PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
21 AUG 2020 6:18PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
గత 24 గంటల్లో ఒకేరోజు 62,282 మంది కోలుకోగా మరో కొత్త రికార్డు సృష్టించిన భారత్.
- వ్యాధి నయమైనవారి సంఖ్య 21.5 లక్షలకుపైగానే; 74 శాతానికిపైగా కోలుకునేవారి సగటు.
- దేశంలో నమోదైన మొత్తం కేసులలో చురుకైన కేసులు (6,92,028) గత 24 గంటల్లో మరింత తగ్గి 23.82 శాతానికి పరిమితం.
- గడచిన 24 గంటల్లో పరీక్షించిన నమూనాల సంఖ్య 8,05,985.
- కోవిడ్-19 కాలంలో సాధారణ/ఉప ఎన్నికల నిర్వహణపై విస్తృత మార్గదర్శకాలకు ఎన్నికల సంఘం ఆమోదం.


భారత్‌లో ఒకేరోజు 62,282 మంది కోలుకోగా మరో కొత్త రికార్డు; బాగా తగ్గిన చురుకైన కేసుల శాతం; స్థిరంగా పెరుగుతున్న కోలుకునేవారి జాతీయ సగటు
కోవిడ్-19 నుంచి బయటపడేవారి సంఖ్యరీత్యా భారత్ మరో కొత్త రికార్డు సృష్టించింది. ఈ మేరకు గత 24 గంటల్లో ఒకేరోజు అత్యధికకంగా 62,282 మంది కోలుకున్నారు. మరింత మంది రోగులు కోలుకొని ఇళ్లకు వెళ్లడంతోపాటు ఏకాంత (స్వల్ప, ఓ మోస్తరు లక్షణులున్నవారు) గృహవాసంలో స్వస్థత పొందుతున్నారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య ఇవాళ 21,58,946కు చేరాయి. తదనుగుణంగా చికిత్స పొందుతున్న-కోలుకున్న కేసుల మధ్య అంతరం 14,66,918కి చేరింది. ఇలా అత్యధికంగా వ్యాధిగ్రస్థులు కోలుకుంటున్నందున దేశంలో కోలుకునేవారి సగటు 74 శాతం (74.28) దాటింది. ఇక 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇది 50శాతానికిపైగా నమోదవుతోంది. దేశం మొత్తంమీద నమోదైన కేసులలో ప్రస్తుత కేసులు (6,92,028) ఇవాళ ఇంకా తగ్గి 23.82 శాతానికి పరిమితమయ్యాయి. వీరంతా చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రులలో మెరుగైన, సమర్థ చికిత్స, ఏకాంత గృహవాసంలో ఉన్నవారిపై నిరంతరం పర్యవేక్షణ తదితర పటిష్ఠ చర్యలవల్ల దేశంలో మరణాల సగటు ప్రపంచ సగటుకన్నా తక్కువగా 1.89 శాతానికి పతనమైంది. ఇక గత 24 గంటల్లో 8,05,985 నమూనాలను పరీక్షించగా, ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 3,34,67,237గా నమోదైంది. దేశంలో పరీక్ష సదుపాయాల నెట్‌వర్క్ నానాటికీ విస్తరిస్తుండగా ప్రభుత్వ రంగంలో 978, ప్రైవేట్ రంగంలో 526 వంతున ఇవాళ మొత్తం 1504 ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647608
కోవిడ్ సమయంలో ప్రవర్తన ఔచిత్యానికి ప్రోత్సాహం దిశగా ఇంటరాక్టివ్ గేమ్, ఐఈసీ కంటెంట్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కోవిడ్-19కు సంబంధించి ప్రవర్తన ఔచిత్యానికి ప్రోత్సాహం దిశగా నిన్న ‘ది కరోనా ఫైటర్స్’ (www.thecoronafighters.in) పేరిట తొలి ఇంటరాక్టివ్ గేమ్‌తోపాటు ఐఈసీ కంటెంట్‌తో రెండు వీడియోలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తంచేస్తూ- మహమ్మారిని ఎదుర్కొనడంలో తగిన ఉపకరణాలు, ప్రవర్తన తీరుపై అవగాహన కల్పించే దిశగా ఈ వినూత్న, సృజనాత్మక గేమ్ ప్రయత్నిస్తుందని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. కోవిడ్ నియంత్రణపై సందేశాన్ని ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లడానికి ఈ రెండు వీడియోగేమ్స్ ఉపయోగపడతాయి. వీటిని అత్యంత సులభంగా, ఆనందం కలిగించే రీతిలో వినియోగించుకునే వీలుందని ఆయన తెలిపారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647540
కోవిడ్-19 కాలంలో సాధారణ/ఉప ఎన్నికల నిర్వహణపై విస్తృత మార్గదర్శకాలకు ఎన్నికల సంఘం ఆమోదం
దేశంలో కోవిడ్-19 కాలంలో సాధారణ/ఉప ఎన్నికల నిర్వహణపై విస్తృత మార్గదర్శకాలను కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఇందులో భాగంగా నామినేషన్ వేసేటపుడు అభ్యర్థి వెంటవచ్చే వ్యక్తుల, వాహనాల సంఖ్యకు సంబంధించిన నిబంధనను సవరించింది. అంతేకాకుండా నామినేషన్ ఫారాన్ని, ప్రమాణ పత్రాన్ని ఆన్‌లైన్ ద్వారా సమర్పించే వెసులుబాటు కూడా కల్పించింది. అలాగే తొలిసారిగా అభ్యర్థులు ఎన్నికలలో పోటీకి జమచేయాల్సిన ధరావతును కూడా ఆన్‌లైన్‌లో జమచేసే అవకాశం ఇచ్చింది. నియంత్రణ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని, ఇంటింటికీ ప్రచారం కోసం అభ్యర్థితో వెళ్లే వ్యక్తుల సంఖ్యను 5కు పరిమితం చేసింది. మరోవైపు దేశీయాంగ శాఖ/రాష్ట్రం జారీచేసిన నియంత్రణ మార్గదర్శకాలకు లోబడి బహిరంగ సభలు, సమావేశాలకు అనుమతిస్తుంది. ఎన్నికల ప్రక్రియలో సామాజిక దూర ప్రమాణాల అనుసరణకు ఫేస్ మాస్క్, శానిటైజర్, థర్మల్ స్కానర్లు, గ్లోవ్స్, ఫేస్ షీల్డ్, పీపీఈ కిట్లు భరోసా ఇస్తాయి. ఓటర్లు రిజిస్టర్‌లో సంతకం చేయడానికి, ఓటువేసే యంత్రంపై మీట నొక్కడం కోసం చేతి తొడుగులు సరఫరా చేస్తారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647624
కోవిడ్-19 సంబంధిత మూడు ఆవిష్కరణలకు పేటెంట్ కోసం దరఖాస్తు చేసిన బెర్హంపూర్ ఐటీఐ
ఒడిషాలోని బెర్హంపూర్‌లోగల పారిశ్రామిక శిక్షణ సంస్థ ఇండస్ట్రియల్ (ఐటిఐ) కోవిడ్-19 వ్యాప్తి నిరోధానికి సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి సంబంధించి మూడు వినూత్న ఉత్పత్తులను ఆవిష్కరించింది. అలాగే వీటికి పేటెంట్ హక్కుల కోసం పేటెంట్ జర్నల్‌లో దరఖాస్తు సమర్పించింది. ఈ వినూత్న ఆవిష్కరణలలో భాగంగా సంచార నమూనా సేకరణ కియోస్క్, యూవీసీ సౌర పరిశుభ్రకం, యూవీసీ రోబో యోధ పరికరం ఉన్నాయి. ఈ మేరకు ఐటీఐ సాధించిన ఘనతను కేంద్ర నైపుణ్యాభివృద్ధి- వ్యవస్థాపక శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే కొనియాడారు. ఇలాంటి ఆవిష్కరణలు సమాజ అవసరాలను తీర్చడానికి, స్వావలంబన, పరిశోధనలను ప్రోత్సహిస్తాయని ఆయన అన్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647760
గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ కఠిన పరిస్థితుల్లో నిల్వకు అనువైన కోవిడ్ నిర్ధారణ పరీక్షల చౌక కిట్ కోసం అధ్యయనం ప్రారంభం
దేశంలో మౌలిక వసతుల కొరతగల మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ వేగంగా రోగ నిర్ధారణ సౌకర్యాల ఏర్పాటుపై కోవిడ్-19 మహమ్మారి కొత్త సవాలు విసిరింది. ఈ నేపథ్యంలో అధునాతన నిల్వ సదుపాయాలు అవసరంలేని చౌక పరికరాలను రూపొందించేలా ప్రేరేపించింది. తదనుగుణంగా అవసరం తీర్చడానికి శాస్త్రవేత్తలు పరిశోధన ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ సహకారంతో శాస్త్ర-సాంకేతిక శాఖ పరిధిలోగల రాంచీ-మెస్రాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక పరిశోధన ప్రారంభించింది. ఈ మేరకు బయోఇన్ఫర్మేటిక్స్ సాధనంతో నిర్దేశిత ప్రోటీన్ వేరుపరచింది. ఈ నేపథ్యంలో దీన్ని గుర్తించగల రోగ నిర్ధారణ కిట్‌ను ఇక రూపొందించాల్సి ఉంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647612
ఈఎస్ఐసీ పరిధిలోని ‘అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన’ కింద అర్హత ప్రమాణాల సడలింపు-నిరుద్యోగ భృతి పెంపు
దేశంలో కోవిడ్ మహమ్మారి ప్రభావితులైన కార్మికులకు సహాయపడే దిశగా కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ సహాయ (ఇంఛార్జి) మంత్రి శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్ అధ్యక్షతన నిన్న ఈఎస్ఐ కార్పొరేషన్ (ESIC) 182వ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు ముఖ్యమైన నిర్ణయాలిలా ఉన్నాయి...: ఈఎస్‌ఐసీ ప్రస్తుతం ‘అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన’ను అమలు చేస్తోంది. దీనికింద ఈఎస్‌ఐ పరిధిలోకి వచ్చే కార్మికులకు నిరుద్యోగ భృతి కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో సదరు పథకాన్ని 2021 జూన్ 30వరకు పొడిగించాలని సమావేశం నిర్ణయించింది. ఆ తర్వాత ఈ పథకం వాస్తవార్హత నిబంధనలనుబట్టి 01.01.2021 నుంచి 30.06.2021 వరకు అందుబాటులో ఉంటుంది. ఈలోగా 31.12.2020 తర్వాత అవసరాన్ని, డిమాండ్‌ను బట్టి సడలింపులపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647609
ఈ ఏడాది ప్రధానమంత్రి ఉపాధి సృష్టి కార్యక్రమం కింద పథకాలలో 44 శాతం ప్రగతితో కొత్త రికార్డు
దేశం కోవిడ్ దిగ్బంధంలో విలవిల్లాడుతున్న వేళ ఖాదీ-గ్రామీణ పరిశ్రమల కమిషన్ (KVIC) నిర్వహణలోని కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాల్లో ఒకటైన “ప్రధానమంత్రి ఉపాధి సృష్టి కార్యక్రమం (PMEGP) అత్యంత వేగంగా పురోగమించింది. ఈ మేరకు 2020 ఏప్రిల్ 1 నుంచి మొదలైన ఆర్థిక సంవత్సరంలో తొలి ఐదు నెలల్లోనే అంటే 2020 ఆగస్టు 18నాటికి ఏకంగా 44 శాతం పురోగమనాన్ని నమోదు చేసింది. ఆ మేరకు కేవీఐసీ 1.03 లక్షల పథకాల దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. నిరుడు ఇదే సమయంలో ఆర్థిక సహాయ సహకారాలు అందించే బ్యాంకులు కేవలం 71,556 దరఖాస్తులను మాత్రమే పరిష్కరించాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647453
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భవిష్యనిధిలో 8 లక్షలకుపైగా చందారుల ప్రవేశం
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) ఈ నెల 20న ప్రకటించిన తాజా సమాచారం ప్రకారం... ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 8.47 లక్షల చందాదారులు అదనంగా చేరారు. వాస్తవానికి కోవిడ్ సంక్షోభంవల్ల కొత్తగా ఉద్యోగాలలో చేరేవారి సంఖ్య ఏప్రిల్, మే నెలల్లో బాగా తగ్గిపోయింది. అయితే దిగ్బంధం ఉన్నప్పటికీ ఏప్రిల్ నెలలో 0.20 లక్షలమంది, మే నెలలో 1.72 లక్షల మంది వంతున కొత్త చందాదారులు ఈ సామాజిక భద్రత పథకంలో చేరారు. అయితే, జూన్‌లో ఈ పరిస్థితి బాగా మెరుగుపడింది. తదనుగుణంగా 6.55 లక్షలమంది సభ్యులుగా చేరటాన్నిబట్టి ఏ నెలకు ఆ నెల సభ్యుల సంఖ్య వేగంగా పుంజుకుంటున్నదని స్పష్టమవుతోంది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647433
అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థ విస్తరణ దిశగా స్వీడన్ ఆరోగ్య రక్షణ ఆవిష్కరణల కేంద్రం-అటల్ ఇన్నొవేషన్ మిషన్‌ల మధ్య భాగస్వామ్యం
దేశంలో సృజనాత్మక సంస్కృతి విస్తరణ లక్ష్యానికి తగినట్లు నీతీ ఆయోగ్ పరిధిలోని ‘అటల్ ఇన్నొవేషన్ మిషన్’ (AIM), బిజినెస్ స్వీడన్ సంస్థలు ఒకడుగు ముందుకేశాయి. ఈ మేరకు భారత-స్వీడన్ ఆరోగ్య రక్షణ ఆవిష్కరణల కేంద్రం తరఫున పరస్పర సహకరించుకోవాలని ఎయిమ్-బిజినెస్ స్వీడన్ అంగీకారానికి వచ్చాయి. భారత ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సామర్థ్యాన్ని, దేశవ్యాప్తంగా క్రియాశీల అంకుర సంస్థల సానుకూల వాతావరణాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇందుకు సంబంధించి కుదుర్చుకున్న వాస్తవిక సాదృశ అనుమతి ప్రకటన పత్రంపై అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఇండియా స్వీడన్ ఆరోగ్య రక్షణ ఆవిష్కరణల కేంద్రం తరఫున బిజినెస్ స్వీడన్ నిన్న సంతకాలు చేశాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1647449
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- మహారాష్ట్ర: రాష్ట్ర రాజధాని ముంబైలో 50 ఏళ్లు పైబడిన కోవిడ్-19 నిర్ధారిత వ్యక్తులందరికీ రోగ లక్షణాలు ఉన్నా/లేకపోయినా సంస్థాగత ఏకాంతవాసం తప్పనిసరి చేస్తూ బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కోవిడ్ మార్గదర్శకాలను మళ్లీ సవరించింది. పెద్దలలో మరణాలు పెరుగుతున్నందున ఈ మార్పు అవసరమైనట్లు పేర్కొంది. కాగా, మహారాష్ట్రలో 326మంది మరణించడంతో మృతుల సంఖ్య 21,359కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1.62 లక్షలమంది చికిత్స పొందుతున్నారు.
- గుజరాత్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1175 కొత్త కేసులు నమోదయ్యాయి. గుజరాత్ ఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం... రాష్ట్రంలో కోలుకునేవారి శాతం మెరుగుపడి 79.21కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 15.47లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించగా, నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 68,581 నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం క్రియాశీల కేసులు 14,454గా ఉంది.
- రాజస్థాన్: రాష్ట్రంలోని కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రులలో పనిచేస్తున్న వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అదనపు గౌరవ వేతనం ప్రకటించారు. కాగా, రాష్ట్రంలో నమోదైన మొత్తం 66,619 కేసులలో 51,190 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
- ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసలో ఇబ్బందివంటి లక్షణాలు కనిపించే వారందరూ 24 గంటల్లో కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది. ఛత్తీస్‌గఢ్‌లో కోవిడ్-19 సంభావ్య రోగులను గుర్తించడానికి అన్ని జిల్లాల్లో ముమ్మర నిఘా పెట్టాలని ఇప్పటికే అధికారులను ఆదేశించింది.
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 116 కొత్త కేసులు నమోదవగా 71 మంది కోలుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం 968 క్రియాశీల కేసులున్నాయి.
- అసోం: రాష్ట్రంలో నిన్న 1735 మందికి వ్యాధి నిర్ధారణ కాగా, 2772 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు 86052 కాగా, ఇప్పటిదాకా 63120 మందికి వ్యాధి నయమైంది. ప్రస్తుతం 22708 మంది చికిత్స పొందుతుండగా మృతుల సంఖ్య 221గా ఉంది.
- మణిపూర్: రాష్ట్రంలో 49 కొత్త కేసులు నమోదవగా 117 మంది కోలుకున్నారు, మొత్తం క్రియాశీల కేసులు 1905 కాగా, కోలుకునేవారి సగటు 60 శాతంగా ఉంది.
- మేఘాలయ: రాష్ట్రంలో 2020 సెప్టెంబరు నుంచి 3 నెలలపాటు ప్రతి నెలలో ఒక వారంపాటు అన్ని ప్రవేశ మార్గాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మేఘాలయలోని ఆరోగ్య సిబ్బంది, ముందువరుస కార్యకర్తలు, కోవిడ్‌పై తీవ్ర నిఘా విధుల్లోగల సంబంధిత జిల్లా పాలన సిబ్బందిపై భారత తగ్గించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
- మిజోరం: రాష్ట్రంలో ఇవాళ 15 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు 895కాగా, క్రియాశీల కేసులు 478గా ఉన్నాయి. మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో సంపూర్ణ దిగ్బంధాన్ని ఆగస్టు 24దాకా ప్రభుత్వం పొడిగించింది.
