ప్రధాన మంత్రి కార్యాలయం
కృత్రిమ మేధస్సు రంగంపై ఏర్పాటైన రైజ్ 2020 మెగా విర్చువల్ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రపంచ వేదికగా రూపుదాల్చనున్న భారతదేశం : ప‌్రధాని
ప్రజల సమస్యలను పరిష్కరించడానికి జాతీయ ఏఐ కార్యక్రమాన్ని ఉపయోగిస్తాం : ప‌్రధాని
Posted On:
05 OCT 2020 8:51PM by PIB Hyderabad
కృత్రిమ మేధస్సు రంగంపై ఏర్పాటైన రైజ్ 2020 మెగా విర్చువల్ సమావేశాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. సామాజిక మార్పుకోసం చేపట్టాల్సిన విధివిధానాలను తయారు చేయడానికిగాను రైజ్ - 2020 అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్య, వ్యవసాయ, విద్య, మొబైల్ సేవలు, ఇంకా ఇతర రంగాలద్వారా ప్రజల సాధికారతను సాధించడంకోసం ఏఐని ఉపయోగించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
కృత్రిమ మేధస్సు రంగంపై చర్చను ప్రోత్సహించడానికిగాను సమావేశ నిర్వాహకులు ముందుకు రావడం ప్రశంసనీయమని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని అన్నారు. సాంకేతికత కారణంగా విధినిర్వహణలో, కనెన్టివిటీలో చాలా మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. సామాజిక బాధ్యత, ఏఐ ...ఈ రెండూ కలిస్తే తద్వారా మానవీయ స్పర్శతో కూడిన ఏఐని రూపొందిచనట్టవతుందని స్పష్టం చేశారు. మనిషి, ఏఐ రెండూ కలిసి ఐకమత్యంగా పని చేస్తే ఈ ప్రపంచంలో అద్భుతాలు జరుగుతాయని ప్రధాని అన్నారు.
చరిత్రను చూస్తే విజ్ఞాన, బోధన రంగాల్లో భారతదేశం ప్రపంచానికి సారధ్యంవహించిందని డిజిటల్ పరంగా కూడా ఆ పని చేస్తుందని, తద్వారా ప్రజల సంతోషించేలా ప్రపంచానికి మేలు చేస్తుందని ప్రధాని వివరించారు.
దేశంలో పారదర్శకతను మెరుగు పరచడానికిగాను, సేవలను అందించడానికిగాను సాంకేతికత ఎలా ఉపయోగపడుతుందనే విషయం భారతదేశానికి ఇప్పటికే అవగాహనలోకి వచ్చిందని ప్రధాని అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద గుర్తింపు కార్డు వ్యవస్థ ఆధార్ గానీ, ప్రపంచంలోనే విశిష్ట డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అయిన యుపిఐ... ఈ రెండు దేశంలో డిజిటల్ సేవల్ని సమర్థవంతంగా అందిస్తున్నాయని ప్రధాని అన్నారు. ఆర్ధిక సేవలు, బడుగు బలహీన వర్గాల అకౌంట్లలోకి నేరుగా నగదును జమ చేసే పథకాలు డిజిటల్ రూపంలో సమర్థవంతంగా అందుతున్నాయని ప్రధాని అన్నారు. కరోనా మహమ్మారి ప్రభావం మొదలైన తర్వాత ప్రజలకు ఆర్ధికసాయం అందించడానికిగాను దేశంలోని డిజిటల్ వ్యవస్థ చాలా సమర్థవంతంగా పని చేసిందని ప్రధాని అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారతదేశం ప్రపంచ కేంద్రంగా రూపొందుతుందని ప్రధాని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో మరింత మంది పని చేస్తారని భావిస్తున్నట్టు ప్రధాని తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఐకమకత్యంగా పని చేయడం, నమ్మకం, భాగస్వామ్యం, బాధ్యత, అందరినీ కలుపుకొని పోయే విధానం అనేవి ముఖ్యమైన నియమాలని ప్రధాని అన్నారు.
