PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 27 APR 2020 6:57PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • కోవిడ్‌-19 బారినపడి కోలుకున్నవారు 22.17 శాతం... అంటే- 6,814 మంది;
 • నిన్నటినుంచి నమోదైన కేసులు 1,396; నిర్ధారిత కేసులు 27.892; 24 గంటల్లో మరణాలు 48.
 • నిత్యావసరాల సరఫరా గొలుసుల్లో చిక్కుల తొలగింపు; విధాన-అమలు చర్యల సరళీకరణపై ప్రభుత్వ దృష్టి
 • దేశంలో కోవిడ్‌-19 పరిస్థితులు చక్కదిద్దడంపై ముఖ్యమంత్రులతో చర్చించిన ప్రధానమంత్రి
 • దిగ్బంధంతో సానుకూల ఫలితాలు... వేలాది మందికి ప్రాణరక్షణ: ప్రధానమంత్రి
 • ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయసును తగ్గించేదిలేదని డాక్టర్ జితేంద్రసింగ్‌ స్పష్టీకరణ
 • ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్ట్‌కిట్ల ధరపై వివాదం; ప్రభుత్వానికి రూపాయి కూడా నష్టంలేదన్న ఐసీఎంఆర్‌
 • ఈశాన్య భారతంలోని 8 రాష్గ్రాల్లో 5 కరోనా నుంచి విముక్తం

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం

దేశంలో కోవిడ్‌-19 బారినపడి కోలుకున్నవారు 22.17 శాతం... అంటే- 6,814 మంది; నిన్నటినుంచి నమోదైన కేసులు 1,396 కాగా, మొత్తం నిర్ధారిత కేసులు 27,892కు; గడచిన 24 గంటల్లో మరణాలు 872కు చేరాయి. కాగా, ఇంతకుముందు కేసులు నమోదైన 16 జిల్లాల్లో గడచిన 28 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గడచిన 14 రోజుల వ్యవధిలో ఒక్క కేసు కూడా నమోదుకాని జిల్లాల సంఖ్య 85గా ఉంది. ఆహారం, ఔషధాలు తరలిస్తున్న ట్రక్కులు మార్చి 30నాటికి 46 శాతం కాగా, 2020 ఏప్రిల్‌ 25నాటికి 76 శాతంగా నమోదయ్యాయి. ఇదే వ్యవధిలో గూడ్సు రైళ్ల రవాణా కూడా 67 శాతం నుంచి 76 శాతానికి, రేవుల విషయంలో 70 శాతం నుంచి 87 శాతానికి పెరిగింది. ఇక లావాదేవీలు నడుస్తున్న ప్రధాన మండీలు 61 శాతం నుంచి 79 శాతానికి పెరిగాయి. ఇక దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలు రోజువారీ 1.5 కోట్ల మందికి భోజనం అందిస్తున్నాయి. నిత్యావసరాల సరఫరా గొలుసు సంబంధిత సమస్యల పరిష్కారం దిశగా విధాన-అమలు చర్యల సరళీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. తద్వారా క్షేత్రస్థాయిలో నిర్దిష్ట చిక్కులను తొలగిస్తూ, కీలక సూచీల పర్యవేక్షణతోపాటు సరఫరా శృంఖల యోధులకు ఉత్తమాచరణలను సూచించనుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618780

కోవిడ్‌-19 పరిస్థితులు చక్కదిద్దడంపై ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి చర్చ

కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి నిరోధం  నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు, తదుపరి కార్యాచరణపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు. జాతీయ దిగ్బంధం సానుకూల ఫలితాలిస్తున్నదని, దీనివల్ల గడచిన ఒకటిన్నర నెలల కాలంలో వేలాదిమందికి ప్రాణరక్షణ లభించిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అనేక దేశాల మొత్తం జనాభా కలిస్తే మన దేశ జనాభాతో సమానమని ప్రధాని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో మార్చి ఆరంభంనాటికి భారత్‌సహా అన్ని దేశాల్లోనూ కోవిడ్‌-19 పరిస్థితి ఒకేస్థాయిలో ఉందన్నారు. కానీ, సకాలంలో చర్యలు చేపట్టిన కారణంగా భారత్‌ పెద్దసంఖ్యలో ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించగలిగిందని వివరించారు. అంతమాత్రాన వైరస్‌ను మనం జయించినట్లు భావించరాదని, ఈ సుదీర్ఘ పోరులో భాగంగా నిరంతర నిఘా తప్పదని స్పష్టం చేశారు. వాతావరణంలో మార్పులను- ప్రస్తుత వేసవి, అటుపైన రుతుపవనాల రాక, తత్ఫలితంగా తలెత్తే అనారోగ్యాలు తదితరాలను దృష్టిలో ఉంచుకుని, వ్యూహాత్మకంగా ముందడుగు వేయాల్సి ఉందని ముఖ్యమంత్రులకు ప్రధాని సూచించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618697

ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్ట్‌ కిట్ల ధర వివాదంపై వాస్తవాలు

కోవిడ్‌-19పై పోరాటంలో నిర్ధారణ పరీక్షలు ఒక ప్రధాన ఆయుధం. ఈ మేరకు పరీక్షల సంఖ్య పెంచడానికి ఐసీఎంఆర్‌ శక్తివంచన లేకుండా కృషిచేస్తోంది. ఇందులో భాగంగా టెస్ట్‌ కిట్లను కొనుగోలుచేసి రాష్ట్రాలకు సరఫరా చేయాల్సి ఉంది. ఈ కిట్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ అధికంగా ఉన్న ప్రస్తుత తరుణంలో, వాటి కొనుగోలుకు దేశాలన్నీ నగదు చెల్లింపుసహా దౌత్యమార్గాల్లోనూ యధాశక్తి ప్రయత్నిస్తున్నాయి. అయితే, వీటి సామర్థ్యంపై శాస్త్రీయ అంచనాల మేరకు (వోండ్‌ఫో కంపెనీవంటి) సందేహాస్పదంగా  ఉన్నవాటికి ఇచ్చిన ఆర్డర్ల రద్దు, మెరుగైనవాటి కోసం ఆర్డర్లు పంపడం సర్వసాధారణం. ఈ దిశగా నిర్దిష్ట ప్రక్రియ (పూర్తి మొత్తం ముందే చెల్లించకుండా) లను అనుసరించాల్సి ఉంటుంది. అందువల్ల భారత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నష్టపోయే అవకాశం లేదు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618739

ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయసు తగ్గించేది లేదు... అలాంటి ప్రతిపాదనపై ప్రభుత్వంలో ఏ స్థాయిలోనూ చర్చ లేదా యోచన లేదు: డాక్టర్‌ జితేంద్రసింగ్‌

ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయసును 50 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కొన్ని మాధ్యమాల్లో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్రసింగ్‌ స్పష్టం చేశారు. ఉద్యోగ విరమణ వయసును తగ్గించే ప్రతిపాదనగానీ, అటువంటి దానిపై చర్చగానీ ఏదీ జరగలేదని, అసలు అలాంటి ప్రతిపాదన ప్రభుత్వంలో ఏ స్థాయిలోనూ లేదని ఆయన నిర్ద్వంద్వంగా ప్రకటించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618785

న్యూఢిల్లీలోని ‘ఎయిమ్స్‌’లో అత్యవసర చికిత్స కేంద్రం; కోవిడ్‌-19 ప్రత్యేక ఆస్పత్రుల సంసిద్ధతను ప్రత్యక్షంగా పరిశీలించిన డాక్టర్‌ హర్షవర్ధన్‌

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఇవాళ న్యూఢిల్లీలోని ‘ఎయిమ్స్‌’ను సందర్శించారు. ఈ సందర్భంగా జయప్రకాష్‌ నారాయణ్‌ అత్యున్నత అత్యవసర చికిత్స కేంద్రం సంసిద్ధతతోపాటు, కోవిడ్‌-19 చికిత్స కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవల తీరును ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618558

ఈశాన్య భారతంలోని 8 రాష్ట్రాల్లో 5 కరోనా విముక్తం; మిగిలిన మూడు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా కొత్త కేసులు రాలేదు: డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

ఈశాన్య భారతంలోని 8 రాష్ట్రాల్లో 5 కరోనా విముక్తంకాగా, మిగిలిన మూడు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు. షిల్లాంగ్‌లోని ఈశాన్యభారత మండలి సీనియర్‌ అధికారులు, ప్రభుత్వరంగ-వివిధ ప్రభుత్వశాఖల ప్రతినిధులతో దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష అనంతరం కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ఈ మేరకు వివరించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618785

ఎలాంటి నివేదిక ఇవ్వమనిగానీ, విచారణకుగానీ ఆదేశించలేదు: సీబీడీటీ

దేశంలో కోవిడ్‌-19 పరిస్థితులను చక్కదిద్దడంపై ఐఆర్‌ఎస్‌ అధికారుల సంఘం నుంచి నివేదిక కోరడం లేదా విచారణకు ఆదేశించడంవంటి చర్యలేవీ చేపట్టలేదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు-సీబీడీటీ ఇవాళ స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవాలని తేల్చింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618523

కోవిడ్‌పై రైల్వేశాక సహాయ కేంద్రానికి నిత్యం సందేహాలు, అభ్యర్థనలు, సూచనల రూపేణా 13,000 ఫోన్‌కాల్స్‌

కోవిడ్‌-19 దిగ్బంధ పరిస్థితుల నేపథ్యంలో భారత రైల్వేశాఖ సంపూర్ణస్థాయిలో చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రయాణికుల, వాణిజ్య వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణతోపాటు దేశవ్యాప్తంగా సరఫరా గొలుసు నిరంతరం నడిచేలా అన్నివిధాలా చేయూతనిస్తోంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618698

కోవిడ్‌-19 మహమ్మారి సృష్టించిన పరిస్థితులను అవకాశాలుగా మలచుకోవాలని ప్రవాస భారత విద్యార్థులతో చర్చ సందర్భంగా శ్రీ నితిన్‌ గడ్కరీ పిలుపు

కోవిడ్‌-19 పరిస్థితుల నేపథ్యంలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రవాస భారత విద్యార్థులతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ మేరకు “ప్రపంచ మహమ్మారిపై భారత్‌ ప్రతిస్పందన; భారతదేశం కోసం మార్గప్రణాళిక” ఇతివృత్తంగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌, కెనడా, సింగపూర్‌, ఆస్ట్రేలియాసహా ఐరోపా దేశాల్లోని భారతీయ విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. ఈ ప్రతికూలతను ఒక అవకాశంగా మలచుకునే దిశగా సానుకూల దృక్పథంతో, సమష్టి కృషితో ముందుకు సాగడమే భారత్‌ ముందున్న మార్గమని, ఈ కృషిలో పాలుపంచుకోవాలని తన ప్రసంగంలో మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618404

కోవిడ్-19పై దిగ్బంధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా 684 టన్నుల నిత్యావసరాలు, వైద్య సామగ్రిని రవాణా చేసిన లైఫ్‌లైన్‌ ఉడాన్‌ విమానాలు

కోవిడ్‌-19పై భారత్‌ పోరాటానికి మద్దతుగా ‘లైఫ్‌లైన్‌ ఉడాన్‌’ విమానాలు నిత్యావసరాలు, అత్యవసర వైద్య సామగ్రిని దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. ఈ మేరకు ఎయిరిండియా, అలయెన్స్‌ ఎయిర్‌, ఐఏఎఫ్‌, ఇతర ప్రైవేటు విమానయాన సంస్థలు ఇప్పటిదాకా 383 విమానాలను 3,76,952 కిలోమీటర్ల మేర నడిపి, 684.08 టన్నుల సామగ్రిని రవాణా చేశాయి. ఇక జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌, ద్వీప ప్రాదేశికాలు, ఈశాన్య భారత ప్రాంతంలోని మారుమూల ప్రదేశాలకు పవన్‌హన్స్‌ లిమిటెడ్‌ సంస్థసహా పలు హెలికాప్టర్‌ సర్వీసులు వైద్య సామగ్రితోపాటు కోవిడ్‌-19 రోగులను కూడా తీసుకెళ్లాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618530

 కోవిడ్‌-19పై పోరాటంలో భారత వాయుసేన మద్దతు

కరోనా వైరస్‌ ప్రపంచ మహమ్మారిపై భారత ప్రభుత్వ పోరాటం నేపథ్యంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సేవలందించేందుకు భారత వాయుసేన అన్నివిధాలా కృషిచేస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా నిత్యావసరాలు, మందులు, రేషన్‌ సరుకులు, వైద్య సిబ్బందిని చేరవేస్తోంది. తద్వారా కోవిడ్‌-19పై రాష్ట్ర ప్రభుత్వాలు, పౌరసంస్థల పోరాటానికి కూడా చేయూతనిస్తోంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618775

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • పంజాబ్: రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలు, వ్యాపారులు 6,79,220 టన్నుల గోధుమలను కొనుగోలు చేశారు. ఫ్యాక్టరీ కార్మికుల భద్రత-శ్రేయస్సు రీత్యా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ ప్రధానంగా పని ప్రదేశాల్లో పరిశుభ్రత-పారిశుద్ధ్యం దిశగా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ సమగ్ర ఆదేశాలు జారీచేసింది. ఆరోగ్య విధివిధానాలను కచ్చితంగా పాటించాలని ఉద్యోగులను కోరింది. అంతేగాక ఏదైనా వ్యాధి లక్షణం కనిపిస్తే సత్వరం స్వచ్ఛందంగా వెల్లడించాలని, కోవిడ్‌-19 సంబంధిత అవాస్తవాలు/వదంతులపై వాస్తవాలను నిర్ధారించుకోవాలని, అటువంటివి వ్యాపించకుండా చూసుకోవాలని సూచించింది.
 • హర్యానా: కోవిడ్‌-19పై పోరులో ముందువరుసన సేవలందింస్తున్న ఆరోగ్య సంరక్షణ నిపుణులు, కార్యకర్తలకు భద్రత కల్పించడంతోపాటు వారిపై హింసకు పాల్పడటం వంటి సంఘటనల నిరోధానికి ప్రభుత్వం రాష్ట్ర-జిల్లా స్థాయులలో నోడల్ అధికారులను నియమించింది. వైద్య నిపుణుల పనితీరుకు సంబంధించిన భద్రత అంశాల పర్యవేక్షణకు ఈ అధికారులు సదా అందుబాటులో ఉంటారు. రాష్ట్రంలో గడచిన ఐదు రోజులుగా 1,30,707 మంది రైతుల నుంచి 19.26 లక్షల టన్నుల గోధుమలు కొనుగోలు చేయబడ్డాయి.
 • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రానికి అసోం నుంచి వచ్చే కూరగాయలపై సందేహాలు అక్క‌ర్లేద‌ని ఇటానగర్ డిప్యూటీ కమిషనర్ స్ప‌ష్టం చేశారు.  ఈ మేర‌కు నిర‌భ్యంత‌రంగా వాటిని వాడుకోవ‌చ్చున‌ని తెలిపారు.
 • మణిపూర్: దేశంలో కోవిడ్‌-19 ప‌రిస్థితులు చ‌క్క‌దిద్ద‌డానికి రాష్ట్రాల స‌మ‌ష్టి కృషి అవ‌స‌ర‌మ‌ని ముఖ్య‌మంత్రి ట్వ‌ట్ట‌ర్‌ద్వారా పేర్కొన్నారు. ప్ర‌ధాన‌మంత్రితో ఇవాళ దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్యమ స‌మావేశం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రులంతా ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశార‌ని తెలిపారు. కాగా, రాష్ట్రంలోని గ్రీన్‌జోన్‌లు, కోవిడ్‌-19 ప్ర‌భావంలేని జిల్లాల్లో దిగ్బంధం స‌డలించే అవ‌కాశం ఉంద‌న్నారు.
 • మేఘాలయ: రాష్ట్రంలో దిగ్బంధం కొన‌సాగే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ మ‌రికొన్ని స‌డ‌లింపులు ఉంటాయ‌ని ముఖ్య‌మంత్రి  కాన్రాడ్ సంగ్మా తెలిపారు. ప్ర‌ధాన‌మంత్రితో దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్య‌మ స‌మావేశం త‌ర్వాత ఈ మేర‌కు ప్రకటించారు. మేఘాల‌య‌లో అమ‌లు చేస్తున్న స‌త్వ‌ర ప్ర‌తిస్పంద‌న వ్య‌వ‌స్థ గురించి ప్ర‌ధానికి వివ‌రించాన‌ని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కోవిడ్‌-19 కొత్త కేసుల విష‌యంలో ఆరోగ్య‌, పాల‌న‌, పోలీసు వ్య‌వ‌స్థ‌లు నిర్దిష్ట కాల‌వ్య‌వ‌ధిలో  స్పందిస్తాయ‌ని పేర్కొన్నారు.
 • మిజోరం: రాష్ట్రంలో ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల గురించి, ప్ర‌జ‌ల క్ర‌మ‌శిక్ష‌ణ-స‌హకారం గురించి ప్రధానమంత్రితో ఇవాళ్టి దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్యమ‌ స‌మావేశంలో ఈ మేర‌కు వివ‌రించిన‌ట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 
 • నాగాలాండ్: రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు తగిన సంఖ్య‌లో భద్రతా సిబ్బందిని పంపామ‌ని, అన్ని ప్ర‌వేశ ప్రాంతాల‌నూ పూర్తిగా మూసివేశామ‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు.
 • సిక్కిం: రాష్ట్రంలో స‌ముచిత‌ పారదర్శక విధానాలతో క‌రోనా వైర‌స్‌ను నియంత్రించడంపై ప్ర‌ధాన‌మంత్రి అభినందించార‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రంలో అనుస‌రించిన విధానాల ఫ‌లితాలు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వ్యాధి వ్యాప్తి నిరోధానికి చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో కేంద్రానికి దోహ‌ద‌ప‌డ్డాయ‌న్నారు.
 • త్రిపుర: రాష్ట్రంలోని మార్కెట్లలో థర్మల్ స్క్రీనింగ్ చేప‌డ‌తామ‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయరాద‌ని, మూత్ర విసర్జన చేయరాద‌ని పౌరులను కోరారు.
 • కేరళ: రాష్ట్రంలో హాట్‌స్పాట్‌లు కాకుండా ఇతర ప్రదేశాల్లో మినహాయింపులతో దిగ్బంధాన్ని దశలవారీగా తొల‌గించాల‌ని దేశీయాంగ శాఖ మంత్రితో టెలిఫోన్ సంభాష‌ణ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కరోనా వైరస్ సామాజిక సంక్ర‌మ‌ణ‌ సంకేతాలు లేవ‌ని తెలిపారు. ఇడుక్కిలో మూడంచెల దిగ్బంధం విధించామ‌ని, కోట్ట‌యంలో నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశామ‌ని చెప్పారు.  వివిధ దేశాల్లో చిక్కుకున్న 1.5 లక్షల మందికిపైగా కేరళీయులు రాష్ట్రానికి తిరిగి వ‌చ్చేందుకు ఆన్‌లైన్ ద్వారా  నమోదు చేసుకున్నారు.  కాగా, నిన్నటి వరకు మొత్తం నిర్ధారిత కేసులు : 469, యాక్టివ్ కేసులు: 123, న‌య‌మైన వారు: 342 మంది.
 • తమిళనాడు: రాష్ట్రంలో 2021 జూలై వరకు క‌ర‌వు భ‌త్యాన్ని ప్రస్తుత శాతంవ‌ద్ద‌నే స్తంభింప‌జేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది; అలాగే ఆర్జిత సెల‌వుల న‌గ‌దు మార్పిడికి ఏడాదిపాటు నిలిపివేయ‌నుంది. ఇక ర‌క్త‌జీవ ద్ర‌వ్యం చికిత్స ప్ర‌యోగాల కోసం వారం వ్యవధిలో రాష్ట్రం అనుమతి కోరుతుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ‌ మంత్రి చెప్పారు. మ‌రోవైపు మద్రాస్ వైద్య క‌ళాశాల పీజీ విద్యార్థులు మరో ఇద్ద‌రికి వ్యాధి నిర్ధార‌ణ అయింది. నిన్నటిదాకా మొత్తం కేసులు: 1,885, యాక్టివ్ కేసులు: 838, మరణాలు: 24, డిశ్చార్జ్ అయిన‌వారు: 1,020, చెన్నైలో గ‌రిష్ఠ కేసుల సంఖ్య 523గా ఉంది.
 • కర్ణాటక: ఈ రోజు 8 కొత్త కేసులు నిర్ధార‌ణ అయ్యాయి; విజయపుర, బాగల్‌కోట్, దక్షిణ కన్నడలో 2 చొప్పున; బెంగళూరు, మాండ్యలో 1 చొప్పున ఇవి న‌మోద‌య్యాయి. కాగా, బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో 50 ఏళ్ల కోవిడ్ రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్రంలో మొత్తం కేసులు: 511, మరణాలు: 19, నయమైన‌వారి సంఖ్య‌: 188.
 • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో గ‌డ‌చిన 24 గంటల్లో 80 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,177కు చేరింది. వీటిలో యాక్టివ్ కేసులు: 911, కోలుకున్నవి: 235, మరణాలు: 31గా ఉన్నాయి. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ముఖ్య భ‌ద్ర‌తాధికారి స‌హా న‌లుగురు సిబ్బందికి కోవిడ్‌-19 నిర్ధార‌ణ అయింది. దీంతో రాజ్‌భ‌వ‌న్ ఉద్యోగులంద‌ర్నీ నిర్బంధ వైద్య‌ప‌రిశీల‌న‌కు త‌ర‌లించారు. ఇక కడపలోని 4 ప్రాంతాలను రెడ్‌జోన్‌లుగారాష్ట్ర ప్ర‌భుత్వం ప్రకటించింది. నిర్ధారిత కేసుల రీత్యా కర్నూలు (292), గుంటూరు (237), కృష్ణా (210), నెల్లూరు (79), చిత్తూరు (73) జిల్లాలు అగ్ర‌స్థానంలో ఉన్నాయి.
 • తెలంగాణ: రోగుల‌తో ప‌రిచ‌యాలుగ‌ల వారిని గుర్తించడంలో తెలంగాణ పోలీసులు చేసిన కృషిని కేంద్ర అంత‌ర మంత్రిత్వ సంఘం అభినందించింది. నియంత్ర‌ణ ప్రాంతాలతోపాటు నిర్బంధ వైద్య కేంద్రాల్లో భద్రతను కొనసాగించాలని పోలీసులకు సూచించింది. కాగా, గ‌చ్చిబౌలీ క్రీడా ప్రాంగ‌ణంలోని 1500 పడకల ప్ర‌త్యేక కోవిడ్‌-19 ఆస్ప‌త్రిని వైద్య-పరిశోధన‌ సంస్థగా ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ మొత్తం నిర్ధారిత కేసులు 1,001.
 • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో గ‌డ‌చిన 24 గంటల్లో 175 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2,120కి చేరింది. వివిధ ఆసుపత్రుల నుంచి 302 మంది రోగులు నయమై ఇళ్ల‌కు వెళ్ల‌గా 103 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్ ప్రకారం... 1,650 మంది రోగుల పరిస్థితి స్థిరంగా ఉండగా, 35 మంది వెంటిలేటర్ల సంర‌క్ష‌ణ‌లో ఉన్నారు.
 • గుజరాత్: రాష్ట్రంలోని 61 కోవిడ్ ప్ర‌త్యేక‌ ఆసుపత్రులలో 10,500 పడకలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో హెచ్‌సిక్యూఎస్, అజిత్రోమైసిన్ మందులు, ఎన్95, మూడు పొర‌ల మాస్క్‌లువ్య‌క్తిగ‌త ర‌క్ష‌ణ సామ‌గ్రి కిట్ల నిల్వ‌లు తగిన మేర ఉన్నాయ‌ని తెలిపింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో 1,061, ప్రైవేటు ఆస్ప‌త్రుల‌లో 1700 వంతున వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు మరో వెయ్యి వెంటిలేటర్లకు ప్ర‌భుత్వం ఆర్డర్ ఇచ్చింది. కాగా, మధ్యప్రదేశ్ నుంచి 1.10 లక్షలకుపైగా వలస కార్మికులు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నారు. గుజరాత్‌లో వివిధ రంగాల్లో అత్యధికంగా 35,000 మంది పనిచేస్తున్నారు, మహారాష్ట్రలో 25 వేల మంది, రాజస్థాన్‌లో 15 వేల మంది వంతున ఇత‌ర ప్రాంతాల కార్మికులు పనిచేస్తున్నారు. రాజస్థాన్‌లో పనిచేస్తున్నవారిలో  చాలామంది సొంత ఊళ్ల‌కు తిరిగి వెళ్లారు. గుజరాత్‌లో చిక్కుకున్న వారు తిరిగి రావడం ప్రారంభించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కూడా వలస కార్మికులను ఇంటికి పంపించే ఏర్పాట్లు చేసేదిశ‌గా చ‌ర్చిస్తున్నాయి.
 • మహారాష్ట్ర: ముంబై నగరంలోని వివిధ నియంత్ర‌ణ మండ‌ళ్ల‌లో పరిస్థితి మెరుగుపడుతోందని మేయర్ కిషోరి పెడ్నేకర్ అన్నారు. నగరంలోని 1,036 మండ‌ళ్ల‌కుగాను 231 చోట్ల‌ గత 14 రోజులుగా కొత్త కరోనా వైరస్ కేసులు న‌మోదు కాలేద‌ని ఆమె తెలిపారు. మ‌రోవైపు వ్యాధి సోకిన‌ట్లు అనుమానించిన 53 మంది పాత్రికేయుల‌ను 14 రోజుల‌పాటు నిర్బంధ ప‌రిశీల‌న‌లో ఉంచిన త‌ర్వాత గ‌డ‌చిన 24 గంట‌ల్లో రెండుసార్లు నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల‌లో 31 మందికి వ్యాధి సోక‌లేద‌ని నిర్ధార‌ణ కావ‌డంతో వారిని డిశ్చార్జి చేశారు.

PIB FACTCHECK

*******(Release ID: 1618809) Visitor Counter : 46