ప్రధాన మంత్రి కార్యాలయం
కోవిడ్-19 ను పరిష్కరించడానికి ముందస్తు ప్రణాళిక కోసం ముఖ్యమంత్రులతో సంప్రదించిన ప్రధానమంత్రి.
గడచిన ఒకటిన్నర నెలల్లో లాక్ డౌన్ కారణంగా దేశం వేలాదిమంది ప్రజల ప్రాణాలను కాపాడుకోగలిగింది : ప్రధానమంత్రి.
వేగవంతమైన స్పందనే మన తప్పనిసరి లక్ష్యం కావాలి, "రెండు గజాల దూరం" మంత్రాన్ని అనుసరించవలసిన అవసరం ఉంది : ప్రధానమంత్రి.
రెడ్ జోన్లు ఆరంజ్ జోన్లుగా ఆ తర్వాత గ్రీన్ జోన్లుగా మారే దిశగా రాష్ట్రాలు కృషి చేయాలి : ప్రధానమంత్రి.
సాధారణ పౌరుల జీవితాలను చేరే విధంగా సంస్కరణలు తీసుకురావడానికి మనం ధైర్యంగా ఉండాలి : ప్రధానమంత్రి.
కోవిడ్-19 కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తూనే, ఆర్థికవ్యవస్థకు తగిన ప్రాధాన్యత నివ్వాలి.
కరోనా వైరస్ ప్రభావం రానున్న నెలల్లో కూడా కొనసాగుతుంది, మాస్కులు, ఫేస్ కవర్లు మన జీవితంలో భాగంగా ఉంటాయి : ప్రధానమంత్రి.
ముఖ్యమంత్రులు తమ స్పందన తెలియజేశారు. ఆర్ధిక సవాళ్ళను ఎదుర్కోడానికీ, ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెంపొందించుకోడానికీ చర్యలు సూచించారు.
Posted On:
27 APR 2020 1:48PM by PIB Hyderabad
కోవిడ్-19 ప్రస్తుత పరిస్థితి గురించి, మహమ్మారిని పరిష్కరించడానికి ముందస్తు ప్రణాళిక గురించి చర్చిండం కోసం ప్రధానమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానమంత్రి ఈ విధంగా ముఖ్యమంత్రులతో సమావేశం కావడం ఇది నాలుగో సరి. గతంలో ఆయన మర్చి 20వ తేదీన, ఏప్రిల్ 2వ తేదీన,11వ తేదీన సమావేశమయ్యారు.
గడచిన ఒకటిన్నర నెలల్లో లాక్ డౌన్ కారణంగా దేశంలోని వేలాదిమంది ప్రజల ప్రాణాలను కాపాడుకోగలిగామనే విషయాన్ని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. పలు దేశాల మొత్తం జనాభాతో పోలిస్తే మన దేశ జనాభా చాలా ఎక్కువ అని ఆయన పేర్కొన్నారు. మర్చి నెల ప్రారంభంలో భారతదేశంతో సహా చాలా దేశాల్లో పరిస్థితి చాలా భాగం ఒకే విధంగా ఉంది. అయితే, సకాలంలో తీసుకున్న చర్యల వల్ల, భారతదేశం చాలా మంది ప్రజల ప్రాణాలను రక్షించగలిగింది. ప్రస్తుతం వైరస్ ప్రమాదం చాలా భాగం తగ్గినప్పటికీ, స్థిరమైన అప్రమత్తత పాటించడం చాలా ముఖ్యం.
దేశం ఇంతవరకు రెండు లాక్ డౌన్లను చూసిందనీ, కొన్ని విషయాలలో ఈ రెండూ భిన్నమైనవనీ, ఇప్పుడు మనం భవిష్యత్తు గురించి ఆలోచించాలనీ ప్రధానమంత్రి చెప్పారు. వచ్చే నెలల్లో కరోనా వైరస్ ప్రభావం స్పష్టంగా కనబడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. "రెండు గజాల దూరం" మంత్రాన్ని అనుసరించవలసిన అవసరం ఉందనీ, రానున్న రోజులలో మాస్కులు, ఫేస్ కవర్లు మన జీవితంలో భాగమైపోతాయనీ, ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో, వేగవంతమైన స్పందనే మన అందరి తప్పనిసరి లక్ష్యం కావాలని, ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ తమకు దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్నాయోమోనని ఎవరికీ వారు పరీక్షించుకుంటున్నారనీ, ఇది స్వాగతించదగ్గ పరిణామమనీ ఆయన పేర్కొన్నారు.
కోవిడ్-19 కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తూనే, ఆర్థికవ్యవస్థకు తగిన ప్రాధాన్యత నివ్వాలని ప్రధానమంత్రి అన్నారు. అవకాశం ఉన్నంతవరకు సాంకేతికతను ఉపయోగించుకోవలసిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. అలాగే ఈ సమయంలో సంస్కరణ చర్యలను వినియోగించుకోవాలని అన్నారు. కోవిడ్-19 కి వ్యతిరేకంగా దేశం అనుసరిస్తున్న చర్యలను పెంపొందించడానికి వీలుగా "ఆరోగ్య సేతు" యాప్ ను ఎక్కువ మంది ప్రజలు డౌన్ లోడ్ చేసుకోవలసిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. "సాధారణ పౌరుల జీవితాలను చేరే విధంగా సంస్కరణలు తీసుకురావడానికి మనం ధైర్యంగా ఉండాలి" - అని ఆయన పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలతో అనుబంధం కలిగిన ప్రజలు ఈ మహమ్మారితో పోరాటానికి అవసరమైన పరిశోధనలు, ఆవిష్కరణలను బలోపేతం చేసే మార్గాలను రూపొందించడంలో కలిసి ముందుకు రావాలని కూడా ఆయన సూచించారు.
హాట్ స్పాట్స్ అంటే రెడ్ జోన్స్ గా పేర్కొన్న ప్రాంతాల్లో మార్గదర్శకాలను కఠినంగా అమలుచేయవలసిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. రెడ్ జోన్లు ఆరంజ్ జోన్లుగా ఆ తర్వాత గ్రీన్ జోన్లుగా మారే దిశగా రాష్ట్రాలు కృషి చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
విదేశాలలో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకువచ్చే విషయమై ఆయన మాట్లాడుతూ, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అదేవిధంగా వారి కుటుంబాలు ఎటువంటి ప్రమాదంలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాతావరణంలో వచ్చే మార్పుల విషయంలో కూడా ముఖ్యంగా వేసవి కాలం, వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాల బారిన ప్రజలు పడకుండా ముఖ్యమంత్రులు జాగ్రత్తలు తీసుకుని, తగిన విధంగా వ్యూహ రచన చేయాలని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు.
గరిష్టంగా ప్రజల ప్రాణాలను కాపాడడానికి లాక్ డౌన్ విధించవలసిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి పునరుద్ఘాటించారు.
ఈ సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి నాయకత్వాన్ని ముఖ్యమంత్రులు అభినందించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో వారు చేపట్టిన చర్యలను కూడా ప్రశంసించారు. అంతర్జాతీయ సరిహద్దులపై నిఘా పెంచవలసిన అవసరం ఉందనీ, ఆర్ధిక సవాళ్ళను పరిష్కరించడం పైన, ఆరోగ్య మౌలిక సదుపాయాలూ పెంపొందించడంపైనా కూడా దృష్టి కేంద్రీకరించాలని వారు పేర్కొన్నారు. కోవిడ్-19 కి వ్యతిరేకంగా పోరాటంలో పోలీసు దళాలు, వైద్య సిబ్బంది ఆదర్శప్రాయమైన సేవలందిస్తున్నారని నాయకులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
*****
(Release ID: 1618697)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam