ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహకమండలి ప్రత్యేక సమావేశానికి డాక్టర్ హర్ష వర్ధన్ అధ్యక్షత అత్యవసర పరిస్థితులకు తట్టుకోగలిగేలా

బలంగా సిద్ధమవటమే లక్ష్యం కావాలి

వ్యాధి నిర్థారణ, చికిత్స, వాక్సిన్లు మాత్రమే

ప్రపంచాన్ని మహమ్మారినుంచి బైటపడేస్తాయి

Posted On: 05 OCT 2020 8:35PM by PIB Hyderabad

ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక మండలి చైర్మన్ హోదాలో ఐదవ ప్రత్యేక సమావేశానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ అధ్యక్షత వహించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో పరిశీలకులుగా పాల్గొన్నవారు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కేంద్ర కార్యాలయపు సీనియర్ అధికారులు హాజరయ్యారు.

కోవిడ్ కు స్పందనగా డబ్ల్యు హెచ్ ఎ 73.1 తీర్మానపు నిబంధనలను సంపూర్ణంగా, సమర్థంగా అమలు చేయటానికి తీసుకోవాల్సిన చర్యల మీద దృష్టి సారించటం ఈ ఎజెండాలో కీలకమైన అంశం.

కోవిడ్-19 స్పందన పేరుతో చేసిన తీర్మానాన్ని స్పాన్సర్ చేయటంలో 130 కి పైగా దేశాలు పాలుపంచుకున్నాయి. కరోనా మహమ్మారిని నియంత్రించే చర్యలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చాయి. వైరస్ మీద జరిగే పోరులో భాగంగా అత్యవసర ఆరోగ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని నిజాయితీగా అందరికీ పంపిణీ చేయాలని కోరాయి.

ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ స్వాగతం పలికారు. ఈ మహమ్మారిమీద జరిగే పోరులో నిస్వార్థంగా పనిచేసి ప్రాణాలు త్యాగం చేసినవారికి ఆయన ఘనంగా నివాళులర్పించారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన సంక్షోభాన్ని గుర్తు చేసుకుంటూ “ఈ రోజు మనం చాలా అనివార్యమైన,  ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం. వర్చువల్ సమావేశాల ద్వారా కలుసుకోవాల్సిన తప్పనిసరి వాతావరణం వచ్చింది. ప్రభుత్వాలు, పరిశ్రమ, దానధర్మ స్వభావం ఉన్నవారు ఉమ్మడిగా వనరులను సమీకరించి రిస్క్ భర్తీ చేయటానికి, పరిశోధనకు, వస్తువుల తయారీకి, పంపిణీకి మద్దతుగా నిలబడాల్సిన అవసరముంది. ఎక్కడ తయారుచేసినదైనా సరే దాని ఫలితాలు అందరికీ అందుబాటులో  ఉండేట్లు చూసుకోవాలి” అన్నారు.

వైపరీత్యాల రిస్క్ ను తగ్గించటానికి కట్టుబడి ఉండాలంటే ఆ రిస్క్ ను పారదర్శకంగా,  ప్రాథమిక దశలోనే గుర్తించాల్సి ఉందన్నారు. కోలుకోవటానికి అవసరమైన ఆరోగ్య వ్యవస్థల రూపకల్పనకు, అందులో కృషి చేస్తున్నవారికి అండగా నిలవటానికి ప్రయత్నం జరగాలని పిలుపునిచ్చారు. బహుళ రంగ సహాకారాన్ని బలోపేతం చేయటం, వ్యాధి ఆధారాలను వేగంగా చూపటం, పరిశోధనను వేగవంతం చేయటం, ఆధారాలతో పథకాల అమలు చాలా ముఖ్యమన్నారు.  

ప్రజారోగ్య బాధ్యతను నెరవేర్చటంలో అంతర్జాతీయ భాగస్వాములందరూ కలసికట్టుగా, సమర్థంగా కృషి చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యులకు డాక్టర్ హర్ష వర్ధన్  పిలుపునిచ్చారు. ఇప్పుడు ఎదుర్కుంటున్న సంక్షోభం లాంటి సవాళ్ళు ఉమ్మడి భాగస్వామ్యంతో  ఎదుర్కోవాల్సినవని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ భాగస్వామ్యదేశాల సిద్ధాంతం కూడా బాధ్యతలు పంచుకోవటమేనని గుర్తు చేశారు.


(Release ID: 1661914)