PIB Headquarters

కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 06 OCT 2020 6:26PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • దేశంలో నమోదైన మొత్తం కేసులలో ప్రస్తుతం ఆస్పత్రులలోగల కేసులు 13.75 శాతమే.
  • తాజాగా వ్యాధి నయమైనవారిలో 74 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలవారే.
  • భారత్‌లోని 25 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో తాజా నిర్ధారిత కేసులకన్నా కోలుకున్నవే అధికం.
  • గత 24 గంటల్లో కోలుకున్నవారి సంఖ్య 75, 787; నమోదైన కొత్త కేసులు 61,267.
  • కోవిడ్‌-19పై ఆయుర్వేదం, యోగా ఆధారిత జాతీయ వైద్య నిర్వహణ విధివిధానాలను ఆవిష్కరించిన డాక్టర్‌ హర్షవర్ధన్‌.
  • సినిమాల ప్రదర్శనపై ప్రామాణిక విధాన ప్రక్రియను విడుదల చేసిన శ్రీ ప్రకాష్‌ జావడేకర్‌.

దేశంలో చికిత్సపొందే కేసులలో స్థిరమైన తగ్గుదల; మొత్తం రోగులలో ఆస్పత్రులలో ఉన్నది 13.75శాతమే; తాజాగా కోలుకున్న కేసులలో 74 శాతం 10 రాష్ట్రాలవారే; 25 రాష్ట్రాల్లో కొత్త కేసులకన్నా కోలుకుంటున్నవే అధికం

దేశవ్యాప్తంగా చికిత్సలోగల కోవిడ్‌ కేసుల సంఖ్య స్థిరంగా తగ్గుతూ ఇవాళ 9,19,023 వద్ద నిలిచింది. ఈ మేరకు ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులలో ప్రస్తుతం ఆస్పత్రులలోగల రోగులు 13.75 శాతమే. కోలుకునేవారి సంఖ్య నిరంతరం పెరుగుతూ ప్రస్తుతం 56,62,490కి చేరింది. ఆ విధంగా చికిత్సలోగల కేసులకన్నా కోలుకున్న కేసుల సంఖ్య 47 లక్షలకు (47,43,467)పైగా నమోదైంది. ఆ మేరకు కోలుకునేవారి జాతీయ సగటు బాగా మెరుగుపడి 84.70 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో 75,787 మంది వ్యాధి నయమై ఇళ్లకు వెళ్లగా అదే సమయంలో నిర్ధారిత కొత్త కేసులు 61,267గా తేలాయి. తదనుగుణంగా 25 రాష్ట్రాల్లో కొత్త కేసులకన్నా కోలుకున్నవే అధికంగా ఉన్నాయి. ఇలా తాజాగా వ్యాధి నయమైనవారిలో 74 శాతం పది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ మేరకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, ఒడిషా, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. కాగా, ఒక్క మహారాష్ట్రలోనే ఒక్కరోజులో 13,000 మందికిపైగా కోలుకున్నారు. ఇక గత 24 గంటల్లో నమోదైన 61,267 కొత్త కేసులలో 75 శాతం 10 రాష్ట్రాలలోనివే కావడం గమనార్హం. ఇందులోనూ అత్యధికంగా మహారాష్ట్రలో 10 వేలకుపైగా కేసులు నమోదవగా, 7,000కుపైగా కేసులతో కర్ణాటక రెండో స్థానంలో ఉంది. గత‌ 24 గంటలలో సంభవించిన 884 మరణాల్లో దాదాపు 80 శాతం పది రాష్ట్రాల్లోనివే కాగా- మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్ ఈ జాబితాలో ఉన్నాయి. తాజా మరణాల్లో  29 శాతానికిపైగా (263) మహారాష్ట్రలో నమోదయ్యాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661997

కోవిడ్-19పై ఆయుర్వేదం, యోగా ఆధారిత జాతీయ వైద్య నిర్వహణ విధానాలను ఆవిష్కరించిన డాక్టర్ హర్షవర్ధన్

