PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 24 AUG 2020 6:38PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • ‌దేశంలో కోలుకున్నవారు 23 ల‌క్ష‌లకుపైగానే; 16 ల‌క్ష‌లు దాటిన ప్రస్తుత-న‌య‌మైన కేసుల తేడా
  • భారత్‌లో 75 శాతంకన్నా అధికంగా కోవిడ్‌ నుంచి కోలుకునేవారి సగటు.
  • దేశవ్యాప్తంగా ఇప్పటికి 3.6 కోట్లకుపైగా రోగ నిర్ధారణ పరీక్షలు.
  • ప్రతి పది లక్షల జనాభాకు పరీక్షల సగటు 26,016తో కొత్త శిఖరారోహణ.
  • దిగ్బంధ విముక్తి-3 స‌మ‌యంలో వ్య‌క్తుల‌-వ‌స్తుసేవ‌ల ర‌వాణాకు అవ‌రోధాల్లేకుండా చూడాల‌ని అన్ని రాష్ట్రాల‌కూ దేశీయాంగ శాఖ సూచ‌న‌.
  • కోవిడ్‌ నేపథ్యంలో మోటారు వాహన పత్రాల చెల్లుబాటు గడువు డిసెంబరుదాకా పొడిగింపు.

దేశంలో ఇప్పటిదాకా 3.6 కోట్లకుపైగా రోగ నిర్ధారణ పరీక్షలు; ప్రతి 10 లక్షల జనాభాకు 26,016 సగటుతో కొత్త శిఖరారోహణ

దేశంలో కోవిడ్‌-19పై పోరాటంలో భాగంగా ఇప్పటిదాకా 3,59,02,137 నమూనాలను పరీక్షించారు. పరీక్షల సామర్థ్యం పెంపుపై హామీ నెరవేర్చే దిశగా గత 24 గంటల్లో 6,09,917 పరీక్షలు నిర్వహించారు. విస్తృత ప్రయోగశాలల నెట్‌వర్క్‌ అందుబాటు ఫలితంగా రోజువారీ ప‌రీక్ష‌ల సంఖ్య‌ వేగంగా పెరుగుతోంది. ప్రభుత్వాలు నిశిత దృష్టి సారించిన ఫలితంగా నేడు ప్రతి 10 లక్షల జనాభాకు పరీక్షల సగటు 26,016కు పెరిగింది. ప్రతి పది లక్షల జనాభాకు కనీసం 140 రోజువారీ పరీక్షలు నిర్వహించాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన దానికన్నా అధికంగా భారత్‌లో పరీక్షలు సాగుతున్నాయి. తదనుగుణంగా దేశంలో పరీక్ష సదుపాయాల నెట్‌వర్క్‌ రోజురోజుకూ విస్తరిస్తూ ప్రభుత్వ రంగంలో 984, ప్రైవేట్ రంగంలో 536 వంతున నేడు మొత్తం 1520 ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648237

భారత్‌లో 23 ల‌క్ష‌లు దాటిన కోలుకున్న‌వారి సంఖ్య; ప్రస్తుత-న‌య‌మైన కేసుల అంతరం 16 ల‌క్ష‌ల‌కుపైగా నమోదు

దేశంలో కోవిడ్‌ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య ఇవాళ 23 లక్షలు దాటింది. ముమ్మ‌ర ప‌రీక్ష‌లు, స‌మ‌గ్ర నిఘాతో ప‌రిచ‌య‌స్థుల స‌త్వ‌ర అన్వేష‌ణ‌, స‌కాలంలో చికిత్స వ్యూహంపై దృష్టి సారించడంతో కోలుకునే రోగుల సంఖ్య 23,38,035కు పెరిగింది. ఇక గత 24 గంటల్లో 57,469 మందికి వ్యాధి నయం కాగా, భారత్‌లో కోలుకునేవారి సగటు 75.27 శాతానికి దూసుకెళ్లింది. తదనుగుణంగా ప్ర‌స్తుత (7,10,771) కేసులక‌న్నా కోలుకున్న కేసులు 16,27,264 ల‌క్ష‌ల‌ మేర అధికంగా న‌మోద‌వ‌డం విశేషం. దేశంలో కోలుకునే రోగులు అత్య‌ధికంగా ఉండ‌టంతో మొత్తం కేసుల‌లో నిర్ధారిత కేసులు కేవ‌లం 22.88 శాతానికి ప‌రిమిత‌మ‌య్యాయి. దీంతో న‌మోదైన మొత్తం కేసుల‌లో మ‌ర‌ణాల స‌గ‌టు కూడా తగ్గుతూ ఇవాళ అత్య‌ల్పంగా 1.85 శాతానికి ప‌త‌న‌మైంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648236

