PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
20 JUL 2020 6:32PM by PIB Hyderabad
(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- కోవిడ్-19 నుంచి ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 7 లక్షలకుపైగా నమోదు.
- కేవలం 2.46 శాతం మరణాలతో ప్రపంచంలో అత్యల్ప మరణశాతంగల దేశాల జాబితాలో భారత్
- దేశంలో ప్రస్తుతం చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,90,459.
- దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 43 పెద్ద ఆస్పత్రులకు విస్తరించిన న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఈ-ఐసీయూ వీడియో సంప్రదింపుల కార్యక్రమం.
- ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కోవిడ్ ప్లాస్మా దానం కార్యక్రమం ప్రారంభం.
- సాంకేతిక పరిజ్ఞానం, అందుబాటులో చిక్కుల్లేని గణాంక చోదిత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానాలతో సమీకృత ప్రగతివైపు పయనిస్తున్న భారతదేశం: ప్రధానమంత్రి ఉద్ఘాటన.
కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ సమాచారం; వ్యాధినుంచి కోలుకున్నవారి సంఖ్య 7 లక్షలకుపైగా నమోదు; కేవలం 2.46 శాతం మరణాలతో ప్రపంచంలో అత్యల్ప మరణశాతంగల దేశాల్లో భారత్
దేశంలో కోవిడ్-19 మరణాల శాతం స్థిరంగా తగ్గుతూ వస్తోంది. తదనుగుణంగా భారత్‌లో ఇవాళ కేవలం 2.46 శాతంగా నమోదై, ప్రపంచంలో అత్యల్ప మరణశాతంగల దేశాల జాబితాలో చేరింది. ఇక ఇప్పటివరకూ 7 లక్షలమందికిపైగా రోగులు కోలుకుని ఇళ్లకు వెళ్లారు. దీంతో ప్రస్తుత-కోలుకున్న కేసుల (7,00,086) మధ్య అంతరం మరింత విస్తరించి 3,09,627కు పెరిగింది. ఇక గడచిన 24 గంటల్లో 22,664 మందికి వ్యాధి నయం కాగా, కోలుకునేవారి జాతీయ సగటు 62.62గా నమోదైంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3,90,459 మంది వివిధ ఆస్పత్రులతోపాటు ఏకాంత గృహవాసంలో చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639944
న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో వేగం పుంజుకున్న ఈ-ఐసీయూ వీడియో సంప్రదింపుల కార్యక్రమం; 11 రాష్ట్రాల్లోని 43 పెద్ద ఆస్పత్రులకు వర్తింపు
కోవిడ్-19 మరణాల తగ్గింపు దిశగా కేంద్ర ప్రభుత్వ కృషిని బలోపేతం చేసేందుకు న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఐసీయూలోని రోగుల సంరక్షణపై డాక్టర్లకు మార్గదర్శనం చేసేందుకు ‘ఈ-ఐసీయూ’ పేరిట 2020 జూలై 8నుంచి దృశ్య-శ్రవణ మాధ్యమ సంప్రదింపుల సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. మహమ్మారిపై పోరులో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రులలో చికిత్సనందిస్తున్న ముందువరుస యోధులైన డాక్టర్లకు కేసుల నిర్వహణలో సాయపడటం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ మేరకు ఐసీయూలో చికిత్స సందర్భంగా డాక్టర్లకు సందేహాలు కలిగితే వారు ఈ -ఐసీయూ సదుపాయంద్వారా నిపుణులతో సంప్రదించవచ్చు. అదేవిధంగా వారు తమ అనుభవాలను, సముపార్జిత విజ్ఞానాన్ని ఎయిమ్స్‌లోని నిపుణులు, ఇతర వైద్య సిబ్బందితో ఈ వేదికద్వారా పంచుకోవచ్చు. ఐసీయూ, ప్రాణవాయు సౌకర్యం, ఏకాంత చికిత్స పడకల సదుపాయాలున్న వెయ్యి పడకల ఆస్పత్రులలో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను బలోపేతం చేయడమే కాకుండా అందరి అనుభవాలనూ పంచుకోవడం ద్వారా కోవిడ్ మరణాలను తగ్గించడం దీని ప్రధానోద్దేశం. ఇప్పటిదాకా 43 ఆస్పత్రులతో నాలుగు దఫాలుగా వీడియో సంప్రదింపులు నిర్వహించబడ్డాయి. కోవిడ్ రోగుల చికిత్సలో రెమ్‌డెసివిర్, టొసిలీజుమాబ్ ఔషధాలతోపాటు కోలుకున్నవారి రక్తజీవ ద్రవ్యం (ప్లాస్మా) వినియోగం వంటి ‘పరిశోధనాత్మక చికిత్స’ పద్ధతులను హేతుబద్ధంగా అనుసరించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా విశదీకరించారు. మరోవైపు వ్యాధికి సంబంధించి ప్రస్తుత లక్షణాలు, సదరు పద్ధతుల విచక్షణరహిత వినియోగంవల్ల సంభావ్య ముప్పుసహా సామాజిక మాధ్యమ సిఫారసుల ఒత్తిడి తదితరాల గురించి రోగులకు చికిత్స చేస్తున్న వైద్య బృందాలు ప్రత్యేక నిపుణులతో చర్చించాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639885
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కోవిడ్ ప్లాస్మా దానం కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ హర్షవర్ధన్
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నిన్న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కోలుకున్నవారి ‘రక్తజీవ ద్రవ్య’ (ప్లాస్మా) దానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోవిడ్ బారినుంచి బయటపడిన 26 మంది పోలీసు సిబ్బంది స్వచ్ఛందంగా ప్లాస్మా దానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. “కరోనావల్ల 12 మందికిపైగా ఢిల్లీ పోలీసు సిబ్బంది మరణించడం చాలా విచారకరం. మరోవైపు నియంత్రణ మండళ్ల సంఖ్య 200 నుంచి 600కు పెరిగింది. అయినప్పటికీ వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా వారు తమ కర్తవ్యం నిర్వర్తిస్తూ అమూల్యమైన సేవలందిస్తున్నారు.” అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా 26 మంది కానిస్టేబుళ్లకు ప్రశంసపత్రాలు ప్రదానం చేస్తూ, వారి స్వచ్ఛంద సహకారాన్ని డాక్టర్ హర్షవర్ధన్ ప్రశంసించారు. కాగా, వీరిలో శ్రీ ఓం ప్రకాష్ అనే కానిస్టేబుల్ మూడోసారి తన ప్లాస్మాను దానం చేయడం విశేషం. కాగా, కోవిడ్-19పై విజయ పథంలో ప్రతి దాత సహాయం అమూల్యమైనదని, కచ్చితమైన చికిత్స లేదా టీకా అందుబాటులోకి వచ్చేదాకా మహమ్మారితో పోరాటంలో ‘ప్లాస్మా యోధుల’ అవసరం మనకెంతో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. “దేశంలో 24 గంటలూ ప్లాస్మా అందుబాటు దిశగా ప్లాస్మా బ్యాంకులు ఏర్పాటవుతున్న నేపథ్యంలో కారుణ్య వినియోగం కోసం ప్లాస్మా చికిత్సకు ఆమోదం తెలిపాం” అని ఆయన గుర్తుచేశారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639870
ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణతో ప్రధానమంత్రి సంభాషణ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఐబీఎం ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ అరవింద్ కృష్ణతో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సంభాషించారు. వ్యాపార సంస్కృతిపై కోవిడ్ ప్రభావం గురించి మాట్లాడుతూ- దేశంలో ‘ఇంటినుంచి పని’ విధానాన్ని పెద్ద ఎత్తున అనుసరిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఈ సాంకేతిక మార్పు సజావుగా సాగిపోయేలా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, అనుసంధానం, నియంత్రణ వాతావరణాన్ని సమకూర్చే దిశగా నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. అలాగే తమ ఉద్యోగులలో 75 శాతం ఇంటినుంచే పనిచేసేలా ఐబీఎం ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అనుసరించే సాంకేతిక పరిజ్ఞానం-సవాళ్ల గురించి ఆయన చర్చించారు. ఇక భారత్‌లో పెట్టుబడులకు ఇదే తగిన తరుణమని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలో ఆరోగ్య శ్రేయస్సును ప్రోత్సహించడంతోపాటు ఉత్తమ, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా ఆరేళ్ల నుంచి ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి వివరించారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో భారత్‌కు ప్రత్యేకమైన నిర్దిష్ట కృత్రిమ మేధ ఆధారిత ఉపకరణాల సృష్టి అవకాశాల గురించి ప్రస్తావించారు. అంతేగాక వ్యాధి నిర్ధారణ, విశ్లేషణ కోసం మెరుగైన నమూనాల అభివృద్ధి అవసరాన్ని వివరించారు. ప్రజలకు సరసమైన, చిక్కుల్లేని సమీకృత సాంకేతిక-గణాంక ఆధారిత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అభివృద్ధి దిశగా దేశం ముందడుగు వేస్తున్నదని ఆయన నొక్కి చెప్పారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640037
కోవిడ్-19 నిరోధం కోసం దేశంలో మాస్కులు, పరిశుభ్రకాల పంపిణీకి పంజాబ్ నేషనల్ బ్యాంకు చేపట్టిన సీఎస్‌ఆర్ కార్యక్రమానికి డాక్టర్ హర్షవర్ధన్ శ్రీకారం
దేశంలో కోవిడ్-19 వ్యాప్తి నిరోధం కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద దేశమంతటా మాస్కులు, పరిశుభ్రకాల పంపిణీకి పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) చేపట్టిన కార్యక్రమాన్ని డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించారు. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేళ పీఎన్‌బీ ఈ బాధ్యతలో పాలుపంచుకోవడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “మహమ్మారిపై ప్రభుత్వ పోరాటంలో మద్దతిచ్చేందుకు పీఎన్‌బీ చొరవ చూపడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ‘పీఎం కేర్స్’ నిధికి విరాళమివ్వడంతోపాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యకలాపాల కింద మాస్కులు, పరిశుభ్రకాలు పంపిణీ చేసే బాధ్యతను చేపట్టడం హర్షణీయం” అని కొనియాడారు. కాగా, దేశంలోని 662 జిల్లాల్లో ఈ సామగ్రిని పంపిణీ చేయడానికి పీఎన్‌బీ చేపట్టిన కార్యక్రమంపై ఆయన అభినందనలు తెలిపారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640009
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు-2019 వ్యక్తిత్వ పరీక్ష (ఇంటర్వ్యూ) నిర్వహణకు యూపీఎస్‌సీ సన్నాహాలు
కోవిడ్-19 వ్యాప్తి నిరోధం కోసం దిగ్బంధం విధింపునకు ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి సివిల్ సర్వీసెస్ పరీక్షలు-2019కి సంబంధించి 2,304 మంది అభ్యర్థులకు యూపీఎస్‌సీ వ్యక్తిత్వ పరీక్ష (ఇంటర్వ్యూ) ప్రక్రియను నిర్వహిస్తోంది. అటుపైన పరిస్థితిని సమీక్షించాక మిగిలిన 623 మంది అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూ బోర్డులను 2020 మార్చి 23 నుంచి వాయిదా వేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దిగ్బంధం దశలవారీగా తొలగుతున్న నేపథ్యంలో మిగిలిన అభ్యర్థులకు 2020 జూలై 20 నుంచి 30వ తేదీవరకు ఇంటర్వ్యూ నిర్వహించాలని నిర్ణయించి సమాచారం కూడా పంపింది. దీనికి అనుగుణంగా అభ్యర్థులు, నిపుణ సలహాదారులు, ఉద్యోగుల భద్రత-ఆరోగ్య సంబంధిత ఆందోళనల తొలగింపునకు తగిన ఏర్పాట్లు చేసింది.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640046
నేటినుంచి అమలులోకి వచ్చిన వినియోగదారుల రక్షణ చట్టం-2019
కొత్త చట్టం వినియోగదారులకు మరింత సాధికారత ప్రసాదిస్తుంది. ఈ మేరకు వినియోగదారుల రక్షణ మండళ్లు, వినియోగదారు వివాద పరిష్కార కమిషన్లు, మధ్యవర్తిత్వం... కల్తీ/నకిలీ పదార్థాలు కలిగిన ఉత్పత్తుల తయారీ లేదా అమ్మకం తదితరాల విషయంలో ఉత్పత్తి బాధ్యత-శిక్ష సంబంధిత నిబంధనలు ఇందులో పొందుపరచబడ్డాయి. తద్వారా వినియోగదారులు తమ హక్కులను పరిరక్షించుకోవడంలో ఈ చట్టం వారికి పూర్తిగా తోడ్పడుతుంది. వినియోదారులకు సంబంధించిన సకల రక్షణలతోపాటు ఈ-కామర్స్ వేదికల ద్వారా అనుచిత వ్యాపార పద్ధతులను నిరోధించే నిబంధనలు కూడా ఈ చట్టంలో ఉన్నాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639925
కోవిడ్-19 నేపథ్యంలో 2652 ట్రిప్పుల మేర పార్సెల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపిన ఆగ్నేయ రైల్వే
ప్రస్తుత జాతీయ సంక్షోభ సమయంలో దేశంపట్ల కర్తవ్య నిబద్ధతలో భాగంగా ఆగ్నేయ రైల్వే (SER) ఇప్పటిదాకా 2652 ట్రిప్పుల మేర టైమ్ టేబుల్ సహిత పార్సెల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లద్వారా అవసరమైన వస్తువులను రవాణా చేసింది. ఆ మేరకు ఆహార పదార్థాలు, కిరాణా సరకులు, మందులు, వైద్య పరికరాలుసహా ఇతర నిత్యావసరాలను 2020 ఏప్రిల్ 2 నుంచి జూలై 15 వరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేసింది. తదనుగుణంగా 17,81,264 పార్శిళ్లద్వారా 46,141 టన్నుల వస్తువులను దేశంలోని వివిధ ప్రదేశాలకు అందించింది. ఈ పార్శిల్ రైళ్లు షాలిమార్-రాంచీ, షాలిమార్-ముంబై సీఎస్‌ఎమ్‌టీ, హౌరా-సికింద్రాబాద్, హౌరా-కెఎస్‌ఆర్ బెంగళూరు, షాలిమార్-పోర్బందర్, టాటానగర్-ఇట్వారీ మార్గాల్లో నడుస్తున్నాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639781
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- పంజాబ్: రాష్ట్రంలో కోవిడ్‌పై అవగాహన పెంపుదిశగా చేపట్టిన ‘మిషన్ వారియర్’ కార్యక్రమానికి విశేష ప్రజాదరణ లభించడంతో ఉత్సాహంగా ఉన్న పంజాబ్ ముఖ్యమంత్రి- దీన్ని మరో రెండు వారాలు కొనసాగించాలని నిర్ణయించారు. దీంతోపాటు తదుపరి దశకు సంబంధించి డైమండ్ సర్టిఫికెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఇక కోవిడ్ నుంచి బయటపడినవారు తమ అవగాహన మేరకు వివిధ రక్షణ చర్యలపై అట్టడుగు స్థాయిదాకా ప్రజలను చైతన్యపరిచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ‘మిషన్ వారియర్’ పోటీలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
- హర్యానా: రాష్ట్రంలోని దాదాపు 16 లక్షల కుటుంబాలకు కోవిడ్ కాలంలో ప్రభుత్వం రూ.4000 నుంచి 5000దాకా ఆర్థిక సహాయం అందించినట్లు హర్యానా ముఖ్యమంత్రి చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పరివార్ సమృద్ధి యోజనతోపాటు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుద్వారా సహాయం అందించారు. మరోవైపు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద నవంబర్ వరకు పేద కుటుంబాలకు ఉచిత రేషన్ పంపిణీ చేయబడుతుంది.
- కేరళ: రాష్ట్రంలో మరో మరణం సంభవించడంతో కేరళలో మృతుల సంఖ్య 43కు చేరింది. పాలక్కాడ్ జిల్లా పట్టంబి తాలూకాతోపాటు నెల్లయ పంచాయతీలో దిగ్బంధం ప్రకటించారు. కోవిడ్-19 నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో తిరువనంతపురంలో రెండు హైపర్ మార్కెట్ల లైసెన్సులు రద్దు చేయబడ్డాయి. నగరంలో ఎక్కువ మందికి వైరస్ వ్యాప్తి చెందడంలో ఈ రెండు మార్కెట్లు ప్రధాన పాత్ర పోషించాయని అధికారులు నిర్ధారించారు. ఇక రాష్ట్రం వెలుపల మరో ఐదుగురు కేరళీయులు కోవిడ్ మహమ్మారికి బలయ్యారు. ఈ మేరకు గల్ఫ్ ప్రాంతంలో నలుగురు, కర్ణాటకలో ఒకరు మరణించారు. కేరళలో నిన్న నమోదైన 821 కొత్త కేసులలో 629 పరిచయాలద్వారా సంక్రమించినవి కాగా, 43 కేసుల సంక్రమణ మూలం తెలియరాలేదు. ఇక 7,063 మంది చికిత్స పొందుతుండగా వివిధ జిల్లాల్లో 1.70 లక్షల మంది నిఘాలో ఉన్నారు.
- తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 73 ఏళ్ల మహిళ ఒకరు కోవిడ్-19కు బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 29కి చేరింది. మరోవైపు సోమవారం 93 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2000 స్థాయిని దాటింది. ఇక తమిళనాడులో కోవిడ్-19 వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి ఆదివారం ప్రధానమంత్రికి వివరించారు. ఇక రాష్ట్రంలో 13,000 మందికి ఉపాధి కల్పించగల రూ.10,399కోట్ల విలువైన ఎనిమిది అవగాహన ఒప్పందాలపై ప్రభుత్వం సంతకం చేసింది. విరుధాచలం తహశీల్దార్ కోవిడ్-19తో మరణించారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కోవిడ్ వ్యాధి నిర్ధారణ అయింది. ఇక ఆదివారం 78 మరణాలతోపాటు 4,979 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,70,693; యాక్టివ్ కేసులు: 50,294; మరణాలు: 2481; చెన్నైలో యాక్టివ్ కేసులు: 15,042గా ఉన్నాయి.
- కర్ణాటక: బీబీఎంపీ సూచించిన కోవిడ్ రోగులను చేర్చుకునే నిమిత్తం రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులలో పడకలు అందుబాటులో ఉంచాలని ఆదేశిస్తూ ‘విపత్తు నిర్వహణ చట్టం-2005లోని సెక్షన్ 24 (1)’ కింద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. కాగా, బెంగళూరు పట్టణ-గ్రామీణ జిల్లాల్లో జూలై 22న వారం రోజుల దిగ్బంధం తొలగించనుండటంతో రాష్ట్రం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ సమావేశమై కోవిడ్ నియంత్రణకు తదుపరి చర్యలపై చర్చించింది. దిగ్బంధం కొనసాగించేందుకు ముఖ్యమంత్రి సుముఖంగా లేనప్పటికీ కొందరు మంత్రులు, ఆరోగ్య నిపుణులు రాష్ట్రంలో మరికొంత కాలం దిగ్బంధం కొనసాగించాలని సూచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెంగళూరు నగరంలో నిన్న 4120 కేసులు, 91 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 63,772; యాక్టివ్ కేసులు: 39,370; మరణాలు: 1331గా ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో వైరస్ సంక్రమణ నివారణ దిశగా కనీస అత్యవసర సిబ్బందితో మాత్రమే పనిచేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అలాగే షార్‌లోని హౌసింగ్ కాలనీలో నియంత్రణ జోన్లను ప్రకటించి, ఆంక్షలు విధించారు. కోవిడ్ -19 కేసుల పెరుగుదల దృష్ట్యా పశ్చిమ గోదావరి జిల్లాలో జూలై 31 వరకు పూర్తి దిగ్బంధం అమలుకానుంది. కరోనావైరస్ సోకిన టీడీపీ సీనియర్ నేత, సంగం డెయిరీ డైరెక్టర్ పోపురి కృష్ణారావు గుంటూరులోని ఎన్నారై ఆస్పత్రిలో మరణించారు. ఒకవైపు కేసుల సంఖ్య పెరుగుతుండగా మరోవైపు తప్పుడు సమాచార వ్యాప్తి అధికంగా ఉంది. దీంతో పరిస్థితిని చక్కదిద్దడంతోపాటు బాధిత ప్రజలకు మార్గనిర్దేశం దిశగా అన్ని జిల్లాల్లో కోవిడ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, రాష్ట్రంలో నిన్న 5041 కొత్త కేసులు, 56 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 49,650; యాక్టివ్ కేసులు: 26,118; మరణాలు: 642గా నమోదయ్యాయి.
- తెలంగాణ: హైదరాబాద్‌లోని నిమ్స్‌లో కోవిడ్-19 టీకా ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు భారత వైద్యపరిశోధన మండలి (ఐసీఎంఆర్), భారత్ బయోటెక్ రూపొందించిన తొలి స్వదేశీ టీకాను నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో 30 మంది ఆరోగ్యకరంగా ఉన్న స్వచ్ఛంద కార్యకర్తలపై ప్రయోగించనున్నట్లు సమాచారం. కాగా, రాష్ట్రంలో నిన్న 1296 కొత్త కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 45,076; యాక్టివ్ కేసులు: 12,224; మరణాలు: 415గా ఉన్నాయి.
- అరుణాచల్ ప్రదేశ్: కోవిడ్-19 మహమ్మారి అందరికీ స్వావలంబన ప్రాధాన్యాన్ని తేటతెల్లం చేసిందని అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ డాక్టర్ బి.డి.మిశ్రా అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో పోషకాహార పెరటి తోటల పెంపకం చేపట్టాలని ప్రజలను సూచించారు.
- అసోం: రాష్ట్రంలోని బార్పేట జిల్లా పత్సల సమీపాన గహిన్‌పారా వద్ద పహుమారా నది కట్టను అసోం ముఖ్యమంత్రి శ్రీ సర్వానంద సోనోవాల్ పరిశీలించారు, ఇటీవల వరదల్లో ఈ కట్ట తెగిపోయింది.
- మణిపూర్: రాష్ట్రంలోని ఉక్రుల్ (252), కాంగ్పోక్పి (234), తమెంగ్లాంగ్ (212) జిల్లాల్లో అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగులలో అత్యధికం (131 మంది) కాంగ్‌పోక్పిలోనే ఉన్నారు.
- నాగాలాండ్: రాష్ట్రంలో నమోదైన 33 కొత్త కేసులలో దిమాపూర్ 16, మోన్ 12, కోహిమా 5 వంతున నమోదయ్యాయి. దీంతో నాగాలాండ్‌లో మొత్తం కేసులు 1021కి చేరగా, ఇప్పటిదాకా 445 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 576 మంది చికిత్స పొందుతున్నారు.
- సిక్కిం: రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రేపటినుంచి వారంపాటు సంపూర్ణ దిగ్బంధం అమలు చేయాలని సిక్కిం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జూలై 21 నుంచి 27 వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.
- మహారాష్ట్ర: రాష్ట్ర వస్త్ర-ఓడరేవు-మత్స్యశాఖల మంత్రి అస్లాం షేక్ కోవిడ్-19 బారినపడ్డారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కోవిడ్ నిర్ధారణ అయిన మంత్రులలో ఈయన నాలుగోవారు కాగా, ఆయన ముంబై నగర ఇన్‌చార్జి మంత్రి కూడా కావడం గమనార్హం. ఇక మహారాష్ట్రలో ఆదివారం 9,518 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 3,10,455కు చేరింది.
- గుజరాత్: రాష్ట్రంలో 965 కొత్త కేసులతో మొత్తం కేసులు 34,882కు చేరాయి. కొత్త కేసులలో 206 సూరత్‌లో, 186 అహ్మదాబాద్‌లో నమోదవగా యాక్టివ్ కేసుల సంఖ్య 11,412గా ఉంది.
- రాజస్థాన్: రాష్ట్రంలో సోమవారం ఉదయం 401 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 29,835కు పెరిగాయి. ప్రస్తుతం 7,406 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 837 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 22,600కు పెరిగింది. ఇప్పటిదాకా 721 మంది మరణించగా, ఆదివారం 447 మందిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేశారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 15,311కు పెరిగింది.
- ఛత్తీస్‌గఢ్: కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా జూలై 22 నుంచి రాయ్‌పూర్, బిర్గావ్ పురపాలక సంస్థల పరిధిలో 7 రోజుల దిగ్బంధం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాయ్‌పూర్ జిల్లాలోని రాయ్‌పూర్ మునిసిపల్ కార్పొరేషన్ (ఆర్‌ఎంసి), బిర్గావ్ మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) పరిధిలోగల మొత్తం ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నియంత్రణ జోన్లుగా ప్రకటించారు. కాగా, రాష్ట్రంలో ఆదివారం 159 కొత్త కేసులు నమోదయ్యాయి.
- గోవా: గోవాలో ఆదివారం 173 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 3657కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1417 యాక్టివ్ కేసులుండగా- ఇప్పటిదాకా 2218మంది కోలుకున్నారు.
*****
(Release ID: 1640059)
Visitor Counter : 290
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam