ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ - 19 ప్రస్తుత పరిస్థితి, సంసిద్ధతపై ఢిల్లీ ఆరోగ్యమంత్రి,

లెఫ్ట్ నెంట్ గవర్నర్ తో సమీక్షించిన డాక్టర్ హర్షవర్థన్

" ఢిల్లీలో పరీక్షల పెంపు, తీవ్ర నిఘా, సోకినవారి ఆచూకీ,
కంటైన్మెంట్ కార్యకలాపాల తీవ్రతరం తప్పనిసరి"

Posted On: 04 JUN 2020 4:47PM by PIB Hyderabad

ఢిల్లీలో కోవిడ్ బాధితుల సంఖ్య, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు, గట్టి నిఘా, సోకినవారి గుర్తింపు, కంటెయిన్మెంట్ ప్రాంతాల్లో నియంత్రణ గట్టిగా అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి   డాక్టర్ హర్షవర్ధన్ సూచించారు. కోవిడ్-19 నిరోధానికి, నియంత్రణకు సంసిద్ధతను సమీక్షించటానికి ఈరోజు ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.  ఆ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విన్ కుమార్ చౌబే, ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ శ్రీ అనిల్ బైజల్, ఢిల్లీ ఆరోగ్యశాఖామంత్రి శ్రీ సత్యేంద్ర జైన్ కూడా ఆయనతోబాటు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలోని అన్ని జిల్లాలూ కోవిడ్ - 19 బాధిత ప్రాంతాలుగా మారిన నేపథ్యంలో " పెరుగుతున్న బాధితులు, అధిక పాజిటివ్ కేసులు, పరీక్షల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నాయి" అని డాక్టర్ హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. సగటున ప్రతి పదిలక్షల మందికి ఢిల్లీ లో  2018 మందికి  చొప్పున పరీక్షలు జరుగుతుండగా బాగా తక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లో పది లక్షల మందిలో 517 మందికి, ఆగ్నేయ రాష్ట్రాల్లో 506  మందికి మాత్రమే పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఢిల్లీలో గత వారం పాజిటివ్ కేసులు 25.7% కాగా అనేక జిల్లాల్లో 38% పైగా నమోదయ్యాయన్నారు. వైద్య రంగ సిబ్బందికి ఎక్కువగా సోకటం కూడా ఆందోళన కలిగించే పరిణామమని మంత్రి అభిప్రాయపడ్దారు. దీన్ని బట్టి ఇన్ఫెక్షన్ సోకటాన్ని నివారించే చర్యలు చాలా తక్కువగా ఉన్నట్టు అర్థమవుతోందని, ఈ అంశాన్ని చాలా తీవ్రంగా భావిస్తూ అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

ఆరోగ్య మౌలిక వసతులు పెంచటంతోబాటు పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో వైద్యపరంగా కోవిడ్-19  కేసుల నిర్వహణ కూడా సమర్థంగా సాగాలని పిలుపునిచ్చారు. అప్పుడే మరణాల శాతం తగ్గుతుందన్నారు. కేసుల సంఖ్య బాగా పెరుగుతున్న నేపథ్యంలో పడకల అందుబాటును బాగా పెంచాలని, చేర్చుకోవాల్సి వచ్చినప్పుడు అనవసర జాప్యాన్ని నివారించాలని కోరారు. " గణనీయమైన సంఖ్యలో  కేసులను ఇంటికే  పరిమితమయ్యేలా చేయటం, సకాలంలో పరీక్షలు జరపటం, అవసరమైనవారిని ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులకు తరలించటం లాంటి చర్యల ద్వారా మరణాల శాతాన్ని తగ్గించవచ్చు" అన్నారు. వయసు పైబడ్డవారిని, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతూ సులభంగా కోవిడ్ సోకటానికి అవకాశమున్నవారిని గుర్తించి రక్షించాలని. ఇళ్లలో ఐసొలేషన్ సాధ్యం కానప్పుడు సంస్థాగతంగా క్వారంటైన్ చేయటానికి చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

మరణాల శాతం తగ్గించటానికి, కంటెయిన్మెంట్ చర్యలు పకడ్బందీగా తీసుకోవటానికి వీలుగా కేంద్రం ఎప్పటికప్పుడు ఇస్తున్న మార్గదర్శకాలను పాటిస్తూ ఢిల్లీలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తగిన నిఘా పద్ధతుల ద్వారా వీలైనంత ముందుగా ఇన్ఫెక్షన్ కేసులు గుర్తించాలని కోరారు. ఆరోగ్య సేతు యాప్ సమాచారం ద్వారా వైరస్ అంటుకునే అవకాశం ఉన్నవాళ్ళను గుర్తించాలని,  రోగుల పట్ల, వారి కుటుంబ సభ్యుల పట్ల నిరాదరణ ధోరణిని నివారించే దిశలో కృషి చేయాలని సూచించారు. అత్యవసరమైన నాన్- కోవిడ్ ఆరోగ్య సేవలను కూడా పునరుద్ధరించాలని ఆయన కోరారు.

పరీక్షల సంఖ్య పెంచటానికి డిల్లీకి అవసరమైన మౌలిక సదుపాయాలు బలోపేతం చేస్తున్నామని ఈ వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ చెప్పారు. ఢిల్లీలో కలెక్టర్లు, కమిషనర్లు, మేయర్లతో వివరంగా చర్చించిన మీదట జన సాంద్రత ఎక్కువగా ఉన్న కంటెయిన్మెంట్ ప్రాంతాలు ఉమ్మడి చర్యలకు సమస్యాత్మకంగా మారినట్టు తేలిందన్నారు. " వనరుల సమీకరణతోబాటు అనుభవాల ఏకీకరణ ద్వారా సమైక్య కార్యాచరణ రూపొందించుకోవాలి. ఇది ఉమ్మడి పోరు. ఢిల్లీ చేసే కృషికి మా మద్దతు ఉంటుంది" అని హామీ ఇచ్చారు.

కలెక్టర్లు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తమ ప్రాంతాల్లో కోవిడ్-19  నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా వివరించారు. కంటెయిన్మెంట్ జోన్ల విస్తృతిని తగ్గించే విషయం మీద, సకాలంలో రోగులను గుర్తించటం మీద, లక్షణాలు కనబడినా  చెప్పకుండా రహస్యంగా ఉంచుతున్న వారిమీద కూడా చర్చించారు. లాక్ డౌన్ ఆంక్షల సడలింపు సమయంలో భౌతిక దూరం పాటించటం లాంటి విషయాలలో ప్రజలు నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా ఉండటం గురించి కూడా అధికారులు ప్రధానంగా ప్రస్తావించారు. కొత్తగా కేసులు పెరగటానికి ఇదే ప్రధానకారణమని కూడా చెప్పారు.

ఈ పోరులో  ప్రధానంగా పనిచేస్తున్న యోధులను, పాలనాపరమైన సిబ్బందిని అభినందిస్తూ, ఇప్పుడు గతంలో కంటే ఎక్కువగా భౌతిక నిబంధనలు పాటించాల్సిన అవసరముందని, చేతులు, ఊపిరితిత్తుల పరిశుభ్రత పాటించటం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం అవసరమని డాక్టర్ హర్షవర్ధన్ అభిప్రాయపడ్దారు. డాక్టర్లతోబాటు ఇతరవైద్య సిబ్బంది పట్ల గౌరవ మర్యాదలు పాటించటం, పుకార్లు వ్యాపింపజేయకుండా చూడటం చాలా అవసరమన్నారు. అదే సమయంలో వృద్ధులకు, వ్యాధి సోకే అవకాశమున్న వారికి సరైన సమాచారాన్ని అందిస్తూ చైతన్యవంతులను చేయటం కూడా ముఖ్యమన్నారు. " మన ఉమ్మడి కృషి ద్వారా మనం కోవిడ్-19  మీద జరుపుతున్న పోరులో విజయం సాధిస్తామన్న నమ్మకం నాకుంది" అన్నారు.

కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీమతి ప్రీతి సుడాన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఒ ఎస్ డి శ్రీ రాజేశ్ భూషణ్, ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి ఆర్తి అహుజా, ఎన్ సి డి సి డైరెక్టర్ డాక్టర్ ఎస్ కె సింగ్, ఢిల్లీలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, ఎన్ డి ఎమ్ సి ప్రతినిధులు, ఢిల్లీ ప్రభుత్వాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.



(Release ID: 1629468) Visitor Counter : 228