కోవిడ్-19 చికిత్సలో ఆయుర్వేద, యోగా ఆధారిత జాతీయ వైద్య నిర్వహణ విధివిధానాలను కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నేడు ఆవిష్కరించారు. ఆయుష్ శాఖ స్వతంత్ర హోదా సహాయమంత్రి  శ్రీపాద యశో నాయక్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్, ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్ తదితరులు వాస్తవిక సాదృశ పద్ధతిలో ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. సదరు ‘కోవిడ్-19 జాతీయ వైద్య నిర్వహణ విధానంలో ఆయుర్వేద, యోగా చికిత్స విధానాలను ఏకీకృతం చేయడంపై అధ్యయనం కోసం భారత వైద్య పరిశోధన మండలి విశ్రాంత డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ వి.ఎం.కటోచ్‌ అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటైంది. అనంతరం ఆమోదయోగ్య, ప్రయోగాత్మక చికిత్స సమాచారం ప్రాతిపదికగా ఈ కమిటీ వివిధ సిఫారసులతో ఒక నివేదికను రూపొందించి సమర్పించింది. తదనుగుణంగా తాజా విధివిధానాలకు రూపకల్పన చేశారు. సందర్భంగా డాక్టర్‌ హర్షవర్ధన్‌ మాట్లాడుతూ- “కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఆయుష్ విధానాలను అనుసరించాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టంగా సూచించారు. వైరస్ సోకకుండా తీసుకునే ముందు జాగ్రత్త చర్యలు కోవిడ్ నియంత్రణలోనేగాక ఆధునిక కాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల పరిష్కారానికి కూడా సముచితమైనవే” అన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662029

డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అధ్యక్షతన ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక బోర్డు 5వ ప్రత్యేక సమావేశం

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక మండలి చైర్మన్ హోదాలో ఐదో ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వహించారు. వాస్తవిక సాదృశ పద్ధతిలో నిన్న నిర్వహించిన ఈ సమావేశంలో పరిశీలక సభ్యులతోపాటు సంస్థ కేంద్ర కార్యాలయ సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. కోవిడ్-19కు స్పందనగా డబ్ల్యుహెచ్ఎ 73.1 తీర్మానం నిబంధనల సంపూర్ణ, సమర్థ అమలుకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించటం ఈ సమావేశం చర్చలో కీలకాంశం. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్నవారందరికీ డాక్టర్ హర్షవర్ధన్ స్వాగతం పలికారు. మహమ్మారిపై పోరులో నిస్వార్థ సేవలందించి ప్రాణత్యాగం చేసినవారికి ఆయన ఘనంగా నివాళి అర్పించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661914

కోవిడ్‌-19 టీకాపై అంచనా కోసం అంతర్జాతీయ జీవ-అంచనా ప్రయోగశాలగా ‘డీబీటీ’ పరిధిలోని ‘టీహెచ్‌ఎస్‌టీఐ’కి ‘సీఈపీఐ’ గుర్తింపు

కోవిడ్‌-19కు టీకా తయారీలో ప్రపంచ దేశాలన్నీ నిమగ్నమై ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై కేంద్రీయ అంచనా నిమిత్తం విశ్వవ్యాప్త పరిశీలన నెట్‌వర్క్‌ ఏర్పాటైంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ జీవ-అంచనా ప్రయోగశాలగా భారత బయోటెక్నాలజీ శాఖ పరిధిలోని స్వతంత్ర ప్రతిపత్తిగల “ట్రాన్స్‌ నేషనల్‌ హెల్త్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌” (టిహెచ్ఎస్‌టీఐ)కు గుర్తింపు లభించింది. ఈ మేరకు “కోఆలిషన్‌ ఆఫ్‌ ఎపిడమిక్‌ ప్రిపేర్‌డ్‌నెస్‌ ఫర్‌ ఇన్నొవేషన్‌ (సీఈపీఐ) ప్రకటించింది. తదనుగుణంగా తొలుత కెనడా, బ్రిటన్, ఇటలీ, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, భారత్‌లలో ఒక్కో లేబరేటరీకి ఈ గుర్తింపు లభించింది. ఈ నెట్‌వర్క్‌లో ఉన్న ప్రయోగశాలలన్నీ ప్రామాణిక నిబంధనలకు తగినట్లు వ్యవహరిస్తూ టీకా సామర్థ్యాన్ని అంచనావేస్తాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661898

కృత్రిమ మేధ‌స్సుపై భారీ ఆన్‌లైన్‌ సదస్సు ‘రెయిజ్‌-2020’ని ప్రారంభించిన ప్ర‌ధాని

కృత్రిమ మేధ‌స్సుపై ఏర్పాటైన భారీ ఆన్‌లైన్‌ సదస్సు ‘రెయిజ్‌-2020’ని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నిన్న ప్రారంభించారు. సామాజిక మార్పు దిశగా చేప‌ట్టాల్సిన విధివిధానాల  రూపకల్పన లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఆరోగ్య‌, వ్య‌వ‌సాయ‌, విద్య‌, చురుకైన మేధస్సు తదితర రంగాల్లో ప్ర‌జ‌లకు సాధికార‌త కల్సన కోసం కృత్రిమ మేధో పరిజ్ఞానాన్ని ఉప‌యోగించాలన్నది ప్ర‌భుత్వ ల‌క్ష్యం. కృత్రిమ మేధ‌స్సుపై చ‌ర్చ‌ను ప్రోత్స‌హించ‌డానికి స‌మావేశ నిర్వాహ‌కులు ముందుకు రావ‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌ని ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ప్ర‌ధానమంత్రి అన్నారు. సాంకేతిక‌త కార‌ణంగా విధినిర్వ‌హ‌ణ‌లో, అనుసంధానంలో చాలా మార్పులు వ‌చ్చాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. సామాజిక బాధ్య‌త‌, కృత్రిమ  మేధో పరిజ్ఞానం రెండూ ఏకమైతే మాన‌వీయ స్ప‌ర్శ‌తో కూడిన కృత్రిమ మేధస్సు రూపొందించి‌నట్లు అవుతుందని  స్ప‌ష్టంచేశారు. మానవాళి, కృత్రిమ మేధస్సు ఐక‌మ‌త్యంతో ప‌నిచేస్తే ప్ర‌పంచంలో అద్భుతాలు సాధ్యమని  ప్ర‌ధాని స్పష్టం చేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661996

'సామాజిక సాధికారత-2020' సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661920

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్‌ ప్రధాని గౌరవనీయ బెంజమిన్‌ నెతన్యాహుల మధ్య ఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న ఇజ్రాయెల్‌ ప్రధాని గౌరవనీయ బెంజమిన్‌ నెతన్యాహుతో టెలిఫోన్‌ద్వారా సంభాషించారు. యూదుల కొత్త సంవత్సరం, యూదుల పండుగక ‘సుకోత్‌’ల సందర్భంగా  ప్రధాని నెతన్యాహుతోపాటు ఇజ్రాయెల్‌ ప్రజలకు ప్రధానమంత్రి మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాగా, కోవిడ్‌-19 మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో భారత్-ఇజ్రాయెల్‌ ద్వైపాక్షిక సహకార ప్రగతిపై వారిద్దరూ సానుకూలంగా అంచనా వేశారు. ప్రత్యేకించి రోగ నిర్ధారణ పరికరాలు, టీకా తయారీకి సంబంధించిన పరిశోధన, క్షేత్రస్థాయి ప్రయోగాలపై వారు క్షుణ్నంగా చర్చించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661972

సినిమాల ప్రదర్శనపై ప్రామాణిక విధాన ప్రక్రియలను విడుదల చేసిన శ్రీ ప్రకాష్ జావడేకర్; 50 శాతం సీట్ల సామర్థ్యంలో థియేటర్లు తెరిచేందుకు అనుమతి

దేశవ్యాప్తంగా సినిమాల ప్రదర్శనకు సంబంధించిన ప్రామాణిక విధాన ప్రక్రియ (ఎస్‌వోపీ)లను కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి శ్రీ ప్రకాష్‌ జావడేకర్‌ ఇవాళ విడుదల చేశారు. ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖతో సంప్రదించిన అనంతరం సినిమా ప్రదర్శన సమయంలో తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలను తమ శాఖ రూపొందించిందని మంత్రి వెల్లడించారు. అలాగే కేంద్ర హోంశాఖ నిర్ణయానికి అనుగుణంగా 2020 అక్టోబరు 15 నుంచి సినిమా థియేటర్లు 50 శాతం సీట్ల సామర్థ్యంతో పునఃప్రారంభం కాగలవని తెలిపారు. దీంతోపాటు పాటించాల్సిన వివిధ నిబంధనల గురించి వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661494

వస్తుసేవల పన్ను మండలి 42వ సమావేశం సిఫారసులు

వస్తుసేవల పన్నుమండలి 42వ సమావేశం నిన్న ఇక్కడ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. ఆర్థికశాఖ సహాయమంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్‌తోపాటు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతోపాటు ఆ శాఖకు చెందిన సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వస్తుసేవల పన్నుమండలి కొన్ని సిఫారసులు చేసింది: ఇందులో భాగంగా 1. పరిహార సెస్ విధింపును ఐదేళ్ల పరివర్తన కాలానికి మించి... అంటే- జూన్ 2022 తర్వాతి కాలందాకా ఆదాయ అంతరం భర్దీకి అవసరమైన మేర పొడిగించాలి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలపై చర్చించాల్సి ఉంది. కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు నష్టాల భర్తీకోసం రూ.20,000 కోట్ల నష్ట పరిహారాన్ని విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే వచ్చేవారానికల్లా 2017-18కి సంబంధించిన సమీకృత వస్తుసేవల పన్ను బకాయిల కింద దాదాపు రూ.25,000 కోట్లు విడుదల చేయనుంది. అలాగే రిటర్న్ల దాఖలు విధివిధానాల్లో మెరుగుదలకు నిర్ణయించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661484

పాఠశాలల పునఃప్రారంభంపై ప్రామాణిక విధాన ప్రక్రియలు/మార్గదర్శకాలను జారీచేసిన విద్య-అక్షరాస్యత విభాగం, విద్యా మంత్రిత్వశాఖ

దేశవ్యాప్తంగా పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి పాఠశాల విద్య-అక్షరాస్యత విభాగం, విద్యా మంత్రిత్వశాఖ నిన్న ప్రామాణిక విధాన ప్రక్రియలు/మార్గదర్శకాలను జారీచేశాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' ఒక ట్వీట్‌ద్వారా ఈ మేరకు ప్రకటించారు.  ఈ విధివిధానాలు/మార్గదర్శకాలకు అనుగుణంగా 15.10.2020 తర్వాత పాఠశాలలు, కోచింగ్ సంస్థలను దశలవారీగా తిరిగి తెరవడంపై ఆయా రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు సంబంధిత పాఠశాలలతో సంప్రదించి నిర్ణయం తీసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661352

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • మహారాష్ట్ర: రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి రెస్టారెంట్లు, తినుబండారాల దుకాణాలుసహా బార్ల పునఃప్రారంభాన్ని పరిశ్రమ స్వాగతించినప్పటికీ యాజమాన్యాల ల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఈ మేరకు ముంబైలోగల 14,000కుపైగా రెస్టారెంట్లలో 25 నుంచి 30 శాతం మాత్రమే తెరవబడ్డాయి. డిమాండ్ లేకపోవడంతోపాటు సిబ్బంది రవాణా, వసతి తదితరాల్లో ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. కాగా, రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతో నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ దీనికి విరుద్ధంగా బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ మాత్రం 33 శాతానికి పరిమితం చేసింది. కాగా, సోమవారం రాష్ట్రంలో 10,244 కొత్త కేసులు నమోదవగా, 12,982 మంది కోలుకున్నారు.
  • గుజరాత్: రాష్ట్రంలో సోమవారం 1,327 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 1.44 లక్షలకు పెరిగింది. మరోవైపు 1,405మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్త కేసులలో అత్యధికంగా 276 సూరత్‌లో నమోదవగా, 187 కేసులతో అహ్మదాబాద్ రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో కోలుకునేవారి సగటు  85.94 శాతంగా ఉంది.
  • రాజస్థాన్: రాష్ట్రంలోని భిల్వారా పరిధిలోగల సహారా నియోజకవర్గ కాంగ్రెస్‌ శాసనసభ్యుడు కైలాష్ త్రివేది మంగళవారం ఉదయం గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కోవిడ్-19తో మరణించారు. త్రివేది వయసు 65 ఏళ్లు కాగా, రాజస్థాన్ ప్రభుత్వం ఐదు రోజుల కిందట విమాన అంబులెన్స్‌ద్వారా ఆయనను ఆస్పత్రికి తరలించింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా కోవిడ్‌కు బలైనవారి సంఖ్య 1,559కి చేరగా, ప్రస్తుతం 21,215 మంది చికిత్స పొందుతున్నారు.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో సోమవారం 2,681 కొత్తకేసులు, 36 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,26,005కు, మృతుల సంఖ్య 1,081కి పెరిగాయి. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర ప్రభావిత, అత్యధిక కేసులున్న రాయ్‌పూర్ జిల్లాలో 270 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 35,467కు చేరింది. కాగా, ఈ జిల్లాలో ఇప్పటిదాకా 455 మంది మరణించారు.
  • గోవా: రాష్ట్రంలో ఏకాంత గృహవాస చికిత్సకు మొగ్గుచూపిన లక్షణరహిత రోగులకు నేటినుంచి కోవిడ్-19 కిట్ల పంపిణీ ప్రారంభమైంది. కాగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వారంలోగా ఈ కిట్లను పంపిణీ చేస్తామని మూడు వారాలకిందటే ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే ప్రకటించారు.
  • కేరళ: కోవిడ్‌ విషయంలో ముందుజాగ్రత్తలపై ఉదాసీనంగా వ్యవహరించడమే మహమ్మారి విస్తృత వ్యాప్తికి దోహదం చేసిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. రోగుల సంఖ్య పెరిగితే, మరణాలు కూడా పెరుగుతాయని, దీన్ని నివారించేందుకు అందరూ జాగ్రత్తగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖకు చీడపట్టిందని ఐఎంఏ విమర్శించడాన్ని ముఖ్యమంత్రి తప్పుబట్టారు. తమనుతాము నిపుణులుగా చాటుకునేవారు రాష్ట్ర ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించవద్దన్నారు. మరోవైపు కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో శబరిమల సందర్శించే భక్తులు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం సమర్పించింది. కేరళలో నిన్న 5,042 కొత్త కేసులు నమోదయ్యాయి. వివిధ జిల్లాల్లో 84,873మంది చికిత్స పొందుతుండగా 2.58 లక్షల మంది పరిశీలనలో ఉన్నారు. కోవిడ్ మరణాల సంఖ్య 859కి చేరుకుంది.
  • తమిళనాడు: రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితిపై ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి, మరో ముగ్గురు మంత్రిమండలి సహచరులు సోమవారం గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్‌ను కలిసి చర్చించారు. వైద్యవిద్య  ప్రవేశ పరీక్ష ‘నీట్’ అర్హత సాధించిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు సమాంతర రిజర్వేషన్‌ కల్పన బిల్లు, అన్నా విశ్వవిద్యాలయం విభజన బిల్లుపైనా ఆయనతో చర్చించారు. కాగా, 10, 11, 12 తరగతుల సవరించిన పాఠ్యప్రణాళికను త్వరగా విడుదల చేయాలని విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖను కోరారు.
  • కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేపు మంత్రులు, ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే గురువారం జిల్లా కమిషనర్లు, ఎస్పీల సమావేశాన్ని కూడా ఆయన నిర్వహిస్తారు. కర్ణాటకలో అక్టోబర్ 15 తర్వాత పాఠశాలల పునఃప్రారంభంపై సూచనలివ్వాలని వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్‌ ఆరోగ్యశాఖను కోరారు.
  • ఆంధ్రప్రదేశ్: కోవిడ్‌ మహమ్మారి నిర్మూలన దిశగా “కోవిషీల్డ్” టీకాను ప్రయోగాత్మకంగా పరీక్షించే దిశగా విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కెజిహెచ్) చారిత్రక ప్రస్థానం ప్రారంభించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీచేసిన కట్టుదిట్టమైన మార్గదర్శకాలకు అనుగుణంగా- ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, సీరం ఇండియా లిమిటెడ్, ఐసీఎంఆర్ నిర్దేశిత విధివిధానాల ప్రకారం- ఇద్దరు స్వచ్ఛంద కార్యకర్తలకు తొలిరోజు ‘కోవిషీల్డ్’ టీకా ఇచ్చారు. అయితే, ఇతరత్రా వ్యాధులున్నవారు, కోవిడ్‌ నిర్ధారణ అయినవారు ఈ ప్రయోగాత్మక పరీక్షకు అర్హులుకారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రెండున్నర నెలల తర్వాత రోజువారీ కేసుల సంఖ్య సోమవారం 5,000కన్నా తక్కువకు దిగివచ్చింది. ఆ మేరకు చివరిసారిగా జూలై 21న రాష్ట్రంలో 37,000 నమూనాల పరీక్ష అనంతరం 4,944 కేసులు మాత్రమే నిర్ధారణ అయ్యాయి. ఏదేమైనా, రాష్ట్రంలో తాజాగా 38 మంది మరణించడంతో మృతుల సంఖ్య  6,000 స్థాయిని దాటింది.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1983 కొత్త కేసులు, 10 మరణాలు సంభవించగా, 2381 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 292 జిహెచ్‌ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. మొత్తం కేసులు: 2,02,594; క్రియాశీల కేసులు: 26,644; మరణాలు: 1181; డిశ్చార్జి: 1,74,769గా ఉన్నాయి. కాగా, జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రంలోని ఇతర పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలను బ్యాలెట్ పత్రాలతో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులపై వివిధ రాజకీయ పార్టీలతో విస్తృత చర్చలలో వెల్లడైన అభిప్రాయాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి తెలిపారు.
  • అరుణాచల్ ప్రదేశ్‌: రాష్ట్రంలో నిన్న 235 కొత్త కేసులు నమోదవగా, ప్రస్తుత క్రియాశీల కేసుల సంఖ్య 3000కు చేరింది. అరుణాచల్‌లో మరొకరు మరణించడంతో మృతుల సంఖ్య 19కి పెరిగింది.
  • మణిపూర్: రాష్ట్రంలో 250 కొత్త కేసులు నమోదవగా, తాజాగా మరొకరి మరణంతో ఇప్పటిదాకా కోవిడ్‌కు బలైనవారి సంఖ్య  75కు పెరిగింది. రాష్ట్రంలో కోలుకునేవారి సగటు 77 శాతంగా ఉంది.
  • మేఘాలయ: రాష్ట్రంలోని ప్రస్తుత 2217 కేసులకుగాను 123మంది బీఎస్‌ఎఫ్-సాయుధ దళాల సిబ్బంది కాగా, మేఘాలయలో ఇప్పటిదాకా 4491 మంది కోలుకున్నారు.
  • మిజోరం: రాష్ట్రంలో నిన్న 8 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 2128కి పెరిగాయి. వీటిలో ప్రస్తుతం 291 చురుకైన కేసులున్నాయి.
  • నాగాలాండ్: రాష్ట్రంలో సోమవారం నమోదైన 42 తాజా కేసులలో 30 దిమాపూర్ నుంచి, 8 మోన్ నుంచి, 4 కొహిమా నుంచి నమోదయ్యాయి.

FACT CHECK

***

 

 



(Release ID: 1662195) Visitor Counter : 235