ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రాపిడ్ యాంటీబాడీ పరీక్షల ధరల వివాదంపై వాస్తవాలు
Posted On:
27 APR 2020 4:00PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారితో పోరాడటంలో వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చాలా కీలకమైన ఆయుధాలలో ఒకటి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయడానికి గాను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) చేయగలిగిన ప్రయత్నాలన్నింటనీ చేస్తోంది. కిట్ల సేకరణ మరియు వాటిని రాష్ట్రాలకు అవసరం మేరకు వేగంగా సరఫరా చేయడం వంటి పలు చర్యలను సమర్థవంతంగా చేపడుతోంది.
వివిధ దేశాల నుంచి పోటీ..
కోవిడ్ మహమ్మారి విశ్వవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ టెస్ట్ కిట్‌లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ తరుణంలో వివిధ దేశాలు వాటిని సొంతం చేసుకొనేందుకు గాను తమ ద్రవ్య శక్తిని మరియు దౌత్యపరమైన అంశాలను పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నాయి. ఇలాంటి తీవ్ర ఒత్తిడి నెలకొన్న సందర్భంగా కోవిడ్-19 వైరస్ టెస్టింగ్ కిట్ల సమీకరణ భారంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ ఈ కిట్ల కొనుగోలుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పరీక్ష కిట్ల నిమిత్తం గాను ఐసీఎంఆర్ చేసిన మొదటి ప్రయత్నానికి సరఫరాదారుల నుండి ఎటువంటి స్పందన లభించలేదు. కొనసాగింపుగా ఐసీఎంఆర్ చేసిన రెండో ప్రయత్నానికి తగిన స్పందన వచ్చింది. కిట్ల సున్నితత్వం వాటి విశిష్టతను దృష్టిలో ఉంచుకుని, పరీక్ష కిట్లను కొనుగోలు చేసేందుకు రెండు కంపెనీలు (బయోమెడిమిక్స్ మరియు వాండ్‌ఫో) గుర్తించబడ్డాయి. ఈ రెండు తయారీ సంస్థలకూ అవసరమైన అంతర్జాతీయ గుర్తింపు ధ్రువపత్రాలు ఉన్నాయి. వాండ్‌ఫో మూల్యాంకన కమిటీకి నాలుగు బిడ్లు లభించాయి. వరుసగా రూ.1,204, రూ.1,200, రూ.844 మరియు రూ.600 కొటేషన్లు లభించాయి. దీని ప్రకారం రూ.600ల బిడ్ ఆఫర్ను ఎల్ -1 గా పరిగణనలోకి తీసుకున్నారు.
నేరుగా లభించిన కొటేషన్‌లో వివిధ సమస్యలు..
ఇదే తరుణంలో ఐసీఎంఆర్ కూడా సీజీఐ ద్వారా చైనాలోని వాండ్‌ఫో కంపెనీ వర్గాల నుండి నేరుగా పరీక్ష కిట్లు పొందేందుకు కూడా ప్రయత్నించింది. అయితే నేరుగా సేకరణ నిమిత్తం లభించిన కొటేషన్ పలు కింద పేర్కొన్న సమస్యలతో కూడుకొని ఉందిః
- కొటేషన్ లాజిస్టిక్స్ విషయాలకు సంబంధించి ఎటువంటి నిబద్ధత లేకుండా ఫ్రీ ఆన్ బోర్డు విధానంలో లభించింది.
- కొటేషన్ ఎటువంటి గ్యారంటీ లేకుండా 100 శాతం ప్రత్యక్ష ముందస్తు చెల్లింపులు జరపాలనే నిబంధనలతో లభించాయి.
- కిట్ల అందజేతకు సంబంధించి ఎలాంటి నిర్దిష్టమైన సమయాన్ని కొటేషన్లలో పేర్కొనలేదు.
- ధరల హెచ్చుతగ్గులకు సంబంధించి ఎలాంటి నిబంధన లేకుండా రేట్లను అమెరికా డాలర్లలో తెలియజేయడమైంది.
ఈ నేపథ్యంలో ముందస్తు కోసం ఎటువంటి నిబంధన లేకుండా ఎఫ్ఓబీ (లాజిస్టిక్స్) కోసం అన్ని కలుపుకొని కిట్లకు ధరను కోట్ చేసిన వాండ్‌ఫో సంస్థకు చెందిన భారత పంపిణీదారు వద్ద పరీక్ష కిట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇటువంటి వైద్య సామగ్రిని సేకరించడం భారతీయ ఏజెన్సీ చేసిన మొట్టమొదటి ప్రయత్నం ఇదే కావడంతో పాటు బిడ్డర్లు కోట్ చేసిన రేటును పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశంగా వీటి సేకరణ విషయంలో ముందుకు సాగారు అనేది గుర్తుంచుకోవాలి.
క్షేత్రస్థాయి పరిస్థితులలో ఐసీఎంఆర్ పరీక్షలు..
కొంత సామగ్రిని స్వీకరించిన తరువాత క్షేత్రస్థాయి పరిస్థితులలో ఐసీఎంఆర్ కిట్ల నాణ్యతపై తగిన తనిఖీలు నిర్వహించింది.వాటి పనితీరు శాస్త్రీయత అంచనా ఆధారంగా ఈ తనిఖీలను నిర్వహించగా ఇతర తయారీదారులకు సంబంధించిన కిట్లు నిరాశజనమైన పనితీరు కనబరచడంతో మరో రకానికి సంబంధించిన ఆర్డరు రద్దు చేయబడింది. చెల్లింపు గడువు ప్రక్రియ విధానం (100% ముందస్తు మొత్తం చెల్లింపులతో సేకరణకు వెళ్లలేదు) అవలంభించిన కారణంగా ఈ పరీక్ష సామాగ్రికి సంబంధించి ఐసీఎంఆర్ ఇప్పటి వరకు ఎలాంటి చెల్లింపులను చేయలేదని నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్క రూపాయిని కూడా వృధా చేసుకొవడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు.
(Release ID: 1618739)
Visitor Counter : 308
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam