ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ చికిత్సలో ఆయుర్వేద, యోగాపై ప్రొటోకాల్ విడుదల

Posted On: 06 OCT 2020 2:00PM by PIB Hyderabad

  భారతీయ వైద్య విధానంపై జాతీయ కమిషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం, జామ్ నగర్ లోని ఆయుర్వేద సంస్థల సమూహానికి జాతీయ ప్రాముఖ్యతా ప్రతిపత్తి లభించడం  సంప్రదాయ వైద్య విధానాల పునరుద్ధరణపై ఏకాభిప్రాయాన్ని సూచిస్తోంది.

   కోవిడ్-19 చికిత్సలో ఆయుర్వేద, యోగ ప్రయోగానికి సంబంధించిన జాతీయ క్లినికల్ నిర్వహణా నిబంధనావళిని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ రోజు విడుదల చేశారు. ఆయుష్ శాఖ స్వతంత్ర హోదా సహాయ మంత్రి  శ్రీపాద యెస్సో నాయక్, నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్, నీతీ ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ తదితరులు ఆన్ లైన్ ద్వారా వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

  'కోవిడ్-19: జాతీయ క్లినికల్ మేనేజ్ మెంట్ ప్రొటోకాల్ రూపకల్పనలో భాగంగా, ఆయుర్వేద, యోగా చికిత్సా విధానాలపై అధ్యయనానికి మొదట నిపుణులతో ఒక కమిటీని నియమించారు. సంబంధిత పరిశోధనాంశాల నిపుణులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీకి భారతీయ వైద్య పరిశోధనా మండలి (.సి.ఎం.ఆర్.) మాజీ డైరెక్టర్ జనరల్,..డాక్టర్ వి.ఎం. కటోచ్ ను చైర్మన్ గా నియమించారు. ఆమోదయోగ్యమైన, ప్రయోగాత్మకమైన చికిత్సా సమాచారం ప్రాతిపదికగా ఈ కమిటీ ఒక నివేదికను రూపొందించింది. ఈ మందుల ప్రయోజనాలు, వినియోగంలో భద్రత వంటి అంశాలను సూచిస్తూ కమిటీ తన నివేదికను కోవిడ్ జాతీయ టాస్క్ ఫోర్స్ కు, సంయుక్త పర్యవేక్షణ బృందానికి సమర్పించింది. అనంతరం నీతీ ఆయోగ్ సిఫార్సులతో ఒక ప్రొటోకాల్ ను రూపొందించారు

  ఈ సిఫార్సుల ఆధారంగా, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ వివిధ వైద్య సంస్థల నిపుణుల కమిటీనుంచి ఏకాభిప్రాయాలను సేకరించింది. ఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద అధ్యయన సంస్థ (...), జామ్ నగర్ లోని ఆయుర్వేద పోస్ట్ గ్రాడ్యుయేట్ శిక్షణా పరిశోధా సంస్థ, జైపూర్ లోని జాతీయ ఆయుర్వేద సంస్థ, కేంద్ర ఆయుర్వేద శాస్త్రాల పరిశోధనా మండలి (సి.సి.ఆర్..ఎస్.), కేంద్ర యోగా, ప్రకృతి వైద్య పరిశోధనా మండలి (సి.సి.ఆర్.వై.ఎన్.), ఇతర జాతీయ పరిశోధనా సంస్థల నిపుణులనుంచి అభిప్రాయాలను టాస్క్ ఫోర్స్ సేకరించింది. వీటన్నింటినీ క్రోడీకరించి కోవిడ్ చికిత్సలో ఆయుర్వేద, యోగా ప్రాతిపదికన జాతీయ క్లినికల్ మేనేజ్మెంట్ ప్రొటోకాల్ ను తయారు చేశారు

   ఈ మొత్తం ప్రక్రియలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కృషిని మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అభినందిస్తూ, రోగ నిరోధకశక్తిని పెంచేందుకు యోగా, ఆయుర్వేద విధానాల ఆధారంగా రూపొందించిన సూచనలు ఎంతో ప్రజాదరణ పొందాయన్నారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఆయుష్ విధానాలను అనుసరించాలని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా సూచించారు. వైరస్ సోకకుండా తీసుకునే ముందు జాగ్రత్త చర్యలు,..కోవిడ్ నియంత్రణలోనే కాక, ఆధునిక కాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల పరిష్కారానికి కూడా సరిపోతాయి. అని మంత్రి అన్నారు. మొదటినుంచి అందుబాటులో ఉన్న గుడూచి, అశ్వగంధి వంటి ఆయుర్వేద మూలికలను స్వల్ప లక్షణాలు, లక్షణాలు లేని కేసులపై చికిత్సలో చేర్చడంపట్ల కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు. వలసవాద రాజ్యాధికారానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయుర్వేద వైద్య విధానం పోషించిన పాత్రను గురించి డాక్టర్ హర్షవర్ధన్ ఈ సందర్భంగా వివరించారు. ఆయుర్వేద చికిత్సా విధానం అధర్వణవేదంలో ఉప పాఠ్యాంశంగా వేదకాలంనుంచీ అమలులో ఉంది. ఆయుర్వేదం మొదట మనదేశంనుంచి పర్షియాకు, అక్కడనుంచి యూరప్ కు ప్రయాణించింది. ఆధునిక ఔషధ వ్యవస్థ మూలాలపై ఆయుర్వేదం గణనీయమైన ప్రభావం ఉంది. అయితే, స్వాంతంత్ర్యం అనంతరం ఆయుర్వేదానికి తగినంత ప్రాముఖ్యం లభించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రమే ఆయుర్వేదానికి తగిన ప్రాముఖ్యం ఇచ్చారు. అని కేంద్ర మంత్రి అన్నారు.

  ఆయుష్ ప్రోత్సాహానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. 2020వ సంవత్సరపు భారతీయ వైద్య విధాన జాతీయ కమిషన్ బిల్లును ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ బిల్లు కారణంగా, జామ్ నగర్ లో ఉన్న పలు ఆయుర్వేద అధ్యయన సంస్థల సమూహానికి జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రతిపత్తిని కల్పించేందుకు వీలైందన్నారు. బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించడం, సంప్రదాయ వైద్య విధానాల పునరుద్ధరణపై ఏకాభిప్రాయాన్ని సూచిస్తోందని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఆయుష్ శాఖ కార్యదర్శి రాజేశ్ కటోచ్, ఆయుష్ మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

****



(Release ID: 1662029) Visitor Counter : 225