ఈ మధ్యనే జాతీయ విద్యావిధానం 2020కి భారతదేశం ఆమోదం తెలిపిందని... దేశ విద్యారంగంలో సాంకేతికత ఆధారిత బోధన, నైపుణ్యాల బోధన అనేవాటిపైన నూతన విధానం దృష్టి పెట్టిందని ప్రధాని అన్నారు. పలు ప్రాంతీయ భాషల్లో ఎలక్ట్రానిక్ కోర్సులను అభివృద్ధి చేయడం జరుగుతోందని, ఏఐ వేదికలకు సంబంధించిన నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సామర్థ్యాలనుంచి ఈ మొత్తం ప్రయత్నం ప్రయోజనం పొందుతుందని ప్రధాని వివరించారు. యువతకు సంబంధించిన కార్యక్రమంలో బాధ్యతాయుత ఏఐని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రవేశపెట్టామని, పాఠశాలలకు చెందిన 11 వేల మందికిపైగా విద్యార్థులు ఈ కార్యక్రమం కిందగల ప్రాధమిక కోర్సును పూర్తి చేశారని ప్రధాని తెలిపారు. వారిప్పుడు తమకు సంబంధించిన ఏఐ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని ప్రధాని అన్నారు.
జాతీయ విద్యా రంగ సాంకేతికతా వేదిక అనేది రానున్న రోజుల్లో దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు, డిజిటల్ కాంటెంట్, సామర్థ్యాలను ప్రోత్సహించే ఎలక్ట్రానిక్ విద్యా కేంద్రాన్ని తయారు చేస్తోందని ప్రధాని అన్నారు. విర్చువల్ ల్యాబుల ఏర్పాటు, అటల్ ఇన్నోవేషన్ కార్యక్రమంద్వారా నూతన సాంకేతికతలకు అనుగుణంగా భారతదేశం ముందడుగువేస్తుందని ప్రధాని అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఏర్పాటు చేసిన జాతీయ కార్యక్రమాన్ని ప్రజల సమస్యల పరిష్కారంకోసం అంకితం చేస్తామని ప్రధాని అన్నారు.
ఏఐ ముఖ్య పాత్ర పోషించే రంగాల గురించి ప్రధాని తన ప్రసంగంలో వివరించారు. వ్యవసాయరంగం, రాబోయే తరాలకు కావలసిన పట్టణ నగరాల మౌలిక సదుపాయాలను అందించడంలో, నగరాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో, మురుగునీటి పారుదల వ్యవస్థలను, విద్యుత్ శక్తి గ్రిడ్డులను మెరుగుపరచడంలో, విపత్తు నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి, వాతావరణ మార్పులద్వారా వస్తున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రధాని అన్నారు. ఏఐ ద్వారా భాషాపరమైన అంతరాలు తొలగించవచ్చని, భాషల, మాండలికాల వైవిధ్యాన్ని కాపాడుకుంటామని ప్రధాని వివరించారు. విజ్ఞానాన్ని పంచుకోవడానికి ఏఐని ఉపయోగించుకోవాలని ప్రధాని సూచించారు.
ఏఐ వినియోగంలో ఆల్గారిథమ్ పారదర్శకత అనేది చాలా ముఖ్యమని ప్రధాని అన్నారు. మనందరం కలిసికట్టుగా పని చేసి ఏఐ సద్వినియోగంపై నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వుంటుందని ప్రధాని అన్నారు. ఏఐ అసాంఘిక శక్తుల చేతుల్లో ఆయుధంగా మారకుండా కాపాడుకోవాల్సి వుందని ప్రధాని కోరారు.
ఒక పక్క కృత్రిమ మేధస్సు ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) గురించి మనం మాట్లాడుకుంటున్నప్పటికీ, మనిషి సృజనాత్మకత, మనిషి భావోద్వేగాలు అనేవి మన అత్యుత్తమ బలాలుగా కొనసాగుతాయని యంత్రాలకు మనిషికి మధ్యన తేడా అనేది... వాటిద్వారానే అని ప్రధాని సూచించారు. యంత్రాలపై మనిషి పై చేయికి కారణమయ్యే ఈ మేధోపర ప్రత్యేకతను కాపాడుకోవడం గురించి ఆలోచించాలని ప్రధాని కోరారు.
ప్రతి మనిషిలోని ప్రత్యేక ప్రతిభను బైటకు తీసుకురావడానికి ఏఐ ఉపయోగపడుతుందని తద్వారా వారిని సాధికారులను చేసి ఈ సమాజానికి వారు మరింత సమర్థవంతంగా ఉపయోగపడేలా చేస్తుందని ప్రధాని అన్నారు. రైజ్ -2020లో పాల్గొంటున్నవారు తమ అభిప్రాయాలను, ఆలోచనల్ని పంచుకొని ఏఐ వినియోగానికి సంబంధించిన ఉమ్మడి విధానాన్ని రూపొందించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఈ చర్చల ద్వారా తయారయ్యే బాధ్యతాయుతమైన ఏఐ రోడ్డు మ్యాపు అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లోను, ఉపాధిలోను మార్పులు తేవాలని ప్రధాని ఆకాంక్షించారు.
***
(Release ID: 1661996)
Visitor Counter : 349
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam