ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
పంజాబ్ నేషనల్ బాంక్ మాస్కులు,శానిటైజర్ల పంపిణీని ప్రారంభించిన మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్
కోవిడ్ అనంతర సంక్షోభంలో ప్రధాని ఆత్మ నిర్భర్
భారత్ అభియాన్ అమలులో బాంకులది కీలకపాత్ర
దేశంలో ప్రతి ఒక్కరి సహకారంతోనే కోవిడ్ మీద
పోరులో విజయం: డాక్టర్ హర్ష వర్ధన్
Posted On:
20 JUL 2020 5:57PM by PIB Hyderabad
పంజాబ్ నేషనల్ బ్యాంకు తన కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా కోవిడ్ వ్యాప్తి నివారణ కోసం చేపట్టిన మాస్కులు, శానిటైజర్ల పంపిణీని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధమ్ ఈ రోజు ప్రారంభించారు. బ్యాంకు ఎండీ, సీఈవో, ఎండీ శ్రీ ఎస్.ఎస్, మల్లికార్జునరావు, పలువురు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు కు చెందిన 22 జోనల్ కార్యాలయాలు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నాయి.
దేశ ప్రయోజనం కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మంత్రి అభినందించారు. భారతదేశపు తొలి స్వదేశీ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ జాతీయ వాద భావనతో లాలా లజపతి రాయ్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తి నింపుకొని ఏర్పాటైందన్నారు. భారత పెట్టుబడులతో పూర్తిగా భారతీయుల యాజమాన్యంలో నడిచే తొలి బ్యాంకుగా దీనిని అభివర్ణించారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఈ బ్యాంకులో జలియన్ వాలాబాగ్ కమిటీ ఖాతా ఉండేదని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత ఆ ఖాతాను మహాత్మాగాంధీ, పండిట్ జవహర్ లాల్ నిర్వహించారని కూడా డాక్టర్ హర్ష వర్ధన్ ప్రస్తావించారు.
మొత్తం ప్రపంచమంతా కోవిడ్ సంక్షోభంలో కూరుకుపోయిన ఈ సమయంలో ఈ బాధ్యతను భుజాన వేసుకున్నందుకు పంజాబ్ నేషనల్ బ్యాంకును మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. " కోవిడ్ సంక్షోభం మీద ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండగా నిలబడినందుకు సంతోషంగా ఉంది. పిఎం కేర్స్ ఫండ్ కు విరాళాలివ్వటం, కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల కింద మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయటం హర్షించదగిన విషయం. నిజానికి మాస్కుల వాడకం, చేతులు శుభ్రంగా ఉంచుకోవటమన్నది ప్రస్తుత పరిస్థితుల్లో అత్యుత్తమ సామాజిక టీకా గా భావించవలసి ఉంటుంది. దేశవ్యాప్తంగా 662 జిల్లాల్లో పంపిణీ చేపడుతున్న బ్యాంకును అభినందిస్తున్నా" అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో కోవిడ్ మీద జరుపుతున్న ఉమ్మడి పోరును గుర్తు చేసుకుంటూ, " ఈ వైరస్ గురించి చైనా ప్రపంచ దేశాలకు తెలియజేసిన వెంటనే ఆరోగ్య మంత్రిత్వశాఖలో 24 గంటలలోపే నిపుణుల కమిటీ సమావేశమైంది. అప్పట్లో ఈ వైరస్ పరీక్షలకు పూణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ లో మాత్రమే ఒక లాబ్ ఉండగా ప్రస్తుతం ఆ లాబ్ ల సంఖ్య1268 కి పెరిగింది. అంతకు ముందు శ్వాస సంబంధమైన వైరస్ పరీక్షలకు అమెరికాకు శాంపిల్స్ పంపాల్సి వచ్చేది. వచ్చే 10 -12 వారాల్లో దేశం పదిలక్షల పరీక్షలు జరపగలిగే సామర్థ్యం పొందగలుగుతుంది" అన్నారు.
మాస్కులు, పిపిఇ కిట్లు స్వదేశంలోనే తయారు చేయగలిగే సామర్థ్యం గురించి డాక్టర్ హర్ష వర్ధన్ ప్రస్తావించారు. గతంలో పిపిఇ కిట్లు, ఎన్ 95 మాస్కులు, వెంటిలేటర్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేదని, అయితే ప్రభుత్వం తీసుకున్న చొరవ ఫలితంగా మన ఔత్సాహిక తయారీదారులు ఈ అవకాశాన్ని, దేశంలో ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని తగిన విధంగా ఉత్పత్తి చేయగలుగుతున్నారన్నారు.
దేశం ఈ సంక్షోభం నుంచి త్వరలోనే బైటపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఎన్నో వ్యాధులను సమర్థంగా ఎదుర్కోగలిగామని గుర్తు చేసుకున్నారు. పోలియో, మశూచి లాంటి వ్యాధులను సమూలంగా తుడిచిపెట్టగలిగామన్నారు. అదే విధంగా ఎయిడ్స్, నిపా వైరస్, స్వైన్ ఫ్లూ, జికా వంటివీ అదుపులో పెట్టగలిగామన్నారు. ఎబోలాను దేశంలోకి రాకుండా సమర్థంగా అడ్డుకోవటాన్ని కూడా డాక్టర్ హర్షవర్ధన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
" మనందరి ఉమ్మడి కృషితో ఇప్పుడు ఎదురైన సవాలు నుఖ్దా అధిగమిస్తాం" అన్నారు. ప్రపంచంలో అతి తక్కువ మరణాలు నమోదైన దేశంగా భారత్ తన ప్రత్యేకత చాటుకున్నదన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన చికిత్సా మార్గదర్శకాల ఫలితంగా మరణాల రేటును 2.46 శాతానికి పరిమితం చేయగలిగామన్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు సీఈవో శ్రీ ఎస్ ఎస్ మల్లికార్జున రావు మాట్లాడుతూ, ప్రధాని ఇచ్చిన పిలుపుకు స్పందిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో కలిసి ఆర్థిక రంగాన్నీ బలోపేతం చేయటానికి కృషి చేస్తున్నామన్నారు. అదే విధంగా ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అను అమలు చేయటంలోనూ తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. పెద్ద సంఖ్యలో ప్రజలను జన్ ధన్ యోజన కిందికి తీసుకువచ్చి నేరుగా డబ్బు బదలీ చేయటంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నామని చెప్పారు.
బాంకు సీనియర్ అధికారులు ఈ సందర్భంగా మాస్కులు, శానిటైజర్లతో కూడిన కోవిడ్ కిట్ ను, బ్యాంకు ఉజ్వల చరిత్రను వివరించే గ్రంథాన్ని ఆయనకు జ్ఞాపికలుగా అందజేశారు.
****
(Release ID: 1640009)
Visitor Counter : 263