ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కర్ణాటకలోని బళ్లారి లోగల విజయనగర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ట్రామా సెంటర్‌ను డిజిటల్ విధానం ద్వారా ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్.
ఈ సందర్భంగా శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయిని, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ని గుర్తుచేసుకున్న డాక్టర్ హర్షవర్ధన్.
“ ఈ విషయంలో ఎంతో సంతోషించి ఉండే వ్యక్తులు ఇవాళ మన మధ్య లేరు” అని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.
Posted On:
31 AUG 2020 4:08PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బి.ఎస్. యడ్యూరప్పతో కలిసి బళ్లారిలోని విజయనగర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ట్రామా సెంటర్ (ఎస్.ఎస్.టి.సి)ను డిజిటల్ విధానంలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం కేంద్ర ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ శాఖసహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే, ఎక్స్‌ప్రెస్ ఫీడర్ లైన్, ఐసియు వార్డులు, వైద్య అవసరాలకు వాడే 13 కె.ఎల్. ద్రవరూప ఆక్సిజన్ ట్యాంక్ సదుపాయాన్ని ప్రారంభించారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ అత్యధునాతన సిటిస్కాన్‌ను ప్రారంభించారు.ఇది 128 క్రాస్ సెక్షన్ స్లయిస్‌లను తీయగల సామర్ధ్యం కలిగినది.
ఈ ఎస్.ఎస్.టి.సిని, 150 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రధానమంత్రి స్వాస్త్య సురక్షా యోజన(పిఎంఎస్ఎస్‌వై) కింద నిర్మించడం జరిగింది. ఇందులో అత్యవసర, ట్రామా, న్యూరోసర్జరీ, ఆర్థోపెడిక్సు విభాగాలు ఉంటాయి. ఆరు మాడ్యులార్ థియేటర్లు, 200 సూపర్ స్పెషాలిటీ బెడ్లు, 72 ఐసియు బెడ్లు, 20 వెంటిలేటర్లు, పైన పేర్కొన్నట్టుగా అధునాతన సిటిస్కాన్ యంత్రం,డిజిటల్ ఎక్స్‌రే యంత్రం ఉన్నాయి. ఇందులో 27 మంది పిజి విద్యార్ధులకు శిక్షణ ఇచ్చే సదుపాయం ఉంది.
2003 వ సంవత్సరంలో నాటి ప్రధానమంత్రి, దివంగత శ్రీ అటల్ బిహారి వాయజ్‌పేయి స్వాతంత్రదినోత్సవం ప్రసంగాన్ని గుర్తుచేసుకుంటూ డాక్టర్ హర్షవర్ధన్, “ వాజ్‌పేయీజీ దార్శనికత కారణంగా దేశానికి స్వాతంత్రం వచ్చిన 56 సంవత్సరాల అనంతరం, ఇండియా అప్పటికి ఉ న్న ఒక్క ఎయిమ్స్ కాక మరో ఆరు ఎయిమ్సు సంస్థలతో సుసంపన్నమైంది. మరో 75 ప్రస్తుత సంస్థలను ఎయిమ్సు తరహా సేవలు అందించేలా ఉన్నతీకరించడం జరుగుతోంది.” అని ఆయన అన్నారు.పిఎంఎస్ ఎస్ వై పథకానికి ఆనాటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ కృషిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. బళ్లారితో ఆమెకుగల జీవిత పర్యంతంఅనుబంధాన్నిఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
“ ఇప్పుడు వారు ఉండి ఉంటే ఎంతో సంతోషించి ఉండే వారు. బ్రహ్మాండంగా సంతోషపడి ఉండే ఆ వ్యక్తులు ఇప్పుడు మన మధ్య లేరు” అని ఆయన అన్నారు.
ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎంత వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నారో, తన స్వంత అనుభవాన్ని ఆయన ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.“ 3 వ దశ పిఎంఎస్ఎస్ వైని 2019 తర్వాత ప్రకటించారు. బళ్లారి కి ట్రామా కేంద్రం ఆ మరుసటి సంవత్సరంలోపే వచ్చింది. 74 ఆకాంక్షిత జిల్లాలలో వైద్య కళాశాలల ఏర్పాటు శరవేగంతో సాగుతోంది” అని ఆయన అన్నారు. కర్ణాటకకు కొత్త ఎఐఐఎంఎస్ ఏర్పాటు చురుకుగా పరిశీలనలో ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి తెలిపారు.అలాగే నాలుగు వైద్య కళాశాలలను , ఆకాంక్షిత జిల్లాలైన చిక్‌మగళూరు, హవేరి, యాద్‌గిర్, చిక్‌బళ్లాపూర్ లలో నిర్మించడం జరుగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ నిధులతో, రాష్ట్రపాలనాయంత్రాంగాల స్థానిక పర్యవేక్షణతో 157 వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు.
2020 డిసెంబర్ 31 నాటికి 1.5 లక్షల ఆయుష్మాన్ భారత్ హెల్త్- వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. అంతర్జాతీయంగా నిర్దేశించిన 2025 గడువుకు ఐదు సంవత్సరాల ముందే పోలియో, మశూచీని అంతమొందించినట్టే టిబిని నిర్మూలించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. మీసిల్స్, రుబెల్లాలను కూడా తగిన సమయంలొ నిర్మూలించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రారంభించిన ‘ ఈట్ రైట్ ఇండియా’, ‘ఫిట్ ఇండియా’ ఉద్యమాల గురించి డాక్టర్ హర్షవర్ధన్ ప్రస్తావించారు. దేశాన్ని ఆరోగ్యవంతం చేయడంలో ఇవి అనుబంధ పాత్ర పోషించనున్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికైన ప్రజా ప్రతినిదులు వీటిని వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని, దాని వల్ల కర్ణాటక ఈ పథకాల అమలులో నాయకత్వ స్థానంలో ముందుండగలదని ఆయన అన్నారు.
కర్ణాటకలో కోవిడ్ వైరస్ వ్యాప్తి గొలుసును తెంచడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని అదుపుచేసినందుకు కర్ణాటక ప్రభుత్వాన్ని డాక్టర్ హర్షవర్ధన్ అభినందించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే మాట్లాడుతూ, కృతనిశ్చయంతో కూడిన, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దృఢమైన నాయకత్వం ,శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి దార్శనికతను ముందుకు తీసుకువెళ్లిందని, అందువల్ల బళ్లారి వంటి వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి ఫలాలను చూడగలుగుతున్నాయని అన్నారు.
కర్ణాటకలో వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభత్వం తీసుకుంటున్న సానుకూల చర్యలకు ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప కృతజ్ఙతలు తెలిపారు. గుల్బర్గాలోని ఇ.ఎస్.ఐ ఆస్పత్రిని ఎఐఐఎంఎస్ స్థాయికి అప్ గ్రేడ్ చేయాల్సిందిగా ఆయన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖమంత్రిని కోరారు. దీని వల్ల ఆ ప్రాంత ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అడవులు,పర్యావరణ శాఖ కేబినెట్ మంత్రి , బళ్లారి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆనంద్ సింగ్, కర్ణాటక రాష్ట్రప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వెననుకబడిన తరగతుల శాఖ మంత్రి శ్రీ బి.శ్రీనివాసులు, బళ్లారి వి.ఐ.ఎం.ఎస్ డైరక్టర్ డాక్టర్ బి.దేవానంద్ లు ఈ కార్యక్రమంలొ పాల్గొన్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని కర్ణాటక శాసనసభ సభ్యుడు, బళ్లారి గ్రామీణ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ బి. నాగేంద్ర నిర్వహించారు.
****
(Release ID: 1650220)
Visitor Counter : 196