PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 31 AUG 2020 6:27PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • గత 24 గంటల్లో 8,46,278 పరీక్షలు; దేశంలో మొత్తం 4.23 కోట్ల‌కుపైగా న‌మూనాల ప‌రీక్ష‌.
  • దేశ‌ంలోని మొత్తం కేసుల‌లో 43 శాతం 3 రాష్ట్రాలు... మహారాష్ట్ర, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, కర్ణాటకల‌లో న‌మోదైన‌వే.
  • గత 24 గంటల్లో (ఆదివారం) న‌మోదైన కేసుల సంఖ్య 78,512.
  • ఉత్త‌ర‌ప్ర‌దేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా రాష్ట్రాల‌కు కేంద్ర బృందాలను పంప‌నున్న ఆరోగ్య మంత్రిత్వశాఖ.
  • ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ కోసం “రెండు గ‌జాల దూరం - మాస్క్ అత్య‌వ‌స‌రం”తోపాటు సామాజిక దూరం నిబంధనలు పాటిస్తూ కరోనాపై పోరులో తోడ్ప‌డాల‌ని ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి పిలుపు.
  • దిగ్బంధ విముక్తి-4 కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసిన దేశీయాంగ శాఖ‌; నియంత్ర‌ణ మండ‌ళ్ల వెలుప‌ల మరిన్ని కార్యకలాపాలకు అనుమ‌తి రేపటినుంచి అమలు.

భారత్‌లో పెరుగుతున్న పరీక్షల సంఖ్య; 4.23 కోట్లు దాటిన మొత్తం పరీక్షలు; దేశంలోని కేసులలో 43 శాతం మహారాష్ట్ర, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, కర్ణాటకల‌లో న‌మోదైన‌వే

దేశంలో 2020 జనవరినాటికి పుణెలోగల ఏకైక ప్రయోగాలలో రోజుకో కోవిడ్‌ నిర్ధారణ పరీక్ష స్థాయి నుంచి 2020 ఆగస్టులో రోజువారీ పరీక్ష సామర్థ్యం 10 లక్షలకుపైగా స్థాయికి చేరుకుంది. ఈ మేరకు ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య ఇవాళ 4.23 కోట్లు దాటింది. ఇందులో భాగంగా గత 24 గంటల్లో 8,46,278 పరీక్షలు నిర్వహించారు. మరోవైపు గడచిన 24 గంటల్లో (2020 ఆగస్టు 30 ఆదివారం) దేశవ్యాప్తంగా 78,512 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సంఖ్యను దాదాపు 80,000గా పేర్కొన్న కొన్ని మాధ్యమ సంస్థల  కథనాలు నిరాధారమని స్పష్టమవుతోంది. కాగా, కొత్త కేసులలో కేవలం 7 రాష్ట్రాల్లోనే 70 శాతం నమోదయ్యాయి. వీటిలో మహారాష్ట్రలో గరిష్ఠంగా దాదాపు 21 శాతం నమోదు కాగా- ఆంధ్రప్రదేశ్ (13.5%), కర్ణాటక (11.27%), తమిళనాడు (8.27%), ఉత్తరప్రదేశ్ (8.27%), పశ్చిమ బెంగాల్ (3.85%), ఒడిషా (3.84%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక ఇప్పటిదాకా జాతీయస్థాయిలో నమోదైన మొత్తం కేసులలో 43 శాతం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో నమోదైనవే. కాగా, తమిళనాడు 11.66 శాతం కేసులతో తర్వాతి స్థానంలో ఉంది. అలాగే గత 24 గంటల్లో సంభవించిన కోవిడ్‌ మరణాల్లో 50 శాతం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోనివే. ఇందులోనూ మహారాష్ట్ర 30.48 శాతంతో అగ్రస్థానంలో ఉంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650010

ఉత్త‌ర‌ప్ర‌దేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా రాష్ట్రాల‌కు కేంద్ర బృందాలను పంప‌నున్న ఆరోగ్య మంత్రిత్వశాఖ

ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా రాష్ట్రాలకు ఉన్నతస్థాయి కేంద్ర బృందాలను పంపాలని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ నిర్ణయించింది. ఈ రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు అకస్మాత్తుగా పెరగడంతోపాటు కొన్నిటిలో మరణాలు ఎక్కువగా నమోదు అవుతుండటంతో ఈ మేరకు నిర్ణయించింది. నిర్ధారిత కేసుల నియంత్రణ-నిఘా-పరీక్షలతోపాటు సమర్థ  వైద్య నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేసేదిశగా ఈ బృందాలు రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తాయి. సకాలంలో రోగ నిర్ధారణ సంబంధిత సవాళ్లను సమర్థంగా పరిష్కరించడంలోనూ వారు మార్గనిర్దేశం చేస్తారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650089

‘మన్‌ కీ బాత్‌ 2.0’లో భాగంగా 30.08.2020నాటి 15వ సంచికలో ప్రధాని ప్రసంగం

…… నా ప్రియమైన దేశవాసులారా! దేశం ఇప్పటికే ప్రగతి పథంలో పురోగమిస్తోంది. సర్వతోముఖాభివృద్ధి దిశగా సాగే ఈ ప్రక్రియలో ప్రతి పౌరుడు భాగస్వామిగా మారి ఈ పయనంలో పాలుపంచుకున్నపుడు ఇది మరింత సౌకర్యవంతంగా సాగుతుంది. ఇది సాకారం కావాలంటే కరోనా మన సమష్టి పోరాట కృషిలో ప్రతి పౌరుడు ఆరోగ్యంగా-ఆనందంగా ఉండటం అత్యవసరం. తదనుగుణంగా సామాజిక దూరం నిబంధనలను, “రెండు గజాల దూరం – మాస్క్‌ అత్యవసరం” అన్న సూత్రాన్ని తూచా తప్పక పాటిస్తూ మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం అత్యావశ్యకం. కరోనాను నిర్మూలించే మన కృషిలో మనకు సహాయపడే మార్గం ఇదొక్కటే. ఈ మార్గదర్శకాలను పాటించాలని నేను మిమ్మల్ని కోరుతూ, మీరంతా చక్కని ఆరోగ్యంతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను.”

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1649719

మహమ్మారి సమయంలో పెద్దల సంరక్షణ, మద్దతుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రజలకు ఉప రాష్ట్రపతి పిలుపు

మహమ్మారి సమయంలో దేశంలోని పెద్దల సంరక్షణ, మద్దతుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉప రాష్ట్రపతి పిలుపు శ్రీ ఎం.వెంకయ్యనాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో వృద్ధులకు ముప్పు అధికంగా ఉంటుందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇళ్లలో ఉండే పెద్దల విషయంలో కోవిడ్‌-19కు సంబంధించి యువతరం అదనపు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఈ మేరకు నిన్న ఫేస్‌బుక్‌ ద్వారా తన మనోభావాలను దేశ ప్రజలతో పంచుకున్నారు. జిల్లాస్థాయి ఆస్పత్రులలో వృద్ధుల ఆరోగ్య సమస్యల కోసం ప్రత్యేక విభాగం కనిపించడం అరుదైన విషయమని ఆయన పేర్కొన్నారు. వృద్ధులు తరచూ అనారోగ్యం బారినపడతారు కాబట్టి మన ఆరోగ్య వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.  

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1649904

దిగ్బంధ విముక్తి-4 కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసిన దేశీయాంగ శాఖ‌; నియంత్ర‌ణ మండ‌ళ్ల వెలుప‌ల మరిన్ని కార్యకలాపాలకు అనుమ‌తి

దేశంలో కోవిడ్‌ నియంత్ర‌ణ మండ‌ళ్ల వెలుప‌ల మ‌రిన్ని కార్యక‌లాపాల‌కు అనుమ‌తిస్తూ దేశీయాంగ శాఖ 2020 ఆగ‌స్టు 29న కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు జారీచేసింది. ఇందులో భాగంగా 2020 సెప్టెంబర్ 1 నుంచి అమ‌ల‌య్యే దిగ్బంధ విముక్తి-4 కింద కార్యకలాపాల పునఃప్రారంభానికి దశలవారీ అనుమతులిచ్చే ప్రక్రియను కొన‌సాగించ‌నుంది. అన్ని కేంద్ర మంత్రిత్వశాఖలు- విభాగాలతోపాటు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల అభిప్రాయ సేకరణ, విస్తృత సంప్రదింపుల తర్వాతే కొత్త మార్గదర్శకాలను కేంద్రం జారీచేసింది. ఇందులో భాగంగా మెట్రో రైళ్లకు 2020 సెప్టెంబర్ 7నుంచి అనుమతిస్తారు. దీనికి సంబంధించి గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల/రైల్వే మంత్రిత్వశాఖలు దేశీయాంగ శాఖతో సంప్రదించాక గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల శాఖ ప్రామాణిక విధాన ప్రక్రియ (SOP)ను జారీచేస్తుంది. ఇదే తరహాలో ఇతరత్రా కార్యకలాపాలన్నిటికీ దశలవారీగా అనుమతి మంజూరవుతుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1649690

కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణ చర్యలపై దేశీయాంగ, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖల కార్యదర్శుల సమీక్ష

దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణ చర్యలపై దేశీయాంగ, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖల కార్యదర్శులు సమీక్షించారు. ఈ మేరకు దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్-నికోబార్ దీవులు, దాద్రా-నాగర్ హవేలి, దమన్-దయ్యులలోని ఉన్నతాధికారులతో 29.08.2020న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమతమ పరిధిలో కోవిడ్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా పరీక్ష, అన్వేషణ, చికిత్స వ్యూహం కింద చేపట్టిన చర్యలను వారు వివరించారు. దీంతోపాటు అనేక అంశాలపైనా కేంద్ర కార్యదర్శులు సమీక్షించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1649660

ఝాన్సీలోని రాణి లక్ష్మీబాయ్‌ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయ కళాశాల, పాలన భవనాలను ప్రారంభించిన ప్రధానమంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 29న శనివారం నాడు ఉత్తరప్రదేశ్‌లోగల ఝాన్సీలోని రాణి లక్ష్మీబాయ్‌ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయ కళాశాల, పాలన భవనాలను దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ- వారిని అభినందించారు. ఈ కళాశాల నుంచి పట్టభద్రులయ్యేవారు దేశ వ్యవసాయ రంగాన్ని సాధికారం చేయడంలో తమవంతు పాత్ర పోషించగలరన్న ఆశాభావం వ్యక్తం చేశారు. “ఝాన్సీ నగరంపై ఎవరి పెత్తనాన్నీ సహించబోను” అంటూ ఆనాడు రాణి లక్ష్మీబాయ్‌ ప్రతినబూనడాన్ని ఆయన గుర్తుచేశారు. తదనుగుణంగా స్వయం సమృద్ధ భారతం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఝాన్సీ, బుందేల్‌ఖండ్‌ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ స్వావలంబనలో కీలకపాత్ర వ్యవసాయ రంగానిదేనని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1649987

కర్ణాటకలోని బళ్లారిలోగల విజయనగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ప్రాంగణంలో సూపర్‌ స్పెషాలిటీ ట్రౌమా కేంద్రాన్ని ప్రారంభించిన డాక్టర్ హర్షవర్ధన్‌

కర్ణాటకలోని బళ్లారిలోగల విజయనగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ప్రాంగణంలో సూపర్‌ స్పెషాలిటీ ట్రౌమా కేంద్రాన్ని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌, కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప డిజిటల్‌ మాధ్యమం ద్వారా సంయుక్తంగా జాతికి అంకితం చేశారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద రూ.150 కోట్లతో ఈ కేంద్రాన్ని నిర్మించారు. ఈ కొత్త కేంద్రంలో అత్యవసర, ట్రౌమా, న్యూరోసర్జరీ, ఆర్థోపెడిక్స్‌ చికిత్స సదుపాయాలున్నాయి. ఈ కొత్త బ్లాక్‌లో 8 ఆపరేషన్ థియేటర్లుండగా వీటిలో 6 మాడ్యులర్ తరహాకు చెందినవి. అలాగే 200 సూపర్ స్పెషాలిటీ పడకలు, 72 ఐసీయూ పడకలు, 20 వెంటిలేటర్లు, అత్యాధునిక సి.టి.స్కాన్, డిజిటల్ ఎక్స్‌రే యంత్రం కూడా అంతేకాకుండా 27 మంది పీజీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చే వీలుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1650220

ఖాదీ మాస్కులకు పెరిగిన ప్రజాదరణ; రెడ్‌క్రాస్‌ సొసైటీ నుంచి కేవీఐసీకి 10.5 లక్షల మాస్కుల కోసం మరో ఆర్డర్‌

భారత్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీకి అత్యుత్తమ నాణ్యతగల 10.5 లక్షల మాస్కుల సరఫరా కోసం ఖాదీ-గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ (KVIC)కు అతిపెద్ద ఆర్డర్‌ మళ్లీ అందింది. నెల రోజులకు ముందు సొసైటీ 1.80 లక్షల మాస్కులకు ఆర్డర్‌ చేయగా, కేవీఐసీ ఇప్పటికే 1.60 లక్షలు సరఫరా చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి అత్యంత భారీ ఆర్డర్‌ దక్కడం విశేషం.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=16450025

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో గత ఇరవై నాలుగు గంటల్లో 157 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే 68 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 1,205 యాక్టివ్ కేసులున్నాయి. ఇక అరుణాచల్‌ ప్రదేశ్‌లో కోలుకునేవారి సగటు 69.95శాతంగా ఉంది.
  • అసోం: రాష్ట్రంలో నిన్న 1,417 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 83,927కు చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 21,548 అని అసోం ఆరోగ్యశాఖ మంత్రి ట్వీట్ చేశారు.
  • మణిపూర్: రాష్ట్రంలో  152 కొత్త కేసులు నమోదవగా, ఇప్పటిదాకా 69శాతం కోలుకునే సగటుతో 53 మందికి వ్యాధి నయమైంది. మణిపూర్‌లో ప్రస్తుతం 1,845 క్రియాశీల కేసులున్నాయి.
  • మేఘాలయ: రాష్ట్రంలో మొత్తం క్రియాశీల కేసులు 1,284 కాగా, వీరిలో బిఎస్ఎఫ్, సాయుధ దళాల సిబ్బంది 368 మంది, ఇతరులు 916 మంది ఉన్నారు. మేఘాలయలో ఇప్పటిదాకా 1,049 కోలుకున్నారు.
  • మిజోరం: రాష్ట్రంలో నిన్న మరో మూడు కేసులు నమోదవగా  మొత్తం కేసులు 1,011కు చేరాయి. వీరిలో ప్రస్తుతం 422 మంది చికిత్స పొందుతున్నారు.
  • నాగాలాండ్: రాష్ట్రంలోని కోహిమా పరిధిలో కోవిడ్‌ నుంచి కోలుకుని ఇళ్లకు వచ్చిన న్యూ మార్కెట్ కాలనీ వాసులకు అక్కడి నివాసులు కొవ్వొత్తులు వెలిగించి స్వాగతం పలికారు. కాగా, కాలనీకి చెందిన 11 మందిలో 10 మందికి వ్యాధి నయమైంది. ఇక తుయన్సాంగ్ జిల్లాలోని షామాటర్ పట్టణంలో 5 కొత్త కోవిడ్‌ కేసులు బయటపడటంతో ఆగస్టు 30, 31 తేదీలలో విధించిన 48 గంటల దిగ్బంధం ఇవాళ ముగిసింది.
  • సిక్కిం: రాష్ట్రంలో 25 కొత్త కేసులు నమోదవగా 25 మంది కోలుకున్నారు. ప్రస్తుతం సిక్కింలో 404 క్రియాశీల కేసులున్నాయి.
  • కేరళ: రాష్ట్రంలో కోవిడ్ కేసులను గుర్తించడం కోసం ర్యాపిడ్‌ యాంటిజెన్ పరీక్షను విస్తృతంగా నిర్వహించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల స్థానంలో రాష్ట్రవ్యాప్తంగాగల పంచాయతీల్లో మరిన్ని యాంటిజెన్ పరీక్షలు నిర్వహిస్తారు. మరోవైపు ఈ పరీక్షకు కేవలం రూ.625, ఆర్టీ-పీసీఆర్ పరీక్షకు రూ.2750 వంతున నిర్ణయించడంతో ధర తగ్గింపు ఎక్కువమందిని పరీక్షలవైపు ఆకర్షిస్తుందని అధికారులు భావిస్తున్నారు. కేరళలో కోవిడ్-19 నిబంధనల పరిధిలో ఓణం పర్వదినాన్ని నిర్వహించుకున్నారు. కాగా, నిన్న రాష్ట్రంలో 2,154 కొత్త కేసులు నమోదవగా ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 23,658గా ఉంది. మరో 1,99,468 మంది నిర్బంధవైద్య పర్యవేక్షణలో ఉన్నారు. ఇక మృతుల సంఖ్య 287కు చేరింది.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మూడు రోజులుగా 550కిపైగా కేసులు నమోదవగా గత 24గంటల్లో 291కి తగ్గాయి. కాగా, 7 మరణాలు కూడా సంభవించాయి. ప్రస్తుతం మొత్తం కేసులు 14,411కి చేరాయి. ఇక 4,849 క్రియాశీల కేసులుండగా, మరణాల సంఖ్య 228కి పెరిగింది. తమిళనాడులో ‘మదురై నమూనా’ కోవిడ్‌ నియంత్రణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.షణ్ముగం ప్రశంసించారు. కాగా, తమిళనాడు ప్రభుత్వం ప్రస్తుత దిగ్బంధాన్ని పొడిగించినప్పటికీ సడలింపులను ప్రకటించింది. అయితే, అంతర్రాష్ట్ర ప్రయాణానికి మాత్రమే ఇ-పాస్ తప్పనిసరి చేసింది. ఆ మేరకు జిల్లాల మధ్య ప్రయాణానికి ఇ-పాస్ అవసరం లేదని ప్రకటించింది.
  • కర్ణాటక: దిగ్బంధ విముక్తి-4వ దశ అమలులోకి రావడంతో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లు నడుస్తాయి. అయితే, పబ్బులు-బార్లను తెరవడంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. కాగా, బెంగళూరు నగరంలో రోగలక్షణాలు గలవారి తెమడ నమూనాల సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం కర్ణాటకలో 8,852 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 1,00,941కి చేరింది.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో వరుసగా ఐదో రోజు 10,000 కేసులు నమోదవడంతో ఆదివారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 4.24 లక్షలకు చేరింది. దీంతో జాతీయ స్థాయిలో మహారాష్ట్ర తర్వాత రెండో స్థానానికి చేరింది. కాగా, పాఠశాలల పునఃప్రారంభం అనంతరం ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతుల విద్యార్థులందరికీ మూడేసి మాస్కులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ప్లాస్మా చికిత్స సత్ఫలితాలిస్తోంది. ఈ మేరకు వ్యాధినుంచి కోలుకున్న 130మంది ప్లాస్మా దానం చేయడంతో 75మంది విషమ స్థితినుంచి బయటపడ్డారు.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1873 కొత్త కేసులు, 9 మరణాలు నమోదవగా 1849 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 360 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 1,24,963; క్రియాశీల కేసులు: 31,299; మరణాలు: 827; డిశ్చార్జి: 92,837గా ఉన్నాయి. హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవల పునఃప్రారంభానికి యాజమాన్యం సిద్ధంగా ఉంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లభిస్తే కేంద్రం జారీచేసిన దిగ్బంధ విముక్తి-4 మార్గదర్శకాల మేరకు నగరంలో సెప్టెంబర్ 7నుంచి మెట్రో సేవలు తిరిగి ప్రారంభమవుతాయి.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో తుది సెమిస్టర్/వార్షిక పరీక్షల నిర్వహణకు విశ్వవిద్యాలయ అనుమతుల సంఘం (UGC) ఆదేశించిన నేపథ్యంలో మహారాష్ట్ర  ప్రభుత్వం ఉప కులపతులు, విద్యా నిపుణులతో నియమించిన కమిటీ టైమ్‌టేబుల్‌ తయారీలో నిమగ్నమైంది. ఉన్నత-సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఉదయ్ సమంత్ ఈ మేరకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులతోపాటు బోధన-బోధనేతర సిబ్బంది ఆరోగ్యంపై రాజీపడబోమని, తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు.
  • గుజరాత్: రాష్ట్రంలో గత 24 గంటల్లో నమోదైన 1272 కొత్త కేసులకుగాను సూరత్‌ 174, అహ్మదాబాద్ 146, వడోదరలో 93 వంతున తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు గుజరాత్‌లో కోలుకునేవారి సగటు 80.67శాతానికి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 22.65 లక్షలకుపైగా పరీక్షలు నిర్వహించగా, వీటిలో సుమారు 70,000 ఒక్క ఆదివారంనాడు నిర్వహించారు.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వీరిలో కాంగ్రెస్ సభ్యుడు రమేష్ మీనాతోపాటు ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు హమీర్ సింగ్ భయల్, చంద్రభన్ సింగ్ ఆక్యా ఈ వైరస్ బారినపడ్డారు. కాగా, ఆదివారం రవాణాశాఖ మంత్రి ప్రతాప్ సింగ్ ఖాచారివాస్‌కు వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో జెఈఈ-మెయిన్, నీట్-2020 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత జిల్లాల యంత్రాంగం అభ్యర్థులకు ఈ సదుపాయం ఏర్పాటు చేస్తుంది.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ తన ఇద్దరు సిబ్బందితోపాటు ప్రత్యేక విధుల్లోగల అధికారికి ఆదివారం కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన స్వీయ ఏకాంతవాసంలోకి వెళ్లారు. కాగా, ముఖ్యమంత్రికి మాత్రం వ్యాధి సోకలేదని పరీక్షల్లో స్పష్టమైంది. రాష్ట్రంలో మహమ్మారి వల్ల ఎక్కువగా ప్రభావితమైన రాజధాని రాయ్‌పూర్‌లో తాజాగా 518 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,825కు చేరింది. ఇక జిల్లాలో ఇప్పటివరకు 144 మంది మరణించారు.

FACT CHECK

***



(Release ID: 1650235) Visitor Counter : 187