రైల్వే మంత్రిత్వ శాఖ

విధి నిర్వహణ స్ఫూర్తితో అందరి మనసులు గెలుచుకున్న ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌
రైలు వెనుకే పరిగెత్తి పాలు అందించి చిన్నారి ఆకలి తీర్చిన కానిస్టేబుల్‌
కానిస్టేబుల్‌ సేవా తత్పరతను ప్రశంసించి, నగదు బహుమతి ప్రకటించిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

Posted On: 04 JUN 2020 3:58PM by PIB Hyderabad

 విధి నిర్వహణలో రైల్వే భద్రత దళం (ఆర్‌పీఎఫ్‌) కానిస్టేబుల్‌ శ్రీ ఇందర్‌ సింగ్‌ యాదవ్‌ చూపిన నిబద్ధత, రైల్వే శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్ మనసును కదిలించింది. ఇందర్‌ సింగ్‌ యాదవ్‌ను ప్రశంసించిన మంత్రి గోయల్‌, ఆయనకు గౌరవసూచికగా నగదు పురస్కారాన్ని ప్రకటించారు. నాలుగు నెలల చిన్నారికి పాలు అందించేందుకు వేగంగా వెళుతున్న రైలుతోపాటు ఇందర్‌ సింగ్‌ యాదవ్‌ పరిగెత్తారు. చిన్నారికి పాలు అందించి విధి నిర్వహణలో ఆదర్శంగా నిలిచారు.

 

    షరీఫ్‌ హష్మి దంపతులు, వారి నాలుగు నెలల చిన్నారితోపాటు బెంగళూరు నుంచి గోరఖ్‌పూర్‌ వరకు శ్రామిక్‌ స్పెషల్‌ రైల్లో ప్రయాణించారు. ఆ చిన్నారికి పాలు పట్టడానికి గత స్టేషన్లలో ఎక్కడా ఆ దంపతులకు పాలు దొరకలేదు. ఆకలితో చిన్నారి ఏడవడం మొదలుపెట్టింది. తమ పరిస్థితిని రైల్వే కానిస్టేబుల్‌ యాదవ్‌కు భోపాల్‌ స్టేషన్‌లో వివరించిన చిన్నారి తల్లి, సాయం చేయమని కోరింది.
    
    వెంటనే కానిస్టేబుల్‌ యాదవ్‌ స్టేషన్‌ బయటకు పరుగెత్తుకుని వెళ్లి పాల ప్యాకెట్‌ తీసుకున్నారు. అయితే అప్పటికే రైలు కదలడం మొదలై వేగం అందుకుంది. పాలు ఎలాగైనా ఆ తల్లికి అందించి చిన్నారి ఆకలి తీర్చాలన్న పట్టుదలతో, శ్రీ యాదవ్‌ కదులుతున్న రైలు వెనుక పరిగెత్తారు. వేగంగా వెళ్లి ఆ ప్యాకెట్‌ను చిన్నారి తల్లికి అందించి మానవత్వాన్ని, విధి నిర్వహణలో నిబద్ధతను చాటుకున్నారు. ఈ విషయం రైల్వే మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ దృష్టికి వెళ్లడంతో, యాదవ్‌ వృత్తి స్ఫూర్తిని మెచ్చుకున్నారు. నగదు బహుమతి ప్రకటించారు.

 

***(Release ID: 1629376) Visitor Counter : 86