ఘజియాబాద్‌లోని ఎన్డీఆర్‌ఎఫ్‌ 8వ బెటాలియన్‌ ప్రాంగణంలో 10 పడకల ఆస్పత్రిని ప్రారంభించిన డాక్టర్‌ హర్షవర్ధన్‌

ఘ‌జియాబాద్‌లోని ఎన్డీఆర్‌ఎఫ్‌ 8వ బెటాలియ‌న్ సెంట‌ర్ వ‌ద్ద ఆధునిక‌‌, స‌త్వర ఏర్పాటు-సులభ తరలింపు వీలుగల, అన్నిరకాల వాతావరణాలనూ తట్టుకోగల 10 ప‌డ‌క‌ల తాత్కాలిక ఆస్ప‌త్రిని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ప్రారంభించారు. ఈ తాత్కాలిక ఆస్ప‌త్రిని సిఎస్ఐఆర్ అనుబంధ ప్రయోగశాల ‘రూర్కీ సిఎస్ఐఆర్ -సెంట్ర‌ల్ బిల్డింగ్ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్‌, హోంశాఖ‌ పరిధిలోని జాతీయ విప‌త్తు స్పంద‌న ద‌ళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) సహకారంతో దళ వినియోగంతోపాటు ప్ర‌ద‌ర్శ‌నార్థం దీన్ని రూపొందించింది. ఈ సందర్భంగా డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ మాట్లాడుతూ- “ప్రాథ‌మిక ఆరోగ్య స‌దుపాయం క‌ల్పించేందుకు నిర్దేశించిన‌ తాత్కాలిక ఆస్ప‌త్రి స‌దుపాయాల్లో భ‌ద్ర‌త‌, సౌక‌ర్యాలు ఉన్నాయి. ఇది 20 ఏళ్లవరకూ ఉప‌యోగ‌ప‌డుతుంది” అన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647760

దిగ్బంధ విముక్తి-3లో వ్య‌క్తుల‌-వ‌స్తుసేవ‌ల ర‌వాణాకు అవ‌రోధాల్లేకుండా చూడాల‌ని అన్ని రాష్ట్రాల‌కూ దేశీయాంగ శాఖ సూచ‌న‌

ప్ర‌స్తుత దిగ్బంధ విముక్తి-3 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు రాష్ట్రాల్లో, రాష్ట్రాల మ‌ధ్య‌ వ్య‌క్తులు, వ‌స్తుసేవ‌ల ర‌వాణాకు ఆటంకాలు లేకుండా చూడాల‌ని సూచిస్తూ దేశీయాంగ శాఖ అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ ప్రధాన కార్యదర్శులకు వ‌ర్త‌మానం పంపింది. వివిధ రాష్ట్రాలు/జిల్లాల్లో స్థానికంగా పాల‌న యంత్రాంగాలు ర‌వాణాపై ఆంక్షలు విధిస్తున్నట్లు స‌మాచారం అందిన నేప‌థ్యంలో ఈ మేర‌కు సూచించింది. ఇలాంటి ఆంక్ష‌ల విధింపువ‌ల్ల అంతర్రాష్ట్ర వస్తుసేవల ర‌వాణాలో సమస్యలు ఎదుర‌వుతున్నాయ‌ని, దీనివ‌ల్ల‌ సరఫరా గొలుసుపై ప్రభావం ప‌డుతున్న‌ద‌ని దేశీయాంగ శాఖ పేర్కొంది. ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధికి అంతరాయం ఏర్పడుతుంద‌ని, దీంతోపాటు వస్తుసేవల సరఫరాను ప్రభావితం చేస్తుంద‌ని తెలిపింది. ఈ విధంగా రాష్ట్రాలు/జిల్లా పాల‌న యంత్రాంగాలు స్థానికంగా ఆంక్ష‌లు విధించ‌డం విపత్తు నిర్వహణ చట్టం-2005 నిబంధనల ప్రకారం త‌మ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లేన‌ని దేశీయాంగ శాఖ స్ప‌ష్టం చేసింది. కేంద్రం 2020 జూలై 29న జారీచేసిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం దేశ‌వ్యాప్తంగా వ్య‌క్తులు, వ‌స్తుసేవ‌ల ర‌వాణా, స‌ర‌ఫ‌రాల‌కు ఎలాంటి ప్ర‌త్యేక అనుమ‌తులు/ఆ‌మోదాలు/ఈ-ప‌ర్మిట్ల వంటివేవీ అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇది పొరుగుదేశాల‌తో దేశ భౌగోళిక స‌రిహ‌ద్దు ఒప్పందాల విష‌యంలోనూ వ‌ర్తిస్తుంద‌ని వివ‌రించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647966

