రైల్వే మంత్రిత్వ శాఖ

గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద 2020 ఆగస్టు, 21వ తేదీ వరకు 6,40,000 కంటే ఎక్కువ పని దినాలను కల్పించిన - భారతీయ రైల్వే

ఈ పనిదినాలను 6 రాష్ట్రాలు బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ లలో కల్పించడం జరిగింది.

ఈ ప్రాజెక్టులలో సాధించిన పురోగతినీ, ఈ పథకం కింద ఈ రాష్ట్రాల వలస కార్మికులకు కల్పిస్తున్న పని అవకాశాలను పర్యవేక్షిస్తున్న - రైల్వే మంత్రిత్వ శాఖ

ఈ పధకం కింద అమలు చేస్తున్న ప్రాజెక్టుల కోసం, 2020 ఆగస్టు 21వ తేదీ వరకు, కాంట్రాక్టర్లకు 1,410.35 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేయడం జరిగింది.

6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో అమలౌతున్న - గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్

ఈ రాష్ట్రాల్లో సుమారు 165 రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలౌతున్నాయి.

Posted On: 23 AUG 2020 5:10PM by PIB Hyderabad

గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద ఆరు రాష్ట్రాలు - బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ లలో భారతీయ రైల్వే 6,40,000 కంటే ఎక్కువ పని దినాలను కల్పించింది. 

ఈ ప్రాజెక్టులలో సాధించిన పురోగతినీ, ఈ పథకం కింద ఈ రాష్ట్రాల వలస కార్మికులకు కల్పిస్తున్న పని అవకాశాలను, రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమల శాఖల కేంద్ర మంత్రి శ్రీ పియూష్ గోయల్, నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో సుమారు 165 రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలు జరుగుతున్నాయి. 

ఈ అభియాన్ లో 2020 ఆగష్టు, 21వ తేదీ వరకు 12,276 మంది కార్మికులు నిమగ్నమై ఉన్నారు. ఈ పధకం కింద అమలు చేస్తున్న ప్రాజెక్టుల కోసం కాంట్రాక్టర్లకు 1,410.35 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేశారు. 

ప్రతి జిల్లాలోనూ, రాష్ట్రాల్లోనూ రైల్వే శాఖ నోడల్ అధికారులను నియమించింది, తద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహిత సమన్వయం ఏర్పడుతుంది.

ఈ పథకం కింద రైల్వే శాఖ అనేక రైల్వే పనులను గుర్తించి, అమలు చేస్తోంది.  ఆ పనులలో  -  (i) లెవల్ క్రాసింగ్‌ల కోసం అప్రోచ్ రోడ్ల నిర్మాణం మరియు నిర్వహణ; (ii) రైల్వే మార్గం వెంబడి జలమార్గాలు, కందకాలు, కాలువల అభివృద్ధి మరియు శుభ్రపరచడం:  (iii)  రైల్వే స్టేషన్లకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం మరియు నిర్వహణ;  (iv) ఇప్పటికే ఉన్న రైల్వే కట్టలు / కోత మరమ్మతులు మరియు వెడల్పు పనులు;  (v)  రైల్వే భూమి యొక్క సరిహద్దు వద్ద చెట్ల పెంపకం;  (vi) ఇప్పటికే ఉన్న కట్టలు / కోత / వంతెనల రక్షణ పనులు మొదలైనవి ఉన్నాయి. 

వినాశకరమైన కోవిడ్ కారణంగా ప్రభావితమై, అధిక సంఖ్యలో వలస కార్మికులు తిరిగి వచ్చిన ప్రాంతాలు / గ్రామాలలో జీవనోపాధి అవకాశాలను పెంపొందించడానికి, వారికి సాధికారత కల్పించడానికి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ అనే భారీ ఉపాధి-గ్రామీణ ప్రజా పనుల కార్యక్రమాన్ని, 2020 జూన్, 20వ తేదీన ప్రారంభించారు.  గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ కింద మన్నికైన గ్రామీణ మౌలిక సదుపాయాల నిర్మాణానికి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.

125 రోజులపాటు కొనసాగే ఈ అభియాన్, వలస కార్మికులు ఎక్కువ సంఖ్యలో తిరిగి వచ్చిన 6 రాష్ట్రాలు - బీహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్, ఒడిశా లలోని, 116 జిల్లాల్లో 25 రకాల పనులు / కార్యకలాపాలను కేంద్రీకరించి, మిషన్ మోడ్ ‌లో అమలుచేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, 50,000 కోట్ల రూపాయల మేర ప్రజా పనులు జరుగుతున్నాయి. 

అభియాన్ కింద 12 వేర్వేరు మంత్రిత్వ శాఖలు / విభాగాలు సమన్వయంతో, 25 ప్రజా మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయడానికీ, జీవనోపాధి అవకాశాల వృద్ధికీ, సమిష్టిగా కృషి చేస్తున్నాయి. ఆ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, రోడ్డు రవాణా, రహదారులు, గనులు, తాగునీరు, పారిశుధ్యం, పర్యావరణం, రైల్వేలు, పెట్రోలియం, సహజ వాయువు, నూతన, పునరుత్పాదక ఇంధనం, సరిహద్దు రోడ్లు, టెలికాం మరియు వ్యవసాయం ఉన్నాయి. 

*****



(Release ID: 1648093) Visitor Counter : 186