- నాగాలాండ్: రాష్ట్రంలోని కోహిమాలోగల మరో మూడు కాలనీల్లో కోవిడ్ కేసులు నిర్ధారణ కావడంతో వాటిని దిగ్బంధించారు. కాగా, అసోం నుండి మోన్ జిల్లాకు వస్తువుల రవాణాపై పాలన యంత్రాంగం ఈ నెల 20న విధించిన నిషేధం తదుపరి ఉత్తర్వులిచ్చేదాకా కొనసాగనుంది.
- సిక్కిం: రాష్ట్రంలో 46 కొత్త కేసులు నమోదుకాగా, 834 మంది డిశ్చార్జ్ అయ్యారు. క్రియాశీల కేసులు 498గా ఉన్నాయి.
- కేరళ: రాష్ట్రంలో కోవిడ్-19 రోగుల ఫోన్‌కాల్స్ వివరాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాలా దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు ఇవాళ కొట్టివేసింది. కాగా, కోవిడ్ రోగులున్న ప్రదేశాల్లోని ఫోన్ టవర్ల వివరాలను మాత్రమే సేకరిస్తున్నట్లు ప్రభుత్వం నివేదించడాన్ని అంగీకరించింది. ఇక కేరళలో ఇవాళ నలుగురు రోగులు మరణించడంతో కోవిడ్ మృతుల సంఖ్య 195కు చేరింది. రాష్ట్రంలో నిన్న 1,968 తాజా కేసులు నమోదు కాగా, వివిధ జిల్లాల్లో 18,123మంది చికిత్స పొందుతున్నారు, మరో 1,73,189 మంది పరిశీలనలో ఉన్నారు.
- తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 313 కొత్త కేసులు, 6 మరణాలు నమోదవగా 300 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9594కు, మృతుల సంఖ్య 143కు పెరిగాయి. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 3517గా ఉంది. తమిళనాడులో వినాయక చవితి సందర్భంగా వ్యక్తులు విగ్రహ నిమజ్జనం చేయడానికి అనుమతిస్తామని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో నిన్న 5986 కొత్త కేసులు, 116 మరణాలు నమోదవగా 5742మంది కోలుకున్నారు. మొత్తం కేసులు: 3,61,435; క్రియాశీల కేసులు: 53,283; మరణాలు: 6239; డిశ్చార్జి: 3,01,913; చెన్నైలో యాక్టివ్ కేసులు: 12,287గా ఉన్నాయి.
- కర్ణాటక: రాష్ట్రంలో నియంత్రణ జోన్లపై ప్రభుత్వం సవరించిన మార్గదర్శకాల ప్రకారం- ఇకపై కఠిన బారికేడింగ్ కొనసాగించరాదని BBMP నిర్ణయించింది. ఇక కర్ణాటకలో కోవిడ్-19 వ్యాప్తిపై అంచనా దిశగా అన్ని జిల్లాల్లో సర్వే నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రం గురువారం 7385 కొత్త కేసులు, 102 మరణాలు నమోదవగా 6231 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 2,56,975; క్రియాశీల కేసులు: 82,149; మరణాలు: 4429; డిశ్చార్జి: 1,70,381గా ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్-19 ప్రత్యేక ఆస్పత్రుల సంఖ్యను 138 నుంచి 287కు పెంచినట్లు మఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇవాళ కోవిడ్-19పై సమీక్ష సందర్భంగా రోగులకు ఉత్తమ సేవలందించేలా అన్ని ప్రత్యేక ఆస్పత్రులలో నిపుణులను, వైద్యులను త్వరగా నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తూ మౌలిక వసతులు, సిబ్బంది కొరత వంటివాటిని పరిష్కరించాలని స్పష్టం చేశారు. కోవిడ్ -19 సేవలకోసం నియమించిన తాత్కాలిక పారిశుధ్య సిబ్బంది జీతాలను పెంచాలని ఆదేశించారు. రాష్ట్రంలో నిన్న 9393 కొత్త కేసులు, 95 మరణాలు నమోదవగా 8846 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 3,25,396; క్రియాశీల కేసులు: 87,177; మరణాలు: 3001గా ఉన్నాయి.
- తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1967 కొత్త కేసులు, 8 మరణాలు నమోదవగా 1781 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 473 జిహెచ్‌ఎంసి నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 99,391; క్రియాశీల కేసులు: 21,687; మరణాలు: 737; డిశ్చార్జి: 76,967గా ఉన్నాయి. ఇక కొత్త కోవిడ్ కేసుల భారంతోపాటు కాలానుగుణ వ్యాధుల పెరుగుదలను ఎదుర్కోవటానికి, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిలోని ప్రాంతాలలో అన్ని బస్తీ దవాఖానాల వద్ద సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు క్లినిక్‌లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
FACT CHECK


*******
(Release ID: 1647764)
Visitor Counter : 237