కోవిడ్‌ నేపథ్యంలో మోటారు వాహన పత్రాల చెల్లుబాటు గడువు డిసెంబరుదాకా పొడిగింపు

మోటారు వాహనాల చట్టం-1988, కేంద్ర మోటారు వాహనాల చట్ట నిబంధనలు-1989 ప్రకారం మోటారు వాహన పటిష్ఠత, రహదారి అనుమతి, అనుమతి పత్రం, నమోదు తదితర పత్రాల చెల్లుబాటును 2020 డిసెంబర్ 31వరకూ పొడిగించాలని కేంద్ర రోడ్డు రవాణా-రహదారి మంత్రిత్వశాఖ నిర్ణయించింది. కాగా, ఇంతకుముందు ఈ చెల్లుబాటు గడువును 2020 సెప్టెంబరు 30దాకా పొడిగిస్తున్నట్లు మార్చి 30న ఒకసారి, ఆ తర్వాత  జూన్ 9న మరోసారి ప్రకటించింది. అయితే, కోవిడ్-19 వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో 2020 ఫిబ్రవరి 1న గడువు తీరిపోయే అన్ని పత్రాల చెల్లుబాటు గడువును 2020 డిసెంబర్ 31 వరకూ పొడిగిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648213

మాధ్యమ కార్యకలాపాలకు ప్రామాణిక ప్రక్రియ విధానాలను జారీచేసిన సమాచార-ప్రసార శాఖ

భారత స్థూల దేశీయోత్పత్తికి ఇతోధికంగా తోడ్పాటునిచ్చే ప్రధాన ఆర్థిక కార్యాచరణగా మాధ్యమ కార్యకలాపాలను పరిణించవచ్చు. అయితే, ప్రస్తుత కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో మాధ్యమాల కార్యకలాపాల్లో భాగస్వామ్య సంస్థలన్నీ తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ఈ దిశగా ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదింపుల మేరకు సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ రూపొందించిన మార్గదర్శకాలు, ప్రామాణిక ప్రక్రియ విధానాలను (SOP) మంత్రి శ్రీ ప్రకాష్ జావడేకర్‌ నిన్న విడుదల చేశారు. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా వీటిని రూపొందించినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఆరు నెలలుగా మూతపడిన చలనచిత్ర, మాధ్యమ పరిశ్రమలకు ఈ నిబంధనలతో ఊరట లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648038

మాధ్యమ కార్యకలాపాలపై 2020 ఆగస్టు 23నాటి ‘ఎస్‌ఓపీ’లపై స్పష్టీకరణ

కరోనా వ్యాప్తి నిరోధం దిశగా చిత్రీకరణకు 2020 ఆగస్టు 23న తాము జారీచేసిన మార్గదర్శకాలు, ప్రామాణిక ప్రక్రియల విధానాలు (ఎస్‌ఓపీ) అన్నిరకాల చిత్రీకరణలు.. సినిమా, టీవీ షూటింగులు, వెబ్‌ సిరీస్‌లు, ఎలక్ట్రానిక్‌, చిత్రీకరణ మాధ్యమాలన్నిటికీ వర్తిస్తాయని కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648227

ప్రత్యేక రైలురవాణా కారిడార్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్ ప్రగతిపై శ్రీ పీయూష్ గోయల్ సమీక్ష

దేశంలో ప్రత్యేక రైలురవాణా కారిడార్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) ప్రగతిని రైల్వే, వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాజక్టు ప్రస్తుత స్థితి గురించి ఉన్నతాధికారులు తెలియజేశారు. కాగా, ఉత్తర ప్రదేశ్‌లోని దాద్రి- ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఓడరేవులను అనుసంధానించే పశ్చిమ కారిడార్‌తోపాటు పంజాబ్‌లోని షానేవాల్‌ నుంచి మొదలై పశ్చిమ బెంగాల్‌లోని డంకుని వద్ద ముగిసే తూర్పు కారిడార్‌ల పనులు 2021 డిసెంబరు నాటికి పూర్తికానున్నాయి. కోవిడ్‌ దిగ్బంధం కారణంగా నష్టపోయిన సమయాన్ని భర్తీచేస్తూ ప్రాజెక్టు పనులు వేగిరపరచేందుకు చర్యలు తీసుకోవాలని శ్రీ గోయల్‌ డీఎఫ్‌సీసీఐఎల్‌ అధికారులకు సూచించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648310

గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్‌ అభియాన్‌కింద 2020 ఆగస్టు 21దాకా 6,40,000కన్నా ఎక్కువ పనిదినాలను కల్పించిన రైల్వేశాఖ

గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్‌ అభియాన్ కింద బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో రైల్వేశాఖ 6,40,000కన్నా ఎక్కువ పనిదినాలను కల్పించింది. ఈ పథకం కింద ఆరు రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టులో భాగంగా సాధించిన పురోగతిని, వలస కార్మికులకు లభిస్తున్న ఉపాధి పనులను రైల్వే, వాణిజ్య-పరిశ్రమల శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సన్నిహితంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో రైల్వేశాఖ దాదాపు 165 మౌలిక వసతుల ప్రాజెక్టు పనులు అమలవుతుండగా 2020 ఆగస్టు 21నాటికి 12,276 మంది కార్మికులు వీటిలో నిమగ్నమై ఉన్నారు. ఈ పధకం కింద అమలవుతున్న ప్రాజెక్టుల కోసం కాంట్రాక్టర్లకు రూ.1,410.35 కోట్ల మేర నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పనులలో సమన్వయం కోసం రైల్వేశాఖ ప్రతి రాష్ట్రంలో, దాని పరిధిలోని జిల్లాల్లో నోడల్ అధికారులను నియమించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648093

అర్హులైన దివ్యాంగులంద‌రినీ జాతీయ ఆహార భ‌ద్ర‌త చ‌ట్టం పరిధిలోకి తేవాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల‌కు కేంద్ర ఆహార-ప్ర‌జా పంపిణీ విభాగం సూచన

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అర్హులైన దివ్యాంగులందర్నీ జాతీయ ఆహార‌ భ‌ద్ర‌త చ‌ట్టం-2013 పరిధిలోకి తేవాలని  కేంద్ర వినియోగదారు వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖలోని ఆహార-ప్ర‌జా పంపిణీ విభాగం ఆయా రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల‌కు సూచించింది. ఈ మేరకు చ‌ట్టం లోని సెక్ష‌న్-38 కింద కేంద్ర ప్ర‌భుత్వానికిగల అధికారాలకు అనుగుణంగా రాష్ట్ర‌ ప్ర‌భుత్వాల‌కు ఆదేశాలు జారీచేసింది. అదే సమయంలో అర్హత ఉండికూడా ఇంకా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలోకి రానివారికి కూడా కార్డులు జారీచేసి, పీఎంజీకేఏవై కింద వారందరికీ ఆహార‌ధాన్యాల కోటా అందేవిధంగా చూడాలని సూచించింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648073

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • కేరళ: రాష్ట్రంలో ఈ మధ్యాహ్నం వరకు 7 కోవిడ్ మరణాలు నమోదవగా మృతుల సంఖ్య 230కి చేరింది. రాష్ట్ర రాజధానిసహా కనీసం 4 జిల్లాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. మరోవైపు కఠినమైన కోవిడ్-19 విధివిధానాలకు అనుగుణంగా శాసనసభ ఒకరోజు సమావేశంలో ఎల్డీఎఫ్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. కాగా రాష్ట్రంలో నిన్న 1,908 కొత్త కేసులు నమోదవగా వివిధ జిల్లాల్లో 20,330 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మరో 1,82,525 మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: రాష్ట్రంలోని ప్రజలు సంక్షిప్త సందేశంద్వారా కోవిడ్-19 పరీక్ష ఫలితాలను అందుకునేలా రెండు వారాల్లో స్వయంచలిత వ్యవస్థను ప్రారంభిస్తుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సి.విజయభాస్కర్ ప్రకటించారు. కాగా, తమిళనాడు ప్రభుత్వం ఇ-పాస్‌ విధానాన్ని కొనసాగిస్తుండగా, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి సర్కారు మాత్రమే ఈ పద్ధతిని రద్దుచేసింది. కాగా, రాష్ట్రంలో, రాష్ట్రాల మధ్య రాకపోకలు, వస్తుసేవల రవాణాపై ఆంక్షలు విధించవద్దని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్-19 నిర్వహణ పనులకు ఆటంకంగా కలుగుతుందని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. రాష్ట్రంలో నిన్న 5975 కొత్త కేసులు, 97 మరణాలు నమోదవగా 6047 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు: 3,79,385; క్రియాశీల కేసులు: 53,541; మరణాలు: 6517; డిశ్చార్జి: 3,19,327; చెన్నైలో యాక్టివ్ కేసులు: 13,223గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలో ప్లాస్మా చికిత్సకు సంబంధించి ప్రభుత్వం నిబంధనలను నిర్దేశించింది. ఈ మేరకు కోవిడ్ నుంచి కోలుకుని, ప్లాస్మా దానం చేయదలచినవారు 28-60 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి. అలాగే దాతలు 50 కిలోలకన్నా ఎక్కువ బరువుండాలి... వంటి ప్రమాణాలను నిర్దేశించింది. కర్ణాటకలో ఆదివారం 5938 కొత్త కేసులు, 68 మరణాలు నమోదవగా, 4996 మంది కోలుకోవడంతో వ్యాధినయమయ్యే వారి సగటు 68.23 శాతానికి చేరింది. మొత్తం కేసులు: 2,77,814; క్రియాశీల కేసులు: 83,551; మరణాలు: 4683; డిశ్చార్జి: 1,89,564గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కరోనావైరస్ బారినపడ్డారు. కాగా, తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ వైద్యులు రేపటినుంచి అత్యవసర సేవలను బహిష్కరించనున్నట్లు ప్రకటించారు. కాగా, తూర్పుగోదావరి జిల్లాల్లో రెండు రోజుల వ్యవధిలోనే 2,55కుపైగా కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 49,245కి చేరింది. దీంతో రాష్ట్రంలో అత్యంత ప్రభావిత జిల్లాగా అగ్రస్థానంలోకి వెళ్లింది. రాష్ట్రంలో నిన్న 7895 కొత్త కేసులు, 93 మరణాలు నమోదవగా 7449మంది కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 3,53,111; క్రియాశీల కేసులు: 89,742; డిశ్చార్జి: 2,60,087; మరణాలు: 3282గా ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1842 కొత్త కేసులు, 6 మరణాలు నమోదవగా 1825 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 373 జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,06,091; క్రియాశీల కేసులు: 22,919; మరణాలు: 761; డిశ్చార్జి: 82,411గా ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో తొలి ప్లాస్మా బ్యాంక్‌ను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభించారు.
  • అసోం: రాష్ట్రంలోని నిన్న 1272 మందికి కోవిడ్‌ నిర్ధారణ కాగా, మొత్తం పరీక్షలలో నిర్ధారిత కేసులు 6.89 శాతంగా ఉన్నాయి. మరోవైపు 3259 మందికి వ్యాధినయమై ఇళ్లకు వెళ్లారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 70,900కు పెరిగింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 19595 కాగా, మృతుల సంఖ్య 242గా ఉంది.
  • మణిపూర్: రాష్ట్రంలో 114 కొత్త కేసులు నమోదవగా 161 మంది కోలుకున్నారు. మణిపూర్‌లో ప్రస్తుతం క్రియాశీల కేసులు 1608కాగా, కోలుకునేవారి సగటు 69 శాతంగా ఉంది.
  • మేఘాలయ: రాష్ట్రంలో క్రియాశీల కేసులు 1133, ఇప్పటిదాకా కోలుకున్న కేసులు 776గా ఉన్నాయి.
  • మిజోరం: రాష్ట్రంలోని కోలాసిబ్ జిల్లాలో 3 గ్రామాల నుంచి తలా ఒక కేసు నమోదైన నేపథ్యంలో ఆ గ్రామాల్లో సంపూర్ణ దిగ్బంధం విధించారు.
  • నాగాలాండ్: రాష్ట్రంలోని పెరెన్ జిల్లాలో కోవిడ్‌-19 నియంత్రణలో విఫలమైన జిల్లా ఇన్‌చార్జి మంత్రి టెమ్జెన్ ఇమ్నా లాంగ్ స్థానంలో మరెవరికైనా బాధ్యతు అప్పగించాలని జిల్లాలోని పౌరసమాజ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కాగా, నాగాలాండ్‌లోని టుయెన్‌సాంగ్ జిల్లాలో ఇవాళ్టినుంచి రెండు రోజులపాటు సంపూర్ణ దిగ్బంధం విధించారు.
  • సిక్కిం: సిక్కింలో 43 కొత్త కేసుల నమోదుతో క్రియాశీల కేసుల సంఖ్య 509కి పెరిగింది. ఇక ఇప్పటిదాకా 934 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
  • మహారాష్ట్ర: ముంబైలోని నెస్కో జంబో కోవిడ్ కేంద్రంలో  కరోనావైరస్ సంక్రమణ నిర్ధారణ కోసం స్వర పరీక్ష నిర్వహించే ప్రయోగాత్మక ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఈ మేరకు కృత్రిమ మేధో పరిజ్ఞాన సహాయంతో అనుమానిత రోగుల గళ నమూనాలను సేకరిస్తున్నారు. అయితే, ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆర్టీ-పీసీసిఆర్ పరీక్షలు ముంబైలో యథావిధిగా కొనసాగుతాయని అధికారులు ప్రకటించారు.
  • గుజరాత్: రాష్ట్రంలో కొత్త కేసులు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో కోవిడ్‌ ప్రత్యేక కేంద్రాలుగా నిర్దేశించిన  ప్రైవేటు ఆసుపత్రులను ఆ జాబితానుంచి క్రమంగా తొలగించాలని అహ్మదాబాద్ నగరపాలక సంస్థ నిర్ణయించింది. గుజరాత్‌లో కొత్త కేసులు, మరణాలు తగ్గినందువల్ల నిర్ధారిత కేసుల నిష్పత్తి కూడా 35 శాతం నుంచి తగ్గి ఇప్పుడు కేవలం 2.5 శాతంగా నమోదైంది.
  • రాజస్థాన్: రాష్ట్రంలో 6 రోజుల వ్యవధిలో 10,000 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 70,000 దాటింది. అంతకుముందు 50 వేల నుండి 60 వేల స్థాయికి చేరడానికి 9 రోజులు పట్టడం ఈ సందర్భంగా గమనార్హం.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో ఆదివారం అత్యధికంగా 1,263 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 53,129కి చేరింది. కాగా, ఇండోర్‌ నగరంలో అత్యధికంగా 194 కేసులు నమోదవగా, భోపాల్‌ 161, గ్వాలియర్, జబల్‌పూర్‌ 118 వంతున కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

FACT CHECK

****



(Release ID: 1648347) Visitor Counter : 236