరికట్టడానికి భారతదేశం తీవ్ర ప్రయత్నాలు చేసిందనీ, ఆ ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అయ్యామని భారత రాష్ట్రపతి జార్జియా అధ్యక్షురాలికి తెలియజేశారు.  కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రయత్నాలను సమీకరించడంలో భారతదేశం ముందంజలో ఉందనీ, 150 కి పైగా దేశాలకు మందులు, వైద్య పరమైన ఇతర వస్తువులు సరఫరా చేసిందనీ ఆయన తెలిపారు.  ఆర్థికాభివృద్ధికి శక్తినిచ్చేవిధంగా  ప్రపంచ సమాజం సమిష్టిగా పనిచేయాలని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు. 

జార్జియాలో పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు ఉన్నారనీ, వారిలో చాలా మంది వైద్య విద్యను అభ్యసిస్తున్నారనీ రాష్ట్రపతి చెప్పారు. వారి తరలింపులో సహకరించి, జార్జియాలో నివసిస్తున్న భారతీయ సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న జార్జియా ప్రభుత్వానికి రాష్ట్రపతి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

*****



(Release ID: 1629221) Visitor Counter : 313